బంగారం దిగుమతులు పైకి, వాణిజ్య లోటు ఇంకా పైకి


Photo: Reuters

Photo: Reuters

భారతీయుల బంగారం దాహం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ముప్పుగా పరిణమిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇండియా బంగారం దిగుమతులు 138 శాతం పెరిగాయి. దీనితో వాణిజ్య లోటు పెరిగి, విదేశీ మారక ద్రవ్య నిల్వలలో తరుగు ఏర్పడి, కరెంటు ఖాతా లోటు (Current Account Deficit) పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. బంగారం దిగుమతులు పెరిగిన ఫలితంగా ఏప్రిల్ నెలలో వాణిజ్య లోటు అమాంతం 17.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచ బంగారు విపణిలో బంగారం ధరలు తగ్గిన ఫలితంగా గత రెండు, మూడు నెలలుగా బంగారం కొనుగోళ్ళు విపరీతంగా పెరిగిన సంగతి పత్రికలు రాస్తున్నా, ఇది తాము ఊహించలేదని అధికారులు చెప్పడం వారు ఏ లోకాల్లో ఉన్నారన్న అనుమానం కలిగిస్తోంది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI – Foreign Direct Investments) గానీ, విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (FII – Foreign Institutional Investments) గానీ ఒక దేశంలోకి ప్రవేశించాలంటే ఆ దేశ కరెంటు ఖాతా లోటు ఎంత ఉన్నదీ అవి పట్టించుకుంటాయి. సి.ఏ.డి గనుక ఎక్కువ ఉంటే పెట్టుబడులు ముందుకు రావడానికి సంకోచిస్తాయి. కనుక అధిక బంగారం దిగుమతులు భారత ప్రభుత్వ ఎఫ్.డి.ఐ ఆశల్ని కూడా గల్లంతు చేస్తోంది. ఎఫ్.డి.ఐ లు విరగబడి కట్లు తెంచుకొని దేశాన్ని ముంచెట్టాలని ప్రధాని, ఆర్ధిక మంత్రి సహా దేశ పాలకులు ఆశిస్తున్నారు. అందుకోసం దేశ ఆర్ధిక వ్యవస్ధను, అందులోని సామాన్యుల ఉపాధి సౌకర్యాలను కూడా విదేశీ కంపెనీలకు అమ్మేసే విధానాలను వరుసగా ప్రవేశపెడుతున్నారు. అయినప్పటికీ విదేశీ పెట్టుబడులు వారిని కరుణిస్తున్నట్లు లేదు.

ద్రవ్య విధానమూ కష్టమే

కరెంటు ఖాతా లోటు పెరుగుదల వలన దేశ ద్రవ్య విధానం రూపొందించడం కూడా ఆర్.బి.ఐ కి కష్టంగా మారుతుంది. వడ్డీ రేటు తగ్గించాలని ఆర్ధిక మంత్రి చిదంబరం ఆర్.బి.ఐ ని సతాయిస్తున్నాడు. వడ్డీ రేటు తగ్గిస్తే కంపెనీలు వ్యాపారులు బ్యాంకుల వద్ద అప్పులు బాగా తీసుకుని పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి కార్యక్రమాలలోకి దుముకుతారని ఆర్ధిక మంత్రి, ఆ మాటకొస్తే పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలంతా చెప్పే మాట! కానీ వాస్తవాలు చూస్తే అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది.

2008 నుండి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు 0.25 శాతం మాత్రమే. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటు కూడా 2009లో 2 శాతం ఉంటే ఇప్పుడది 0.5 శాతం మాత్రమే. ఇంత తక్కువ వడ్డీ రేటు ఉన్నా, దానిని అలుసుగా తీసుకుని ప్రైవేటు బ్యాంకులు, కంపెనీలు కుప్పలు తెప్పలు రుణాలు తీసుకుంటున్నా అది ఉత్పత్తి కార్యక్రమాన్ని, అనగా జి.డి.పి ని పెంచుతున్న దాఖలా లేదు. పైగా ఐరోపా వృద్ధి యంత్రం (జి.డి.పి ఇంజన్) అని భావించే జర్మనీలో సైతం వృద్ధి రేటు పడిపోతోంది. అమెరికా, ఐరోపాలలో మొత్తం మీద చూస్తే వృద్ధి రేటు 0 – 1 శాతాల మధ్య కొట్టుకులాడుతోంది. ఐరోపాలో అయితే యూరో జోన్ కూటమి ప్రతికూల వృద్ధి (negative growth) ని నమోదు చేస్తోంది.

సెంట్రల్ బ్యాంకు నుండి అతి తక్కువ వడ్డీ రేటుకు అప్పులు తీసుకుని కూడా కంపెనీలు ఉత్పత్తి, ఉద్యోగాల రూపంలో  దానిని ప్రజలకు చేరవేయకపోగా షేర్ మార్కెట్లలో పెట్టి మరిన్ని లాభాలు అర్జిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకుకి ఎక్కడి నుండి డబ్బు వస్తుంది? అదంతా మళ్ళీ ప్రజల వద్ద డిపాజిట్ల ద్వారా సేకరించిన బ్యాంకులు సి.ఆర్.ఆర్ లాంటి కొన్ని నియమాలను అనుసరించి సెంట్రల్ బ్యాంకు వద్ద డిపాజిట్ చేసినదే. అంటే ప్రజల సొమ్ము రిజర్వ్ బ్యాంకుల ద్రవ్య పరపతి విధానం ద్వారా అతి తక్కువ వడ్డీలకు కంపెనీలకు చేరితే అది తిరిగి ప్రజల వద్దకు వివిధ ఉత్పత్తి కార్యక్రమాల రూపంలో చేరవలసింది పోయి మళ్ళీ కంపెనీల వద్దనే పోగుపడుతోంది. అది ఆర్ధిక వృద్ధిని ఏ మాత్రం ప్రేరేపించడం లేదు.

దాదాపు ఇటువంటి పరిస్ధితే భారత దేశంలో నెలకొని ఉన్నది. బడా కంపెనీలు తమ వద్ద ఉన్న డబ్బు రాశుల్ని ఎలాగూ కదిలించవు. బ్యాంకులే వారికి అప్పులిచ్చి ఉత్పత్తి చేయమని చెప్పాలి. కంపెనీలు అప్పుల్ని వెంటనే తీసుకోవు. తమకు నచ్చిన వడ్డీ రేటు రిజర్వ్ బ్యాంకు ఇస్తేనే తీసుకుంటాయి. లేకపోతే తమకు లాభాల మార్జిన్లు తగ్గిపోతాయని వాటి అవగాహన. కనుక వడ్డీ రేటు తగ్గించమని ఆర్ధికమంత్రి చిదంబరం ఆర్.బి.ఐ ని శతపోరుతున్నారు. కానీ వడ్డీ తగ్గిస్తే డబ్బు మరింతగా మార్కెట్ లోకి ప్రవేశించి దేశంలో ధన సంచయం పెరుగుతుంది. దానివలన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది.

ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నపుడు దానిని కట్టడి చేయడానికి మళ్ళీ వడ్డీ రేట్లు పెంచడం ఆర్.బి.ఐ కి తప్పదు. మరో వైపు దిగుమతుల కంటే ఎగుమతులు బాగా తగ్గిపోవడం వలన వాణిజ్య లోటు పెరిగిపోయి తద్వారా కరెంటు ఖాతా లోటు పెరుగుతోంది. ఇది కూడా వడ్డీ రేటు తగ్గించడానికి ఆటంకంగా మారుతోంది. ఈ నేపధ్యంలో కంపెనీలు, ఆర్ధిక మంత్రి కోరిన విధంగా సరళతరమైన ద్రవ్య విధానం (అంటే వడ్డీ తగ్గించడం) ఆర్.బి.ఐ కి కష్టంగా మారుతోంది. దీనికి ఇప్పటి కారణం వాణిజ్య లోటును పెంచుతున్న బంగారం దిగుమతులు.

బంగారం దిగుమతుల పెరుగుదల ఊహించలేదు

బంగారం ధరలు తగ్గిపోవడంతో దేశ వ్యాపితంగా బంగారం కొనుగోళ్ళు పెరిగాయి. ధనికులు మాత్రమే కాక దిగువ మధ్య తరగతి,  మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి ప్రజలు కూడా బంగారం కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఒక దశలో బంగారం కోట్ల ముందు చాంతాడు పొడవునా క్యూలు కట్టిన పరిస్ధితి. ఈ విషయాన్ని పత్రికలు, వార్తా ఛానెళ్లు బ్యానర్ హెడ్డింగులు పెట్టి మరీ రాశాయి, ప్రకటించాయి. అయినా బంగారం దిగుమతులు పెరుగుతాయని తాము ఊహించలేదని కామర్స్ సెక్రటరీ ఎస్.ఆర్.రావు విలేఖరులతో అన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఈ అధికారులు దేశంలో లేరా? ప్రజలకీ అధికారులకీ సంబంధం ఉండడదని చెప్పడం ఎంత నిజమో రావు గారి వ్యాఖ్యలు చెబుతున్నాయి.

దిగుమతుల బిల్లు పెరిగి వాణిజ్య లోటు 17.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటే గాని బంగారం దిగుమతులు ఊహించని విధంగా పెరిగాయని గ్రహించలేకపోవడం విచారకరం. మరీ విడ్డూరం ఏమిటంటే బంగారం దిగుమతుల వలన విదేశీ మారక ద్రవ్యం ఖర్చైపోతోందని భయపడి జనవరిలోనే దిగుమతి సుంకం తగ్గించారు. మరి బంగారం ఇంతగా దిగుమతి అవుతుందని ఊహించలేదని ఎలా చెబుతారు? దిగుమతి సుంకం పెరిగినప్పటికీ దాన్ని అధిగమించి కొనుగోలు చేసేంతగా బంగారం ధరలు తగ్గిపోయాయని అర్ధం అవుతోంది. ఈ పైస్ధితిని ఊహించడానికీ, తదనుగుణంగా చర్యలు తీసుకోడానికీ ప్రభుత్వ విభాగాలు ఉండగా ఆ పనిలో తాము లేమని వాణిజ్య కార్యదర్శి చెబుతున్నారా?

చేతులు కాలాక….

ఆకులు పట్టుకున్న చందంగా ఆర్.బి.ఐ సోమవారం నుండి బ్యాంకుల బంగారం దిగుమతులపై నియంత్రణ విధిస్తున్నట్లు ప్రకటించింది. బంగారం దిగుమతులపై మరింత సుంకం పెంచేందుకు ఆలోచిస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు చెప్పారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఏప్రిల్ నెలలో రెండు వారాల పాటు ధరలు 17 శాతం తగ్గిపోవడంతో బంగారం, వెండి దిగుమతులు 138 శాతం పెరిగాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

నిజానికి కరెంటు ఖాతా లోటు దేశ ఆర్ధిక వ్యవస్ధకు ప్రమాదకరంగా పరిణమించిందని ఆర్.బి.ఐ గత సంవత్సరం నుండి మొత్తుకుంటోంది. అంతకు ముందు వరకు ఆర్.బి.ఐ కేంద్రీకరణ ద్రవ్యోల్బణం పైన ఉండేది. అది కొద్దిగా నియంత్రణలోకి వచ్చేసరికి (అలా అని ప్రభుత్వం చెబుతోంది) కరెంటు ఖాతా లోటు గురించి ఆందోళన మొదలయింది. ఈ కొలతలన్నీ ఒకే ఆర్ధిక పరిస్ధితికి వివిధ రూపాలలోని ప్రతిబింబాలు మాత్రమే. ఇవన్నీ ఒక వరుసలో ఒకదానినొకటి ప్రభావితం చేసుకునేవే. ద్రవ్యోల్బణం అని ఒకసారీ, కరెంటు ఖాతా లోటు అని ఒక సారీ, ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ లు రావడం లేదని ఇంకోసారీ, దిగుమతులు పెరిగి ఎగుమతులు పెరిగాయని మరోసారీ…. ఇలా ఎన్ని సార్లు తిరగేసి మరగేసి చెప్పినా ఆర్ధిక అననుకూల పరిస్ధితినే ఇవి చెబుతాయి.

ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ప్రజలను నమ్ముకోవడమే ఉత్తమ మార్గం. ప్రజలకు పని ఇవ్వాలి. ఆ పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కంపెనీలకు అప్పులిచ్చి ఉత్పత్తులు తీసినా అప్పుడే ఫలితం ఉంటుంది. చేతిలో డబ్బు ఉన్నపుడు జనం సరుకులు కొనుగోలు చేస్తారు. మరింత డబ్బుంటే మరిన్ని సరుకులు కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోళ్లలో అనేక పన్నులు వసూలై ప్రభుత్వాల భోషాణాలు నింపుతాయి. అందరూ పచ్చగా కళకళలాడుతారు. వీటన్నింటికీ ఒకే ఒక్క షరతు జనానికి పనీ, పనికి తగ్గ వేతనం ఇవ్వడం. కానీ అదొక్కటీ జరగదు. కంపెనీలు పెట్టుబడులు పెట్టేదే లాభాల కోసం. అవి కూడా నెల నెలా పెరుగుతూ పోవాలి. అంటే వేతనాలు ఎంత హీనంగా ఉంటే అన్నీ లాభాలు. వేతనాలు లేని జనం కొనేదేముంటుంది, పొట్టే గడవనపుడు? కనుక జనం పూనుకుని తమ పరిస్ధితి మార్చుకోవడమే మిగిలింది.

7 thoughts on “బంగారం దిగుమతులు పైకి, వాణిజ్య లోటు ఇంకా పైకి

 1. గ్రామీణ ప్రాంతాలలొ బంగారం కొని తిరిగి బాంకులలో తాకట్టు పెట్టటం చాలా ఎక్కువైంది.అతి తక్కువ వడ్డికి క్రాప్ లోన్ గా తీసుకుంటున్నారు.దీన్ని నియంత్రిస్తే ఫలితం ఉంటుంది.

 2. బాబు నీ తెలివి చూసి మూర్చబోయాను. భారతదేశంలో ఉన్న ధనవంతులంతా బాంక్ ల ను దోచుకొంట్టుంటే రైతులను నియంత్రించటానికి బయలుదేరావా? రైతులు బాంక్ ల దగ్గర బంగారమన్నా కుదువపెట్టారు. పారిశ్రామిక వేత్తలు ఎమి ఆడుమానంగా పెట్టి వేలకోట్లు అప్పులు తీసుకొంట్టున్నారు? వారు చేతుల్లెత్తితే బాంక్ లు గుట్టు చప్పుడు కాకుండా నోరు మూసుకొంటాయి.

  Please read below lines

  Our PSU banks are burdened with unprecedented levels of bad debt and non-performing assets. Witness this: “Over $15 billion or more than Rs 83,000 crores of corporate loans have turned into bad debts in less than a year-and-a-half, according to a report of the Parliamentary Standing Committee on finance which expressed concern on the phenomenal rise in non-performing assets (NPAs) of public sector banks.”

 3. మనోహర్ గారు, చాలా ముఖ్యమైన అంశాన్ని పాఠకుల దృష్టికి తెచ్చారు.

  అయితే, అందరికి అన్ని విషయాలు తెలియక పోవచ్చు. అభిప్రాయాలు చెప్పనిస్తేనే బెటర్. చెప్పొద్దని మీరన్నారని కాదు. తెలివితో ముడి పెడితే సాధారణ పాఠకులకు అభిప్రాయాలు చెప్పే అవకాశాన్ని నిరాకరించినట్లు అవుతుంది. వారు బెదిరిపోవడానికి దారి తీస్తుంది. పత్రికల్లో ఎలాగూ చోటు దొరకదు. ఇలాంటి బ్లాగుల్లోనైనా అవకాశం ఉండాలి కదా! తెలియజెప్పే పద్ధతిని అనుసరించాలని నా కోరిక.

 4. మనోహర్ గారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులు కూడా మామూలు జనానికి, రైతులకు పెద్దగా లోన్లు ఇవ్వవు. యాభైవేలు ఇస్తే చాలా గొప్ప. ధనిక రైతులు మాత్రం , తమ భూమిని కుటుంబంలోని అందరి పేర్లతో పట్టాలు చేయించి లక్షల రూపాయలు అప్పు తీసుకుంటారు. ఆ డబ్బునే తిరిగి పేద ప్రజలకు వడ్డీకి అప్పులు ఇచ్చి దోచుకుంటారు.

  నాకు తెలిసి మా ఊరి పక్కన ఓ సంఘటన జరిగింది.
  బ్యాంకు అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు కలిసి, గిరిజనుల పేర్లను రైతులుగా చూపి
  ( వారికే తెలీకుండా )….కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బుతో తమకు సంబంధించిన వ్యాపారాలు చేసుకుంటూ…లాభాలు సంపాందించారు. ఆ తర్వాత కేంద్రం ఆ అప్పులు కూడా రద్దు చేయడంతో…ఆ డబ్బులు కూడా వాళ్లకే మిగిలిపోయాయి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు పేద ప్రజలకన్నా, ధనిక రైతుల దోపిడీకే ఉపయోగపడుతున్నాయి.

 5. గ్యారంటర్లు లేకుండా బ్యాంకులు ఋణాలు ఇవ్వవు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారి అయితే గ్యారంటర్ లేకుండా ఋణం ఇస్తాడు, రికవర్ చేసుకోవడానికి గూండాగరీ కూడా చేస్తాడు. అప్పు చెయ్యడం ఎప్పుడూ ప్రమాదకరమే.

 6. బ్యాంక్ ఆఫీసర్ కొడుకునైన నాకే ఇద్దరు గ్యారంటర్లు లేరని ఏ బ్యాంకూ ఋణం ఇవ్వలేదు. అటువంటప్పుడు పేదవాళ్ళకి ఋణాలు వస్తాయని ఎలా అనుకున్నారు? డబ్బున్నవాళ్ళైతే కోఆబ్లిగంట్స్‌తో కలిసి లోన్ అప్లికేషన్లు పెడతారు. ముగ్గురు కలిసి లోన్ అప్లికేషన్ పెడితే మొదటి అప్లికంట్‌ని ప్రధాన అప్లికంట్‌గా, మిగితా ఇద్దరినీ గ్యారంటర్లుగా పరిగణిస్తారు. ఆ రకంగా గ్యారంటర్లు లేకపోయినా కోఆబ్లిగంట్లని గ్యారంటర్లుగా చూపించొచ్చు. అందుకే డబ్బున్నవాళ్ళకి సులభంగా లోన్లు వస్తున్నాయి. వడ్డీ వ్యాపారి గ్యారంటర్లని అడగడు కానీ అప్పు తీర్చకపోతే గూండాగరీ చేస్తాడు. ఒకప్పుడు మైక్రోఫైనాన్స్ సంస్థలు కూడా ఇలాగే గ్యారంటర్లు లేనివాళ్ళకి ఋణాలు ఇచ్చి తరువాత రికవరీ కోసం గూండాగరీ చేసేవి. రిజర్వ్ బ్యాంక్ అభ్యంతరం చెప్పడం వల్ల తరువాత గ్యారంటర్ ఉన్నవాళ్ళకే ఋణాలు ఇవ్వడం మొదలు పెట్టాయి.

 7. This is commonsense of point. In a family(Gvot too) if they are running deficit amount, they will reduce their expeditures. and try to save as much as possible. Our Govt is not taking any such steps. As said మరీ విడ్డూరం ఏమిటంటే బంగారం దిగుమతుల వలన విదేశీ మారక ద్రవ్యం ఖర్చైపోతోందని భయపడి జనవరిలోనే దిగుమతి సుంకం తగ్గించారు. This shows the lack of knowledge on import. Similarly imports on CRUDE oil. we are not comrpmising on the manufacture of automobiles. Now a days people are not hesitating to buy a car, inspite of the petrol price hike, even lower middle class are also going for it. To my knowldge these two are consuming our foreign reseves very much. Govt should consider these two imports primarily.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s