ఎట్టకేలకు కళంకిత మంత్రులుగా పేరుబడిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అనవసర వివాదంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని అశ్వనీ కుమార్ అంటే, పవన్ కుమార్ బన్సాల్ ఆ మాట కూడా చెప్పలేదు. సి.బి.ఐ నివేదికను మంత్రి అశ్వనీ కుమార్, ఇతర బ్యూరోక్రాట్ అధికారులు మార్చడం వల్ల నివేదిక ఆత్మ మారిపోయిందని, వారి జోక్యం వలన విచారణ పక్కదారి పట్టే అవకాశం ఏర్పడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినప్పటికీ తనను కోర్టు తప్పు పట్టలేదని అశ్వనీ కుమార్ వ్యాఖ్యానించడం విశేషం.
కానీ అశ్వనీ కుమార్, పవన్ కుమార్ బన్సాల్ లు కేవలం చిన్న చేపలు మాత్రమే. బొగ్గు కుంభకోణం అసలు నిందితుడు అని ప్రతిపక్ష బి.జె.పి ఆరోపిస్తున్న మన్మోహన్ సింగ్ ఇంకా ప్రధాని పదవిని అంటిపెట్టుకునే ఉన్నారు. ఆయనపై నుండి దృష్టి మరల్చడానికే బన్సాల్ మేనల్లుడి అవినీతి రంగం మీదికి వచ్చిందని చెబుతున్నవారు లేకపోలేదు. లేకపోతే అవినీతి మహాసముద్రంలో 90 లక్షలు ఎంతని? 10 కోట్ల రూపాయల లంచానికి ఇది అడ్వాన్స్ మాత్రమే అని సి.బి.ఐ చెబుతోంది. కానీ పట్టుబడింది 90 లక్షలే. 2జి కుంభకోణాన్ని ఏమార్చి మాయ చేసిన కాంగ్రెస్ పార్టీ, బొగ్గు కుంభకోణాన్ని కూడా అదే తరహాలో మాసిపూసి మారేడు కాయ చేయడం ఖాయం. ఇప్పుడు సుప్రీం కోర్టు చేస్తున్నవన్నీ తాటాకు చప్పుళ్లేనని తెలిసే రోజు త్వరలోనే వస్తుంది.
భద్రంగా కప్పిపెట్టి ఉంచిన అవినీతి సూట్ కేసు నుండి ‘బలి పశువు’ను బైటికి రప్పించి తాము శుభ్రంగానే ఉన్నామని పాలక పెద్దలు రుజువు చేసుకోదలిచారని కార్టూన్ సూచిస్తోంది. బలి పశువును బలి ఇచ్చాక పాపపరిహారం అయిపోయి ఓటు బ్యాంకు అమ్మోరు శాంతిస్తుంది. మళ్ళీ తాజాగా పాప పాలన మొదలవుతుంది. ఈసారి ఇంకొంత జాగ్రత్త తీసుకుంటే సరి!