కొత్త పరిణామం: మధ్యప్రాచ్యంలో చైనా రంగ ప్రవేశం?


బీజింగ్ లో మహమ్మద్ అబ్బాస్‌కు ఆహ్వానం పలుకుతున్న చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్

బీజింగ్ లో మహమ్మద్ అబ్బాస్‌కు ఆహ్వానం పలుకుతున్న చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్

అంతర్జాతీయ రంగంలో ఎంత మెల్లగానైనా బలాబలాల్లో మార్పులు వస్తున్నాయనడానికి తార్కాణంగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉండే మధ్య ప్రాచ్యంలో చైనా రాజకీయ అరంగేట్రంకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బద్ధ శత్రువులైన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ ఇప్పుడు చైనా పర్యటనలో ఉండడం ఈ ఏర్పాట్లలో ఒక భాగంగా చూడవచ్చు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ రాజధాని బీజింగ్ లో విమానం దిగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చైనా వాణిజ్య నగరం షాంఘైలో పర్యటిస్తున్నారు.

పాలస్తీనా ఆధారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ సోమవారం చైనా రాజధాని బీజింగ్ లో దిగారని పత్రికలు తెలిపాయి. మహమ్మద్ అబ్బాస్ కు చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ స్వాగతం పలికారు. బీజింగ్ లో అబ్బాస్ కు స్వాగత సత్కారాలు జరుగుతున్న సమయంలోనే చైనా తూర్పు తీరంలోని ప్రపంచ స్ధాయి నగరం షాంఘైలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పర్యటిస్తున్నారు. అబ్బాస్ పర్యటన మంగళవారం ముగిసిన అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రాజధాని బీజింగ్ కు బుధవారం చేరుకుంటారని తెలుస్తోంది.

స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు దిశలో ఇజ్రాయెల్, పాలస్తీనా నేతల మధ్య జరుగుతున్న చర్చలు నాలుగు సంవత్సరాల క్రితం ప్రతిష్టంభనలో పడిపోయాయి. పాలస్తీనా భూభాగం వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ మరిన్ని సెటిల్మెంట్లు నిర్మిస్తూ మరింత మంది పాలస్తీనా అరబ్బులను వారి ప్రాంతాల నుండి తరిమేస్తోంది. ఆయుధాలు తయారు చేస్తున్నారంటూ పాలస్తీనా ప్రజల ఇళ్లపైన బాంబు దాడులు చేసి కూల్చివేయడం, ఆ తర్వాత అక్కడి నుండి పాలస్తీనీయులను వెళ్లగొట్టడం, ఆ స్ధానంలో యూదు ప్రజలకోసం సెటిల్మెంట్లు నిర్మించడం ఇజ్రాయెల్ ఒక విధానంగా అమలు చేస్తుంది. వెస్ట్ బ్యాంకులో సెటిల్మెంట్లు నిర్మించడం ఐరాస తీర్మానాలకు విరుద్ధం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వెస్ట్ బ్యాంకులో యూదు సెటిల్మెంట్ల నిర్మాణం అక్రమం. అయినప్పటికీ అమెరికాఅండ చూసుకుని ఇజ్రాయెల్ జాత్యహంకార ప్రభుత్వం తన దుష్ట ఎత్తుగడలను అమలు చేస్తోంది.

ఐరాసలో ఇప్పటికే అంగీకరించిన సూత్రాల ప్రకారం 1967 నాటి సరిహద్దుల ప్రకారం పాలస్తీనా స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ ఆ దిశలో జరుగుతున్న చర్చలను కుంటిసాకులు చూపి అడ్డుకుంటోంది. ఈ లోపు ‘facts on the ground’ ని ఏర్పాటు చేసే దిశలో అక్రమ సెటిల్మెంట్లు నిర్మిస్తోంది. వీలైనంత భూభాగాన్ని ఆక్రమించుకుని వీలైనంతమంది పాలస్తీనా ప్రజలను తరిమివేసి ఒప్పందం తప్పనిసరి అయ్యే కాలానికి భూభాగాన్ని విస్తరించుకోడానికి ఇజ్రాయెల్ ఎత్తుగడలు వేస్తున్నదని అంతర్జాతీయ విశ్లేషకులు సాధారణంగా చేసే విమర్శ. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఎంత దూకుడుగా ఉంటే అక్కడ అమెరికా మాట అంత చెల్లుబాటు అవుతుంది.

మరో పాలస్తీనా భూభాగం గాజాలో అబ్బాస్ వ్యతిరేక సంస్ధ హమాస్, ప్రభుత్వం నడుపుతోంది. హమాస్ కు ఇజ్రాయెల్ కి ఉత్తరాన ఉన్న లెబనాన్, ఈశాన్య దిక్కులో ఉన్న సిరియా గట్టి మద్దతుదారులు. లెబనాన్ లో రెండు ప్రభుత్వాలు నడుస్తాయి. అందులో ఒకటి హిజ్బోల్లా. హమాస్ కు మద్దతుగా నిలిచేది ఈ ప్రభుత్వమే. అబ్బాస్ నేతృత్వంలోని ఫతా ప్రభుత్వం ఇజ్రాయెల్, అమెరికాల ఒడిలో కూర్చుని వారు విదిల్చే సహాయంతో సంతృప్తి పడుతుండగా పాలస్తీనా స్వతంత్రం కోసం హమాస్ సాయుధ పోరాటం చేస్తోంది. ఈజిప్టులో ముస్లిం బ్రదర్ హుడ్ అధికారంలోకి రావడంతో హమాస్ సిరియాకు దూరం జరుగుతోంది.

ఇదొక రాజకీయ క్రీడ. పాలస్తీనా ప్రజలను దశాబ్దాలుగా వేధించుకు తింటున్న అంతర్జాతీయ రాజకీయ మృత్యు క్రీడ. ఈ క్రీడలో పాలస్తీనా ప్రజలు తేలికగా అందుబాటులో ఉండే సమిధలు. సిరియాలో అమెరికా, పశ్చిమ రాజ్యాలు రెచ్చగొట్టిన కిరాయి తిరుగుబాటుతో సిరియా ప్రజలు కూడా తాజా సమిధలుగా మారిపోయారు.

ఈ క్రీడలో చైనా ఇంతవరకూ జోక్యం చేసుకోలేదు. అమెరికా, యూరప్ ల ప్రోద్బలంతో సిరియాపైన ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి లో పశ్చిమ రాజ్యాల సాయుధ జోక్యానికి వీలు కల్పించే తీర్మానాలను రష్యాతో కలిసి వీటో చేయడం ఒక్కటే చైనా మధ్య ప్రాచ్యంలో ఇంతవరకూ తీసుకున్న రాజకీయ చర్య. అబ్బాస్, నెతన్యాహుల పర్యటనలతో అసలు సమస్యలోకే చైనా ప్రవేశించనున్నట్లు గట్టి సూచనగా భావించవచ్చు. కొరియాల మధ్య చిచ్చు పెట్టి జోక్యందారీ విధానాలను అవలంబిస్తూ, భారీ సైనిక విన్యాసాలతో చైనాను బెదిరిస్తున్న అమెరికాకు చెక్ పెట్టాలంటే దానికి కల్పతరువు లాంటి పాలస్తీనా సమస్యలో వేలు పెట్టడమే తగిన ఎత్తుగడగా చైనా భావిస్తున్నదేమో భవిష్యత్తులోనే తెలియాలి.

షాంఘైలో ఓ సమావేశంలో బెంజమిన్ నెతన్యాహు

షాంఘైలో ఓ సమావేశంలో బెంజమిన్ నెతన్యాహు

మహమ్మద్ అబ్బాస్, బెంజమిన్ నెతన్యాహు ల మధ్య వారిద్దరు ఇష్టపడితే సమావేశం ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ గత వారం ప్రకటించింది. ఈ ప్రకటనను సోమవారం పునరుద్ఘాటించింది. చైనా వార్తా సంస్ధ జిన్హువా ప్రకారం పాలస్తీనా సమస్య గురించి తాజా విషయాలను చైనాకు వివరిస్తామని చైనా బయలుదేరబోయే ముందు అబ్బాస్ చెప్పారు. ఇజ్రాయెల్ తో చర్చలకు ఏయే అంశాలు ఆటంకంగా నిలిచాయో వివరించనున్నట్లు అబ్బాస్ తెలిపారు. తన పర్యటనలో అబ్బాస్ చైనా ప్రధాని లీ కేకియాంగ్ ను కూడా కలిశారని గ్లోబల్ టైమ్స్ (చైనా ప్రభుత్వ అంతర్జాతీయ పత్రిక) తెలియజేసింది.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విషయానికి వస్తే ఇరాన్ విషయం కూడా చైనాతో ఆయన చర్చించనున్నట్లు బి.బి.సి తెలిపింది. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తోందని చెప్పడానికి మరిన్ని సాక్ష్యాలు బైటికి వస్తున్నాయని ఇజ్రాయెల్ అభిప్రాయంగా నేతన్యాహు చైనాకు తెలిపాడు. అయితే ఏకపక్షంగా ఇరాన్ పై ఆంక్షలు విధించడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. కానీ ఆ ఆంక్షలను అడ్డుకోడానికి చైనా ఇంతవరకు చేసిందేమీ లేదు. (చైనాకు చమురు ఎగుమతి చేసే దేశాల్లో ఇరాన్ దే అతి పెద్ద వాటా.) షాంఘైలో వివిధ వాణిజ్యవేత్తలను ఇజ్రాయెల్ ప్రధాని కాలుస్తున్నారని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. 2007లో యూద్ ఒల్మర్డ్ తర్వాత చైనా సందర్శించిన ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్.

పాలస్తీనా, ఇజ్రాయెల్ అధినేతల చైనా సందర్శనతో అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా ప్రాబల్యం మెల్లగా అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి ఒక సూచన. వైరి పక్షాలు రెండూ దాదాపు ఒకేసారి చైనా సందర్శించడం అంతర్జాతీయ పరిశీలకులకు ఆసక్తికరంగా మారింది. పాలస్తీనా చర్చలకు చైనా వేదిక కానున్నదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. ఇంతకాలం ఈ హక్కు అమెరికాకు మాత్రమే భుక్తం. పాలస్తీనా సమస్యపై ఇజ్రాయెల్ తో చైనాకు విభేదాలున్నాయని అయితే అవి ద్వైపాక్షిక సంబంధాలకు అడ్డు రావని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చూన్యింగ్ పేర్కొనడం గమనార్హం.

గత సంవత్సరం నవంబరు 12 తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగులో సభ్య దేశాలు అత్యధిక మెజారిటీతో పాలస్తీనాకు “సభ్యేతర పరిశీలక దేశం’ హోదాను ఇస్తూ తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల్లో చైనా కూడా ఒకటి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s