చైనా చేతిలో అమెరికా మిలట్రీ రహస్యాలు


Chinese hack US military computersఒక అమెరికా మిలట్రీ కాంట్రాక్టర్ లాప్ టాప్ ను హ్యాక్ చెయ్యడం ద్వారా అమెరికాకి చెందిన అతి కీలక మిలట్రీ రహస్యాలను దొరకబుచ్చుకున్నారు చైనా మిలట్రీ హ్యాకర్లు. ఒకటి, రెండూ కాదు ఏకంగా మూడేళ్ళ పాటు అమెరికా మిలట్రీకి చెందిన మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్లను లేదా టెరా బైట్ల కొద్దీ డేటాను షాంఘై ఆధారిత హ్యాకర్ గ్రూప్ ఒకటి సంపాదించగలిగింది. “కామెంట్ క్రూ” గా పిలుస్తున్న ఈ హ్యాకర్ గ్రూపు పనితనాన్ని తక్కువ చేయడానికి కాంట్రాక్టర్ సంస్ధ ఆదమరిచి ఉన్నదని, తగిన సంకేతాలు అందినా నిర్లక్ష్యం వహించిందని కారణాలు చెబుతున్నారు. కానీ దాదాపు మూడు దురాక్రమణ యుద్ధాల్లో మునిగి ఉండి, వందలాది దేశాల్లో నిరంతరం గూఢచర్యం సాగించే అమెరికా మిలట్రీ తన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పడం నమ్మశక్యంగా లేదు.

హ్యాకింగ్ కి గురయిన కంప్యూటర్ సెక్యూరిటీ సంస్ధ పేరు ‘కినెటిక్ నార్త్ అమెరికా (QinetiQ North America). షాంఘైలోని హ్యాకింగ్ గ్రూపు ‘కామెంట్ క్రూ’ 2007 నుండి 2010 వరకు ఈ సంస్ధ కంప్యూటర్లలో జొరబడి అమెరికా మిలట్రీ రహస్యాల డాక్యుమెంట్లను డౌన్ లోడ్ చేసుకుందని గురువారం బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ తెలిపింది. కంప్యూటర్ భద్రతా నిపుణులే సదరు గ్రూపుకు ‘కామెంట్ క్రూ’ అని పేరు పెట్టారని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్ధాన్, మధ్య ప్రాచ్యంలలో అమెరికా సైనిక బలగాలు ఉపయోగించే సాఫ్ట్ వేర్ తో పాటు అమెరికా జాతీయ భద్రతకు కూడా కినెటిక్ సంస్ధ భద్రతా సాఫ్ట్ వేర్ సమకూర్చిపెడుతోంది.

మూడు సంవత్సరాల పాటు సాగిన హ్యాకింగ్ ఫలితంగా ఇపుడు చైనా చేతిలో అమెరికా రహస్యాలు దండిగా ఉన్నాయని రష్యా టుడే (ఆర్.టి) తెలిపింది. కినెటిక్ సేవలు పొందుతున్న అమెరికా డ్రోన్ లు (మానవ రహిత విమానాలు), ఉపగ్రహాలు, మిలటరీ రోబోటిక్స్, అమెరికా సైనిక పోరాట హెలికాప్టర్ దళాలు తదితర రహస్య సమాచారం అంతా చైనా చేతికి చేరింది. అమెరికా ఆయుధ కార్యక్రమానికి సంబంధించి అనేక టెరా బైట్ల సమాచారాన్ని -కొన్ని వందల మిలియన్ల పేజీలకు సమానం- కామెంట్ క్రూ సంపాదించిందని ఆర్.టి తెలియజేసింది. మరీ ముఖ్యంగా ఆయుధగారం యొక్క ప్రోగ్రామింగ్ కోడ్, డిజైనింగ్ వివరాలు కూడా చైనా మిలట్రీకి అందాయి. అంటే ఒకవేళ అమెరికా, చైనాల మధ్య యుద్ధమే వస్తే అమెరికా ఆయుధాలని ఎందుకూ కొరగాకుండా చేయగల మెలకువలు చైనా చేతిలో ఉన్నట్లే.

ఈ సమాచార సేకరణ, అమెరికా వైపు నుండి చూస్తే సమాచార తస్కరణ అయితే చైనా వైపు నుండి చూసినపుడు అది చైనా మిలటరీ సైబర్ యుద్ధంలో సాధించిన అద్భుత విజయం. సైబర్ యుద్ధం కూడా ఇప్పుడు మరో యుద్ధ తలం. ఇంటర్నెట్ అభివృద్ధి ఫలితంగా భూ, వాయు, జల తలాలతో పాటు ఇప్పుడు సైబర్ తలం అదనంగా వచ్చి చేరింది. ఈ అదనపు యుద్ధరంగంలో ఇపుడు దేశాలన్నీ బిజీగా ఉన్నాయి. ఈ రంగంలో కూడా అమెరికాది ఎలాగూ పై చేయిగా ఉంది. ఇంటర్నెట్ తస్కరణ కార్యక్రమంలో దేశాలన్నీ తలమునకలై ఉన్నందున ‘మా సమాచారం దొంగిలించారు’ అని వాపోయి ఏం ప్రయోజనం? పైగా తామే ఒక పక్క సైబర్ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నపుడు అమెరికాకు ఆరోపణలు చేసి ప్రయోజనం లేదు. అందుకే కాబోలు, ఈ హ్యాకింగ్ పట్ల అమెరికా కిక్కురుమనడం లేదు.

చైనా వద్ద ఉన్న అమెరికా మిలటరీ సమాచారం వలన అమెరికాకి కలిగే నష్టం ఏమిటో మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ. బుష్ కి ప్రత్యేక సలహాదారుగా పని చేసిన రిచర్డ్ క్లార్క్ మాటలు చెబుతాయి. “చైనాతో యుద్ధం రాకుండా దేవుడే అడ్డుకోవాలి. కానీ ఆ దేశంతో యుద్ధం అంటూ వస్తే, భారీ సంకటం తప్పదు. మేము ఈ అత్యాధునిక ఆయుధ వ్యవస్ధలన్నీ ప్రయోగిస్తాము, కానీ అవి పని చేయవంతే.” శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమదే పై చేయి అనీ, సైబర్ సెక్యూరిటీ రంగంలోనూ తమను మించినవారు లేరని డబ్బాలు కొట్టుకునే అమెరికా ఇంత భారీ హ్యాకింగ్ ని ఎందుకని ఆపలేకపోయింది. ఈ అనుమానం వస్తుందనే అమెరికా ముందుగానే నెపాన్ని కంపెనీ మీదకి నెట్టేస్తోంది.

ఆర్.టి ప్రకారం 2007లోనే గూఢచర్యానికి సంబంధించిన సూచనలు కినెటిక్ కంపెనీకి అందాయి. నావల్ క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ సర్వీస్ వారు కినెటిక్ వాళ్ళకి తెలియజేశారట, కంపెనీలో ఇద్దరు ఉద్యోగులు తమ లాప్ టాప్ లలోని సమాచారాన్ని పోగొట్టుకుంటున్నారని. ఈ వ్యవహారం పైన విచారణ జరిపిన ఫోరెన్సిక్ నిపుణుడు బ్రియాన్ డిక్ స్ట్రా ప్రకారం కినెటిక్ వాళ్ళు తగిన విధంగా స్పందించలేదు. “అదేదో చిన్న విషయం అనీ, ఏదో చిన్న వైరస్ తగులుకుని ఉంటుందని వారు భావించారు” అని ఆమె చెప్పిందని ఆర్.టి తెలిపింది. హ్యాకింగ్ పూర్తి స్వరూపం కంపెనీకి ఇంకా గ్రహించలేదని ఆమె హెచ్చరించినప్పటికీ ఉపయోగం లేకపోయిందట.

2008లో నాసా సంస్ధ కినెటిక్ సంస్ధను హెచ్చరించింది. హ్యాకర్లు కంపెనీ కంప్యూటర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని. అయితే ఈ సారి కూడా కినెటిక్ సరిగ్గా స్పందించలేదట. ఆ తర్వాత జరిగిన అనేక దాడులను పరస్పరం సంబంధం లేనివిగా కినిటిక్ భావించిందని తెలుస్తోంది. ఈ లోపు హ్యాకర్లు సర్వర్లపై దాడి చేసి 13,000 కి పైగా అంతర్గత పాస్ వర్డ్ లను సంపాదించారు. వాటి సాయంతో 14 సర్వర్లపైన దాడి చేసి ఆయుధ వ్యవస్ధల టెక్నాలజీ వివరాలు సంపాదించారు. సర్వర్లలో దాదాపు శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు కూడా. కంపెనీ రోబోట్లను నియంత్రించే మైక్రో చీప్ పరిజ్ఞానాన్ని కూడా హ్యాకింగ్ గ్రూపు తస్కరించింది.

ఈ హ్యాకింగ్ ఉదంతం పైన అమెరికా విదేశాంగ శాఖ ఇంతవరకు స్పందించలేదని రష్యా టుడే చెబుతోంది. కినెటిక్ కాంట్రాక్టు రద్దు చేసే అధికారం ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వం అలా చేయడానికి బదులు మరో కాంట్రాక్టును కినెటిక్ కు కట్టబెట్టిందని ఆర్.టి తెలిపింది.

One thought on “చైనా చేతిలో అమెరికా మిలట్రీ రహస్యాలు

  1. సాంకేతికత పెంచుకోని ఇలాంటి చెత్త పనులు ఎలా చెయ్యొచ్చో అర్దం అయింది ఇలాంటి విద్యలన్ని నేర్పింది ఆ అమెరికా మహాశయులే కాబట్టి వాటిని వాల్ల మీదే ప్రయొగిస్తున్నారు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s