చిన్న పిల్లలకి వాహనాలను స్వయంగా నడపాలన్న కోరిక బుర్రని తొలుస్తూ ఉంటుంది. కానీ పెద్దవారి భయం వారిని వెనక్కి లాగుతుంటుంది. వాహనాలు ఉన్న ఇంట్లో అయితే స్టీరింగ్ ముందు కూర్చుని దాన్ని తిప్పుతూ ‘ర్రయ్… ర్రయ్…’ అని ఆడుకుంటారు. వాహనాలు లేనివారయితే ఉత్త చేతుల్ని స్టీరింగ్ పట్టుకున్నట్లు గాలిలో ఉంచి స్టీరింగ్ ని తిప్పుతున్నట్లు చేతులు ఆడిస్తూ ‘ర్రయ్… ర్రయ్…’ అని ఆడుతుంటారు. తాడు రెండు కొసల్ని ముడివేసి మధ్యలో నలుగురైదుగురు చేరి ‘బస్సమ్మ బస్సు…’ అంటూ ముందున్న పిల్లాడు/పిల్లది చేతులు తిప్పుతూ ఆడుకుంటారు. (ఇంజను పెద్ద సౌండుతో మోగిస్తే వచ్చే శబ్దాన్ని (లేదా హై స్పీడ్ తో వాహనం వెళ్తే వచ్చే శబ్దాన్ని) ఇంగ్లీషులో ‘Vroom’ అని సంబోధిస్తారు.)
యు.పి.ఎ-2 ప్రభుత్వాన్ని అతి కష్టం మీద తోలుతున్న ప్రధాని మన్మోహన్ పరిస్ధితి అలానే ఉందని కార్టూనిస్టు సూచిస్తున్నారు. సముద్రంలో ఓడ నడపడం మామూలు విషయం కాదు. ఇప్పుడంటే మోటారు యంత్రాలతో లాగించేస్తున్నారు కానీ, గతంలో మానవ ప్రయత్నంతోనే నడిపేవారు. మహా సముద్రాన్ని తనకంటే మించిన సైజులోని పడవ స్టీరింగ్ చక్రాన్ని ‘ర్రయ్… ర్రయ్…’ మని కంట్రోల్ చేస్తున్నారు మన్మోహన్. ఓడ స్టీరింగ్ ని హెల్మ్ అంటారు. హెల్మ్ ముందు ఉన్నవారిని ‘at the helm’ అనీ, ‘helmsman’ అని అంటారు. తెలుగులో కర్ణధారుడు అంటారుట. అలాగే వివిధ సంస్ధలకు, పార్టీలకు నాయకత్వం వహించడాన్ని కూడా ‘at the helm’ అని చెబుతారు. యు.పి.ఎ-2 ప్రభుత్వానికి ‘helmsman’ మన్మోహన్ గారే కదా! ఆయన శక్తిని, ప్రభుత్వంలో ఆయన స్ధానాన్ని, ఆయన అధికారాన్నీ ఈ కార్టూన్ చక్కగా చెబుతోంది.