మళ్ళీ వార్తల్లో కె.పి.ఎం.జి, 5సం.గా కదలని లైంగిక వేధింపుల కేసు


పైన పటారం, లోన లొటారం

పైన పటారం, లోన లొటారం

ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేటు అకౌంటింగ్ కంపెనీ కె.పి.ఎం.జి (క్లిన్వెల్డ్ పీట్ మార్విక్ గార్దెలర్ – Klynveld Peat Marwick Goerdeler) మరోసారి వార్తలకెక్కింది ఒక మహిళ ఉద్యోగి పైన ఆమె సహ ఉద్యోగులే లైంగికంగా వేధింపులకు  పాల్పడిన కేసులోనే ఈసారి కూడా సదరు కంపెనీ వార్తల్లో నిలిచింది. దాదాపు ఐదేళ్ల క్రితం నాటి ఈ కేసు పోలీసు, న్యాయ, పరిపాలనా వ్యవస్ధలన్నీ ఏ విధంగా ధనికుల సావాసం చేస్తున్నాయో వెల్లడిస్తున్నది. బహుశా ‘ధనికుల సావాసం’ అనడం సమస్యలోని ప్రధాన కోణాన్ని తక్కువ చేసి చూపడం కావచ్చు. ‘మగ ధనికుల సావాసం’ అనడం మరింత సరైన పద ప్రయోగం కాగలదు. కాగా, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన ఉద్యోగినికి ఊరట ఇవ్వడం మాని ఆమెను విధులనుండి తొలగించిన కె.పి.ఎం.జి కంపెనీ కూడా ఇందులో దోషిగా తేలుతోంది.

గత ఫిబ్రవరి నెలలో ఫేస్ బుక్ వేదికగా మహిళా లోకం పైన అసభ్య వ్యాఖల వరద పారిన సంగతి పాఠకులకు తెలిసిన విషయమే. (తెలియనివారు ఈ లింక్ క్లిక్ చేసి విషయం తెలుసుకోవచ్చు. తదనంతర పరిణామాలను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.) అప్పటి అసభ్య వ్యాఖ్యాతల్లో కె.పి.ఎం.జి ఉద్యోగి ఒకరున్నారు. సదరు వ్యాఖ్యాత అసభ్య రాతలను కె.పి.ఎం.జి దృష్టికి తీసుకెళ్తామని కూడా ఫేస్ బుక్ మహిళలు అప్పట్లో ప్రకటించారు. అలా తీసుకెళ్లారో లేదో తెలియదు గాని ఒక వేళ తీసుకెళ్లి ఉంటే బహుశా కె.పి.ఎం.జి నుంచి సానుకూల ప్రతిస్పందన రాకపోగా నిర్ఘాంతపరిచే స్పందనే ఎదురై ఉండొచ్చన్న అనుమానాన్ని తాజా ఉదాహరణ కలిగిస్తోంది.

ముగ్గురు పురుష సహోద్యోగులు తనను లైంగికంగా వేధిస్తున్నారని కె.పి.ఎం.జి ఉన్నత అధికారులకు ఆ సంస్ధలో పని చేసే ఒక మహిళా ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును విచారించడానికి బదులు సదరు బహుళజాతి కంపెనీ ఫిర్యాదు చేసిన మహిళనే ఉద్యోగం నుండి తొలగించింది. దానితో ఆమె జులై 16, 2007 తేదీన ముంబైలోని ‘ఎన్.ఎం.జోషి మార్గ్ పోలీసు స్టేషన్’ లో ఫిర్యాదు చేయడం ద్వారా కోర్టు తలుపు తట్టింది. పోలీసులు ఐ.పి.సి సెక్షన్ 509, 354ల క్రింద లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు. ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేశారు. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు ట్రయల్ కోర్టులో ఆరోపణలు నమోదు చేయలేదు. డిసెంబరు 2007లో చార్జి షీటు నమోదు అయినప్పటికీ, ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి వీలుగా ఆరోపణలు నమోదు కాలేదు.

నిందితులు, బాధిత మహిళకు పంపిన ఈ మెయిల్ వాస్తవమైనదేనని ధృవ పరుస్తూ ఫోరెన్సిక్ లేబొరేటరీ వారు ఇచ్చిన ధృవ పత్రం ఇంతవరకు కోర్టుకు సమర్పించడంలో పోలీసులు విఫలం అయ్యారని ది హిందూ తెలిపింది. పత్రిక కధనాన్ని బట్టి నిందితులు కేసు కొట్టివేయించుకోవడానికి వీలుగా ఉద్దేశ్యపూర్వకంగానే ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు సమర్పించలేదు. ఆర్.టి.ఐ చట్టాన్ని ప్రయోగించి బాధిత మహిళ తన కేసుకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకున్నాక మాత్రమే పోలీసుల నిర్వాకం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అతి ముఖ్యమైన ఫోరెన్సిక్ నివేదిక కోర్టుకు అందకపోవడంతో తగిన సాక్ష్యాలు లేనందున కేసు కొట్టివేయాలని నిందితులు కోర్టుకు పిటిషన్ పెట్టుకునే అవకాశం కలిగింది. ఈ పిటిషన్ పైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం చెప్పవలసి ఉండగా అది వాయిదా పడుతూ ఉండడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ట్రయల్ కోర్టులు మారుతూ పోవడంతో నిందితులకు దాదాపు అయిదేళ్లపాటు ఎటువంటి విచారణ లేకుండా దర్జా వెలగబెట్టడం సాధ్యం అయింది.

గత సంవత్సరం బాధిత మహిళ అనేకసార్లు కోర్టుకు హాజరు అయినప్పటికీ కేసులో పురోగతి లేదు. దానితో ఆమె గత సంవత్సరం మే నెలలో కేసు ఎక్కడివరకు వచ్చింది వివరాలు తెలియాలని దరఖాస్తు చేసుకుంది. ఎన్.ఎం.జోషి మార్గ్ పోలీసు స్టేషన్ ఇనస్పెక్టర్ కిషోర్ షిండే జూన్ 2012లో ఆమెకు సమాధానం ఇస్తూ ‘సి.ఆర్.పి.సి సెక్షన్ 258 కింద కేసు పైన స్టే విధించబడిందని’ తెలియజేశాడు. ఈ సెక్షన్ కింద కొన్ని కేసులలో కేసు ప్రొసీడింగ్స్ పైన స్టే ఇచ్చే అధికారం మేజిస్ట్రేట్ కు ఉంటుందని తెలుస్తోంది. అయితే వాస్తవానికి సదరు ఇనస్పెక్టర్ ఇచ్చిన సమాచారం తప్పని తర్వాత తేలింది. నిందితుల్లో ఒకరు కేసు ప్రొసీడింగ్స్ ను ఆపవలసిందిగా 2009లో కోర్టుకు దరఖాస్తు చేసినప్పటికీ అది కోర్టులో పెండింగులో ఉన్నదే తప్ప స్టే మంజూరు కాలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సదరు పిటిషన్ పైన అభిప్రాయం చెప్పడం కోసం పెండింగ్ లో ఉండిపోయింది.

ఈ పరిస్ధితుల్లో తన కేసుకు సంబంధించి వివిధ ఫైళ్లను పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని బాధిత మహిళ డిమాండ్ చేసారు. అధికారుల అనుమతితో ఫైళ్లను పరిశీలించిన మహిళ వాటిలో ఫోరెన్సిక్ నివేదిక లేనట్లు గమనించి హతాశురాలయ్యారు. నిందితులు ముగ్గురు బాధిత మహిళకు పంపిన నేరపూరిత ఈ మెయిళ్ళు నిజమైనవేనని ఫోరెన్సిక్ నివేదిక ధ్రువపరిచింది. కేసుకు ప్రాణం ఈ నివేదికే. నవంబరు 2008 లోనే ఫోరెన్సిక్ నివేదిక పోలీసుల చేతికి వచ్చినప్పటికి దానిని కోర్టుకు సమర్పించలేదు. దానితో ఆమె ఆర్.టి.ఐ చట్టం కింద పోలీసుల నుండి వివరాలు కోరారు. కానీ పోలీసులు బదులివ్వలేదు. దరిమిలా ఆర్.టి.ఐ చట్టం ప్రకారం మొదటి అప్పీలేట్ ఆధారిటీ అయిన డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఫలితంగా అక్టోబరు 2012లో ఫోరెన్సిక్ నివేదిక కాపీ ఆమె చేతికి వచ్చింది. ఆమెతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పి.పి) వద్దకు కూడా నివేదిక వెళ్లింది. అంటే కేసుకు ముఖ్యమైన ఫోరెన్సిక్ నివేదిక పి.పి వద్దకి వెళ్లడానికే బాధిత మహిళ పోరాటం చేయవలసి వచ్చింది!

ఇంత జరిగినా మహిళ కష్టాలు కొనసాగాయి. గత డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కేసు హియరింగ్ కి వచ్చినప్పటికీ ఫోరెన్సిక్ నివేదిక కోర్టుకు చేరలేదు. మహిళ ప్రకారం ఈ పరిస్ధితికి కారణం ఏమిటో చెప్పినవారు లేరు. కేసు ప్రొసీడింగ్స్ ను ఆపాలంటూ నిందితుల్లో ఒకరు పెట్టుకున్న దరఖాస్తును పి.పి డిసెంబరులోనే వ్యతిరేకించినప్పటికీ, మూడు హియరింగ్ లు జరిగినప్పటికీ కోర్టులో నిందితులపై ఆరోపణలు నమోదు కాలేదు. నిందితుడి దరఖాస్తు చెల్లదని, అదే నిందితుడు గతంలో కూడా విచారణ అడ్డుకోవడానికి వేరే కోర్టులో ప్రయత్నాలు చేశాడని పి.పి కోర్టుకు తెలిపాడు. తనపై దాఖలయిన ఎఫ్.ఐ.ఆర్ ని కొట్టివేయాలని బోంబే హై కోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ ఉపసంహరించుకున్నాడని పి.పి కోర్టుకు తెలిపాడు. కేసు ముందుకు వెళ్లడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని, సాక్ష్యుల స్టేట్ మెంట్లు కూడా ఉన్నాయని తెలిపాడు. నవంబరు 19, 2008 తేదీ నాటి ఫోరెన్సిక్ నివేదిక ఉన్నందున తగిన సాక్ష్యాలు లేవన్న నిందితుడి వాదన కోర్టును తప్పుదారి పట్టించడానికేనని ఆయన తెలిపాడు.

ఇంత జరిగినా మార్చి 22, 2013 వరకు ఫోరెన్సిక్ నివేదిక ట్రయల్ కోర్టుకు చేరలేదు. ఫిబ్రవరి 23 తేదీన మరొక నిందితుడు తనపై ఆరోపణలు కొట్టివేయవలసిందిగా కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఆయన కూడా కేసులో తగిన సాక్ష్యాలు లేవని కోర్టుకు విన్నవించాడు. ఇన్నాళ్లూ పిటిషన్ దాఖలు చేయనందుకు ఆలస్యాన్ని మన్నించవలసిందిగా కూడా కోర్టును కోరాడు. అయితే ఫోరెన్సిక్ నివేదిక వాస్తవంగా పోలీసులకు ఇవ్వడానికి అది కోర్టుకు చేరడానికి సంవత్సరాల తరబడి ఆలస్యం ఉన్నప్పటికీ 46 రోజులు మాత్రమే ఆలస్యం జరిగిందని చెబుతూ సదరు ఆలస్యాన్ని మన్నించాలని కోరాడు. ఆ మేరకు కోర్టు మన్నించినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవ ఆలస్యం 46 రోజులు కాదని 1885 రోజులని తెలియడంతో నిందితుడు నాలుక్కరుచుకుని మరో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలస్య లెక్కలను ఆమోదించడంలో ఎవరు తప్పు చేశారో నిర్ధారించడానికి సెషన్స్ కోర్టు డిప్యూటీ రిజిస్ట్రాన్ పరిశోధన ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఫోరెన్సిక్ నివేదికను ట్రయల్ కోర్టుకు ఎందుకు సమర్పించలేదో, దానికి కారకులెవరో నిర్ధారించడానికి ఒక విచారణ, ఆలస్యం లెక్కల్లో ఎవరు తప్పు చేశారో నిర్ధారించడానికి మరొక విచారణ, ఎఫ్.ఐ.ఆర్ కొట్టేయాల్సిందిగా ఒక్కో నిందితుడు దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా సరికొత్త విచారణ ప్రారంభించే ట్రయల్ కోర్టులు…. ఈ విధంగా పక్క విచారణలతో కాలం గడుస్తోందే తప్ప అసలు కేసు విచారణకు నోచుకోవడం లేదు. ఫలితంగా నిందితులు దిలాసాగా దరఖాస్తుల మీద దరఖాస్తులు, పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టుకుంటూ రోజులు, నెలలు, సంవత్సరాలు దొర్లిస్తుండగా, బాధితురాలు మాత్రం ఎక్కే గుమ్మ, దిగే గుమ్మం అన్నట్లుగా ఆర్.టి.ఐ దరఖాస్తులు పెట్టుకోవలసి వస్తోంది. బాధితురాలి తరపున పని చేయవలసిన పోలీసులు, పి.పిలు అంతిమ పరిశీలనలో నిందితులకు సహాయకారులు తేలుతున్నారు. కోర్టులు సైతం నిందితులపై ఆరోపణలు నమోదు చేయడానికే అయిదేళ్లకు పైగా సమయం తీసుకున్నాయంటే, అలాంటి అవకాశాలు నేరస్ధులకు చట్టాల్లో ఉన్నట్లే.

“(లైంగిక వేధింపులపై) పరిశీలనా బోర్డుకు ఫిర్యాదు చేసి విచారణ కోరానని నన్ను విధుల నుండి తొలగించినందుకు నేను న్యాయ సహాయం కోరాను. అలా కోరడమే నా తప్పైంది” అని బాధిత మహిళ వ్యాఖ్యానించారని ది హిందు తెలియజేసింది. పి.పిలు పదే పదే మారడం, ట్రయల్ కోర్టులు కూడా మారిపోవడం బాధితురాలికి అదనపు శాపం. తదుపరి హియరింగ్ జూన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలపై వేధింపుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని ఒక పక్క మహారాష్ట్ర గొప్పలు చెప్పుకుంటోంది. వాస్తవంలో మహిళలకు అందుతున్న న్యాయం కనీసం కుంటి నడక కూడా నడవని దుస్ధితి! పత్రిక వ్యాఖ్యానించినట్లు ‘బాగు చేయలేని విధంగా ఏదో కుళ్ళిపోయింది’ అని చెప్పడానికి కూడా వీలులేని ఘోరమైన పరిస్ధితి రాజ్యమేలుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s