ఇరాన్ పుణ్యం, సిరియా సమస్యలో ఇండియా మాటకు విలువ!


మే తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్‌తో సల్మాన్ ఖుర్షీద్ సమావేశం -ది హిందు

మే 4 తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్‌తో సల్మాన్ ఖుర్షీద్ సమావేశం -ది హిందు

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో ఇండియా మాట చెల్లుబాటు అయ్యేందుకు అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అలీన దేశాల కూటమి ‘అలీనోద్యమం’ (Non-Aligned Movement) నాయకురాలుగా ఇరాన్ గత యేడు బాధ్యత తీసుకున్న నేపధ్యంలో పశ్చిమ రాజ్యాల ప్రాభవానికి ప్రత్యామ్నాయ శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఇరాన్ ప్రారంభించింది. ఈ కృషిలో ఇండియాను భాగస్వామిగా స్వీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తో ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్, విదేశీ మంత్రి అలీ అక్బర్ సలేహిలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

యుద్ధ విస్తరణకు ఇజ్రాయెల్ కుట్రలు

సిరియా కిరాయి తిరుగుబాటును సిరియా ప్రభుత్వం సమర్ధవంతంగా నిలువరిస్తోంది. కిరాయి తిరుగుబాటు అమెరికా, ఐరోపా పశ్చిమ రాజ్యాల జియో-పోలిటికల్ వ్యూహాల ఫలితం కావడంతో సిరియా ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు పశ్చిమ దేశాలకు కడుపు మంటగా ఉంటోంది. ఆధునిక ఆయుధాలు సరఫరా చేస్తూ తమ గూఢచారులను స్వయంగా రంగంలోకి దింపి సలహాలు, సూచనలు ఇస్తున్నా కూడా ఆల్-ఖైదా టెర్రరిస్టులు ముందుకు సాగకపోగా తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను కూడా కోల్పోతున్నాయి. ఈ పరిణామాలు పశ్చిమ రాజ్యాల పరువు తీస్తున్నాయి.

దానితో ఘర్షణలను మరింత విస్తృతం చేయడానికి పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ ను రంగంలోకి దించాయి. లెబనాన్ లో పాక్షిక ప్రభుత్వం నడుపుతున్న హిజ్బోల్లాకు ఇరాన్ ఆయుధాలు అందజేస్తున్నదని ఆరోపిస్తూ సిరియాలో ముఖ్యమైన ప్రాంతాల మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. సిరియా గుండా ఇరాన్ ఆయుధాలు లెబనాన్ కి చేరుతున్నాయని ఇజ్రాయెల్ ఆరోపణ. ఆ విధంగా ఆయుధాలు తీసుకెళ్తున్న కాన్వాయ్ పైన దాడుల పేరుతో ఇప్పటికీ మూడుసార్లు ఇజ్రాయెల్ సిరియాలో నేరుగా వైమానిక దాడులకు దిగింది.

తిరుగుబాటుదారులు వెనకబడే కొద్దీ పశ్చిమ రాజ్యాలకు ఆందోళన పెరుగుతోంది. సిరియా ప్రభుత్వ బలగాల పురోగమనాన్ని అడ్డుకోవాలంటే అమెరికా నేరుగాగానీ లేదా వివిధ సాకులతో పరోక్షంగా గాని రంగంలోకి దిగాలి.  యుద్ధాన్ని విస్తృతం చేసి స్వయంగా రంగంలోకి దిగాలన్నది అమెరికా, ఐరోపాల వ్యూహం. ఇజ్రాయెల్ దాడులకు సిరియా ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్ పై యుద్ధానికి మరో ఫ్రంట్ తెరిచినట్లయితే తిరుగుబాటుదారులతో యుద్ధంలో అది బలహీనపడే అవకాశం ఉంది. అమెరికా వ్యూహం కూడా ఇదే. ఈ వ్యూహంతోనే ఇజ్రాయెల్ చేత మూడుసార్లు వైమానిక దాడులు చేయించింది. తానే దాడి చేశానని ఇజ్రాయెల్ చెప్పకపోయినా పశ్చిమ వార్తా సంస్ధలన్నీ అమెరికా గూఢచార వర్గాలను, పేరు చెప్పడానికి ఇష్టపడని ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ ఇజ్రాయెలే దాడులకు కారణమని రాస్తున్నాయి.

కానీ ఇప్పటివరకైతే ఇజ్రాయెల్ దాడులకు సిరియా స్పందించలేదు. సిరియా స్పందించకపోతే అమెరికా-ఐరోపా-ఇజ్రాయెల్ దుష్టత్రయ కూటమి వ్యూహం విఫలం అయినట్లే. అయితే సిరియాను లాగడానికి మరిన్ని ప్రయత్నాలు ఆ కూటమి చేయడం ఖాయం.

సువర్ణావకాశం

ఇటువంటి కీలక సమయంలో ఇరాన్ సాగిస్తున్న ప్రయత్నాలు మధ్యప్రాచ్యం రాజకీయాలను, ముఖ్యంగా సిరియా రాజకీయాలను రసకందాయంలో పడవేస్తున్నాయి. పశ్చిమ దేశాల కుట్రలను విఫలం చేయడానికి మరో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడానికి ‘అలీనోద్యమం’ బ్యానర్ కింద ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికా నేతృత్వంలోని ‘ఫ్రెండ్స్ ఆఫ్ సిరియా’ కూటమిలో ఇండియా ఇప్పటికే సభ్యురాలు. కానీ ఇండియా మాట వినేవారు అక్కడెవరూ లేరు. ఇండియాకు ఆదేశాలిచ్చేవారే తప్ప ఇండియా మాటని ఆలకించేవారు, ఆలకించి మంచి చెడ్డలు ఏంచేవారు లేరక్కడ. దానితో ‘ఫ్రెండ్స్ ఆఫ్ సిరియా’ కూటమిలో ఇండియా పాత్ర నామమాత్రంగా ఉంటూ వచ్చింది.

నిజానికి ‘ఫ్రెండ్స్ ఆఫ్ సిరియా’ కూటమిలో ఉండడం ఇండియా ప్రకటిత విధానానికి విరుద్ధం. సిరియా భవిష్యత్తును సిరియా ప్రజలే నిర్ణయించుకోవాలనేది ఇండియా ప్రకటిత విధానం. ఈ విధానానికి అనుగుణంగా ఐరాస + అరబ్ లీగ్ మాజీ రాయబారి కోఫీ అన్నన్ ‘జెనీవా కమ్యూనిక్’ రూపొందించారు. దీనిని అమెరికా, ఐరోపాలు కూడా తప్పని పరిస్ధితుల్లో అంగీకరించాల్సి వచ్చింది. దీని ప్రకారం సిరియా సమస్యను అన్ని పక్షాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. సాయుధ ఘర్షణలు మాని రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అమెరికా, ఐరోపాలు కోరినట్లుగా ఇందులో సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ పదవి నుండి దిగిపోవాలన్న షరతు లేకుండా రష్యా, చైనాలు చూశాయి. జెనీవా ఒప్పందాన్ని అంతర్జాతీయంగా చట్టబద్ధం చేయడానికి ఐరాస దానిని ఆమోదించవలసి ఉంది. కానీ అమెరికా, ఐరోపాలు దాని కోసం ప్రయత్నించకుండా కాలయాపన ఎత్తుగడలను అమలు చేస్తున్నాయి. ఈలోపు సిరియాలో పరిస్ధితిని తలకిందులు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

జెనీవా కమ్యూనిక్ ను ఆమోదించిన దేశాల్లో ఇండియా, ఇరాన్ లు కూడా ఉన్నాయి. జెనీవా ఒప్పందం అమలుకు జోచుకోకపోవడంతో కోఫీ అన్నన్ ఐరాస + అరబ్ లీగ్ ల రాయబారిగా బాధ్యతలకు రాజీనామా చేసేశాడు. ఆయన స్ధానంలో అల్జీరియా నాయకుడు లఖ్దర్ బ్రహ్మీని నియమించారు. ఆయన కూడా విసిగిపోయి రాజీనామా చేసే యోచనలో ఉన్నాడు.

ఈ నేపధ్యంలో సల్మాన్ ఖుర్షీద్ పర్యటన సందర్భంగా సిరియా పరిస్ధితి పైన ఇండియా, ఇరాన్ లు ఆందోళన ప్రకటించాయి. సిరియా భవిష్యత్తును సిరియా ప్రజలే నిర్ణయించాలని, బైటి దేశాల జోక్యం తగదని మరోసారి ప్రకటించాయి. ఫ్రెండ్స్ ఆఫ్ సిరియా గ్రూపుకు ప్రత్యామ్నాయంగా మరొక సిరియా కేంద్రక గ్రూపును ఏర్పాటు చేసి అందులో ఇండియాను ప్రధాన భాగస్వామిగా స్వీకరించనున్నట్లు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. ఇరాన్, ఇండియా, ఇండోనేషియా లాంటి పది ప్రధాన అలీన దేశాలను కొత్త గ్రూపును ఏర్పాటు చేయాలని ఇరాన్ భావిస్తోంది.

అలీనోద్యమం వ్యవస్ధాపనలో ఇండియా ప్రధాన పాత్ర వహించింది. అలీనోద్యమ చట్రంలో సిరియా విషయమై ఏర్పడే కూటమికి భారత్ కు అభ్యంతరం ఉండకూడదు. సిరియాలో జోక్యందారీ విధానాలను అవలంబిస్తున్న అమెరికా, ఐరోపాల సరసన ఉండడానికే ఇండియాకు అభ్యంతరం ఉండాలి. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ వెంటనే గద్దె దిగాలని అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్, కతార్, సౌదీ అరేబియా, టర్కీల దుష్ట కూటమి చేస్తున్న డిమాండు ఇండియా ప్రకటిత విధానానికి విరుద్ధం. కనుక ఇరాన్ ప్రయత్నాలకు ఇండియా సహకరించడం సరైనది. కోఫీ అన్నన్ రూపొందించిన జెనీవా ఒప్పందం ప్రాతిపదికన సిరియా సమస్య పరిష్కారానికి చొరవ చూపినట్లయితే ఇండియా ఖ్యాతి మరింత విస్తరించడం ఖాయం. ఒక ముఖ్యమైన సమకాలీన అంతర్జాతీయ సమస్యపైన ఇండియా గొంతు ప్రాముఖ్యంగా వినిపించడానికి ఇది ఒక సువర్ణావకాశం.

అయితే ఈ దిశలో ఇండియా పాలకులు ఎంతవరకు కృషి చేస్తారన్నదే అనుమానం.

వ్యాఖ్యానించండి