స్త్రీల దుఃఖాన్ని రొమాంటిసైజ్ చేయలేము -POW సంధ్యతో ఓ రోజు


వైజాగ్ లో జైల్లో పెట్టిన మురికివాడ ప్రజల్ని పలకరించి వస్తూ...

వైజాగ్ లో జైల్లో పెట్టిన మురికివాడ ప్రజల్ని పలకరించి వస్తూ… (జనవరి 2012)

(రచన: రమా సుందరి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్ షిప్ తో పంజాబ్ యూనివర్సిటీలో ఎం.టెక్ చదువుతున్న రచయిత్రి వద్దకు ‘ప్రగతిశీల మహిళా సంఘం’ అధ్యక్షురాలు సంధ్య వచ్చిన సందర్భంగా… విశేషాలు)

సంధ్య వస్తుందనే సంతోషం నన్ను నిలవనీయలేదు. ఎయిర్ పోర్ట్ కు గంట ముందే వెళ్ళి కూర్చున్నాను. డిల్లీలో తెలంగాణా ధర్నా రెండు రోజులు ఉంటుందని, ముందు ఒక రోజు వచ్చి నీతో ఉంటాను అని నాకు చెప్పినప్పటి నుండి నా పరిస్థితి ఇదే. ఆటోలో వస్తూ చండీఘర్ వెడల్పైన రోడ్డులను, సైకిల్ ట్రాక్ లను, విశాలమైన పార్కింగ స్థలాలను, ఫుట్ పాత్ మీద ఉన్న దశభ్ధాల వయసు కలిగిన చెట్లను మెచ్చుకొంటూ, “మా హైదరాబాద్ లో కూడ ఇంతకు ముందు ఇలాంటి చెట్లు ఉండేవి” అంది ఆలోచిస్తూ.

“మీ హైదరాబాద్ సంగతి నాకు చెప్పకు. అదొక జనారణ్యం. నేను ఒక్క రోజు ఉంటే ఎప్పుడు మా ఒంగోలు తిరిగి రావాలా అని తహతహలాడతాను. ఎందుకు దాని కోసం కొట్టుకు చస్తున్నారో తెలియదు. అన్నట్లు మొన్న ఫలానా రచయిత హైదారాబాద్ మీద మనసు పారేసుకొన్నాడు తెలుసా. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళకు అదంటే అనుభంధం ఉంటుంది కాని, అది ధ్యంసం అయిన తరువాత వెళ్ళిన వాళ్ళు కూడ దాన్ని ప్రేమిస్తారని ఇప్పుడే తెలిసింది.” అన్నాను. నవ్వింది తను.

రూమ్ కి వచ్చాక తనకిష్టమైన , నేను బాగ చేయగలిగిన, స్ట్రాంగ్ కాఫీ ఇచ్చి “ఎలా సాగుతున్నాయి, పి.వో.డబ్లూ కార్యక్రమాలు? మీ మహిళా కౌన్సిలింగ్ విషయాలేమిటి?” అని అడిగాను.

“చాలా డిప్రెసివ్ స్టేజ్ లో వస్తారు రమ ఆడవాళ్ళూ. చచ్చిపోతామని అంటారు. వాళ్ళ సమస్యల తీవ్రత కూడ అలాగే ఉంటుంది. ఒళ్ళు జలదరిస్తది, సమాజంలో కొందరి మగవాళ్ళ పర్వర్షన్స్ వింటుంటుంటే. అయితే వాళ్ళ దుఃఖాన్ని రొమాంటిసైజ్ చేయలేము కదా. సునామి వచ్చి కుటుంబంలో మెజారిటీ సభ్యులు చనిపోయి, ఇళ్ళు కూలిపోయి సమస్తం నాశనమైన చోట కూడ మళ్ళీ జీవితాలు లేస్తున్నాయి. మొదలు నరికి, వేర్లు బయటికి వచ్చిన చెట్లు కూడ చివుర్లు వేస్తాయి. పునర్మిమాణం ఎంత అవసరమో నొక్కి చెబుతాము.” అంది.

“అయితే భర్త నుండి తప్పనిసరిగా విడిపోవాల్సి వస్తే, కొంతమంది పిల్లల తల్లిదండ్రులు చాలా విచిత్రంగా మాట్లాడతారు. పిల్లలని చూసుకొని బతికేస్తుంది లేమ్మ అంటారు. నిండా పాతికేళ్ళు లేని ఆడపిల్లలు, పిల్లల్ని చూసుకొంటూ, మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా అన్నలు, తమ్ముల దయాదాక్షిణ్యాలతో జీవితాంతం ఎలా బ్రతుకుతారు! దానికంటే నీ భర్త దగ్గరే ఉండి విషయం తేల్చుకో అని చెప్పాలనిపిస్తుంది.”

తరువాత నా లాప్ టాప్ తెరిచి నేను రాసిన రాతలను ముందు పెట్టి చదవమన్నాను, దౌర్జన్యంగా. స.వెం రమేష్ గారి ఇంటర్యూలో “స్థానికీకరణ, ప్రపంచీకరణ” దగ్గర ఆగి తన జ్ఞాపకాలను నెమరు వేసుకొంటూ “1995లో నేను ప్రపంచ మహిళా సదస్సుకి చైనా వెళ్ళి నప్పుడు మూడో ప్రపంచ దేశ మహిళా ప్రతినిధులం అంతా హిల్లరి క్లింటన్ ని ఘొరావ్ చేయాలని అనుకొన్నాము. అప్పుడు దక్షిణాఫ్రికా మహిళలు వందమంది వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో బూరలు ఊదుకొంటూ వచ్చి మాతో కలిసారు. వాళ్ళేమి చెప్పారో తెలుసా రమా” నా చెయ్యి పట్టుకొంది సంధ్య. తన మనసులో విషయాన్ని నా మనసులో నాటటానికి తను నా చెయ్యి గట్టిగా పట్టుకోవటం నాకు అలవాటే.

“వాళ్ళు ముందు మరబోటులు తెచ్చారు, సంతోషించాము. తరువాత మర ఓడలు తెచ్చారు. మెల్లిగా సముద్రాన్ని పాట పాడి గెలుచుకొన్నారు. మేము ఇప్పుడు మేము మా వృత్తిని, ఉపాధిని కోల్పోయి, మా బిడ్డల్ని పోషించటానికి వ్యభిచారం చేస్తున్నమని చెప్పారు.” సన్నని తెర తన కళ్ళలో.

“ఇది 1995 విషయం. అప్పుడే పి.వి నరసింహారావు నూతన ఆర్ధిక విధానాలు భారతదేశంలో ప్రవేశపెట్టాడు. మనం ఇంకా ఆ పర్యవసానాలను అనుభవించలేదు. ఫిలిప్పీన్స్ మహిళలు మమ్మల్ని మీరు ఎలాంటి బట్టలు వేసుకొంటారు, ఎలాంటి తిండి తింటారు ఇత్యాది ప్రశ్నలు వేసారు. భారత దేశంలో ఎనభై శాతం మహిళలు సాంప్రదాయ దుస్తులే ధరిస్తున్నామని చెప్పాను. తిండి కూడ మా స్థానిక ఆహారమే (ఇడ్లీ, దోస, పరోటాలే) ఎక్కువ తింటామని చెప్పాను. అప్పటికి ఇంకా మనకు పిజ్జ, బర్గర్లు, మెక్ డోనాల్డులు, కె.ఎఫ్.సి లు రాలేదు. వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకొని ‘మాకు మా సాంప్రదాయ దుస్తులు ఇక లేవు. మా సాంప్రదాయ తిండి లేదు. మాది కాని దాన్ని మేము మోస్తున్నాము అన్నారు తెలుసా!'”

మెస్ కి వెళదామని బయలు దేరాము. మెస్ లో ఎండిపోయిన పుల్కాలు, బంగాళ దుంపలతో భోజనం. నాకే జాలి వేసింది. కాని అది సంధ్య పెద్ద పట్టించుకొన్నట్లు లేదు. అదే ఆలోచనలో తింటోంది.

“ఇప్పుడు భారత దేశంలో ధ్వంసం ప్రారంభమైంది. సోంపేట, కాకరపల్లి, వాన్ పిక్, కనపర్తి సెజ్ లు, పవర్ ప్రాజెక్టులు ఇప్పుడు ఏమిచేయబోతున్నాయో! నీకు తెలుసా, మీ జిల్లా లోని కనపర్తి మ్యూజియంలో కొన్ని వేల శివ లింగాలు ఉన్నాయి. అసలు ఆ మండలాన్ని తవ్వితే ఇంకొక పురాతన నగరం దొరుకుతుందట. పవర్ ప్రాజెక్ట్ కోసం ఆ శివలింగాల్ని వేరే చోటుకి తరలిస్తారట. అక్కడి ప్రజలు మేము వెళ్ళినపుడు ఎంత ఆవేశంగా మాట్లాడారంటే మా ప్రాణాలు పోయినా మేమిక్కడ నుండి వెళ్ళమని చెప్పారు. వాళ్ళు ఎత్తి పోతల పధకంతో ఐదు వందల ఎకరాలు సాగుచేసుకొంటున్నారు. ఒక్కక్క పంటకు, ఒక్కో వర్గం, వంతుల వారిగా నీళ్ళు వాడుకొంటున్నారు. సారవంతమైన భూములు, ఇళ్ళు, వాకిళ్ళు, ప్రాచీన సంపద , సుస్సంపన్నమైన గ్రామీణ వాతావరణం …ఇదంతా ఎంత ఎక్స్-గ్రెషియాతో పూడుస్తారు? బాపట్ల దగ్గర పల్లెకారులు సముద్రం మా పేగు బంధం అన్నారు.”

“అభివృద్ధి అంటున్నారు కదా” చిన్నగా గొణిగాను. “అదే మరి. ప్రజలు అభివృద్ధి కి వ్యతిరేకం! విశాఖ ఉక్కు మా హక్కు అంటూ ఉద్యమించి,కొన్ని వేల ఎకరాల భూములు ధార పోసి విశాఖలో ఉక్కు కర్మాగారం తెచ్చుకొన్నది ప్రజలు కాదా. హైదరాబాద్ లో బి.హెచ్.ఇ.ఎల్, హెచ్.సి.ఎల్, బి.డి.ఎల్, ఇ.సి.ఐ.ఎల్ వీటన్నిటికి భూములు ధారదత్తం చేసింది పేద ప్రజలా, పారిశ్రామిక వేత్తలా? అవి తమ ఊరి బావుల్లాగా తవ్వుకొన్నారు. ఊట తాగారు. ఇవి వాళ్ళను నిలువునా ముంచటానికి వచ్చాయి.”

“అయినా అభివృద్ధి, అభివృద్ధి అని హైదరాబాద్ లో అరిచే వాళ్ళు ఈ సెజ్ లు ఏ కూకటి పల్లిలోనే, వనస్థలి పురం లోనో పెట్టుకోవచ్చు కదా.ఎప్పుడు పేద ప్రజలే, పల్లె ప్రజలే త్యాగాలు చేయాలా?” కోపం వచ్చేసింది సంధ్యకు. భాష అర్ధం కాకపోయినా ఆమె గొంతులోని పదునుకి మెస్ లో అందరు తిరిగి చూసారు. “కూల్, పద రూమ్ కి వెళదాం” అని లాక్కెళ్ళాను.

కాసేపు పిచ్చాపాటి నడిచింది. మా ఇద్దరికీ తెలిసిన రచయితలు, రచయిత్రుల గురించి మాట్లాడుకొన్నాము. మావోయిష్టు ఐడియాలజీ కలది అనుకొన్న ఒక రచయిత్రి, చనిపోయిన ఒక కామ్రెడ్ ఇంటి నుండి వచ్చి స్నానం చేసిన వైనం చూసి తన కమ్యూనిష్ట్ కాని స్నేహితురాలు ఎలా ఆశ్చర్యపోయిందో చెప్పి నవ్వించింది. “టీ పెట్టనా” తనే లేచింది. టీ పెడుతూ వంటగది కిటికీ నుండి “ఎంత అందంగా ఉంది బయట” అంది పక్షుల శబ్ధాలు వింటూ. నేను ఉత్సాహంగా నా ఫొటోగ్రఫి, పక్షులు గురించి చెప్పటం మొదలు పెట్టాను. ఆసక్తిగా వింది. “త్వరగా బయలు దేరు. రాక్ గార్డెన్ మూసేస్తారు” అని తొందర చేసాను.

ప్రపంచంలోనే యునీక్ అయిన రాక్ గార్డెన్ ను బాగా ఎంజాయ్ చేసింది సంధ్య. నాకిష్టమైన మూలల్లో నిలబెట్టి నవ్వించి ఫొటోలు తీసాను. ఒక సర్దార్జీని బతిమలాడి ఇద్దరం కొన్ని ఫొటోలు తీసుకొన్నాము. తను నడుస్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్లు గమనించాను. ““రేణుకాచౌదరీ ఇంటిని ముట్టడించినపుడు పోలిసులు కొద్దిగ మొరటుగా వ్యవహరించారులే,” నవ్వింది. “తెలంగాణా కోసం చనిపోయిన పిల్లల గురించి చాలా ఇన్ సెన్సిటివ్ గా మాట్లాడింది ఆవిడ.”

సుఖనా లేక్ ఒడ్డున కాళ్ళు జారాడేసుకొని కూర్చున్నాము. అస్తిత్వ ఉద్యమాల గురించి ప్రస్తావన వచ్చింది. మార్కిజానికి, అస్తిత్వానికి లింక్ చేయాలని అన్నది. దళితులకు రాజ్యాధికారం వస్తే వ్యవస్థ సారంలో మార్పు రాకున్నా, అది ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పింది. “ఎన్ని రోజులు ఈ రెండున్నర కులాల వాళ్ళు రాజ్యమేలుతారు?”

కొద్దిగా షాపింగ్ చేసుకొని, ఒక సౌత్ ఇండియన్ హోటల్ లో దోస తిని రూమ్ కి వచ్చాము. పొద్దున్నే తను వెళ్ళి పోవాలి. రాత్రంతా కబుర్లే.

“ఎమ్.ఇ తరువాత ఏమి చేస్తావు?” అడిగింది.

“ఏముంది, ఉద్యోగం! సీరియస్ రీడింగ్, కొద్దిగా రైటింగ్ అనుకొంటున్నాను”

“మరి నీ యాక్టివిటీస్?” అడగనే అడిగింది.

“మీరంతా చేస్తున్నారు కదా. నీ పర్ స్పెక్టివ్ రాసుకోవటం కూడ నీకు తెలియదు కద. లెట్ మి డు ఇట్” నవ్వాను.

“ఒక యాక్టివిస్ట్ రాతలకు, ఒక అకడమీషియన్ రాతలకు ప్రజా ప్రదర్శనకు, శ్మశానానికి ఉన్నంత తేడా ఉంటుంది” సీరియస్ గా నా కళ్ళలోకి చూస్తూ చెప్పింది.

ఉద్యమాలలో కొత్త పర్సప్టివ్స్, ట్రెండ్స్, వ్యక్తుల హిపోక్రసి, సాహిత్యం, సినిమాలు … ఆ రాత్రి మాకొక చైతన్య ఝరి.

పొద్దున్నే కళ్ళనీళ్ళతో తన వీడ్కోలు, తనపై మరింత ప్రేమతో మిగిలిన నేను.

8 thoughts on “స్త్రీల దుఃఖాన్ని రొమాంటిసైజ్ చేయలేము -POW సంధ్యతో ఓ రోజు

  1. రమ గారూ, స్నేహితురాలి రాక సందర్భాన్ని అర్థవంతమైన సంభాషణలకు వేదికగా మార్చటం ఎంతో నచ్చింది. మాట్లాడుతూ నోట్ చేసుకున్నారేమో అన్నంతగా ఇంత వివరంగా గుర్తుంచుకుని రాయటం ఆశ్చర్యంగా ఉంది.

    ‘ సునామి వచ్చి కుటుంబంలో మెజారిటీ సభ్యులు చనిపోయి, ఇళ్ళు కూలిపోయి సమస్తం నాశనమైన చోట కూడ మళ్ళీ జీవితాలు లేస్తున్నాయి. మొదలు నరికి, వేర్లు బయటికి వచ్చిన చెట్లు కూడ చివుర్లు వేస్తాయి.’’- పునర్నిర్మాణం గురించి సంధ్య గారి మాటలు చాలా బాగున్నాయి!

  2. “ఒక యాక్టివిస్ట్ రాతలకు, ఒక అకడమీషియన్ రాతలకు ప్రజా ప్రదర్శనకు, శ్మశానానికి ఉన్నంత తేడా ఉంటుంది”

    భేషైన మాట. యాక్టివిస్టు బాటలో నడిచొచ్చి ఆ భిక్షతోనే రచయిత్రిగా మారాక ‘యాక్టివిటీస్ మీరు చూసుకొండి’ అనడం ఏరు దాటాక తెప్ప తగలేయడంతో సమానం కాదా?

  3. మెకాలె విధ్యవిధానం మనల్ని మానసికంగా వారి గుమస్తాలుగా తయారు చేస్తే, ఇప్పటి ధేశియ విధ్య విధానం గ్లోభల్‌ కంపెనీలకు మేనెజర్లుగా, ఇంజినీరింగ్‌ మెకానికులుగా థయారు చేస్థూంధి.మనల్ని ఆలోచన ఉన్న మనుషులుగా తయారు చెయ్యటంలేదు.

  4. సంధ్యతో ఒకరోజు సంఘటనలను బాగా వ్యక్తీకరించారు. స్త్రీల సమస్యలు మొదలు ప్రపంచీకరణ, అస్తిత్వ ఉద్యమాలు, అబివ్రుద్ధి తదితర విషయల్ని బాగా గుదిగుచ్చారు. బాగుంది. అయితె ఎం.ఇ. తర్వాత యాక్టివిటీస్ అని అడిగినప్పుదు మీరంతా చేస్తున్నారుగ అనే మాట బాగాలేదు. నా వంతు చెస్తాను అంటె బాగుండేదికదా.

  5. ఏరు దాటాక తెప్ప తగలేయడం అన్నారు ఇలాంటి వ్యాసాలు ఈ బ్లాగ్ లో రాస్తుంటె ఏటిలో ఉన్న తెప్పకే చిల్లులు పెట్టుకోవడం లాగా ఉంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s