ఎంత హింస మోసిందో, భర్తను కడతేర్చింది…


NDTV

NDTV

“ఎంతైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు కదా!” ఈ మాట చెప్పడం చాలా తేలిక. కష్టాన్ని మోసేవాడిని నీతి సూత్రాలు ఎందుకు పాటించలేదని నిలదీయడం అతి సులువు. ఒడ్డున నిలబడి లోతు లెక్కలు వల్లించడం మాటలతో పని. ఇక ఇరవై నాలుగ్గంటలూ హింస అనుభవిస్తున్న వారిని ‘ప్రతిఘటించొద్దు, అది నేరం’ అని చెప్పడం ఎంత అన్యాయం? పదేళ్ళు అనుమానపు భర్త చేతుల్లో హింస అనుభవించిన భార్య, ఇక సహించలేక అతన్ని కడతేరిస్తే ఆమె పైన హత్యానేరం మోపడం చట్టం దృష్టిలో సబబే అయినా, అది న్యాయమేనా? ఎంత హింస మొస్తే అంత తీవ్ర చర్యకు పాల్పడుతుంది?

ఆదివారం ముంబై లోని పోవై పోలీసు స్టేషన్ అధికారులు రక్తం మరకలతో ఉన్న దుస్తులతో వచ్చిన మహిళను చూసి నిశ్చేష్టులుగా మిగిలారు. “నేను నా భర్తను చంపాను. అతని శవం ఇంట్లోనే ఉంది” అని తొణక్కుండా చెబుతున్న ఆమె కంఠం తమ చెవుల్లో ఘంటారావంగా మారుమోగుతుంటే చేష్టలుడిగి నమ్మశక్యం కాని దృశ్యాన్ని ఊహించుకోవడం పోలీసుల వంతయింది. ఆమె ఒక్కర్తే రాలేదు. తానే చంపానని చెప్పడానికన్నట్లుగా సాక్ష్యంగా 14 యేళ్ళ కొడుకుని వెంటబెట్టుకుని మరీ వచ్చింది.

ఆ అనుమాన పిశాచి మరెవరో కాదు. ఆ ఇల్లాలు లొంగిపోయిన పోలీసు స్టేషన్ అధికారులు అంతకు ముందు రోజే పంచాయితీ చేసి బుద్ధిగా ఉండమని బుద్ధి చెప్పి ఇంటికి పంపించిన మరో పోలీసు అధికారే. ఆయన పేరు నంద కిషోర్ తక్సల్కర్. వయసు 43 సంవత్సరాలు. ఆమె పేరు పార్వతి. వయసు 36 సంవత్సరాలు. మొదట గ్రానైట్ రాయితో తలపై మోది అనంతరం తన కొడుకు ముందే సుత్తితో మళ్ళీ కొట్టడంతో అతను చనిపోయాడు.

అసిస్టెంట్ పోలీసు ఇనస్పెక్టర్ అయిన నంద కిషోర్ పచ్చి తాగుబోతు. భార్య గుణ గుణాల పైన ఒకటే అనుమానం. ఆ అనుమానంతో ఆమెను అనేకసార్లు చితకబాదేవాడు. ఎవరైనా వ్యక్తితో మాట్లాడినట్లు అనిపిస్తే అక్కడే పోట్లాడి, చితగ్గొట్టేవాడు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఆ రాత్రి ఒంటి గంట ప్రాంతంలో వారిద్దరూ పోలీసు స్టేషన్ కి వెళ్లారు. స్టేషన్ లో కూడా ఇద్దరూ తగాదాపడి అరుచుకున్నారు. తమ ముందే కలహించుకున్నారని పోలీసులు చెప్పినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ఆ రాత్రికి ఇద్దరినీ పోలీసు స్టేషన్ లోనే ఉండమని పోలీసులు కోరారు.

దానికి నంద కిషోర్ ఒప్పుకోలేదు. తనను క్షమించమని పోలీసుల్ని వేడుకున్నాడు. భార్యను కూడా క్షమాపణలు కోరాడు. పోలీసు అధికారుల ముందు భార్యను పదే పదే బతిమాలి ఇంకెప్పుడూ గొడవ చేయనని ఒట్టు పెట్టాడు. “మేము ఇద్దరికీ కౌన్సిలింగ్ చేశాము. చివరికి ఆదివారం ఉదయం 10 గంటలకి వారిని ఇంటికి వెళ్ళమని చెప్పాము” అని ఎస్.ఐ భోస్లే చెప్పాడు.

కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే నంద కిషోర్ తాగడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ పెద్ద తగాదా మొదలైంది. సింగిల్ బెడ్ రూమ్ ఇంటిలో భార్యా భర్తలు ఇరువురూ పెద్దగా తగవులాడుకున్నారని పొరుగువారు చెప్పారు. వంటగది సామాన్లన్నీ ఇంటి బైట చిందరవందరగా పడి ఉన్నాయని పోలీసులు చెప్పారు. బాగా తాగిన నంద కిషోర్ మధ్యాహ్నం 3 గంటల కల్లా పడుకునేందుకు బెడ్ రూమ్ కి వెళ్ళాడు. అప్పటికే పార్వతి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇక భరించలేను అనుకొన్నది. ఆగ్రహం కట్టలు తెంచుకుని ఉబుకుబికి వస్తుండగా వంటగది నుండి గ్రానైట్ రాయి తెచ్చి భర్త తలపైనా మోదింది. తర్వాత సుత్తితో కొడుకు సతీష్ ముందే కొట్టింది. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి రక్తం అంటిన దుస్తులతో పోలీసు స్టేషన్ లో లొంగిపోయింది. ఆమె విషయం చెప్పిన కొంతసేపటికి తేరుకున్న పోలీసులు హుటాహుటిన ఇంటికి పరుగెత్తారు.

ఎస్.ఐ. భోస్లే ఇలా చెప్పాడు, “తక్సల్కర్ ఎప్పుడూ తన భార్యని అనుమానించేవాడు. ఎవరితోనైనా మాట్లాడినా సరే ఆమెతో పోట్లాడేవాడు. ఇంకో పక్క ఆయన బాగా తాగుతాడు. పార్వతి పైన హత్యా నేరం మోపాము.” తక్సల్కర్ 1996 బ్యాచ్ ముంబై పోలీసు అధికారి అని ఎన్.డి.టి.వి తెలిపింది. స్ధానికంగా ఆయుధగారంలో ఆయన ఉద్యోగం. అంతకుముందు నాలుగు పోలీసు స్టేషన్లలో పని చేశాడు. ఆయనకి పార్వతి రెండవ భార్య కాగా, పార్వతికి ఆయన రెండో భర్త. మొదటి భార్యతో కలిగిన కుమారుడు వారి వద్ద ఉండడం లేదు. కానీ పార్వతికి మొదటి భర్త వల్ల కలిగిన కుమారులు వారి వద్దనే ఉంటున్నారు. ఆదివారం జరిగిన హత్యకు సతీష్ ప్రత్యక్ష సాక్షి అని పోలీసులు చెబుతున్నారు.

ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి? సమాజంలో వివిధ తరగతుల ప్రజల సామాజిక స్ధాయిలు విపరీతమైన హెచ్చు తగ్గులతో ఉన్నపుడు ఇలాంటి సంకట పరిస్ధితి సర్వ సాధారణంగా ఎదురవుతుంది. ఒకే ఇంట్లో ఉన్నా భార్యాభర్తలు సమానులు కారని సమాజంలో అమలులో ఉన్న అలిఖిత సంప్రదాయ సూత్రం. కానీ భార్య కూడా సంపాదిస్తే కానీ ఇల్లు గడవని ఆర్ధిక అవసరం తరుముకొని వచ్చింది. మహిళలపై మోపిన శీల భారం మరో సామాజిక అపభ్రంశం. అనుమానపు భర్త సైక్రియాటృస్టు వద్ద చికిత్స తీసుకోవడం తప్ప పరిష్కారం లేదు. కానీ మానసిక వైద్యుడి వద్దకు వెళ్లడాన్ని ఆమోదించే స్ధితికి సమాజం అభివృద్ధి చెందకపోవడం మరో సామాజిక అంగవైకల్యం. భార్యల ప్రతి కదలికను అనుమానంతో చూసే భర్తలతో గడపడం కంటే మించిన నరకం మరొకటి ఉండదు. ఆ నరకం నుండి విముక్తి పొందడానికి పార్వతి ఎంచుకున్న దారి ఆమోదయోగ్యం కాకపోయినా సంఘటన జరిగినాక అర్ధం చేసుకోదగ్గది. కానీ ఇది శాశ్వత సూత్రం కానీ సమాజం రావాలి.

2 thoughts on “ఎంత హింస మోసిందో, భర్తను కడతేర్చింది…

 1. విదేశాలలో , మానసిక వ్యాధి తో విపరీతం గా ప్రవర్తించే వారిని , తప్పని సరిగా, మానసిక వైద్యుల తో పరీక్ష చేయిస్తారు !
  ఆల్కహాలు విపరీతం గా తాగుతూ , దానికి బానిసలయిపోయిన చాలా మంది లో , మానసికం గా, చాలా మార్పులు వస్తాయి !
  సహజం గా నే, ఆ మార్పులు చాలా హాని కరం గా పరిణమిస్తూ ఉంటాయి , తాగుతున్న వారికీ , వారి ద్వారా ఇతరులకూ !
  విపరీతమైన తాగుడు తో భార్యను అనుమానించడం , ఆమె శీలాన్ని శంకిస్తూ , ఆమెను హింసించడం ఒక మానసిక వ్యాధి !
  దానిని ‘ ఒథెల్లో సిండ్రోం ‘ అని పిలుస్తారు ( ఆ పేరు షేక్స్పియర్ రాసిన ఒక నాటకం ఒథెల్లో నుంచి గ్రహించ బడింది ! ఆ నాటకం లో , ఒథెల్లో తన భార్య శీలాన్ని శంకించి , ఆమెను హత్య చేస్తాడు ! )
  ఈ ఒథెల్లో సిండ్రోం చికిత్స తేలిక కాదు , ఎందుకంటే ఎంత మంది తాగుడు కు బానిసలయిన వారు , తాగడం మానుతారు గనుక ???!!!
  పైన వివరించిన సంఘటనలో ఆ స్త్రీ , తాను ఒక సమిధ అవ్వక ముందే , భర్తను అంతం చేసింది, పోలీసులకు చెబితే వారు, భర్త , ఆమెను అంతం చేసిన తరువాత ,పంచ నామా చేయడానికి వచ్చే వారేమో ! ఎందుకంటే , వారికి పైన చెప్పిన విషయాల మీద అవగాహన ఏమాత్రం ఉంటుంది ?

 2. భార్యను అర్థం చేసుకునే భర్త దొరికితే ఎంత అద్రుష్టమో.. అనుమానించే వాడు వస్తే అంత నరకం.. అయినా ఆమె పది సంవత్సరాలు అతనితో ఆ నరకాన్ని అనుభవిస్తూ కాపురం చేయడం ఆమె సహనానికి నిదర్శనం. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందంటారు.. ఒక జంతువే తట్టుకోలేనపుడు ఆలోచన గల మనిషి ఆమె మాత్రం ఎలా సహిస్తుంది?..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s