ఉత్తర కొరియా శాంతించినా, అణు వాహక నౌక తరలించిన అమెరికా


యు.ఎస్.ఎస్ నిమిట్జ్ -ఫొటో: ఎ.ఎఫ్.పి

యు.ఎస్.ఎస్ నిమిట్జ్ -ఫొటో: ఎ.ఎఫ్.పి

ఉభయ కొరియాల వద్ద నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్ధితులను శాంతింపజేయడానికి ఉత్తర కొరియా ప్రయత్నిస్తున్నప్పటికీ అమెరికా, దక్షిణ కొరియా దేశాలు మాత్రం తమ భారీ మిలట్రీ డ్రిల్ తో రెచ్చగొట్టుడు కార్యక్రమం కొనసాగిస్తున్నాయి. సరిహద్దు వద్ద మొహరించిన మధ్య శ్రేణి క్షిపణులను ఉపసంహరించడంతో పాటు ఉత్తర కొరియా తమ మంత్రివర్గంలో కూడా మార్పులు చేసి తద్వారా ఉద్రిక్తతలు శాంతించడానికి తన వంతు చర్యలు చేపట్టింది.

అయితె అమెరికా, దక్షిణ కొరియాలు తదనుగుణంగా స్పందించలేదు. పైగా అమెరికా అణు సామర్ధ్యం కలిగిన తన భారీ విమాన వాహక నౌక ‘యు.ఎస్.ఎస్ నిమిట్జ్’ ను ఉత్తర కొరియాకు అతి సమీపంలోని సముద్ర జలాలకు తరలించింది. అమెరికా-దక్షిణ కొరియాల భారీ మిలట్రీ డ్రిల్లును చూడనట్లు నటిస్తూ ఉద్రిక్తతలకు ఉత్తర కొరియాయే ఏకైక కారణం అంటూ కలం చించుకున్న పశ్చిమ పత్రికలు యధావిధిగా తాజా పరిణామం పట్ల కూడా శీత కన్ను కొనసాగించాయి.

ఉత్తర కొరియా తన రక్షణ మంత్రిని తొలగించి ఆయన స్ధానంలో యువ జనరల్ ను నియమించింది. తొలగించబడిన రక్షణ మంత్రి జనరల్ కిమ్‌ క్యోక్-సిక్ దూకుడు కలిగిన వ్యక్తిగా పేరు. 2010లో దక్షిణ కొరియా ద్వీపం పైకి క్షిపణుల ప్రయోగానికి ఆజ్ఞ ఆయనే ఇచ్చాడని ప్రచారంలో ఉంది. అలాంటి వ్యక్తిని తొలగించి మరొకరిని నియమించడం అంటే ఉద్రిక్తతలను నివారించడానికి ఉత్తర కొరియా బహిరంగ సూచన చెసినట్లే.

వాస్తవానికి దూకుడు మంత్రి తొలగింపు ఉత్తర కొరియా తీసుకున్న శాంతి చర్యల్లో రెండవది. మొదటి చర్యగా అంతకు మునుపు దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద మొహరించిన మధ్య శ్రేణి క్షిఫణులైన ‘ముసుడాన్‌’ లు రెండింటిని మే 7 తేదీన ఉత్తర కొరియా ఉపసంహరించుకుంది. ఈ క్షిపణుల మొహరింపు తర్వాతనే ఉత్తర కొరియా ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందంటూ పశ్చిమ పత్రికలు కాకిగోల చేశాయి. ఇపుడవి అక్కడ లేవు. అయినప్పటికీ అమెరికా తన దూకుడుని కొనసాగించింది.

బ్యానర్ చూపిస్తున్న అమెరికా నేవీ సిబ్బంది

బ్యానర్ చూపిస్తున్న అమెరికా నేవీ సిబ్బంది

శనివారం అమెరికా తన అణు సామర్ధ్యం కలిగిన ‘యు.ఎస్.ఎస్ నిమిట్జ్’ యుద్ధ విమాన వాహక నౌకను ఉభయ కొరియాల సరిహద్దు జలాలకు సమీపంలో మొహరించింది. ఈ నౌక ద్వారా సోమ, మంగళవారాల్లో శోధన మరియు రక్షణ కార్యకలాపాల డ్రిల్లు నిర్వహించనున్నట్లు రష్యా టుడే పత్రిక తెలిపింది. సముద్ర తలం పైన జరిపే యుద్ధ విన్యాసాలలో కూడా ఇది పాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ కొరియా రక్షణ మంత్రి ప్రకటించాడని ఆర్.టి తెలిపింది.

అమెరికా అణు యుద్ధ విమాన వాహక నౌక మొహరింపును ఉత్తర కొరియా తీవ్రంగా గర్హించింది. తీవ్రమైన మిలట్రి ప్రకోపానికి అమెరికా చర్యలు దారితీస్తాయని, కొరియాల వద్ద మరిన్ని ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికే అమెరికా ప్రయత్నిస్తోందని ఉత్తర కొరియా ప్రభుత్వ నాయకులు ఆరొపించారు. “ అణు యుద్ధ విమాన వాహక నౌకతో సహా ఇతర అత్యాధునిక ఆయుధాలతో జరుపుతున్న ఈ నౌకా డ్రిల్లు, ఉద్దేశ్యపూర్వకంగా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి తలపెట్టినది… మాపై దురాక్రమణ దాడి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు తీవ్రమైన నిర్లక్ష్యపూరిత దశకు చేరుకున్నాయని దీని ద్వారా స్పష్టం అవుతోంది” అని ‘ ఉభయ కొరియాల శాంతియుత పునరేకీకరణ కమిటీ’ శనివారం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నదని పత్రికలు తెలిపాయి.

ఆర్.టి ప్రకారం నిమిట్జ్ యుద్ధ వాహక నౌక పైన 64 యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. నిమిట్జ్ నౌక ఫ్లాగ్ షిప్ గా వ్యవహరించే ఈ నౌకల వరుసలో 8 యుద్ధ నౌకలు ఉన్నాయి. అందులో నాలుగు ఉపరితల వినాశకర చర్యలు తీసుకునే డిస్ట్రాయర్లు కాగా మూడు ఎస్కార్టు నొఉకలు. ఎనిమిదవది నిమిట్జ్. ఈ నౌకను ఇక్కడకు రావాలని ముందే నిర్ణయించబడిందని, ఉత్తర కొరియా చర్యలకు ప్రతిస్పందనగా తేలేదని నౌక అడ్మిరల్ చెప్పినట్లు తెలుస్తోంది.

పత్రికల ప్రకారం అమెరికా, దక్షిణ కొరియాలు ప్రతి సంవత్సరం ఈ విధమైన మిలట్రీ డ్రిల్లులతో కొరియాల వద్ద ఉద్రిక్తతలు రేపడం ఆనవాయితీ. కొరియా యుద్ధం, యుద్ధ విరమణ ఒప్పందంతో ముగియలేదు. ఆర్ంస్టైజ్ ఒప్పందంతో మాత్రమే ముగిసింది. యుద్ధంలో ఉన్న ఇరు పక్షాల సేనా నాయకులు పరస్పర అంగీకారంతో కాల్పులను తాత్కాలికంగా విరమిస్తే అది ఆర్మిస్టైజ్ ఒప్పందం అవుతుంది. అది తాత్కాలిక ఒప్పందం మాత్రమే. ఈ ఒప్పందం కుదిరినప్పటికీ ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభించే అవకా్శం ఇరు పక్షాలకు ఉంటుంది. అలా కాకుండా ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య సమగ్ర చర్చలు జరిగినట్లయితే అది శాశ్వత శాంతి ఒప్పందంగా ఉంటుంది.

ఇలాంటి శాశ్వత ఒప్పందం చేసుకుందామని అప్పటి  ఉత్తర కొరియా ప్రభుత్వ నేత కిమ్‌ ఇల్-సంగ్ (ఇప్పటి నేత కిమ్‌ జోంగ్-ఉన్‌ తాత) పదే పదే కోరినప్పటికీ అమెరికా అంగీకరించలేదు. ఆ తర్వాత కూడా అనేకసార్లు చర్చల కొసం ఉత్తర కొరియా ప్రయత్నించింది. పునరేకీకరణకు దక్షిణ, ఉత్తర కొరియాల వైపు నుండి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ ప్రయత్నాలను అమెరికా అడ్డం కొట్టడంతో అవి ముందుకు సాగలేదు.

అమెరికా చర్యకు కారణం స్పష్టమే. శాంతి నెలకొన్న చోట అమెరికాకు స్ధానం ఉండదు. అమెరికా వేలు పెట్టాలంటే అక్కడ నిరంతరం ఉద్రిక్తతలు రగులుతూ ఉండాలి. లెనిన్‌ మహాశయుడు చెప్పినట్లు సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం. సామ్రాజ్యవాదం బతికి ఉన్నంతవరకు ‘రెండు యుద్ధాల మధ్య విరామమే శాంతి’ అన్న నానుడి నిత్య సత్యంగా కొనసాగుతూనే ఉంటుంది.

One thought on “ఉత్తర కొరియా శాంతించినా, అణు వాహక నౌక తరలించిన అమెరికా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s