సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నా, ఆఫ్ఘన్ అధ్యక్షుడి ఒప్పుకోలు


Hamid Karzaiఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వంలో అవినీతి గురించి తెగ బాధపడిపోయే అమెరికా అవినీతి భాగోతాన్ని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్వయంగా బైటపెట్టాడు. తాను సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నమాట నిజమేనని కానీ ఆ డబ్బు గాయపడినవారికి, జబ్బు పడినవారికి, కొన్ని ఇళ్లకు అద్దె చెల్లించడానికి వినియోగించానని హమీద్ కర్జాయ్ నమ్మబలికాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో సి.ఐ.ఎ లంచాలు మేపడం కొత్తేమీ కాదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సి.ఐ.ఎ చర్యలను సమర్ధించుకురాగా, సి.ఐ.ఎ సొమ్ము చివరికి తాలిబాన్ వద్దకే చేరుతోందని అనేకమంది అమెరికా అధికారులే వాపోవడం ఈ మొత్తం కధకి కొసమెరుపు.

సోమవారం నాటి న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం సి.ఐ.ఎ “సూట్ కేసుల్లో, బ్యాక్ ప్యాక్ లలో, ఒక్కోసారి షాపింగ్ బ్యాగ్ లలో కూడా దశాబ్ద కాలంగా మిలియన్ల కొద్దీ డాలర్లను ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కు అందజేస్తోంది. ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి ఈ డబ్బు అందజేత ఉద్దేశించిన న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. 2002 నుండి 2005 వరకు కర్జాయ్ కి డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పని చేసిన ఖలీల్ రోమన్ ఈ డబ్బును ‘దెయ్యం డబ్బు’గా పేర్కొన్నాడని “అది రహస్యంగా వచ్చి, రహస్యంగానే వెళ్లింది” అనీ పత్రిక తెలియజేసింది.

సి.ఐ.ఎ ఈ వార్త గురించి ఏ వ్యాఖ్యా చేయనప్పటికీ కర్జాయ్ మాత్రం తాను “కొద్ది మొత్తాలలో” డబ్బు తీసుకున్నమాట నిజమేనని తెలిపాడు. తాలిబాన్, అమెరికాల మధ్య చర్చలు జరుపుతున్న నేపధ్యంలో అమెరికా, కర్జాయ్ ల మధ్య ఇటీవల కాలంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైన్యాలు ప్రజలపై హత్యాకాండ సాగిస్తున్నాయని వెంటనే దేశం వదిలి వెళ్లాలని ఆదేశించేవరకు కర్జాయ్ వెళ్ళాడు. 2014 చివరి నాటికి పోరాట (అణచివేత అని చదువుకోవాలి) కార్యక్రమం నుండి అమెరికా దురాక్రమణ సేనలు ఉపసంహరించుకుంటున్న నేపధ్యంలో అక్కడ వివిధ స్టేక్ హోల్డర్ల మధ్య ఎత్తులు పైఎత్తులు ఊపందుకున్నాయి. చైనా-ఇండియాల మధ్య కూడా ఆఫ్ఘన్ ఉపసంహరణ విషయమై ఇటీవల చర్చలు జరిపాయంటే అమెరికా సేనల నామమాత్ర ఉపసంహరణ సైతం ఈ ప్రాంతంలో పడవేయనున్న ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ఈ పరిస్ధితుల్లో కర్జాయ్ అవినీతిని న్యూయార్క్ టైమ్స్ పత్రిక బైటపెట్టడం ఒక పధకం ప్రకారమే జరిగిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాను బహిరంగంగానే తిట్టిపోస్తున్న కర్జాయ్ ని అదుపులో ఉంచడానికే దురాక్రమణ యుద్ధం మద్దతుదారు న్యూయార్క్ టైమ్స్ తాజా వెల్లడికి పూనుకుందని వారి అవగాహనగా తెలుస్తోంది. అమెరికా అధికార వర్గాలను ఉటంకిస్తూ అమెరికా పత్రికే ఈ విషయాన్ని వెల్లడించడంతో కర్జాయ్ కి అంగీకరించక తప్పలేదు. అయితే సి.ఐ.ఏ డబ్బు మంచి కార్యక్రమాలకే ఉపయోగించానని ఆయన చెప్పుకోవడానికి తంటాలు పడడం విశేషం.

“అవును. అమెరికా నుండి గత పది సంవత్సరాలుగా జాతీయ భద్రతా కార్యాలయం మద్దతు స్వీకరిస్తోంది… నెలవారిగా. పెద్ద మొత్తం ఏమీ కాదు. చాలా కొద్ది మొత్తం, దానిని వివిధ కారణాలకి వినియోగించాము” అని హెల్సింకి (ఫిన్లాండ్) అధికార పర్యటనలో ఉన్న కర్జాయ్ తెలిపాడు. గాయపడినవారికి, జబ్బు పడ్డావారికి, కొన్ని ఇళ్లకు అద్దె చెల్లించడానికి ఈ సొమ్ము వినియోగించామని కర్జాయ్ చెప్పాడు.

సి.ఐ.ఏ చెల్లింపులు అమెరికా చట్టాలకు వ్యతిరేకం కాదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక చెప్పుకొచ్చింది. స్వతంత్ర దేశాలపై బడి దాడులు చేసి దురాక్రమణ యుద్ధాలకు తెగబడే సామ్రాజ్యవాద ఎజెండాను ప్రాణవాయువుగా చేసుకున్నా అమెరికాకు సి.ఐ.ఏ చేసే లంచాల మేపుడు చట్ట విరుద్ధం అవుతుందని ఎవరు మాత్రం ఆశించారు గనక? అయితే సి.ఐ.ఏ అందజేసిన ఈ మొత్తం అమెరికా ప్రభుత్వంలోని ఇతర విభాగాలు ఇతర ఆఫ్ఘన్ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలకు విరుద్ధంగా ఉపయోగపడి ఉండవచ్చని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆందోళన వ్యక్తం చేసింది. అంటే ఒక పక్క తాలిబాన్ పైన, ఆల్-ఖైదా పైనా పోరాడుతున్నట్లు చెప్పే అమెరికా, అదే సమయంలో ఆ రెండు సంస్ధలకు పరోక్షంగా నిధులు అందజేసే పనిలో నిమగ్నం అయిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొంత సున్నితమైన పరిభాషలో చెబుతోంది. ఆఫ్ఘనిస్ధాన్ ని దురాక్రమించి, అక్కడ వివిధ వర్గాల మధ్య చిచ్చు రగిలించి, అన్నీ పక్షాలకూ సాయం చేస్తూ ఆఫ్ఘనిస్ధాన్ ను ఆరని మంటగా, నిరంతరం రక్తం ఓడుతున్న గాయంగా (గోర్భచెవ్) మార్చడమే అమెరికా లక్ష్యమని స్పష్టం అవుతోంది.

కనుక అమెరికాకి ఆఫ్ఘనిస్ధాన్ లో కావలసింది టెర్రరిజం అణచివేయడం కాదు. ఆఫ్ఘన్ టెర్రరిజం ప్రాధమికంగా అమెరికా సృష్టే. పశ్చిమ పత్రికలు అదే పనిగా బాకాలూదినట్లు అక్కడి మహిళల హక్కులను కాపాడడం కూడా అమెరికా లక్ష్యం కాదు. గత పదేళ్ళలో ఆఫ్ఘన్ మహిళల పరిస్ధితి మెరుగుపడకపోగా యుద్ధం మోపిన భారం వారిని మరింత క్రుంగ దీసిందని అనేక విశ్లేషణలు తేల్చాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో నిరంతరం ఘర్షణలు ప్రోత్సహించి అక్కడ తన సేనలు కొనసాగేలా చేసుకునేందుకు ఎలిబీలు సృష్టించుకోవడం అమెరికా దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా సాగుతున్న ఒక రాజకీయ కార్యాచరణ ఆఫ్ఘన్ యుద్ధం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s