–
బొగ్గు కుంభకోణం విచారణలో సి.బి.ఐ నిర్వహిస్తున్న పాత్ర పలు అనుమానాలకు తావిస్తోంది. సి.బి.ఐ ని ప్రభావితం చేయడానికి న్యాయ శాఖ మంత్రి స్వయంగా పూనుకోవడం, ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఇందులో పాత్ర వహించడాన్ని బట్టి పాలకులు అవసరం అయితే ఎంతకు తెగిస్తారో తెలిసి వస్తోంది. విచారణ పురోగతి నివేదికలను ప్రభుత్వానికి చూపడం లేదని మార్చి 8 తేదీన చెప్పిన సి.బి.ఐ ఏప్రిల్ 26 తేదీన సమర్పించిన అఫిడవిట్ లో ప్రభుత్వానికి చూపిన తర్వాతే కోర్టుకు నివేదికలు సమర్పిస్తున్నామని చెప్పడంతో సుప్రీం కోర్టు సి.బి.ఐని మంగళవారం కడిగిపారేసింది.
“ముసాయిదా నివేదికను ప్రభుత్వంతో పంచుకున్నామన్న విషయం మార్చి 8 నాటి పురోగతి నివేదిక (status report)లో ఎందుకు వెల్లడించలేదు?”
“ఏప్రిల్ 26 న దాఖలు చేసిన అఫిడవిట్ లో ముసాయిదా నివేదికలో ఏయే మార్పులు చేశారో వివరాలు ఎందుకు ఇవ్వలేదు? మే 6 తేదీలోపు ఏయే మార్పులు చేశారో చెబుతూ మరో అఫిడవిట్ దాఖలు చెయ్యండి.”
“ఎవరి ఆదేశాల మేరకు ముసాయిదాలో మార్పులు చేశారో ఎందుకు చెప్పలేదు?”
“న్యాయ శాఖ మంత్రి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు కాకుండా ఇంకెవ్వరూ ముసాయిదా నివేదికను చూడలేదా?”
“బొగ్గు గనుల కేటాయింపుల పైన జరుగుతున్న విచారణలో పాల్గొంటున్న (సి.బి.ఐ) అధికారుల పేర్లు తదితర వివరాలు మాకు ఇవ్వండి!”
ఇవి మంగళవారం సి.బి.ఐ కి సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్నలు, ఆదేశాలు. (newsbullet.in)
న్యాయశాఖ మంత్రి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఏయే మార్పులు ముసాయిదా నివేదికలో చేశారో ఏప్రిల్ 26 తేదీ నాటి అఫిడవిట్ లోనే వెల్లడించక పోవడం పట్ల సుప్రీం కోర్టు బెంచి అసంతృప్తి ప్రకటించింది. ఏయే మార్పులు చేశారో, ఎవరి ఆదేశాలకు ఆ మార్పులు చేశారో వివరిస్తూ మే 6 తేదీ లోపు మరో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించడం కేంద్ర ప్రభుత్వానికి సంకట పరిస్ధితిని తెచ్చింది. అశ్వని కుమార్ రాజీనామా చేయక తప్పని పరిస్ధితిని ఇది కల్పిస్తోంది.
అయితే కోర్టుల క్రియాశీలత పెరిగే కొద్దీ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల చర్మం మందబారుతోంది. ఎన్ని అక్షింతలు వేసినా మాకవి దీవెనేలే అన్నట్లుగా వారు కుర్చీలకు అంటుకుని ఉండడం సరికొత్త రివాజుగా మారింది. రైలు ప్రమాదం జరిగితేనే రిల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి కాలం నాటి బూర్జువా నీతి సైతం నేడు కలికానికి కూడా కానరాకుండా పోతోంది.
అశ్వినీ కుమార్ రాజీనామా తధ్యం లాగానే కనిపిస్తున్నా అది పెద్ద విషయం కాదు. ఇప్పడు ప్రధాని మన్మోహన్ సింగ్ కాళ్ళ కిందికి చేరుతున్న నీరే అసలు విషయం. ‘మౌన ముని’గా అనేక ఆటుపోట్లను అవలీలగా ఎదుర్కొన్న ప్రధాని మన్మోహన్ ఈసారి కూడా మౌనం తోనే బాధ్యతాయుత ప్రవర్తన మోపే భారాన్ని ఇట్టే నెట్టిపారేయగలరు. సందేహం అనవసరం.
ప్చ్…ఇది చాలు నిజమైన అవినీతి పరులు సి.బీ.ఐ. పై బురద జల్ల డానికి…అవకాశం దొరికింది…చేసిన అక్రమాలన్నీ…ఈ ఒక్క తీర్పు చూపించి కడిగేసుకోవడానికి…
ఈ దేశానికి దరిద్రమే కాంగ్రెస్…వెధవల్ని చేర దీసి పెద్ద వాళ్ళను చేసి…వాళ్ళు తోక జాడిస్తే …మళ్ళీ వీళ్ళే రంగం లోకి దిగి… వాళ్ళ తోక కత్తిరిం చడానికి ప్రయత్నించడం..నానా ఛండాలం చేస్తున్నారండీ…
అవును సార్…ఇప్పటిక్ ఆ అవినీతి తమ పత్రికల్లో సీబీఐ గురించి దుష్ప్రచారం మొదలు పెట్టారు. సీబీఐకి స్వతంత్ర ప్రతి ఇస్తే తప్ప ఆ సంస్థ బాగు పడదు.