సౌదీ కార్మిక చట్టంతో 18 వేల భారతీయులు ఇంటికి


ట్రావెల్ ఏజెంట్ మోసానికి గురై సఫర్ జైలు (సౌదీ) లో ఉన్న భారతీయులు -ఫొటో: డెక్కన్ క్రానికల్

ట్రావెల్ ఏజెంట్ మోసానికి గురై సఫర్ జైలు (సౌదీ) లో ఉన్న భారతీయులు -ఫొటో: డెక్కన్ క్రానికల్

సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశీయుల నిరుద్యోగం తగ్గించడానికి నూతన కార్మిక చట్టం ‘నితాకాత్’ ప్రవేశ పెట్టడంతో వేలాది మంది భారతీయులు ఇండియాకు తిరుగుముఖం పడుతున్నారు. కొత్త చట్టం వలన తమ ఉద్యోగాలు ఎలాగూ పోతాయన్న ఆలోచనతో ఉన్న అనేకమంది ‘ఎమర్జెన్సీ సర్టిఫికేట్’ కోసం భారత రాయబార కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉద్యోగంలో చేరేటప్పుడు పాస్ పోర్టులను ఎంప్లాయర్స్ తీసేసుకుంటారు. దానితో ‘ఎమర్జెన్సీ సర్టిఫికేట్’ అవసరం ఏర్పడింది. సౌదీ అరేబియాలో 20 లక్షల  మందికి పైగా భారతీయులు వివిధ సంస్ధలలో పని చేస్తున్నారని కార్మిక మంత్రి వాయలార్ రవి ఒక ప్రశ్నకు సమాధానంగా లోక్ సభకు తెలిపారు.

నితాకత్ చట్టం ప్రకారం స్ధానిక ప్రైవేటు కంపెనీలు ప్రతి పది మంది విదేశీ ఉద్యోగులకు గాను ఒక సౌదీ ఉద్యోగికి (10 శాతం) ఉపాధి కల్పించాలి. అయితే భారతీయుల్లో ఎక్కువమంది ఉద్యోగులు తక్కువ స్ధాయి పనుల్లోనే అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్నారు. భారతీయులకు ఇచ్చే వేతనాలకు సౌదీ అరేబియా దేశీయులు ఎవరూ పని చేయరు. దానితో కొత్త చట్టం వలన భారతీయులకు వచ్చిన ముప్పేమీ లేదని భారత ప్రభుత్వం పరోక్షంగా సూచిస్తూ వచ్చింది. (ప్రత్యక్షంగా చెబితే ఆ మాత్రం పని కూడా ఇండియాలో దొరకదని అంగీకరించినట్లే.) కానీ నూతన చట్టం వలన తమకు ఉద్యోగాలు నిరాకరిస్తారన్న అనుమానం భారత కార్మికుల్లో పెరుగుతోంది. ఫలితంగా రాయబార కార్యాలయం ముందు వారు క్యూ కడుతున్నారు. మే నెలలో వారి సంఖ్య బాగా పెరిగిందని మంత్రి రవి తెలిపారు.

అయితే సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ప్రకారం భారతీయులు వెనక్కి రావడానికి కారణం నితాకత్ చట్టం కారణం కాదు. సరైన ధృవ పత్రాలు లేకుండా దేశంలో నివశిస్తున్న విదేశీయులకు వ్యతిరేకంగా సౌదీ అధికారులు చర్యలు, ప్రచారం ఉధృతం చేశారు. దానివల్లనే భారతీయులు అధిక సంఖ్యలో ‘ఎమర్జెన్సీ సర్టిఫికేట్’ ల కోసం దరఖాస్తు చేసుకున్నారని భారత ఎంబసీ వాదనగా మంత్రి రవి తెలిపారు. “ఈ ప్రచారం ఒక్క భారతీయ కార్మికుల పైన మాత్రమే ప్రభావం చూపడం లేదు. వలస కార్మికులు ఏయే దేశాలనుంచైతే వచ్చారో ఆ దేశాలన్నింటి పైనా ప్రభావం చూపుతుంది” అని రవి పార్లమెంటుకు తెలిపారు.

అయితే భారతీయుల పాస్ పోర్టు లను వారి ఉపాధిదారులు తీసివేసుకోవడం పట్ల భారత ప్రభుత్వం ఎన్నడూ స్పందించలేదు. పత్రికలు అనేకసార్లు ఈ సమస్యను ప్రస్తావించాయి. ఈ సమస్య వలన అనేకమంది భారతీయులు అక్రమ వలసదారులుగా ముద్ర పొంది గల్ఫ్ దేశాల్లో సంవత్సరాల తరబడి జైళ్ళలో గడుపుతున్నారు. వీరి విడుదలకు ప్రభుత్వాలు ప్రయత్నించిన దాఖలాలు లేవు. రాజశేఖర రెడ్డి హయాంలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏదో హడావుడి చేసింది గానీ అవి ఖాళీ చప్పుళ్లతోనే ముగిశాయి. ఆ తర్వాత పట్టించుకున్న నాధుడు లేడు. మంత్రి రవి ఇచ్చిన సమాచారం కూడా సౌదీ ఉపాధిదారుల దౌర్జన్యాన్ని స్పష్టం చేస్తోంది. పాస్ పోర్టులు భారతీయుల వద్ద ఉన్నట్లయితే ‘ఎమర్జెన్సీ సర్టిఫికేట్’ తీసుకోవలసిన అవసరం వారికి ఉండేది కాదు.

మంత్రి రవి నేతృత్వంలో కేంద్ర బృందం ఒకటి రెండు వారాల క్రితం సౌదీ అరేబియా పర్యటించి వచ్చింది. సౌదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నితాకత్ చట్టం వలన భారతీయులకు నష్టకరమని తాము సౌదీ ప్రభుత్వానికి చెప్పామని వారు అప్పట్లో తెలిపారు. తక్షణ సమస్యలన్ని పరిష్కరించడానికి ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్’ ని ఏర్పాటు చేస్తున్నామని ఇరు దేశాలు ఆర్భాటంగా ప్రకటించాయి. అనుమతి ఇచ్చినదాని కంటే ఎక్కువ కాలం దేశంలో ఉంటున్న భారతీయుల సమస్య, నితాకత్ చట్టం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఈ గ్రూప్ చూస్తుందని ప్రకటించారు. వాళ్ళు ఎంతవరకు చూశారో ఎమర్జెన్సీ సర్టిఫికెట్ల కోసం వేలాది మంది వరుస కట్టడాన్ని బట్టే అర్ధం అవుతోంది.

2 thoughts on “సౌదీ కార్మిక చట్టంతో 18 వేల భారతీయులు ఇంటికి

 1. ఈ విదేశాలలో ఉద్యోగాల మీద మోజు చాలా క్లిష్టమైన సమస్య !
  తక్కువ జీతాలతో , తక్కువ రకం ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడే భారతీయుల పరిస్థితులు దయనీయం ! ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో ! ప్రతి రోజూ అనేక మంది గల్ఫ్ ఏజెంట్ ల ” వల ” లో పడి , (మోసగించేది , గల్ఫ్ దేశాల ఎజంట్లూ , ఇండియా లో ఎజెంట్లూ కూడా ) వారి డబ్బూ పోగొట్టుకుని , చాలా అవస్థలు పడుతుంటారు ! గల్ఫ్ దేశాలలో, జీవన పరిస్థితులు, ప్రత్యేకించి తక్కువ జీతాలకోసం ఉద్యోగాలు చేసే ఉద్యోగుల జీవన పరిస్థితి, అక్కడకు వెళ్ళిన వారే వివరించాలి ! ఆశ్చర్యకరం ఏమిటంటే , చాలా మంది , తెలిసి తెలిసీ , తమ పాస్ పోర్టు లను ఏజెంట్ దగ్గర ” తాకట్టు ”పెట్టి అయినా గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు చేయడానికే సిద్ధ పడతారు !
  అట్లాంటి వారు , భారత దేశం లోనే ,ఒక్కో పట్టణం లో, కొన్ని వందల మంది సంఘటితం అయి, ఏజెంటు కు ఇచ్చే డబ్బూ , ప్రయాణ ఖర్చులకు పెట్టే డబ్బూ , కూడా కలిపి, పెట్టుబడి పెట్టి ,
  అనేక రకాల వ్యాపారాలను , ఉన్న చోటే ఉండి , చేస్తూ , లాభం పొందవచ్చు ! ఇక్కడ లోపించింది,సంకల్పమూ , కృత నిశ్చయం మాత్రమే ! కృషి లో లోపం ఎట్లాగూ ఉండదు కదా ! ‘దూరపు కొండలు నునుపు ‘ అనుకునే భావన కూడా వారి అవస్థలకు కారణం అవుతుంది !

 2. సుధాకర్ గారు…మీ సూచన విలువైనదే.
  –స్థానికంగా అవకాశాలు లేకపోవడం, ఉన్న అరకొర వాటిలోనూ వేతనాలు సరిగా లేకపోవడం, ఆర్థిక అవసరాలు అధికంగా ఉండడం, లాంటి తదితర కారణాలతో పరాయి దేశాలకు వెళ్లడానికి సిధ్దపడుతున్నారు. అందుకోసం లక్షల రూపాయలు సమర్పించుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తూ మోసగాళ్ల వలలో పడి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.

  —సుధాకర్ గారు చెప్పినట్లు స్థానికంగా ఉత్పాదక కార్యక్రమాలు చేపట్టి కొంత పరిస్థితి మెరుగుపరచుకోవచ్చు. ఐతే ఇందుకు ప్రభుత్వాలు కూడా కొంత ప్రోత్సాహకాలు కల్పించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s