ఇంతకీ సరబ్ జిత్ సింగ్ ఎవరు? పాకిస్ధాన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు టెర్రరిస్టా? ఆయన కుటుంబం చెబుతున్నట్లు తాగి ఏమి చేస్తున్నాడో, ఎటు వెళుతున్నాడో తెలియని అమాయక తాగుబోతా? భారత ప్రభుత్వం సొంతం చేసుకోలేని గూఢచారా? భారత పత్రికలు సరబ్ జిత్ సింగ్ గురించి అతని కుటుంబ సభ్యులు చెప్పిన ‘అమాయక తాగుబోతు’ కధని వల్లించినప్పటికీ బి.బి.సి, సి.ఎన్.ఎన్ లాంటి పశ్చిమ దేశాల పత్రికలు ఆయనను భారత గూఢచారి అనే సంబోధిస్తూ వచ్చాయి. ది హిందు పత్రిక ఆదివారం నాడు అతన్ని మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం తరపున పాకిస్ధాన్ లో పని చేసి అరెస్టయిన గూఢచారిగా గుర్తించింది.
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో సరబ్ జిత్ సింగ్ కు అంత్యక్రియలు నిర్వహించడం, కోటి రూపాయలు పరిహారం ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం మరో 25 లక్షల రూపాయల నష్టపరిహారం లేదా సహాయం ప్రకటించడం… ఇవన్నీ సరబ్ జిత్ సింగ్ వెనుక దాగిన వాస్తవ గాధను తెలిపేవి. ఆయన వాస్తవానికి భారత మిలటరీ గూఢచార సంస్ధ ‘రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ (RAW – రా) కోసం పనిచేసిన గూఢచారి. అమెరికాకి సి.ఐ.ఎ, పాకిస్ధాన్ కి ఐ.ఎస్.ఐ ఎలాగో భారత్ కి ‘రా’ అలాగ.
పట్టుబడితే పైసలు దక్కవు
అలాగని సరబ్ జిత్ సింగ్ లాంటి వారు జేమ్స్ బాండ్ తరహాలో డబ్బు యంత్రాలు జేబుల్లో పెట్టుకుని తిరిగే సాహసవీరులు కారు. నిరుద్యోగం వెంటపడి తరుముతుండగా ‘పని దొరికిందే చాలు’ అనుకుంటూ కొద్ది మొత్తానికి సైతం సరిహద్దు దాటిపోయే సాధారణ సమాచార సేకరణకర్తలు. ఇలాంటి గూఢచారులు ప్రత్యర్ధులకు పట్టుబడనంతవరకే జీత భత్యాలు. అవి కూడా పెద్ద మొత్తాలేమీ కాదు. పట్టుబడితే కనుక వారి గతి ఎవరికీ పట్టదు. వీధి కుక్కలకైనా అప్పుడప్పుడూ ఒక ముద్ద పెట్టేవారు దొరుకుతారు. ‘దా ఇజ్జూ’ అని పిలిచే దాతలు కనపడతారు. కానీ విదేశీ సమాచార సేకరణలో పట్టుబడిన గూఢచారులకు మాత్రం అలాంటివారు ఎవరూ ఉండరు. వారిని గూఢచర్యానికి పురమాయించిన సంస్ధలే మాకు తెలియదు పొమ్మంటాయి.
పంజాబ్ లో పాక్ సరిహద్దు గ్రామాల్లో రా కోసం పని చేసిన అనేకమంది గ్రామీణ యువకులు, నిరుద్యోగులు ఇలాగే పట్టుబడి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ఏళ్లతరబడిన కారాగారవాసం అనంతరం విడుదలై పరిహారం కోసం పోరాడుతున్నారు. ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా విదేశంలోని తమ జైలు జీవితాన్ని ‘ఆన్ డ్యూటీ’గా పరిగణించి తగిన పరిహారం ఇవ్వాలని మొర పెట్టుకుంటున్నారు. కానీ తగిన సాక్ష్యాలు ఉంచకపోవడం రా విధానాల్లో ఒక భాగం. దానితో కోర్టులు తలుపులు మూసేస్తున్నాయి. కొండొకచో తమ సమయం వృధా చేసారంటూ జరిమానా కూడా విధిస్తున్నాయి.
సరబ్ జిత్ సింగ్ కి కోటిన్నర రూపాయల వరకు నష్టపరిహారం దక్కడంతో వీరంతా పోయిన ప్రాణం లేసొచ్చినట్లు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించేందుకు ఆశగా నడుం బిగిస్తున్నారని ది హిందు పత్రిక ఆదివారం తెలియజేసింది. ‘పట్టుబడితే నీ సంగతి నీవే చూసుకోవాలి’ అన్న ఒప్పందం మీదనే రా గూఢచారులను రిక్రూట్ చేసుకుంటుందట. దాదాపు ప్రతిదేశంలోనూ గూఢచార సంస్ధలు అమలు చేసే సూత్రమే ఇది. అయితే సరబ్ జిత్ సింగ్ ను విడుదల చేయించడానికి భారత ప్రభుత్వం చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తుండడం అలాంటి మరింత మందికి ఆశలు రేకెత్తించింది. పంజాబ్, జమ్ములలో మాజీ రా గూఢచారులు ఒక్కొక్కరు తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోర్టు గుమ్మం తొక్కడం ప్రారంభించారు.
ఆత్మ బంధువు
చండీఘర్ కి చెందిన రంజన్ లఖన్ పాల్ అనే లాయరు ఒక్కరే ఇలాంటి పిటిషన్ లను 40 కి పైనే పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలు చేశారని ది హిందూ తెలిపింది. “మాకు ఇంతవరకు దక్కిన ఊరట ఏమిటంటే ఈ సంగతేంటో చూడమని కోర్టు ప్రభుత్వానికి ఒక నిర్దిష్టత అంటూ లేకుండా సిఫారసు చేయడమే. దానివల్ల పిటిషనర్లకు ఇంతవరకు దక్కిందేమీ లేదు. వారిలో అనేకమంది పాకిస్ధానీ జైళ్ళలో గడిపి వచ్చిన నిరుపేదలు. కోర్టులు వారి కేసులు విచారణకు స్వీకరించనప్పుడల్లా ప్రభుత్వం వారిని గుర్తించడానికి నిరాకరిస్తుందంతే” అని లఖల్ పాల్ తెలిపాడని పత్రిక తెలిపింది. అయినప్పటికీ శిక్ష అనుభవించిన మాజీ గూఢచారులు లఖన్ పాల్ ఇంటి తలుపు తట్టడం మానడం లేదు. ఎందుకంటే ఆయన వారి కేసులను ఉచితంగా వాదిస్తాడు. సంవత్సరాల తరబడి పాక్ జైళ్ళలో గడిపి విడుదలయిన మాజీ రా గూఢచారులకు ఆయన ఆత్మబంధువే.
భారత్ కు చెందిన గూఢచార సంస్ధలు రా, మి (MI – మిలటరీ ఇంటలిజెన్స్), BSFI (బి.ఎస్.ఎఫ్ ఇంటలిజెన్స్) లకు సరిహద్దు ప్రాంతాలు ముఖ్యంగా అమృత్ సర్, గుర్దాస్ పూర్, ఫిరోజ్ పూర్ లు రిక్రూటింగ్ నిలవులు. ధరివాల్, దాడువాన్, ఖరియా కాలన్, కాంగ్ గ్రామాలనైతే గూఢచారుల గ్రామాలని పిలవొచ్చట. అనేకమందిని గూఢచారులుగా ఈ గ్రామాల నుండి రిక్రూట్ చేసుకోవడం దానికి కారణం.
కొంతమందిని సరిహద్దు అవతలి నుండి కూడా గూఢచారులను రిక్రూట్ చేసుకుంటారని తెలుస్తోంది. అంటే అలాంటివారు మనకు ఇంటలిజెన్స్ అస్సెట్ అయితే పాకిస్ధాన్ కి దేశద్రోహులు కింద లెక్క. కానీ ఆ పనికి సిద్ధపడేవారికి మాత్రం అందుబాటులో ఉన్న బతుకు తెరువు మాత్రమే. అలాంటివారి పట్ల ‘దేశ ద్రోహులు’ అంటూ భావోద్వేగాలు వెళ్లగక్కడం ఎంత అపహాస్యపూరితమైనదో వారి పేదరికం చెబుతుంది. సరిహద్దుకు ఇవతల ఉంటూ అవతలి వారి తరపున రిక్రూట్ అయినవారి విషయంలో కూడా ఇదే నిజం. భూమి పుట్టినప్పుడు ఈ సరిహద్దులు లేవు. మనిషి పుట్టినప్పుడూ లేవు. అసలు అక్కడివరకూ ఎందుకు? 1947 ఆగస్టు 15 కి ముందు కూడా ఈ సరిహద్దు లేదు. ఈ విషయాలు స్ఫురణకు తెచ్చుకుంటే పాకిస్ధాన్ విద్వేషం వల్ల ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న అనివార్యంగా తలెత్తుతుంది.
కరామత్ దీనగాధ
కరామత్ రాహి పాక్ నుండి భారత గూఢచార సంస్ధలు రిక్రూట్ చేసుకున్నవారిలో ఒకరు. నిరంతర దరిద్రంలో నుండి ఉద్భవించే నిరాశా నిస్పృహలు సో కాల్డ్ ‘దేశ ద్రోహానికి’ ఎలా పురిగొల్పుతాయో కరామత్ నిలువెత్తు నిదర్శనం. వీరికి సరిహద్దు రేఖ అంటే రెండు దేశాలను విడదీసేది కాదు. అది కేవలం ఉపాధి కల్పించే రేఖ మాత్రమే. కరామత్ తండ్రి మఝాబి సిక్కు అయిన్నప్పటికీ దేశ విభజన తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. అతని మరణం తర్వాత కుమారుడు కరామత్ 1980లో పాకిస్ధాన్ పాస్ పోర్టుతో ఇండియాకి వచ్చాడు. క్రైస్తవులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారుస్తుండడంతో తాను ఇండియాకి వచ్చానని కరామత్ తెలిపాడు.
ఇండియాకి వచ్చాక కరామత్ ను రా రిక్రూట్ చేసుకుంది. ఆయన మళ్ళీ పాక్ వెళ్ళి గూఢచర్యం ప్రారంభించాడు. మరికొంతమంది ఏజెంట్లను కూడా రిక్రూట్ చేసుకోడానికి సాయపడ్డాడు. అయితే 1988లో ఆయన లాహోరులో అరెస్టయ్యాడు. 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అప్పటికి అతని నెల జీతం రు. 1500/-. అరెస్టు తర్వాత కొన్ని నెలలపాటు నెలకు రు. 300/- పెన్షన్ గుర్దాస్ పూర్ లోని అతని కుటుంబానికి భారత ప్రభుత్వం చెల్లించింది. ఒక సంవత్సరం పాటు పెన్షన్ చెల్లించాక ఆయన చనిపోయాడని భావిస్తూ చెల్లింపులు ఆపేశారు.
18 సంవత్సరాలు జైలులో ఉన్న కరామత్ 2005లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పాకిస్ధాన్ సందర్శన సందర్భంగా గుడ్ విల్ గా విడుదల అయ్యాడు. తనకు పెన్షన్ ఇప్పించాలని, కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని కరామత్ హై కోర్టుకు వెళితే ఆయనకి ఊహించని షాక్ ఎదురైంది. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు కోర్టు ఆయనకు జరిమానా వేసింది. అనంతరం సుప్రీం కోర్టుకు వెళ్ళగా పాకిస్ధాన్ లో గూఢచార కార్యకలాపాలు నిర్వహించాడనడానికి రుజువులు చూపమని అడిగారు. “(గూఢచార) ఏజన్సీలు మమ్మల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు మాకు బంగారపు మెట్లు చూపిస్తారు. మాకు డబ్బు ఇస్తామని, మా కుటుంబాలకు భద్రత కల్పిస్తామని హామీ ఇస్తారు. మేము అరెస్టయితే వాటన్నింటిని గాలికి వదిలేస్తారు” అని కరామత్ వాపోయాడు. నోరు మూసుకొమ్మని కోరుతూ కరామత్ ని రిక్రూట్ చేసుకున్న సంస్ధ రు. 2 లక్షలు ఇచ్చిందట. ఐతే కరామత్ దాన్ని నిరాకరించాడు. “ఈ దేశం కోసం నా జీవితంలో విలువైన కాలాన్ని జైలులో గడిపాను. ఇప్పుడు వాళ్ళు నన్ను తృణీకరించారు” అని కరామత్ ఆవేదన చెందాడు.
ఇంకా అనేకమంది ఉన్నారు. MI కోసం గూఢచర్యం చేస్తున్నందుకు కాశ్మీర్ సింగ్ కు 1976లో పాక్ కోర్టు ఒకటి మరణ శిక్ష విధించింది. శిక్ష అమలు పై స్టే వచ్చినా జైలులో కొనసాగాడు. పాకిస్ధాన్ మానవహక్కుల కార్యకర్త ఆన్సార్ బార్ని కృషి ఫలితంగా 2008లో అధ్యక్షుడి నుండి క్షమాభిక్ష పొందాడు. 34 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చిన కాశ్మీర్ సింగ్ ఇస్లాం మతంలోకి మారాడు. తనను తాను మహమ్మద్ ఇబ్రాహీం అని చెప్పుకున్నాడు. పంజాబ్ ప్రభుత్వం ఆయనకు కొంత భూమి. డబ్బు ఇచ్చినా MI అసలు పట్టించుకోకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు.
బల్బీర్ సింగ్ అనే మరో వ్యక్తి 1971-74 మధ్య రా గూఢచారిగా పని చేశాడు. అరెస్టు కావడంతో సుదీర్హకాలమ్ పాటు జైలులో గడిపి 1986లో విడుదల అయ్యాడు. తాను జైలు లో ఉన్న కాలాన్ని ‘ఆన్ డ్యూటీ’ గా పరిగణించి జీత భత్యాలు చెల్లించాలని, తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని అమృత్ సర్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆయన చనిపోవడానికి కొద్దిగా ముందు ఆయనాకొక ఉత్తరం వచ్చింది. అది కూడా ఆర్.టి.ఐ చట్టం ప్రయోగిస్తేనే. రా ఉద్యోగిగా పని చేశానని చెప్పినందున ఆయన దరఖాస్తు కేబినెట్ సెక్రటేరియట్ పరిశీలనలో ఉన్నదన్నది ఆ ఉత్తరం సారాంశం. ఆయన కుమారుడు తన తండ్రి పిటిషన్ ను కొనసాగించే ప్రయత్నంలో ఉన్నాడని ది హిందు తెలిపింది.
సరబ్ జిత్ మరణం అనంతరం ఆయన కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు అందడంతో మాజీ గూఢచారులు అనేకమంది తమ కృషిని ప్రభుత్వం చేత గుర్తించేలా చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. “మాలాంటి పేదవారిని, తేలికగా బుట్టలో పడేవారిని ప్రభుత్వం ఈ విధంగా ఉపయోగించుకోవడం చాలా దురదృష్టకరం. మేము నిజమైన దేశ సేవ చేస్తున్నామని మమ్మల్ని నమ్మిస్తారు. కానీ మేము పట్టుబడిన తర్వాత మా భ్రమలన్నీ పటాపంచలవుతాయి” అని కరామత్ చెబుతున్నాడు.
సరిహద్దు ప్రజల గూఢచర్యం వాస్తవానికి ఇరు దేశాల పాలకవర్గాలకు పని ముట్లుగా ఉపయోగపడడమే. ఇందులో దేశ సేవ సరికదా, స్వ సేవ కూడా లేదని సరబ్ జిత్, సనాయుల్లా, కరామత్, కాశ్మీర్ సింగ్, బల్బీర్ సింగ్ ల ఉదంతాలు తెలియజేస్తున్నాయి. దేశం లోపల ఉన్నవారు సరిహద్దుల్లో దేశభక్తిని వెతకడం మాని ప్రజల జీవితాల్లో, వారి బాగోగుల్లో వెతకడం మొదలుపెట్టాలని ఈ మాజీ గూఢచారుల జీవితాలు సందేశం ఇస్తున్నాయి.
the hindu medhavulu ilanti vishayallo baaga expertlu savaalani kooda news nunchi vadalaru ee goodacharula gurinchi ippude gurtochindaa epudu nuncho unnarantunaaruga. sensation kaavaalante veellanta ippude kavali ippude veellu vaalla gurinchi raayaali memu chadavaali
సరిహద్ధు లని రక్షించాలంటె ఇలాంటి పనులని చెయ్యక తప్పదు అలాంటి పేద వాల్లె కద ఈ పనులకి దొరికెది దేశం లోపల ఉన్న ఎవరూ అలాంటి పనులూ చెయ్యరు హాయిగా ఏ సి లొ కూర్చొని ఇంటర్నెట్ లొ చాటింగ్ చెస్తూ లెకుంటె బిబిసి సిఎనెన్ లు చూస్తూనొ ఉంటా రు వీల్లు ఇలా ఉందాలంటె వాల్లు అక్కడ అలా బలి అవాల్సిన్ దె కదా paniki aahaara padakam ante ide laagundi
సరిహద్దులు అవతల గుహల్లో గుడారాల్లో ప్రభుత్వాలు నడుస్తున్నంత కాలం ఇలాంటి పేద వాల్లని అమాయకులని గూడచారులుగ వాడుకోక తప్పదు వాల్ల ప్రానాలకి పరిహారం ఇవ్వక తప్పదు
వి శేఖర్ గారు, ఈనాడులో మీ వ్యాసాల పరంపర ఆగింది చదువు పేజీలో. అయితే మీరు ఈ బ్లాగులో ఒక వ్యాసం అందించండి. సమగ్రంగా భారత దేశ విదేశాంగ విధానం పరిణామం ప్రస్తుత పరిస్థితి భవిష్యత్ చిత్రం గురించి విశ్లేషణాత్మక సుదీర్ఘ వ్యాసాన్ని అందించగలరు
సి ఎన్ ఎన్ బి బి సి వాల్లు చెప్పేదాకా మన గూడ చారులు ఎవరొ మన విధానాలు ఏంటొ మనకు తెలియట్లెదంటె మన స్తితి ఏంటో అర్దం అవుతుంది మన గురించి దూరదర్సన్ పి టీ ఐ లు చెప్తే మనకి ఎక్కదు ఎవడో బిబిసి వాడు చెప్పాల్సిందే ఈ పత్రికలు వాల్లు అందరూ బూజు పార్టీలు బూర్జువ పర్టీలు(paarteelu) అని రాస్తూ అసలు విషయం చెప్పెటానికి ఎవరి మీదో అదారపడాల్సి వస్తుంది .ఎంతైనా మనందరికి విదేశీ మోజు చాలా ఎక్కువ అన్ని రంగాల్లొ ……… …. ఈ వార్తలు ఎమి అతీతం కాదు ……
ఇలాగే బిబిసి సిఎనెన్ లని ఫాలో ఆవూతూ ఉంటే ఒకరోజు అసలు ఈ దేశ సరిహద్దులు మాపు ని కూడా మార్చ్గెస్తారు కాష్మీర్ అరునాచల్ ప్రదేశ్ sikkim la లాగ మిగత వాటీ పరిస్తితి కూడా అవుతుంది చివరికి మా జిల్లాలో ఉన్న సముద్ర తీరాన్ని కూడా మనది కాదు అంటారు ఇప్పటికే సెజ్ అని చెప్పి అరబ్ షేకు లకి దీన్ని అద్దెకిచ్చారు ఆ bbc వాల్లు ఇది అరబ్బులదె అని రాసినా రాస్తారు ……………
“మన గురించి దూరదర్సన్ పి టీ ఐ లు చెప్తే మనకి ఎక్కదు ఎవడో బిబిసి వాడు చెప్పాల్సిందే”
సాయిగారూ… అసలు ఈ విషయాల గురించి ఎప్పుడైనా మన చానళ్ళు (much less దూరదర్శన్) ఎప్పుడైనా ప్రసారం చేశారంటారా? అసలు మన ఛానళ్ళు అంత informative కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయా? ఈ స్థాయి కార్యక్రమాలు ఏ ఛానల్లో ప్రసారమవుతాయో చెప్పగలరా?
మీ మిగతా కామెంట్లలో కూడా ఆక్రోశమే ఉంది తప్ప తర్కంలేదు. గమనించగలరు.
తాగినోడెవడైనా దారి మర్చిపోయి పక్కింటికో, పక్కవీధికో వెల్తాడు గానీ.. బార్డర్ దాటి పక్క దేశంలోకి వెల్లడమేమిటో.. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఈ విషయాన్ని మన ఘనత వహించిన మీడియా తలకెత్తుకోవడమేమిటో.. మా పవిత్ర భారతీయునికి పరాయి దేశంలో అన్యాయం జరిగిపోయిందహో అని సాక్ష్యాత్తూ పార్లమెంటులోనే ప్రతిపక్ష నాయకుడు గొంతు చించుకోవడమేమిటో.. దేశం మొత్తం ఈ విషయాల్ని నమ్మేసి అవేశంతో ఊగిపోవడమేంటో.. ఏంటో.. అంతా మాయ..
Some one said that male buffalo delivered a calf and every one wanted to tie it.
నిజమే కదా చీకటి గారూ….ఎంతతాగితే మాత్రం బోర్డర్ దాటి వెళతారా…
కొంపదీసి ఇండియా-పాకిస్తాన్ బార్డర్లో వైన్ షాపులున్నాయా…? ఎంత తాగినా బార్డర్ ఎలా దాటుతారు…అదే మైనా పిట్టగోడా…?
మత్య్సకారులు దారితెలియక సముద్రంలో తప్పిపోయినట్లు…తాగుబోతులు కూడా సరిహద్దులు దాటుతున్నారన్న మాట. పోనీ ఆప్రకారమే ఐనా చాలామంది తాగుబోతులు అలా పాకిస్తాన్ కు, ఇటు ఇండియాకు రావాలి కదా…? ఒక్కరి విషయంలోనే ఇలా ఎందుకు జరిగింది. అంటే బయటకి తెలియని విషయం ఏదో ఉంది.
ఇక మన మీడియా ప్రచారం నిజంగా ప్రవీణ్ గారు చెప్పినట్లు దున్నపోతు ఈనినట్లే….
చీకటి గారు, రాజకీయాలని, గూఢాచారులుగా మారటానికి కారణాలను పక్కన పెడితె, గూఢాచారులుగా వీరు చెరవేసే సమాచారం అ యా దేశాలను పొరుగు దేశాల దాడులనుండి రక్షించటానికి ఉపయోగ పడట్లెదంటార ? మరి ఆ ప్రస్తావన కనిసం లెదే ? వారు డబ్బుకొసం చేసినా మనకన్న ఎంతో కొంత మేలు చెస్తున్నారు కదా ? మరి తాగి తుళ్ళి అని విమర్శ ఎందుకు ?గూఢాచారులను దేసభక్తులుగ చుపించటం తర తరాలుగ లేదా ? ఇండియనే చెస్తుంద..
గూఢాచారులుగా వారు చేసె చెడును అందరు ఖండిస్తారు
కిషోర్ గారు
సరబ్ జిత్ సింగ్ తదితరులు సాగించిన గూఢచార కార్యకలాపాలకు దేశానికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చలేదని ఇప్పటి రా అధికారులు చెబుతున్నారు. సంస్ధలోని కొందరు అత్యుత్సాహపరులు, పాకిస్ధాన్ కి వ్యతిరేకంగా ఏదో ఒకటి సాధించాలనుకున్న అధికారులు ఇలాంటి ప్రయోజనం లేని కార్యకలాపాలకు అమాయకులను బలి చేశారని అధికారులు వ్యాఖ్యానించినట్లు పత్రికలు చెబుతున్నాయి.
దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఒకటిగా ఉన్నపుడే గూఢచర్యం నిజమైన దేశభక్తి కార్యకలాపం అవుతుంది. దేశాన్ని ధనిక వర్గాలు పాలిస్తూ, వారి దృష్టిలో ప్రజల ప్రయోజనాలకు విలువ లేనపుడు, వారి వ్యాపార ప్రయోజనాలే ప్రభుత్వాలకు పరమావధిగా ఉన్నపుడు గూఢచార కార్యకలాపాలకు కూడా అంతిమ ప్రయోజనం ధనికులకు సంబంధించే ఉంటుంది. అందులో దేశ ప్రయోజనాలు లేకపోగా తక్షణ కాలికంగా చూసినా దీర్ఘకాలికంగా చూసినా ప్రజలకు నష్టమే జరుగుతుంది.
ఉదాహరణకు పాకిస్ధాన్ పైన అర్ధం లేని వ్యతిరేకత రెచ్చగొట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం? దేశాన్ని పీడించి, పిప్పి చేసిన బ్రిటన్ పైన రవ్వంత ద్వేషం ఉండదు; కానీ నిన్నమొన్నటివరకూ మనతో కలిసి ఉన్న పాకిస్ధానీయుల పైన మాత్రం అవధుల్లేని విద్వేషాన్ని పెంచి పోషించారు. అంతర్జాతీయంగా వివిధ శక్తుల బలా బలాల మధ్య అటూ ఇటూ మారే భారత పాలకులు స్వప్రయోజనాల కోసం పాక్ విద్వేషాన్ని రెచ్చగొట్టారు తప్ప అందులో దేశ ప్రయోజనం ఏమీ లేదు. ఇరు దేశాలు ఎంతగా కలహించుకుంటే ఇక్కడ అంతగా అమెరికా, ఐరోపాలకు స్ధానం దక్కుతుంది. తన్ని తరిమేశామని చెబుతున్న బ్రిటన్ సామ్రాజ్యవాద ప్రయోజనాలను, వారి మిత్రులైన అమెరికా, ఇతర యూరప్ దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు భారత-ఐరోపా-అమెరికా పాలకులకు ఒక వ్యూహాత్మక ప్రయోజనాన్ని పాక్ విద్వేషం నెరవేర్చుతుంది.
ఇలాంటి పాక్ వ్యతిరేక సెంటిమెంట్లకు లోనై కొందరు రా అధికారులు అనవసర గూఢచార కార్యకలాపాలకు సరబ్ జిత్ లాంటివారిని వినియోగించి వారి జీవితాలను నాశనం చేసారు. ఈ ఆర్టికల్ లో చెప్పినట్లు అనేకమంది నిరుద్యోగ అమాయకులు పాక్ విద్వేష యాగంలో సమిధలుగా ఆహుతయ్యారు. ఈ సంగతే ఆర్టికల్ లో చర్చించబడింది.
సమాజంలో ప్రజల ప్రయోజనాలు, ధనికుల ప్రయోజనాలు ఒకటిగా లేవు. అవి పరస్పరం ఎదురుబొదురుగా నిలబడి ఘర్షించుకుంటున్నాయి. ఒకరికి మేలు చేకూర్చేది మరొకరికి అనివార్యంగా కీడు చేస్తుంది. ఈ విధంగా చూస్తే ధనిక పాలకుల కోసం జరిపే గూఢచర్యం సాధారణ ప్రజలకు కీడే తప్ప మేలు చేయదు.
మీరు చెప్పిన దేశభక్త గూఢచర్యం కూడా ఉంటుంది. కాని అది పాలకుల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఏకీభవించినపుడే. జాతీయోద్యమంలో యువకులు బ్రిటన్ వెళ్లి తెల్ల అధికారులను చంపి వచ్చిన ఘటనలు ఉన్నాయి. అది బ్రిటన్ కి దేశద్రోహం. కాని భారత ప్రజలకు దేశభక్త కార్యక్రమం.
పత్రికలు చెబుతున్నై అన్నారు, వీలితే లింక్ ఇవ్వండి. పాక్ భారత్ కలిసుంటె శంతియుతమైన ప్రయజనా లు మినాహ ఇతర ప్రయొజనలెంటి చెప్పగలరు. భారత్, పాక్ విద్వేషాలకు పాక్ భాథ్యత లెదంటార. కామెంట్స్ లో తాగాడు, దుకాడు అనటమె బాదిస్థుంది
@kishore, pls see my Responce inline.
చీకటి గారు, రాజకీయాలని, గూఢాచారులుగా మారటానికి కారణాలను పక్కన పెడితె, గూఢాచారులుగా వీరు చెరవేసే సమాచారం అ యా దేశాలను పొరుగు దేశాల దాడులనుండి రక్షించటానికి ఉపయోగ పడట్లెదంటార ?
Res: దేశ రక్షణ లాంటి వ్యవహారాల మీద నాకంట నాలెడ్జి లేదండి, కాబట్టి ఈ విషయం మీద నేనేమీ చప్పలేను. ‘ఉపయోగపడట్లేదు’ అని మాత్రం నేనెక్కడా చెప్పలేదే..
వారు డబ్బుకొసం చేసినా మనకన్న ఎంతో కొంత మేలు చెస్తున్నారు కదా ?
Res: గూడాచారిని కాకున్నా, నాకు తెలిసినంతలో .. ఇలా కామెంట్ల రూపంలో, వ్యాసాల రూపంలో నేను కూడా ఎంతో కొంత మేలు చేస్తున్నాననే అనుకుంటున్నా..(దురావేశాలను నిరసిస్తూ.. )
మరి తాగి తుళ్ళి అని విమర్శ ఎందుకు ?
Res : అది నేనన్నది కాదు, ఇంతకాలం మన పత్రికలు, ప్రభుత్వం అంటున్నదే…
గూఢాచారులను దేసభక్తులుగ చుపించటం తర తరాలుగ లేదా ? ఇండియనే చెస్తుంద..
Res:ఇక్కడ కొంచెం చెప్పుకోవాలి. తరతరాలుగా.. ఇతరులు కూడా చేస్తున్నారు కాబట్టి ఇక దానిని గురించి ఎవరూ మాట్లాడకూడదా.. అనేది ఒకటి.
రెండోది దేశభక్తి.. (కొంత మంది ప్రబుద్ధులు దేశభక్తి అనేది తమకు మాత్రమే ఉన్న, పుట్టుకతోనే వచ్చిన ఆరోవేలు లాంటిదని భావిస్తూ ప్రగల్బాలు పలుకుతుండటంతో.. ఈ పదాన్ని వాడాలంటేనే చిరాగ్గా ఉంటుంది. ) సరే దేశభక్తికి ఎవరి నిర్వచనాలు వారికి ఉండొచ్చు. నా దృష్టిలో దేశ రాజ్యాంగాన్ని చట్టాల్ని గౌరవిస్తూ, ఇతరులకి హాని చేయకుండా ఉండటమే దేశభక్తి. .
నోట్: సరిహద్దులు దాటించిన సరబ్ జీత్ పేదరికంపైన, అతను మరణించిన విధానం పైనా ఇక్కడ అందరికీ సానుభూతి ఉంది. కాకపోతే, జస్ట్ తాగి అటు వెల్లిన అమాయకుడిగా మాత్రమే అతనిని ఇన్నాల్లూ చిత్రిస్తూ, ఈ అంశంపై దేశ వ్యాప్తంగా అనవసర భావావేశాలు రగిల్చిన మీడియాని , దీని నుండి కూడా రాజకీయ లబ్ధి పొందుదామని అత్యుత్సాహం ప్రదర్శించిన రాజకీయాల నే ఇక్కడ తప్పుపడుతున్నది.
చీకటి గారు ధన్యవాదములు