బంగ్లాదేశ్ ప్రమాదం: ఆదుకోడానికి ముందుకు రాని కంపెనీలు


శిధిలాల్లో మృతుల కోసం వెతుకులాట

శిధిలాల్లో మృతుల కోసం వెతుకులాట

బంగ్లాదేశ్ లో ఎనిమిది అంతస్ధూల భవనం కూలిపోయి 400 మందికి పైగా మరణించిన ప్రమాదంలో బాధిత కార్మికులను ఆడుకోడానికి పశ్చిమ దేశాల కంపెనీలు ముందుకు రావడం లేదు. కూలి పోయిన భవనంలో నడుస్తున్న అనేక బట్టల తయారీ కంపెనీలు ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల బహుళజాతి కంపెనీలకు దుస్తులు సరఫరా చేస్తాయి. నెలకు 38 డాలర్లు చెల్లించే అత్యంత హీనమైన వేతనాలతో బిలియన్ల కొద్దీ డాలర్ల లాభాలు గుంజే ఫ్యాషన్ బట్టల కంపెనీలు తమకు లాభాలు ఆర్జించిపెడుతున్న కార్మికులు కష్టాల్లో ఉంటే ఆడుకోవడానికి ముందుకు రాణంటున్నాయి. ఇప్పటివరకు రెండంటే రెండే కంపెనీలు సాయం చేస్తామని ప్రకటించగా డజన్ల కొద్దీ కంపెనీలు మొఖం చాటేస్తున్నాయి.

బ్రిటన్ కి చెందిన ప్రైమార్క్ బట్టల గొలుసు షాపుల కంపెనీ ప్రమాదంలో మరణించిన కార్మికులకు కొంత పరిహారం చెల్లిస్తానని ప్రకటించింది. అయితే ఈ పరిహారం ఎంతయిందీ ఆ కంపెనీ చెప్పలేదు. ప్రైమార్క్ బట్టల షాపులకు దుస్తులు సరఫరా చేసే ‘సింపుల్ అప్రోచ్’ ఫ్యాక్టరీ కూలిపోయిన భవనంలోనే ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎనిమిది అంతస్ధుల ‘రాణా ప్లాజా’ లో రెండో అంతస్ధులో ప్రైమార్క్ కి చెందిన ‘న్యూ వేవ్’ కు దుస్తులు సరఫరా చేసే ఫ్యాక్టరీ ఉన్నదని రష్యా టుడే తెలిపింది. తానొక్కరే కాకుండా ఇంకా అనేక రిటైలర్ షాపులు అక్కడి నుండి దుస్తులు ఆర్డర్ చేసి తెప్పించుకుంటాయని ప్రైమార్క్ చెప్పడం గమనార్హం.

Primark“మా బాధ్యత గురించి మాకు పూర్తిగా తెలుసు. ఇతర రిటైలర్లను కూడా ముందుకొచ్చి సహాయం చేయాలని మేము కోరుతున్నాము” అని ప్రైమార్క్ ప్రతినిధిని ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు దీర్ఘకాలిక సహాయం చెయ్యడంతో పాటు, గాయపడినవారికి ఆర్ధిక సాయం చేస్తామని కంపెనీ తెలిపింది. బాధిత కుటుంబాలకు అత్యవసర ఆహారం అందించడంలో ఇతర ఎన్.జి.ఓ లతో పాటు తమ పాత్ర ఉన్నదని ప్రైమార్క్ తెలిపింది. బాధ్యత పూర్తిగా తెలిసిన ప్రైమార్క్ తాను ఎంతమందికి ఎంత సహాయం చేయనున్నదో చెప్పకపోవడం అనుమానాస్పదంగా కనిపిస్తోందని బంగ్లాదేశ్ బట్టల మిల్లుల కార్మిక సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ప్రైమార్క్ ప్రకటన తర్వాత కెనడియన్ కంపెనీ ‘లోబ్లా’ కూడా సాయం చేస్తానంటూ ముందుకు వచ్చింది. ప్రమాదానికి గురైన భవనంలో తమ ఫ్యాక్టరీ కూడా ఉన్నదని ఆ కంపెనీ అంగీకరించింది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తానని తెలిపింది. “సాధ్యమైనంత మెరుగైన, అర్ధవంతమైన పద్ధతిలో సాయం అందిస్తాం. బాధితులకు, వారి కుటుంబాలకు సాయం చెయ్యడమే మా ప్రాధాన్యత. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మార్పులు చేయడానికి పురిగొల్పుతాము” అని లోబ్లా ప్రతినిధి జిలిజా హంటర్ తెలిపాడు. భవనం కూలిపోవడానికి కారణం తెలుసుకోడానికి తమ సీనియర్ అధికారులను పంపనున్నట్లు ఆయన తెలిపాడు.

OLYMPUS DIGITAL CAMERAబంగ్లాదేశ్ బట్టల కార్మికుల వెతలు ఈనాటివి కాదు. అత్యంత దుర్భరమైన, గాలి చొరని ఇరుకైన గదుల్లో అనేకమంది, ముఖ్యంగా మహిళలు పని చేస్తుంటారు. పని పరిస్ధితులు మెరుగుమరచాలని కార్మిక సంఘాలు పోరాటాలు చేసినప్పటికీ పోలీసు నిర్బంధం ఎదురయిందే తప్ప ఫలితం దక్కలేదు. కంపెనీలు మాత్రం ఏటికేడూ లాభాలు పెంచుకుంటూ పోయాయి. చైనా, ఇటలీల తర్వాత అత్యధికంగా బట్టలు ఎగుమతి దేశం బంగ్లాదేశ్. కొందరైతే బంగ్లాదేశ్ ది చైనా తర్వాత రెండో స్ధానం అని చెబుతారు. సంవత్సరానికి 20 బిలియన్ డాలర్ల బట్టల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుందని ఒక అంచనా. ఇందులో నెలకి ఒక కార్మికుడికి చేరేది 38 డాలర్లు మాత్రమే. మెరుపులతో కూడిన అద్దాల వెనుక మెరిసిపోతూ కనిపించే ఫ్యాషన్ దుస్తుల వెనుక బంగ్లాదేశ్ కార్మికుడి చెమట చుక్కలు ఉండగా, ఆ కార్మికుడుకి దక్కుతోంది నిత్య దరిద్రం అయితే కంపెనీలకి దక్కేది లాభాల పంటలు.

తమవారి కోసం ఆందోళనలు

తమవారి కోసం ఆందోళనలు

బ్రిటన్, కెనడాలతో పాటు అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల కంపెనీలకు కూడా ప్రమాద భవనంలోని ఫ్యాక్టరీలు బట్టలు సరఫరా చేస్తున్నా అవేవీ సాయం చేస్తున్నట్లు ప్రకటించలేదు. అమెరికాకి చెందిన వాల్ మార్ట్, ఇటలీకి చెందిన బెనెట్టన్ లకు కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అధికారికంగా తమకు అక్కడ ఫ్యాక్టరీలు లేవని వాల్ మార్ట్ ప్రకటించగా బెనెట్టన్ అయితే అసలు తమకు ఆ భవనంలో ఫ్యాక్టరీలే లేవు పొమ్మంది. ఒకే ఒక్కసారి ఆర్డర్ ఇచ్చి దుస్తులు తెప్పించుకున్నామని మాత్రమే బెనెట్టన్ ప్రకటించింది. అయితే భవనంలోని ‘న్యూ వేవ్ బాటమ్స్’ అనే తయారీదారు తమ క్లయింటులలో బెనెట్టన్ ఒకటని చెప్పడంతో బెనెట్టన్ మోసం బట్టబయలయింది.

ఇంకా హెచ్ & ఎం, గాప్ తదితర బహుళజాతి కంపెనీలకు ప్రమాద భవనంలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఇంతవరకూ నోరు మెదపలేదు. కంపెనీలన్నీ నష్టపరిహారం చెల్లించాలని బంగ్లాదేశ్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల పరిస్ధితి ఇలా ఉంటే బంగ్లాదేశ్ తయారీదారుల పరిస్ధితి మరోలా ఉన్నది. ఈ వంక పెట్టి కంపెనీలు మరో చోట ఆర్డర్లు ఇస్తారని వారికి భయం పట్టుకుంది. వారంతా కలిసి దాదాపు 30 విదేశీ బట్టల కంపెనీలకు విన్నపం చేసుకున్నారు. ఇకనుండి భద్రతా నియమాలు పాటిస్తామని ఇంకెక్కడా ఆర్డర్లు ఇవ్వొద్దని వారు విన్నవించుకున్నారు. కానీ 38 డాలర్ల వేతనం చెల్లిస్తూ కంపెనీలకు ఇబ్బడి ముబ్బడిగా లాభాల మూటలు పంచుతున్న తయారీదారులు భయపడాల్సింది ఏమీ లేదని చెప్పొచ్చు.

One thought on “బంగ్లాదేశ్ ప్రమాదం: ఆదుకోడానికి ముందుకు రాని కంపెనీలు

  1. పెట్టుబడులు పెడతామని…ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని… ప్రభుత్వాల నుంచి భారీ రాయితీలు తీసుకునే బహుళజాతి సంస్థల్లో కార్మికుల బతుకులు ఎంత దయనీయంగా ఉంటాయో ఈ ఉదంతం చెబుతోంది.ఎమ్మెన్సీల పేరుతో స్థానిక చట్టాలు తమకు వర్తించవంటాయి. కార్మిక చట్టాలు వర్తించవంటూ అడ్డగోలు వాదనలు చేస్తుంటాయి. కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసి కాసులపైనే ధ్యాస పెట్టడం బహుళజాతి సంస్థల నైజం. ప్రభుత్వాలు బహుళజాతి సంస్థల ఒత్తిళ్లకు లొంగి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. అదే కార్మికుల పాలిట శాపంగా మారుతోంది. మన దేశంలోనూ ఎస్ ఈ జెడ్ లాంటి వాటిలో జరుగుతున్నది ఇదే. ఎమ్మెన్సీలకు రాజభోగాలు. కార్మికులకు కడగండ్లు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s