సిరియా: ఇజ్రాయెల్ దూకుడుకి రష్యన్ మిసైల్ ముకుతాడు


మే 7న క్రెమ్లిన్ లో పుతిన్ ని కలిసిన జాన్ కెర్రి

మే 7న క్రెమ్లిన్ లో పుతిన్ ని కలిసిన జాన్ కెర్రి

సిరియా కిరాయి తిరుగుబాటులో అంతిమ అంకానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.  సిరియా లోని ఒక జాతీయ సైనిక శిబిరం పైకి ఇజ్రాయెల్ చేత ఇప్పటికీ మూడుసార్లు మిసైళ్లతో అమెరికా దాడి చేయించడంతో రష్యా తన శక్తివంతమైన ఎస్-300 మిసైల్ వ్యవస్ధను సిరియాకు సరఫరా చేయడానికి వేగంగా నిర్ణయం తీసుకుంది. ఎస్-300 క్షిపణులు సిరియా ప్రభుత్వం చేతికి వస్తే (ఒక మిసైల్ బ్యాటరీ ఇప్పటికే సరఫరా అయిందని వార్త) అమెరికా పధకాలు దాదాపు తల్లకిందులు అయినట్లే. అమెరికా అమ్ముల పొదిలో ఉన్న ఇజ్రాయెల్ తురుపు ముక్క ఎస్-300 ధాటికి ఎందుకూ పనికిరాకుండా పోతుంది. ఈ నేపధ్యంలోనే అమెరికా వెనక్కి తగ్గి సిరియా ప్రభుత్వం భాగస్వామిగా శాంతి చర్చలు జరపడానికి రష్యాతో ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.

S-300 -The Hindu

S-300 -The Hindu

వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రకారం రష్యా తన అత్యాధునిక ఎస్-300 మిసైల్ వ్యవస్ధలు నాలుగుంటిని సిరియాకు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఎస్-300 మిసైల్ వ్యవస్ధల సరఫరా కోసం వాస్తవానికి రష్యా, సిరియాల మధ్య 2010లోనే ఒప్పందం కుదిరింది. గత సంవత్సరం ప్రారంభంలోనే ఈ మిసైళ్ళు సరఫరా కావలసి ఉన్నప్పటికీ జూన్ 2012 న జెనీవాలో శాంతి చర్చలు జరగనున్న దృష్ట్యా సరఫరాను రష్యా వాయిదా వేసింది. తద్వారా ఘర్షణ కంటే శాంతియుత ఒప్పందానికే తమ ప్రాధాన్యమని రష్యా సంకేతం ఇచ్చింది. అయితే ఈ సంకేతం అందుకోవడంలో రష్యా, ఐరోపాలు విఫలం అయ్యాయి.

నాన్-లెధల్ ఆయుధాలు సరఫరా చేస్తున్నాం అంటూ మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి ఆల్-ఖైదా టెర్రరిస్టులకు రసాయన ఆయుధాలతో సహా అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేసింది. కానీ సిరియా ప్రభుత్వం తిరుగుబాటుదారులపై వరుసగా విజయాలు సాధించడంతో అమెరికా, ఐరోపాల పధకాలు పారలేదు. ఫలితంగా అమెరికాకు చర్చల బేరానికి రాక తప్పలేదు. అయితే అమెరికా చెబుతున్న చర్చలు తిరుగుబాటుదారులు శక్తులు కూడదీసుకోడానికి తగిన సమయం ఇవ్వడానికి ఉద్దేశించినదేనని, వాస్తవానికి శాంతి పరిష్కార ఉద్దేశ్యం అమెరికాకు లేదని వివిధ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మే రెండో వారంలో రష్యా పర్యటించిన జాన్ కెర్రి (అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ లేదా విదేశాంగ మంత్రి) సిరియా విషయమై శాంతి చర్చలు జరపడానికి త్వరలో అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేయడానికి రష్యాతో ఒప్పందం కుదిరిందని ప్రకటించాడు. ఈ సమావేశంలో బషర్ ఆల్-అస్సద్ నేతృత్వంలోని సిరియా ప్రభుత్వం కూడా హాజరు కావడానికి అమెరికా అంగీకరించడం ఒక కీలక పరిణామం. అస్సద్ దిగిపోతే తప్ప శాంతి చర్చలు సాధ్యం కావని అమెరికా, ఐరోపాలు ఇంతకాలం భీష్మించుకుని ఉన్నాయి. తమ తరపున కిరాయి తిరుగుబాటు నిర్వహిస్తున్న ఆల్-ఖైదా కిరాయి బలగాలు సిరియా ప్రభుత్వం పైన విజయం సాధించడం తధ్యమన్న అంచనాతో అవి ఆ విధంగా బెట్టు చేశాయి. కానీ తమ అంచనా విఫలం కావడంతో తిరిగి చర్చల పల్లవి అందుకున్నారని కొందరు విశ్లేషకులు అంచనా.

రష్యా విదేశీ మంత్రి సెర్గి లావరోవ్ తో చర్చలు ముగించుకుని జాన్ కెర్రి రష్యా విడిచి వెళ్ళిన మరు నిమిషమే రష్యా ఎస్-300 మిసైల్ సరఫరా వార్తను వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. పత్రిక ప్రకారం సిరియా ప్రభుత్వం నాలుగు ఎస్-300 మిసైళ్ళ కొనుగోళ్ల కోసం అప్పుడే రష్యాకు చెల్లింపులు ప్రారంభించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ నుండి అమెరికా అధికారులకు సమాచారం అందిందని పత్రిక తెలిపింది. రానున్న మూడు నెలల్లో ఎస్-300 మిసైల్ వ్యవస్ధలు సిరియా చేరుకోవచ్చని సమాచారం.

ఎస్-300 క్షిపణి వ్యవస్ధ రష్యా తయారీ క్షిపణుల్లో అత్యాధునికమైనది. భూతలం నుండి గాలిలోకి పేల్చే తరగతికి చెందిన ఈ క్షిపణి భూమికి 25 మీటర్ల ఎత్తునుండి 25,000 మీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను ఛేదించగల శక్తి కలిగిన స్వల్ప-సుదీర్ఘ దూర క్షిపణి. ఎస్-300 సరఫరాకు కొత్తగా నిర్ణయం తీసుకోలేదని గతంలో కుదిరిన ఒప్పందాన్ని మాత్రమే తాము అమలు చేస్తున్నామని రష్యా ప్రతినిధి ఇంటర్ ఫాక్స్ వార్తా సంస్ధకు చెప్పాడని ది హిందు తెలిపింది. “ఇక్కడ అంతా స్పష్టంగానే ఉంది. ఆయుధ సరఫరాల పై నిషేధం ఏమీ లేదు. గతంలో కుదిరిన కాంట్రాక్టులనే మేము అమలు చేస్తున్నాము” అని సదరు ప్రతినిధి చెప్పినట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ పరిశీలకుల ప్రకారం ఎస్-300 మిసైళ్ వ్యవస్ధల సరఫరా రష్యా, పశ్చిమ దేశాలకు చేసిన హెచ్చరిక. ఇజ్రాయెల్ చేత అమెరికా మూడుసార్లు సిరియాపై వైమానిక దాడులు చేసినందుకు హెచ్చరికగా రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. సిరియా సమస్యలో అమెరికా, ఇజ్రాయెల్ ను దించడానికి నిర్ణయించుకున్న పక్షంలో తాము చూస్తూ ఊరుకోబోమని రష్యా చెప్పదలిచిందని, ఫలితమే తాజా నిర్ణయమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జెనీవా శాంతి ఒప్పందానికి అమెరికా కట్టుబడకపోతే ఘర్షణలో తగిన దూరం రావడానికి రాము సిద్ధమేనని రష్యా చెప్పడలిచిందని వారి అవగాహన.

రష్యా హెచ్చరికను అమెరికా, తదితర పశ్చిమ దేశాలు ఆషామాషీగా తీసుకోలేదు. సిరియాపై దాడులు చేయడం ద్వారా పరిస్ధితిని తీవ్రం చేయవద్దని రష్యా నేరుగా ఇజ్రాయెల్ కు హెచ్చరిక చేయడాన్ని కూడా వారు పరిగణనలోకి తీసుకున్నారు. ఫలితంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు త్వరలో తాను రష్యా సందర్శిస్తానని ప్రకటించాడు. రష్యా వెళ్ళి సిరియాకు ఎస్-300 క్షిపణులు సరఫరా చేయకుండా అడ్డుకుంటానని ఆయన ప్రకటించాడు. అయితే ఇజ్రాయెల్ దౌత్యం ఫలించేది అనుమానమే.

అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ ప్రకారం ఎస్-300 మిసైళ్ళ సరఫరా అమెరికా తదితర దేశాలకు తీవ్ర నష్టకరం. సిరియా గగనతలంలోకి ప్రవేశించడానికి ఇజ్రాయెల్ తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు యోచించే పరిస్ధితికి ఎస్-300 నేడుతుంది. ఇజ్రాయెల్ విమానాలు సిరియా గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఎస్-300 లు వాటిని మట్టికరిపించడం ఖాయం అని ఏ.పి తెలిపింది. “అమెరికా మరియు ఇతర దేశాలకు (సిరియాలో) మిలట్రీ జోక్యం చేసుకోవాలన్నా, సిరియా పై నో-ఫ్లై జోన్ అమలు చేయాలన్నా కష్టంగా మారుతుంది” అని ఎ.పి తెలిపింది.

జెనీవా తీర్మానానికి పొడిగింపుగా మరో శాంతి సమావేశం జరిపి రష్యా ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడమా లేక మిలట్రీ పరిష్కారాన్నే ఎంచుకుని రష్యా క్షిపణుల వినాశనం ఎదుర్కోవడమా – ఈ రెండు అవకాశాలు అమెరికా ముందు ఉన్నాయి. ప్రస్తుతానికి శాంతి సమావేశాలకే తమ ప్రాధాన్యమని అమెరికా ఇప్పటికే జాన్ కెర్రి ద్వారా సంకేతం ఇచ్చింది. ఇవి అంతిమ అంకానికి తెరలేసింది అనడానికి సంకేతమా లేక మరో బాధాకర, వినాశకర దురాక్రమణ యుద్ధానికి ముందు ఏర్పాట్లా అన్నది రెండు మూడు నెలల్లో తేలే అవకాశం ఉంది. అమెరికా ఆర్ధిక బలహీనత, అమెరికన్లలో ఉన్న యుద్ధ వ్యతిరేకత… వీటిని బట్టి చూస్తే సాయుధ ఘర్షణల తీవ్రతకు అమెరికా మరింత సమయం తీసుకోవడమో, నిరవధికంగా వాయిదా వేయడమో జరగవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s