స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు తానే అసలు ప్రతినిధినని చెప్పుకుంటుంది అమెరికా. వ్యక్తిగత స్వేచ్ఛను మించింది లేదని అంటుంది అమెరికా. (స్వేచ్ఛా హక్కు లాంటి ప్రాధమిక హక్కులకు హేతుబద్ధమైన పరిమితులు -reasonable restrictions- ఉండాలంటుంది భారత రాజ్యాంగం.) భారీ లిబర్టీ విగ్రహం సాక్షిగా చూపే అమెరికాలో లిబర్టీ, శిలగా తప్ప బతకలేని పరిస్ధితి అంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచంలో స్వేచ్ఛను స్ధాపిస్తానంటూ బాంబులు, ఫిరంగులతో బయలుదేరే అమెరికా అత్యంత కరుడుగట్టిన నియంతృత్వ రాజ్యాలకు కాపలా కాయడమే కాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన అనేక ప్రభుత్వాలను కూల్చివేసింది. అమెరికా లోపల సామాన్యుడి పరిస్ధితి కూడా అమెరికా బైట స్వతంత్ర రాజ్యాలు అనుభవిస్తున్నదే.
వేట దేశం అనే పేరుతో అమెరికాలో విచ్చలవిడిగా తుపాకులకు లైసెన్సులు దొరుకుతాయి. ఒక లైసెన్సును అడ్డం పెట్టుకుని నాలుగైదు తుపాకులు కొని పెట్టుకోవడం అక్కడ ఆనవాయితీ. భారత దేశం లాంటి దేశాల్లో చంపుకోవాలంటే వేట కొడవళ్ళు, గొడ్డళ్ళను ఆశ్రయిస్తారు తప్ప తుపాకుల జోలికి వెళ్ళడం చాలా అరుదు. ఒక ఎస్.ఐ గాలిలోకి తుపాకి పేల్చాడంటేనే రగడ జరిగే చోట తుపాకుల లైసెన్సులు గొప్పోళ్లకే సొంతం. కానీ అమెరికాలో నిత్యం అబధ్రతకు చోటు కల్పించే సామాజిక పరిస్ధితుల వలన వేట తుపాకులే భద్రతా సాధనాలుగా మారి తుపాకుల మార్కెట్ ను బిలియన్ల డాలర్లకు చేర్చింది.
తుపాకులు వ్యాపార సామ్రాజ్యాలకు ఆకర్షణీయంగా మారినాక ఇక వాటికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ లాబీలు తయారైనాయి. ‘గన్ కంట్రోల్’ ను డిమాండ్ చేసే లాబీలు కొన్నయితే, సెకండ్ అమెండ్ మెంట్ గ్యారంటీ చేసిన తుపాకులు కలిగి ఉండే హక్కు వ్యక్తిగత భద్రతకు, అణచివేత ప్రతిఘటనకు, రాజ్య రక్షణలో పౌరుడి పాత్రకూ తప్పనిసరి అని వాదించి గెలుస్తున్న గన్ లాబీలు మరికొన్ని. ఇప్పటివరకూ అయితే తుపాకి తయారీ కంపెనీలదే పై చేయిగా ఉంది.
తుపాకులకు అనుకూలంగా వాదించేవారిలో అనేకమంది ప్రజానుకూల రాజకీయ ప్రముఖులు కూడా ఉండడం విశేషం. ధనిక వర్గాలు ప్రభుత్వాల అండతో తుపాకులు పేర్చుకుంటే వారి నుండి రక్షణ కోసం సామాన్యులకు కూడా తుపాకులు అవసరమేనని అనేకమంది ప్రముఖులు వాదిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే ‘తుపాకుల నియంత్రణ’ కోసం ఇటీవల ఒక చట్టాన్ని తేవడానికి ప్రయత్నించిన అధ్యక్షుడు ఒబామా విఫలం అయ్యి, ఆక్రోశం వెళ్లగక్కి, చేసేది లేక ఊరుకున్నారు. అనేకసార్లు స్కూలు పిల్లలపైన జరిగిన కాల్పులు, సిక్కుల గురుద్వారాలో జరిగిన కాల్పులు, బాట్ మేన్ సినిమా హాలులో జరిగిన కాల్పులు… వీటన్నింటినీ చూపి తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా అధ్యక్షుడికి సాధ్యం కాలేదు. తుపాకుల ధారణ హక్కును రక్షించుకోవడం కోసం అక్కడ ఒక పెద్ద సంఘమే ఉంది మరి.
ఐరోపా నుండి వలస వచ్చిన సెటిలర్లు స్ధానిక అమెరికన్ల దాడుల నుండి రక్షించుకునే పేరుతో తుపాకులను ఒక హక్కుగా అభివృద్ధి చేశారు. స్ధానికులను పశ్చిమ తీరానికి తరుముకుంటూ పోయిన యూరోపియన్ సెటిలర్ల ఆక్రమణకు తుపాకులే బాగా తోడ్పడ్డాయి. రెండో రాజ్యాంగ సవరణ ద్వారా తుపాకులను ప్రాధమిక హక్కుగా పొందడం వెనుక నేటివ్ అమెరికన్లు అణచివేతకు, తరిమివేతకు గురయిన చరిత్ర ఉన్నది. నేటివ్ అమెరికన్ల స్వేచ్ఛా కాంక్ష, దురాక్రమణ ప్రతిఘటనలే సెటిలర్ అమెరికన్లకు తుపాకి హక్కును కల్పించాయన్నమాట!
కనుక ‘సెకండ్ అమెండ్ మెంట్’ అంటూ అమెరికన్లు చెప్పేది ఒట్టి పిట్టకధ తప్ప మరొకటి కాదు.
పరపీడనా సంస్ర్కుతి ప్రతినిది అమెరికా సామ్రాజ్యవాదాన్ని గురించి చాలా బాగా వివరిస్తున్నారు. మూలవాసుల్ని కడతేర్చో లేక తరిమేసో కూర్చున్న అమెరికా ఆక్రమణ దారులను గురించి పరిశోధనాత్మక వివరాలు అందిస్తున్నారు. ఒకప్పుడు ఊచకోతకు గురైన యూదులు ప్రపంచ ప్రజల్ని శాసించడంలో పాత్ర పోషించడం విచిత్రం. దన్యవాదాలు.