అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియాల వద్ద ఉద్రిక్తతలు


దక్షిణ కొరియాలో అమెరికా మెరైన్ల యుద్ధ విన్యాసాలు

దక్షిణ కొరియాలో అమెరికా మెరైన్ల యుద్ధ విన్యాసాలు

ఉభయ కొరియాల వద్ద అమెరికా సాగిస్తున్న ‘మిలట్రీ డ్రిల్’ (కోడ్ నేమ్ ఫోల్ ఈగిల్) ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. మున్నెన్నడూ లేని విధంగా అణు బాంబులు జారవిడిచే బి-2 బాంబర్ యుద్ధ విమానాలను కొరియా భూభాగంపై ఎగరడంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. కొరియా భూభాగంపై 10,000 కి.మీ ఎత్తు ఎగురుతూ బి-2 బాంబర్లు ‘మాక్ బాంబింగ్’ డ్రిల్ (పేలుడు పదార్ధాలు లేని బాంబు జారవిడిచి అది అనుకున్న చోట పడేదీ, లేనిదీ నిర్ధారించుకోవడం) నిర్వహించడంతో ఉత్తర కొరియా మిలటరీ కమాండ్ అత్యవసర సమావేశం నిర్వహించి తమ బాలిస్టిక్ మిసైళ్లను అత్యున్నత స్థాయిలో అప్రమత్తం చేసి సరిహద్దుకు తరలిస్తున్నట్లు ప్రకటించింది. తాము దక్షిణ కొరియా, అమెరికాలతో ‘స్టేట్ ఆఫ్ వార్’ లో ఉన్నట్లు ప్రకటించింది.

అమెరికా, దక్షిణ కొరియాలు గత కొన్ని నెలలుగా భారీ స్ధాయిలో మిలటరీ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. దక్షిణ కొరియాలోని అమెరికా సైన్యాలు ఈ డ్రిల్ లో పాల్గొంటున్నాయి. దక్షిణ కొరియాలో అమెరికా 25,000 వరకు సైన్యాలతో పఆటు అణ్వాయుధాలను కూడా మోహరించడంతో ఉత్తర కొరియా అనేక యేళ్లుగా అణు బాంబుల నిర్మాణానికి ప్రయత్నించి సఫలం అయింది. మధ్యతరహా ఖండాంతర క్షిపణులను కూడా తయారు చేసుకుంది. ఉత్తర కొరియా సాగిస్తున్న అణు ప్రయత్నాలకు కారణం దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరం, అందులోని అణ్వాయుధాలు. ఈ సంగతి పత్రికల్లో పెద్దగా రాదు. దానితో ఉత్తర కొరియాయే కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా ప్రపంచానికి కనిపిస్తుంది. ఉత్తర కొరియా నాయకుడు కిం జోంగ్-ఉన్ కొద్ది నెలల క్రితమే చర్చలు జరుపుదామని అమెరికా, దక్షిణ కొరియాలను ఆహ్వానించిన సంగతి, ఈ ఆహ్వానాన్ని ఆ దేశాలు తిరస్కరించిన సంగతి తెలిపిన పత్రికలు చాలా తక్కువ.

దక్షిణ కొరియా, అమెరికా దేశాల తాజా డ్రిల్ సందర్భంగా మార్చి నెలాఖరులో అమెరికా రాష్ట్రం మిస్సోరి నుండి 20,000 కి.మీ దూరం ఏకబిగిన ప్రయాణించి, బి-2 బాంబర్లు దక్షిణ కొరియాలో 10,000 కి.మీ ఎత్తునుండి మాక్ బాంబింగ్ నిర్వహించాయి. తాను అనుకున్న చోట, అనుకున్నపుడు, త్వరితగతిన దాడులు చేయగలనని చెప్పడమే బి-2 ప్రదర్శన లక్ష్యం అని అమెరికా మిలట్రీ ప్రకటన స్పష్టం చేసింది. ఈ చర్యలతో తాను ప్రమాదంలో ఉన్నట్లు భావించిన ఉత్తర కొరియా ఆత్మరక్షణ చర్యలకు దిగింది. అత్యున్నత మిలట్రీ కమాండ్, తమ నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ నేతృత్వంలో అత్యవసర సమావేశం జరిపి తాము పొరుగు దేశంతో ‘యుద్ధ స్ధితి’లో ఉన్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉత్పన్నమైన సమస్యలన్నీ తదనుగుణంగానే పరిగణించబడతాయని ప్రకటించింది. 1950-53 నాటి కొరియా యుద్ధం ఎటువంటి శాంతి ఒప్పందం లేకుండా ముగిసింది. దానితో ఇరు దేశాలు సాంకేతికంగా యుద్ధంలో ఉన్నట్లే. 1953లో కొరియా యుద్ధం ముగిశాక చర్చలు జరిపి నిర్యుద్ధ ఒప్పందం కుదుర్చుకుందామని ఉత్తర కొరియా ఆహ్వానించినా అమెరికా తిరస్కరించింది. కొరియా ఐక్యత కోసం చర్చలు ప్రతిపాదించినా కూడా తిరస్కరించింది. బిల్ క్లింటన్ అధ్యక్షరికంలో చర్చలు జరిగినా బుష్ అధ్యక్షుడు అయ్యాక వాటిని రద్దు చేశారు.

రష్యా, చైనా హెచ్చరికలు

ఈ నేపధ్యంలో కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితి ఏర్పడడం పట్ల రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్ధితి అనుకోని మలుపులు తిరిగి తీవ్ర పరిస్ధితి తలఎత్తవచ్చని ఏప్రిల్ ప్రారంభంలో హెచ్చరించింది. దక్షిణ కొరియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా పెట్టుకుని సరిహద్దు వద్ద ఉత్తర కొరియా తన బాలిస్టిక్ మిసైళ్లను మోహరించడం, అమెరికా ఈ ప్రాంతంలో తన మిలట్రీ ఉనికిని మరింతగా పెంచడం… ఈ పరిస్ధితి త్వరలో చేయి దాటవచ్చని హెచ్చరించింది. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడానికి అమెరికా, ఉత్తర కొరియా రెండూ కారణమేనని రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ వ్యాఖ్యానించాడు. అనూహ్యంగా చైనా కూడా ఉత్తర కొరియానే తప్పు పడుతోంది. చైనా పౌరుగునే ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం చైనా సహించదని అధ్యక్షుడు జిన్ పింగ్ ఏప్రిల్ 7న వ్యాఖ్యానించి అనేకమందిని ఆశ్చర్యపరిచాడు.

ఆసియా, ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల్లో పెట్టుబడులు పెంచుకుంటూ ప్రబల ఆర్ధికశక్తిగా ఎదిగిన చైనాను అమెరికా సైనికంగా చుట్టుముట్టింది. కొరియాల మధ్య మళ్ళీ యుద్ధమే వస్తే ఉత్తర కొరియా సర్వనాశనమై అమెరికా ఆధిపత్యంలోకి పోవడం ఖాయం. అది చైనా భద్రతకు పెను ముప్పుగా పరినమిస్తుంది. సిరియా విషయంలో అమెరికా, తదితర పశ్చిమ దేశాల చొరబాటుకు అవకాశం కల్పించే ఐరాస తీర్మానాలను రష్యాతో కలిసి రెండుసార్లు వీటో చేసిన చైనా తాను తప్ప మరో మిత్రుడు లేని ఉత్తర కొరియాకు, తన భద్రతకు ముప్పు పొంచిఉన్నా, అండగా నిలవకపోవడం ఆసక్తికర పరిణామం. బహిరంగ మద్దతు ఇస్తే ఉత్తర కొరియా పాలకులు మరింత ఉద్రిక్తత పెంచేవైపుగా ప్రకటనలు చేయవచ్చని, అది మళ్ళీ అమెరికాకు అనుకూలంగా మారవచ్చని బహుశా చైనా భావిస్తున్నదేమో భవిష్యత్తులోనే తెలియాలి.

ఆర్కిటిక్ కనెక్షన్

ఉత్తర కొరియా నుండి రానున్న ప్రమాదాన్ని నివారించడానికి అలాస్కాలో ‘మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ’ మోహరింపు అధికం చేయనున్నట్లు మార్చి నెలలో అమెరికా ప్రకటించింది. యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ అమెరికా అమ్ములపొది లోని ఒక అస్త్రం. అమెరికా భూభాగంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో అమర్చే ఈ వ్యవస్థ అమెరికా పైకి వచ్చే అణు క్షిపణులు భూభాగాన్ని తాకక మునుపే ఆకాశంలోనే అడ్డుకుని నాశనం చేస్తుంది. యూరప్ ఖండంలో కూడా ఈ క్షిపణి రక్షణ వ్యవస్ధను ఏర్పాటు చేశానని గత సంవత్సరమే అమెరికా ప్రకటించింది. తమకు సమీపంలో ఉన్న పోలండులో క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని అమెరికా ప్రకటించడంతో రష్యా అప్రమత్తమైంది. పోలండులో క్షిపణి రక్షణ కవచం ఏర్పాటు చేసిన మరుక్షణమే దానిని తమ క్షిపణులతో నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తామని హెచ్చరించింది. అయితే తమ వ్యవస్ధకు రష్యా లక్ష్యం కాదని, తలపెట్టిన పధకంతో ముందుకు వెళ్తామని అమెరికా ఇటీవలి వరకూ ప్రకటిస్తూ వచ్చింది.

అయితే, కొద్ది వారాల క్రితం అమెరికా అనూహ్యంగా మాట మార్చింది. పోలండులో యాంటీ మిసైల్ వ్యవస్థను మోహరించడం లేదని ప్రకటించింది. దానికి బదులు ఉత్తర కొరియా నుండి రానున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అలాస్కాలో మోహరిస్తామని తెలిపింది. 2017 నాటికల్లా మిసైళ్లను మధ్యలోనే అడ్డుకునే ‘మిసైల్ ఇంటర్ సెప్టార్ల’ను కనీసం పదిహేడింటిని అలాస్కాలో మోహరిస్తామని ఒబామా నూతన ప్రభుత్వంలో డిఫెన్స్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన చక్ హేగల్ ప్రకటించాడు. దీనితో ఉత్తర కొరియా కలవరపాటుకి గురయింది. తమ పైకి వస్తే అమెరికా ప్రధాన భూభాగం పైకి నిర్దాక్షిణ్యంగా అణుబాంబులతో దాడి చేస్తామని హెచ్చరించింది. ఈ హెచ్చరికల్లో వాస్తవికత ఎంత ఉన్నా అవి అమెరికా ‘అలాస్కా ఎత్తుగడ’కే బాగా కలిసొచ్చింది. అసలు ఉత్తర కొరియా అమెరికా పైకి దాడి చేస్తుందని చెప్పడమే పెద్ద జోక్. అలాంటి చిన్న దేశం కోరి కోరి అమెరికాను రెచ్చగొట్టి ఉపద్రవాన్ని నెత్తి మీదకు తెచ్చుకుంటుందని ఊహకు అందని విషయం. మరయితే కొరియాలో పెచ్చుమీరిన ఉద్రిక్తతలకు, అమెరికా పోలండు-అలాస్కా ఫియాస్కోకు కారణం ఏమిటి?

బ్రిటిష్ గూఢచార సంస్థ MI5 మాజీ గూఢచార అధికారి ‘అన్ని మేకన్’ రష్యా టుడేకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఆర్కిటిక్ ధ్రువం వద్ద ఉన్న సహజ వనరులపైన కన్నేసిన అమెరికా, వాటిని తమ వశంలో ఉంచుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోందని, అందులో భాగంగానే అలాస్కాలో యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను మోహరిస్తోందని తెలియజేసింది. అమెరికా చేపెట్టిన ఈ వ్యూహాత్మక కదలికకు ఉత్తర కొరియా ఒక సాకు మాత్రమేనని తెలిపిందామె. ఉత్తర కొరియా అమెరికా పైకి దాడి చేయడం అంటే ఆత్మహత్యతో సమానమని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.

ఒక దేశం నుండి దాడి జరిగే భయం (threat) ఉన్నదని చెప్పడానికి రెండు అంశాలు చూస్తారని, ఒకటి: ఆ దేశానికి దాడి చేసే సామర్ధ్యం ఉన్నదా, రెండు: ఆ దేశానికి దాడి చేసే ఉద్దేశం నిజంగా ఉన్నదా… పరిశీలిస్తారని, ఇవి రెండూ ఉత్తర కొరియాకు లేవని స్పష్టమేనని మేకన్ తెలిపింది. ఆర్ధిక సంక్షోభంలో కూరుకు పోయిన అమెరికా ఆర్కిటిక్ లోని వనరులపై కన్నేసిందని, అందుకోసం యూరప్ నుండి యాంటీ మిసైల్ ఇంటర్ సెప్టార్లను అలాస్కాకు తరలించే అవసరం దానికి ఏర్పడిందని, ఆ అవసరం నుండే అకస్మాత్తుగా ఉత్తర కొరియా, ఇరాన్ ల నుండి అణు బాంబు భయం ఉన్నట్లు అమెరికా కనుగొన్నదని మేకన్ తెలిపింది.

ఉత్తర కొరియా శక్తి పరిమితం

అమెరికా ఎత్తుగడ ఏమైనప్పటికీ వాస్తవంగా ఆచరణలో జరుగుతున్నది దక్షిణ కొరియాలో సైనికుల కదలికలు పెరగడం, అమెరికా కొత్తగా అణు బాంబర్లను తరలించడం, వాటితో మాక్ బాంబింగ్ డ్రిల్ నిర్వహించడం. ఈ చర్యలు ఎంత లేదన్నా పొరుగు దేశాలకు అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. ప్రపంచంలో తాను కావాలనుకున్న చోట యుద్ధ పరిస్ధితులను రగిలించి ఏదో వంకతో ఏకపక్షంగా దాడులు చేసే అమెరికా చర్యలు ఎవరికి మాత్రం భయాన్ని కలిగించవు? అందుకే ఉత్తర కొరియా తన జాగ్రత్తలో తాను ఉన్నానని దక్షిణ కొరియా, అమెరికాలకు సంకేతాలు పంపించే పనిలో పడింది.

నిజానికి ఉత్తర కొరియా వద్ద ఉన్న మిసైళ్ళకు అమెరికా ప్రధాన భూభాగం వరకు చేరగల శక్తి లేదని పరిశీలకుల అంచనా. ఉత్తర కొరియా వద్ద ఉన్న మిసైళ్ళ సామర్ధ్యం ఎక్కువలో ఎక్కువ 6,000 కి.మీ మాత్రమే. కానీ ఉత్తర కొరియా అలాస్కాల మధ్య దూరం సుమారు 9,000 కి.మీ పైనే. కనుక ఉత్తర కొరియా నుండి దాడి ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పడం ఒట్టిమాట! ‘అమెరికాను తాకే శక్తి ఉత్తర కొరియా క్షిపణులకు లేదని’ ఏప్రిల్ 11 తేదీన జరిగిన హౌస్ మిలట్రీ కమిటీ సమావేశంలో రక్షణ కార్యదర్శి చక్ హేగల్ స్పష్టం చేశాడని న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాయడమే ఇందుకు సాక్ష్యం. ఒక పధకం ప్రకారం కొరియాల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఉత్తర కొరియా నాయకుల నుండి దుందుడుకు హెచ్చరికలు రాబట్టి, యుద్ధ నగారాలు మోగింపజేసి సందట్లో సడేమియాగా యాంటీ మిసైల్ ఇంటర్ సెప్టార్లు కొన్ని యూరప్ నుండి అలాస్కాకు తరలించడం అమెరికా లక్ష్యంగా కనిపిస్తోందన్న నిపుణుల మాటలను కొట్టిపారేయలేం.

ఆర్ధిక సంక్షోభం నుండి బైటికి రాలేక మిలట్రీ బడ్జెట్ లో కోత పెట్టుకునే పరిస్ధితిలో ఉన్న అమెరికాకు కొత్తగా మిసైల్ ఇంటర్ సెప్టార్లను నిర్మించే శక్తి లేదు. 2013 సంవత్సరానికి గాను ‘ఫిస్కల్ క్లిఫ్’ గా పేరు పొందిన కోశాగార చర్యలలో భాగంగా మిలట్రీ తదితర ఖర్చులలో కోత విధించే బిల్లుపై అధ్యక్షుడు ఒబామా ఇటీవలే సంతకం చేశారు కూడా.

కనుక కొరియాలో తలవని తలవంపుగా ఏర్పడిన ఉద్రిక్తత పరిస్ధితి అమెరికా పిల్లి తలపెట్టిన వ్యూహాత్మక ‘చెలగాటం’కు బాహ్య రూపం కాగా, ఉత్తర కొరియాకు ఎలుకకు ‘ప్రాణ సంకటం’!

4 thoughts on “అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియాల వద్ద ఉద్రిక్తతలు

  1. మొత్తానికి కొరియాల మధ్య యుధ్ధంలో మరో కొత్తకోణం వెలుగు చూసింది. ఆర్టికల్ విశ్లేషణాత్మకంగా బాగుంది.

  2. ద.కొరియా ని ఆర్థికంగా, రాజకీయంగా లొంగదీసుకున్న ఆమెరికా తన సైనిక స్థావరాన్ని చైనాకు అతి సమీపంలో స్థాపించకలింగింది. ఉ.కొరియాకు, ద.కొరియాకు గొడవలు పెద్దవి అవడ్డానికి ఆమెరికానే కారణం అని ద.కొరియా వాసులు చాలా మంది విశ్వసిస్తున్నారు.. నేను ద.కొరియాలో వున్నపుడు నాతో ద.కొరియా వాసులు చాలా మంది చెప్పింది కూడా అదే! ఆ విషయం తెలిసినా ఆమెరికాను కాదనలేరు/ఎదిరించలేరు, కారణం వారి ఆర్థిక వ్యవస్థా అంతా అమెరికా గుత్తాధిపత్యంలో వుంది.

    మాక్ డ్రిల్ ఉ.కొరియా అంచున చేస్తుంది అమెరికా/ద.కొరియా అదీనూ అణు పాఠవాన్ని ప్రదర్శిస్తూ!!
    కానీ, చైనా కూడా ఉ.కొరియాను తప్పుపట్టినప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను.

    అణు సంపత్తి ఆమెరికా, చైనా, ద.కొరియాల దగ్గర వున్నప్పుడు ఉ.కొరియా దగ్గర వుంటే తప్పేంటి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s