రిజర్వ్ బ్యాంకు నిధుల కోసం కాచుకు కూచున్న కంపెనీల కలలు తీరే రోజు వస్తోంది. ఆర్.బి.ఐ వడ్డీ రేటు మరింత తగ్గడానికి, తద్వారా రిజర్వ్ బ్యాంకు నుండి మరిన్ని నిధులు పొందడానికి కంపెనీలు ‘వర్షపు నీటి చుక్క కోసం ఎదురు చూసే చాతక పక్షుల్లా’ చూస్తున్న ఎదురు చూపులు ఫలించే రోజు రానున్నది. కంపెనీల తరపున వడ్డీ రేట్లు తెగ్గోయాలని ఆర్.బి.ఐ వద్ద చెవినిల్లు కట్టి పోరుతున్న ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కూడా కాలర్ ఎగరేయబోతున్నారు. కారణం ఏమిటీ అంటే ద్రవ్యోల్బణం దాదాపు నాలుగు సంవత్సరాల కనిష్ట స్ధాయికి దిగిరావడమే. ద్రవ్యోల్బణం తగ్గితే వడ్డీ రేటు తగ్గించడానికి ఆర్.బి.ఐ కి వీలు చిక్కుతుంది మరి!
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు
గత మార్చి నెలలో టోకు ధరల సూచీ ఆధారంగా లెక్కించే ద్రవ్యోల్బణం 5.96 శాతం వద్ద ఉండగా అది ఎప్రిల్ నెలలో 4.89 శాతంకు తగ్గిందని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ద్వారా తెలిసింది. నవంబరు 2009 తర్వాత టోకు ధరల ద్రవ్యోల్బణం ఇంత తక్కువ నమోదు కావడం ఇదే ప్రధమం. మూడున్నరేళ్ల క్రిందట, నవంబరు 2009లో టోకు ధరల ద్రవ్యోల్బణం అత్యంత తక్కువగా 4.78 శాతం నమోదయింది.
ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పేరు చెప్పి జి.డి.పి వృద్ధిని ప్రేరేపించడానికి అంటూ ఆర్.బి.ఐ అతి తక్కువ స్ధాయిలో వడ్డీ రేటు ఉంచింది. ఆర్.బి.ఐ మాత్రమే కాదు, అమెరికా రిజర్వ్ బ్యాంకు ఐన ‘ఫెడరల్ రిజర్వ్’ మరీ ఘోరంగా 0.25 శాతంకు వడ్డీ రేటు తగ్గించింది. (ఇప్పటికీ అది అక్కడే ఉంది.) దీనితో అటు డాలర్ల ప్రవాహం, ఇటు దేశంలో రూపాయల ప్రవాహం కట్లు తెంచుకుని స్వైర విహారం చేయడంతో ద్రవ్యోల్బణానికి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. అప్పటి నుండి దానికి పై చూపే గానీ, కింద చూపు తెలియదు. ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసి బిగించడానికి ప్రయత్నిస్తున్నామంటూ భారత ప్రభుత్వము, ఆర్.బి.ఐ లు ప్రకటనల మీద ప్రకటనలు ఇవ్వడమే గానీ అవి ఆచరణలోకి వచ్చిన జాడ లేదు.
భారత ప్రభుత్వ నిష్క్రియాపరత్వం పైన అంతర్జాతీయ సంస్ధలు, విశ్లేషకులు, పత్రికా సంస్ధలు కూడా అనేక విమర్శలు చేశారు. లక్ష్యం పెట్టుకోవడమే తప్ప దానిని సాధించేందుకు చర్యలు తీసుకోరని భారత నాయకులను తిట్టిపోశారు. భారీ లక్ష్యాలు పెట్టుకోవడం వాటిని సాధించలేక చతికిలబడడం భారత ప్రభుత్వానికి మామూలేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజానికి భారత ద్రవ్యోల్బణానికి ఒక ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు అత్యంత కనిష్ట స్ధాయిలో ఉండడం.
అక్కడ వడ్డీ రేటు తక్కువగా ఉండడం వలన వాల్ స్ట్రీట్ కంపెనీలు విచ్చలవిడిగా అప్పులు తీసుకుని వాటిని ప్రపంచంలోని వివిధ షేర్ మార్కెట్లతో ఆటలాడుకున్నారు. ఆ డబ్బే రియల్ మార్కెట్ లోకి కూడా ప్రవేశించి ద్రవ్యోల్బణాన్ని అదుపులేని స్ధాయికి చేర్చింది. అసలు మూలం తమ వద్ద పెట్టుకుని పరాయి దేశాల్లో తమ కంపెనీలకు సానుకూల పరిస్ధితులు కల్పించలేదని ఇతర దేశాల ప్రభుత్వాలను ఆడిపోసుకోవడం పశ్చిమ పత్రికలు అనాదిగా అభ్యసించి ఆచరిస్తున్న హిపోక్రసీ కళ!
వడ్డీ రేట్లు, కధా కమామీషూ…
ఈ నేపధ్యంలో భారత దేశంలో ద్రవ్యోల్బణం కట్టడి చేయాల్సిన బాధ్యత ఆర్.బి.ఐ నెత్తిపై పడింది. ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ మూడు వడ్డీ రేట్లను ఉపయోగిస్తుంది.
ఒకటి, కేష్ రిజర్వ్ రేషియో (సి.ఆర్.ఆర్): ప్రతి బ్యాంకు కూడా తాను ప్రజల నుండి వసూలు చేసే డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకు వద్ద జమ చేయాలి. డిపాజిటర్ల రక్షణ కోసం ఆర్.బి.ఐ ఈ చర్య తీసుకుంటుంది. సి.ఆర్.ఆర్ ను తగ్గిస్తే మరిన్ని నిధులు బ్యాంకులకు అందుబాటులోకి వస్తాయి. వివిధ కంపెనీలకు, వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అవకాశం వస్తుంది. సి.ఆర్.ఆర్ పెంచితే బ్యాంకుల వద్ద అందుబాటులో ఉండే నిధులు తగ్గిపోతాయి. ఆ మేరకు రుణాల జారీ కూడా తగ్గిపోతుంది.
రెండు, రేపో రేటు: ఆర్.బి.ఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు ఆర్.బి.ఐ వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్.బి.ఐ ఈ రేపో రేటు నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఈ రేటు గురించే. ఆర్.బి.అయి యొక్క ద్రవ్య పరపతి విధానానికి ఇది ప్రధాన ఉపకరణం. రేపో రేటు తగ్గితే వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద రుణాలు తీసుకోడానికి ఉత్సాహం చూపుతాయి. తద్వారా కంపెనీలకు, వ్యక్తులకు కూడా రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆర్.బి.ఐ రేపో రేటు తగ్గించినా దానిని జనానికి తరలించడానికి బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు. తద్వారా ఆదాయం పెంచుకోవాలని అవి చూడవచ్చు.
మూడు, రివర్స్ రేపో రేటు: బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వవచ్చు. అలా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్.బి.ఐ చెల్లించే వడ్డీ రేటు రివర్స్ రేపో రేటు. ఇది ఎల్లప్పుడూ రివర్స్ రేపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. ఆర్.బి.ఐ వద్ద ఉన్న డబ్బు పదిలంగా ఉంటుంది. మార్కెట్లో అస్ధీర పరిస్ధితులు ఉన్నపుడు బ్యాంకులు తమ అదనపు డబ్బును ఆర్.బి.ఐ వద్ద ఉంచడానికి ఇష్టపడతాయి. తద్వారా తక్కువే అయినా నమ్మకమైన, స్ధిరమైన వడ్డీ ఆదాయాన్ని అవి పొందుతాయి.
ద్రవ్యోల్బణం
ఇపుడు ద్రవ్యోల్బణం విషయానికి వస్తే ద్రవ్య + ఉల్బణం = ద్రవ్యోల్బణం. ద్రవ్యం అనగా డబ్బు లేదా దాని సమాన రూపాలు విచ్చలవిడిగా మార్కెట్లో స్వైర విహారం చేయడమే ద్రవ్యోల్బణం. ఒక నిర్దిష్ట కాలంలో దేశంలో చలామణీలో ఉన్న ఉత్పత్తుల మొత్తం విలువకు సమాన మైన డబ్బు మాత్రమే జనం చేతుల్లో చలామణీలో ఉండాలి. ఉత్పత్తుల వాస్తవ మొత్తం విలువ కంటే ఎక్కువ డబ్బు చలామణీలో ఉన్నట్లయితే సరుకుల కంటే డబ్బు ఎక్కువ కావడం వలన ధరలు పెరుగుతాయి. ఈ కారణం వల్ల ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణానికి పర్యాయ వ్యవహారికంగా చూస్తారు.
అయితే ఖచ్చితంగా సరుకుల (ఉత్పత్తుల) విలువకు సమానమైన డబ్బు మాత్రమే చలామణీలో ఉన్నట్లయితే మారకం కష్టం అవుతుంది. అందువలన చలామణి కోసం (డబ్బు చేతులు మారడం కోసం అంటే సరుకులు చేతులు మారడం కోసం) పరిమిత స్ధాయిలో అధిక డబ్బును అనుమతిస్తారు. ఇది సాధారణంగా 3 శాతం ఉంటుంది. ఇది అధికారికం కనుక దీనిని ద్రవ్యోల్బణంగా లెక్కించరు. 3 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది ద్రవ్యోల్బణం అవుతుంది. మొత్తం మీద ద్రవ్యోల్బణం 5 శాతం ఉన్నట్లయితే సాధారణం అని ఆర్.బి.ఐ చెబుతుంది. కనుక ఇపుడున్న 5.96 శాతం కూడా ఎక్కువే. కానీ గత రెండు, మూడు సంవత్సరాలుగా రెండంకెల స్ధాయి వద్ద ఉన్న ద్రవ్యోల్బణం దాదాపు 6 శాతం ఉండేసరికి సంతోషకారకంగా కనిపిస్తోంది.
మరి ఒక నిర్ధిష్ట కాలంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న సరుకుల మొత్తం విలువ కంటే తక్కువ విలువ గల డబ్బు చలామణిలో ఉంటే? అప్పుడది ప్రతి ద్రవ్యోల్బణం (deflation) అవుతుంది. ప్రతి ద్రవ్యోల్బణం ఉన్నపుడు డబ్బు తక్కువగా ఉండి సరుకులు ఎక్కువగా ఉండడం వలన సరుకుల ధరలు తగ్గిపోతాయి. సరుకుల ధరలు తగ్గినపుడు కొనుగోళ్ళు పెరుగుతాయని భావిస్ధాము కానీ అలా జరగదు. సరుకులు ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనతో సాధారణంగా జనం కొనుగోళ్ల జోలికి పెద్దగా పోరు. (సరుకుల ధరలు పెరుగుతున్న దశలో ఇంకా పెరుగుతాయేమో అన్న ఆందోళనతో ముందే కొనిపెట్టుకోవాలని భావిస్తూ కొనుగోళ్ళు ఎక్కువ చేస్తారు.) దానితో కంపెనీలు ఉత్పత్తులు తగ్గిస్తాయి. అంటే జి.డి.పి పడిపోతుంది. కనుక ద్రవ్యోల్బణం పరిమిత స్ధాయిలో ఉంటేనే దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఆరోగ్యం. ఎక్కువ ఉన్నా నష్టమే, తక్కువ ఉన్నా నష్టమే.
వడ్డీ రేట్ల గురించి, ద్రవ్యోల్బణం గురించి చూశాం కనుక ఇప్పుడు మళ్ళీ భారత దేశము వడ్డీ రేట్లు దగ్గరికి, ద్రవ్యోల్బణం కట్టడి దగ్గరికి వద్దాము.
పైన చెప్పినట్లు ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడి మళ్ళీ జి.డి.పి ని పెంచడానికి దేశాలన్నీ బెయిలౌట్ల పేరుతో కంపెనీలకు అనుకూలమైన విధానాలను అనుసరించాయి. వడ్డీ రేట్లు, సి.ఆర్.ఆర్ లాంటి రేట్లు బాగా తగ్గించి ప్రైవేటు కంపెనీలకు విచ్చలవిడిగా నిధులను అందుబాటులోకి తెచ్చాయి. ఈ నిధులు ఖర్చు పెట్టి పరిశ్రమలు తదితర ఉత్పత్తి కార్యక్రమాలు జరిపి, ఉదోగాలు కల్పించి ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిన పెడతాయని ప్రైవేటు కంపెనీలకు ఆ విధంగా నిధులు అందుబాటులోకి తెచ్చాయి. ఆ వరుసలో ఆర్.బి.ఐ కూడా ఇక్కడ రెపో రేటు తగ్గించింది. సి.ఆర్.ఆర్ రేటు కూడా తగ్గించింది. రెపో రేటు 2008 చివర 9 శాతం వరకు ఉండగా దానిని 2009 ఏప్రిల్ నాటికి 4.75 శాతానికి తగ్గించారు. ప్రపంచవ్యాపితంగా దాదాపు ఇలాగే జరిగింది.
ఆర్.బి.ఐ విఫల యత్నం
ఈ సరళతరమైన ద్రవ్య పరపతి విధానం వలన 2009-10 నాటికి ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంది. పశ్చిమ దేశాల్లో నియంత్రణ వ్యవస్ధలు సాపేక్షికంగా గట్టిగా ఉంటాయి. చైనా లాంటి చోట్ల ఒకే పార్టీ పాలన గనుక అక్కడ కూడా నియంత్రణ వ్యవస్ధ సాపేక్షికంగా పటుత్వంతో ఉండడం వలన ద్రవ్యోల్బణం పరిమితి దాటలేదు.
కానీ భారత దేశం పేరుకే ప్రజాస్వామ్యం గానీ ఇక్కడ జనం తప్ప అందరూ మేస్త్రులే. భూస్వామి ఒక మేస్త్రి. బడా పెట్టుబడిదారుడు ఇంకో మేస్త్రి. మాఫియా మరో పెత్తందారు. వీరి మాస్టరయిన సామ్రాజ్యవాది వీరి కంటే పెద్ద మేస్త్రి (మేస్త్రీలకు మేస్త్రీ అన్నట్లు). ఇంతమంది యజమానుల్లో ఆర్.బి.ఐ ఎవరిని కట్టడి చేయాలి? ఐరోపా సెంట్రల్ బ్యాంకు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ల వడ్డీ రేట్లను ఎలాగూ ఆర్.బి.ఐ నియంత్రించలేదు. కనుక యూరోలు, స్టెర్లింగులు, డాలర్లు తక్షణ లాభాల కోసం ఇండియా లాంటి దేశాల స్టాక్ మార్కెట్లను ముంచెత్తాయి. ఇవి కాక దేశం నుండి వెళ్ళిన నల్ల డబ్బు రూపం మార్చుకుని ఎఫ్.డి.ఐ లుగానో ఎఫ్.ఐ.ఐ లుగానో వచ్చింది. ఇవి వచ్చినంత కాలం కరెంటు ఖాతా లోటుకు ఢోకా లేకుండా పోయింది గానీ ద్రవ్యోల్బణం అవధులు దాటింది.
ఆర్.బి.ఐ కి మిగిలిన సాధనాలు సి.ఆర్.ఆర్, రెపో, రివర్స్ రెపో లు. వీటిని ఒక్కో అడుగూ పెంచుకుంటూ పోయింది. దఫదఫాలుగా 0.25 శాతం, అప్పుడప్పుడూ 0.5 శాతం వరకు సి.ఆర్.ఆర్, రెపో, రివర్స్ రెపో పెంచుతూ పోయింది. డిసెంబరు 2011 నాటికి రెపో రేటును 8.5 శాతానికి పెంచగా సి.ఆర్.ఆర్ ను 6 శాతానికి పెంచింది. ఆ విధంగా ద్రవ్య చలామణిని కట్టడి చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్.బి.ఐ ప్రయత్నించింది.
కానీ ద్రవ్యోల్బణానికి అసలు రంగం నిజ ఆర్ధిక వ్యవస్ధే తప్ప స్టాక్ మార్కెట్లు, సెంట్రల్ బ్యాకులు, వాణిజ్య బ్యాంకులు కావు. నిజ ఆర్ధిక వ్యవస్ధలో జనానికి డబ్బు అందుబాటులోకి రావాలి. అంటే వారి శ్రమకు తగిన వేతనాలు వారికి అందాలి. ద్రవ్యోల్బణం పెరుగుదల నిష్పత్తిలోనే ఉద్యోగుల వేతనాలు కూడా పెరగాలి. కానీ వాస్తవానికి అలా జరగదు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఉద్యోగుల నిజ వేతనాలు పడిపోవడం వాస్తవ పరిస్ధితి. ఇది ప్రభుత్వోగుల విషయం మాత్రమే. ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు, కూలీలు, రైతులు, కార్మికుల పరిస్ధితి ఇక చెప్పనవసరం లేదు. వారి శ్రమతో ఉత్పత్తి అయ్యే సరుకుల ద్వారా ఉత్పన్నమయ్యే ఆదాయ పంపిణీ విషయానికి వచ్చేసరికి పై వర్గాల వద్ద ఎక్కువగానూ. కింది వర్గాల వద్ద తక్కువగానూ పంపిణీ అవుతుంది.
ఆ ఒక్కటీ అడక్కు
ఆదాయాలను ప్రదానంగా సొంతం చేసుకునే ధనిక వర్గాలు ఎంత ఖర్చు చేసినా పరిమితి దాటదు. అదే ప్రజా సామాన్యం చేతికి తగిన ఆదాయం వస్తే సరుకులు అమ్ముడుబోతాయి. ఆదాయం, ఉత్పత్తిలు నిరంతరం టర్నోవర్ అవుతుంటాయి. ద్రవ్యోల్బణం కట్టడి చేయాలంటే ఆదాయాల పంపిణీ సజావుగా జరగాలి. శ్రమకు తగిన ఫలితం దక్కాలి. నల్ల డబ్బు అరికట్టాలి. ఆదాయాల, సంపదల కేంద్రీకరణ తగ్గించాలి. మాఫియా ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆర్ధిక వ్యవస్ధలోకి ప్రవేశపెట్టాలి. విదేశాల్లో దాగిన లక్షల కోట్ల నల్ల డబ్బును దేశానికి రప్పించి వినియోగపెట్టాలి. ఇవన్నీ జరిగితే ద్రవ్యోల్బణం ఏమి ఖర్మ! దాని తలలో జేజమ్మే దిగి వస్తుంది.
కానీ విషాధం ఏమిటంటే ధనికులు కాపుకాస్తున్న ప్రస్తుత వ్యవస్ధలో జరగనిది ఇదే. ఎవరి వద్ద అయితే ఆదాయాలు కేంద్రీకృతం అవుతున్నాయో వారే కుర్చీలో ఉన్నారు. ఏ మాఫియాల నైతే అరికట్టాలో వారే ఎం.పిలు, ఎమ్మెల్యేలు. ఎవరిపైనైతే కుంభకోణాలను అరికట్టే బాధ్యతను ప్రజలు ఉంచారో వారే అందులో పాత్రధారులు. డబ్బు ఈ విధంగా విచ్చలవిడిగా ఎవరి దగ్గరైతే ఉండకూడదో వారి వద్దనే పేరుకుపోతే ద్రవ్యోల్బణం అరికట్టడం ఆర్.బి.ఐ లాంటి నామమాత్ర సంస్ధల వల్ల కాదు.
కనుక ద్రవ్యోల్బణం అరికట్టడానికి ఆర్.బి.ఐ వివిధ ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా సఫలం కాలేదు. అయితే అంకెల గారడీయే చేశారో, ఏమి చేశారో గానీ గత ఒకటిన్నర సంవత్సరాల కాలంగా ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. మొదట రెండంకెల నుండి ఒంటి అంకెకు చేరిన టోకు ధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్ 2012 నాటికి 7.5 శాతానికి ఫిబ్రవరి 2013 నాటికి 7.28 శాతానికి చేరింది. ప్రభుత్వం ఇస్తున్న తాజా వివరణ ప్రకారం కూరగాయల ధరలు బాగా పడిపోవడంతో ద్రవ్యోల్బణం తగ్గడానికి వీలయింది. మార్చి నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.73 ఉంటే అది ఏప్రిల్ నాటికి 6.08 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల ద్రవ్యోల్బణం మార్చి నెలలో -0.95 శాతం కాగా ఏప్రిల్ లో అది -9.05 కి తగ్గింది. పండ్ల ధరల ద్రవ్యోల్బణం మార్చి లో 4.71 శాతం ఉండగా ఏప్రిల్ లో 0.71 శాతానికి తగ్గింది. వీటన్నింటి ఫలితంగా మొత్తం టోకు ధరల ద్రవ్యోల్బణం 4.89 శాతానికి తగ్గింది.
అయితే ఇది హోల్ సేల్ ధరల పై ఆధారపడిన ద్రవ్యోల్బణం మాత్రమే. ప్రజలు వాస్తవంగా రుచి చూసేదీ వినియోగ ధరల సూచీ పై ఆధారపడిన ద్రవ్యోల్బణం. Consumer Price Index (CPI) ధరల ప్రకారం ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యకు కొద్దిగా తక్కువగా 9.39 శాతం వద్ద ఠీవిగా నిలబడే ఉంది. ఈ సి.పి.ఐ ద్రవ్యోల్బణం గురించి పాలకులు పెద్దగా చర్చించరు. పత్రికలు కూడా ప్రభుత్వాల హృదయ వేదన గ్రహించి సి.పి.ఐ ద్రవ్యోల్బణానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.
రేటు కోతకు సైయా?
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్.బి.ఐ మళ్ళీ రెపో రేటు తగ్గిస్తుందని రాయిటర్స్, బ్లూమ్ బర్గ్ లాంటి పశ్చిమ పత్రికల నుండి టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందు లాంటి భారత పత్రికల వరకు ఊహాగానాలు చేస్తున్నాయి. ఆ ఊహాలన్నీ కంపెనీల ఆశలే. కంపెనీల ఆశలు ప్రతిఫలింప జేయడంలో పత్రికలు, ముఖ్యంగా వాణిజ్య పత్రికలు ఎప్పుడూ ముందే ఉంటాయి. అసలు తమ పనే అది అన్నట్లుగా పెట్టుబడిదారులు, వారి కంపెనీల ఆశల ఊసులను బ్యానర్ హెడ్డింగుల పల్లకీలు కట్టి ఊరేగిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ద్రవ్యోల్బణం 5.96 శాతానికి తగ్గింది గనుక ఆర్.బి.ఐ రెపో రేటు తగ్గించడం తధ్యం అంటున్నాయి. జూన్ 17 నాటికి మధ్యంతర ద్రవ్య పరపతి విధానం ఆర్.బి.ఐ ప్రకటించాలి.
మొన్న మే 3 తారీఖున ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంలోనే ఆర్.బి.ఐ రెపో రేటును 7.5 నుండి 7.25 కు తగ్గించింది. గత సంవత్సరంతో పాటు అంతకు ముందు సంవత్సరం నుండి భారత జి.డి.పి బాగా క్షీణించడంతో రెపో రేటు తగ్గింపుకు డిమాండు తీవ్రం అయింది. కంపెనీలతో పాటు మంత్రులు, ప్లానింగ్ కమిషన్ తదితర సంస్ధలు డిమాండ్ చేయడంతో మళ్ళీ దఫదఫాలుగా ఆర్.బి.ఐ తన రెపో రేటు తగ్గిస్తూ వస్తోంది.
8.5 శాతం నుండి తగ్గిస్తూ ఇప్పుడు 7.25 శాతానికి చేర్చింది. మే 3 నాటి పరపతి విధానంలోనే 0.25 శాతం కాకుండా ఒకేసారి 0.5 శాతం తగ్గించాలని డిమాండ్ వచ్చింది. కానీ కరెంటు ఖాతా లోటు ప్రమాదకరంగా ఉండడంతో ఆర్.బి.ఐ 0.25 శాతం కోతతో సరిపుచ్చింది. అప్పుడు కోరిన విధంగా తగ్గించలేదు గనక జూన్ 17 న ప్రకటించబోయే ద్రవ్య విధానంలో ఆర్.బి.ఐ తగ్గించ వచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఇప్పుడప్పుడే వడ్డీ తగ్గింపు లేదని మే 3వ తేదీనే ఆర్.బి.ఐ తెలిపింది. అయినప్పటికీ ఒత్తిడి పెంచే ఉద్దేశ్యంతో కంపెనీలు ఊహలను ప్రచారంలో పెడుతున్నాయి.
అంతిమంగా తేలేదేమిటంటే ఆర్.బి.ఐ పరపతి విధానం, రెపో, రివర్స్ రెపో, సి.ఆర్.ఆర్ తదితర వడ్డీ రేట్ల భాష అంతా ధనికులకు, వారి కంపెనీలకు సంబంధించినదే తప్ప సామాన్య జనానికి సంబంధించినది కాదు. ఆర్.బి.ఐ ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాని ద్రవ్యోల్బణం ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అనూహ్య రీతిలో తగ్గిపోవడం ఎన్ని టక్కు టమార విద్యల ఫలితమో పాలకులకే తెలియాలి.
Thanks for sharing detail explanation..
Sir i need clarity on one point.As u pointed out,how an equal distribution of wealth will help in controlling inflation?
ప్రేమ్ గారు, సంపదల సమాన పంపిణి అనేది మీరు ఏ అర్ధంతో చూస్తున్నారో గాని అది ప్రస్తుత వ్యవస్ధలో జరిగేది కాదు. ఐనా వివరణ కోసం చూద్దాం.
సంపదల సమాన పంపిణికి చర్యలు తీసుకునే ప్రభుత్వాలు, బ్లాక్ మనీ, మాఫియా, విదేశీ బ్యాంకులకు తరలింపు, వాటిని మళ్ళీ హవాలా మార్గంలో తిరిగి తెచ్చుకోవడం… ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వవు. అంటే ఉన్న డబ్బు అంతా లెక్కింపులోకి వస్తుంది.
కాని బ్లాక్ మనీ, హవాలా మనీ లాంటివి ఆర్.బి.ఐ లెక్కింపులో ఉండవు. చట్టబద్ధంగా బ్యాంకుల ద్వారా చలామణి అవుతున్న డబ్బునే అది పరిగణిస్తుంది. ఆ విధంగా అసలు చలామణిలో ఉన్న డబ్బు కంటే తక్కువ డబ్బు మాత్రమే ద్రవ్యోల్బణం లెక్కల్లోకి వస్తుంది. ఆ విధంగా చట్టబద్ధ ద్రవ్యోల్బణమే ఇంత ఉంటే వాస్తవ ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువ ఉంటుంది.
ఆర్.బి.ఐ లెక్కలోనే లేని డబ్బుని అదెలా నియంత్రిస్తుంది? కాని సంపదల సమాన పంపిణిలో ముద్రించిన డబ్బంతా ఆర్.బి.ఐ లేదా అలాంటి వ్యవస్ధ లెక్కింపులో ఉంటుంది గనుక తదనుగుణంగా ద్రవ్య విధానం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయగలుగుతుంది.
అంతే కాకుండా సమాన పంపిణి ఉండే వ్యవస్ధలో ఆస్తులు పోగేసుకునే అవసరం రాదు. డబ్బు ఇనప్పెట్టెల్లో, బంగారు నగల్లో దాచుకునే అవసరం రాదు. వచ్చే ఉత్పత్తి అంతా ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్ధితి సంపదల సమాన పంపిణీలో ఉంటుంది. అప్పుడిక ద్రవ్యోల్బణం సమస్య నామమాత్రంగా ఉంటుంది. అది కూడా ప్రభుత్వం లేదా ఆర్.బి.ఐ లాంటి వ్యవస్ధల నియంత్రణలో ఉంటుంది.
సంపదల సమాన పంపిణి జరగాలంటే వ్యవస్ధలో సమూల మార్పులు జరగాలి. అది విప్లవాల ద్వారానే సాధ్యం. కనుక మీ ప్రశ్న ఇప్పటి వ్యవస్ధలో ఒక విధంగా ఊహాజనితం. జవాబేమో వ్యవస్ధల మార్పులో ఉంది.
శేఖర్ గారు. ఈ ఆర్టికల్ చాలా ఉపయోగకంగా ఉంది.
సాధారణంగా ఆర్థిక విషయాలకు సంబంధించిన వ్యాసాలన్నీ సులభంగా అర్ధంకాని పదాలతో ఉండి ఒక పట్టాన కొరుకుడు పడవు. అలాంటిది ఆర్ బీఐకి సంబంధించిన వ్యవహారాలు, ద్రవ్యోల్బణం తాలూకు అసలు లొసుగులు అన్నీ చాలా చక్కగా వివరించారు.
ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం ఓకే. కానీ ఇంకోటి రుణ ద్రవ్యోల్బణం( రివర్స్ ఇన్ ఫ్లేషన్ ) కూడా ఉన్నట్లుంది. దాన్ని కూడా కొంచెం సులభంగా అర్ధమయ్యేలా వివరించరా..
చందుతులసి గారు
బహుశా మీరు చెప్పేది రీఫ్లేషన్ అనుకుంటాను.
రీఫ్లేషన్ అంటే తీవ్రమైన ఆర్ధిక మాంద్యం (గ్రేట్ డిప్రెషన్ లాంటివి) పరిస్ధితుల్లో అత్యంత తక్కువ ధరలు ఉన్నపుడు ఆర్ధిక వ్యవస్ధలో ఉత్తేజం నింపడానికి ఉద్దేశ్యపూర్వకంగా ధరలు పెంచడం తద్వారా డబ్బు పెంచడం. డిజ్-ఇన్ఫ్లేషన్ దీనికి వ్యతిరెకం. ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా వందలు, వేల శాతాల్లో ఉన్నపుడు ఉద్దేశ్యపూర్వకంగా వివిధ పద్ధతుల్లో డబ్బు సంచయాన్ని తగ్గించడం.
ఇవి ప్రత్యేక పరిస్ధితుల్లో వాడుకలోకి వచ్చేవి.
Dear Sir,
If RBI is not counting block money into their calculation, why not RBI and govt making decision to change currency notes to any plastic notes by which RBI can ask ppl to exchange available currency with plastic notes and seize remaining notes which are not submitted to govt. This may not possible as the decision has to be made by politicians who are mainly having block money but just want your input on this.
They just want my input!?
Sir, My intention was i need your input on my comment.
Sir,u explained nicely abt inflation,could be pls explain how various sections of society are affected by inflation?like moneylenders,poor people,corporate industry,bankers,manfactures…etc