నిత్యం పెనం మీద కాలుతుండే మధ్యప్రాచ్యం (Middle-East) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా పర్యటనలో ఉన్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ, ఊహించని రీతిలో సిరియా ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకు చర్చలు జరగడానికి అంగీకరించాడు. అధ్యక్షుడు బషర్ అస్సద్ గద్దె దిగితే తప్ప చర్చలు సాధ్యం కాదని హుంకరిస్తూ వచ్చిన అమెరికా, చర్చలకు అంగీకరించడం ప్రపంచంలో బలా బలాలు మారుతున్నాయనడానికి మరో ప్రబల సంకేతం. అమెరికా, ఐరోపాల ప్రాభవ క్షీణతలో మరో అధ్యాయానికి తెరలేసిందని అమెరికా వెనకడుగు సూచిస్తోంది.
రెండు సంవత్సరాల పాటు కతార్, సౌదీ అరేబియా దేశాలను అడ్డం పెట్టుకుని హింసాత్మక టెర్రరిస్టుల సాయంతో బషర్ అస్సద్ ను కూలదోయడానికి ప్రయత్నిస్తున్న అమెరికా, ఐరోపాలు సిరియాలో చావుదెబ్బ ఎదుర్కొంటున్నాయని తాజా పరిణామం సూచిస్తోంది. సిరియా భవిష్యత్తును సిరియా ప్రజలే నిర్ణయించుకోవాలని ఇండియాతో సహా చైనా, రష్యా, ఇంకా అనేక దేశాలు సూచిస్తున్నప్పటికీ పెడచెవిన పెట్టిన అమెరికా, ఐరోపాలకు సిరియాలో తగిన గుణపాఠం ఎదురైనట్లే కనిపిస్తోంది.
జూన్ 2012 నెలలో ఐరాస మాజీ అధ్యక్షుడు కోఫీ అన్నన్ నేతృత్వంలో సిరియా శాంతి ఒప్పంద పత్రాన్ని రూపొందించారు. జెనీవాలో సిరియా అంశంపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఈ పత్రాన్ని అమెరికా, రష్యా, చైనా, యూరప్ లతో సహ అన్నీ దేశాలు అంగీకరించాయి. ‘జెనీవా కమ్యూనిక్’ గా పిలుస్తున్న ఈ ఒప్పందం ప్రకారం: సిరియా ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య చర్చలు జరిపేందుకు అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలి. మిలట్రీ పరిష్కారం కంటే రాజకీయ పరిష్కారమే సిరియా సమస్యకు సరైనది. సిరియాలో శాంతి నెలకొనడానికి సిరియా ప్రభుత్వము, తిరుగుబాటుదారులు కలిసి ‘పరివర్తన ప్రభుత్వం’ ను ఏర్పరచాలి.
అమెరికా, ఐరోపాలు కూడా జెనీవా ఒప్పందంలో భాగస్వాములు అయినప్పటికీ అది ముందుకు కదలలేదు. బషర్ అస్సద్ ఖచ్చితంగా గద్దె దిగాలని కోరుతున్నట్లుగా షరతు ఒప్పందంలో చేర్చాలని అమెరికా గట్టిగా డిమాండ్ చేసింది. అయితే దానికి రష్యా, చైనాలు అంగీకరించలేదు. సిరియా భవిష్యత్తును సిరియా ప్రజలే నిర్ణయించుకోవాలి అని అవి ప్రకటించాయి. ఈ ఒప్పందానికి అంగీకరించిన దేశాలలో ఇండియా కూడా ఒకటి. అమెరికా డిమాండు ఒప్పందంలో లేకపోవడంతో దాని అమలుకు అది ఆసక్తి చూపలేదు. తాను రూపొందించిన ఒప్పందాన్ని అన్నీ పక్షాలు అంగీకరించినప్పటికీ అది అమలు చేయకపోవడంతో కోఫీ అన్నన్ ఐరాస, అరబ్ లీగ్ ల సంయుక్త రాయబారి పదవికి రాజీనామా చేశాడు. ఆయన స్ధానంలో అల్జీరియా రాజకీయవేత్త లఖ్దర్ బ్రహ్మీ బాధ్యతలు చేపట్టాడు. అయితే పశ్చిమ దేశాల వైఖరికి విసిగిపోయిన బ్రహ్మీ కూడా ఇటీవల రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయనను ఎలాగో బతిమాలుకుని మరో 3 నెలలు ఉండాలని కోరడంతో ఆయన కొనసాగుతున్నాడు.
వాస్తవానికి జెనీవా ఒప్పందం ఆచరణలోకి రావడానికి ఐరాసలో తగిన తీర్మానం చేయవలసి ఉంది. తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా, ఐరోపా, కతార్, సౌదీ అరేబియాలు ప్రభుత్వ బలగాలపై తిరుగుబాటు బలగాలు పై చేయి సాధిస్తాయని అంచనా వేశాయి. ఆ అంచనా ఇంతవరకు సాకారం కానేలేదు. పైగా తిరుగుబాటు బలగాల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ప్రభుత్వ బలగాలు ఒక్కొక్కటీ స్వాధీనం చేసుకుంటున్నాయి. దానితో అమెరికాకు తన పరిస్ధితి ఏమిటో అర్ధం అయిందని జాన్ కెర్రీ మాటల ద్వారా అర్ధం అవుతోంది. జాన్ కెర్రీ ప్రకటనను ఐరాస, అరబ్ లీగ్ ల సంయుక్త రాయబారి లఖ్దర్ బ్రహ్మీ స్వాగతించాడు. ఇది సానుకూల సంకేతమని వ్యాఖ్యానిస్తూనే, ఇది మొదటి అడుగు మాత్రమేనని కెర్రీ ప్రకటన ఆచరణలోకి రావాలని ఆయన కోరాడని బి.బి.సి తెలిపింది.
“నేను ఈ రోజు రాత్రి ఆ విషయాన్ని (అస్సద్ తొలగింపు) నిర్ణయాయించబోవడం లేదు. అంతిమంగా కూడా నేను ఆ విషయాన్ని నిర్ణయించబోవడం లేదు. ఎందుకంటే వివిధ పక్షాలు పరస్పర అంగీకారంతో పరివర్తన ప్రభుత్వాన్ని (transitional government) ఎన్నుకోవాలని జెనీవా కమ్యూనిక్ చెబుతోంది. ఎవరా వివిధ పక్షాలు? వారెవరంటే ప్రస్తుత ప్రభుత్వం, మరియు ప్రతిపక్ష” అని జాన్ కెర్రీ, రష్యా విదేశీ మంత్రి సెర్గి లావరోవ్ తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త విలేఖరుల సమావేశంలో అన్నాడని ది హిందూ తెలిపింది. చర్చల ద్వారా ఒప్పందం చేసుకోవడంలో విఫలం అయితే సిరియా అల్లర్లలోకి జారిపోతుందని, విచ్ఛిన్నం అవుతుందని, జాతి హననం జరుగుతుందనీ, మధ్య ప్రాచ్యంలో విస్తృత అస్ధిరత్వానికి దారితీస్తుందని కెర్రీ వ్యాఖ్యానించాడు.
“సిరియాలో ఎదురవుతున్న భయాల్లో ఒకటి ఏమిటంటే – అది తీవ్రవాదులకు ఒక అయస్కాంతంలా మారిపోయింది. ప్రపంచంలో ఇతర ప్రజలకు హాని చేయాలన్న కోరికను వ్యక్తం చేసినవారిని, ఆల్-ఖైదాతో తమను తాము అనుబంధంగా ప్రకటించుకున్నవారిని, పశ్చిమ దేశాల ప్రయోజనాలను లేదా ఇతరుల ప్రయోజనాలను దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నవారిని అది ఆకర్షిస్తోంది” అని కెర్రీ అన్నాడు.
గత రెండేళ్లుగా రష్యా, చైనా, ఇండియా తదితర దేశాలు చెబుతున్నది సరిగ్గా ఇదే. సిరియాలో ప్రభుత్వ బలగాలతో తలపడుతున్న సో కాల్డ్ తిరుగుబాటుదారులలో ప్రధాన సంస్ధ ఆల్-నుస్రా ఫ్రంట్. ఇది తాను ఆల్-ఖైదాకు అనుబంధమని ప్రకటించుకుంది. ఈ సంస్ధను అమెరికా ఇటీవలే టెర్రరిస్టు జాబితాలో కూడా చేర్చింది. కానీ కతార్, జోర్డాన్, సౌదీ అరేబియా, టర్కీల ద్వారా వారికి అందుతున్న అత్యాధునిక ఆయుధాలు అమెరికా సరఫరా చేస్తున్నవే. కొసావో, లిబియా తదితర దేశాలలో తాము నిల్వ చేసిన ఆయుధాలను తిరుగుబాటుదారులకు అందజేసే ఏర్పాట్లను సి.ఐ.ఏ గూఢచారులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఆ మేరకు న్యూ యార్క్ టైమ్స్ లాంటి పత్రికలు ప్రత్యేక కధనాలు ప్రచురించాయి. సి.ఐ.ఏ కాంట్రాక్టర్లు స్వయంగా సిరియాలో ప్రవేశించి తిరుగుబాటుదారులకు సలహాలు, సూచనలు, ఇంటలిజెన్స్ సమాచారం అందిస్తున్నారని సదరు పత్రికలు తెలిపాయి.
ఈ నేపధ్యంలో చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోక పోతే సిరియా విచ్ఛిన్నం అవుతుందని, జాతి హననం జరుగుతుందని, ప్రాంతీయ అస్ధీరత్వానికి దారితీస్తుందని జాన్ కెర్రీ వాపోవడం గతి లేని పరిస్ధితుల వల్లనే. తాము ఆశలు పెట్టుకున్న తిరుగుబాటుదారులు చీలికలు, పేలికలుగా ఉండడం, అంతర్జాతీయంగా తగిన మద్దతు లేకపోవడం, సిరియా ప్రభుత్వం రోజు రోజుకీ పై చేయి సాధించడం, అమెరికాలో సైతం సిరియా విషయం అమెరికాకి అనవసరమని ప్రజలు భావిస్తున్నట్లు సర్వేల్లో తెలియడం, మరీ ముఖ్యంగా తన దుష్టపన్నాగాలు పారే అవకాశాలు క్రమంగా సన్నగిల్లడం… ఇవన్నీ అమెరికా వెనకడుగు వేయడానికి దారి తీసాయి. అయితే లఖ్దర్ బ్రహ్మీ చెప్పినట్లు ఇది ప్రారంభం మాత్రమే.
రష్యా విదేశీ మంత్రి సెరీ లావరోవ్ కూడా తగిన జాగ్రత్త పాటించాడు. “మాటలు చర్యలుగా మారాలంటే ప్రతిపక్షాల (తిరుగుబాటుదారులు) నుండి కూడా కొన్ని మాటలు వినపడాలి. జెనీవా కమ్యూనిక్ పట్ల నిబద్ధత ప్రకటిస్తూ ప్రతిపక్షాల నుండి ఇంతవరకు ఒక్క మాట కూడా రాలేదు. తమ తరపున చర్చలు జరిపే ప్రతినిధులు ఎవరో వారు చెప్పలేదు” అని లావరోవ్ అన్నాడు. ప్రతిపక్షాలు చీలి ఉన్నారని, వారిని ఐక్యం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన గుర్తు చేశాడు. ప్రతి గ్రూపును చర్చల బల్ల వద్దకు తేవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. “ఐక్య ప్రతిపక్షం నుండి తగిన మాటలు మనం విన్నట్లయితే – సిరియా ప్రభుత్వం ఇప్పటికే తగిన మాటలు చెప్పింది కనుక – అప్పుడు అలాంటి మాటలను చర్యలలోకి మార్చవచ్చు” అని లావరోవ్ వ్యాఖ్యానించాడని రష్యా టుడే తెలిపింది.
ఆర్ధికంగా బాగా బలహీనపడి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సర్దుబాట్లతో జి.డి.పి వృద్ధిని నెట్టుకొస్తున్న అమెరికా మిలట్రీ వ్యూహాలలో సైతం బలహీనపడుతోందని అత్యంత ముఖ్యమైన సిరియా సమస్య విషయంలో జరిగిన తాజా పరిణామం సూచిస్తోంది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఇప్పటికే అనేకమంది బలగాలను కోల్పోతున్న అమెరికా సిరియాలో సైనిక జోక్యం చేసుకోవడం ఆత్మహత్యా సదృశమే కాగలదు. అయితే సిరియా ప్రతిపక్షాలకు అమెరికా స్వయంగా ఆయుధ సరఫరాలు ప్రారంభిస్తుందని ఒక సెనేటర్ ప్రకటించడం, సంబంధిత బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదానికి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉండడం కెర్రీ ప్రకటన పట్ల అనుమానం రేకెత్తిస్తోంది. రానున్న రోజుల్లో విషయమై తగిన స్పష్టత రావచ్చు.