జ్యోతి సింగ్ సింగపూర్ కి, సరబ్ జిత్ సింగ్ ఇండియాకి!?


తక్షణ స్పందన ఈ పాల మనసుల సొంతం

తక్షణ స్పందన ఈ పాల మనసుల సొంతం

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక విచిత్రమైన ప్రకటన జారీ చేసింది. సరబ్ జిత్ సింగ్ ని విడుదల చేసి ఇండియాకి పంపిస్తే ఇక్కడ ఉన్న అత్యున్నత వైద్య చికిత్సను అందజేసి ఆయన్ను బతికించుకుంటామన్నది ఆ ప్రకటన సారాంశం. ‘బతకడం కష్టమే’ అని పాకిస్ధాన్ డాక్టర్లు పెదవి విరుస్తున్న సరబ్ జిత్ సింగ్ కి అత్యున్నత స్ధాయి వైద్య చికిత్స అందజేసి గుర్రాన్ని ఎగిరించగల భారతీయ వైద్యం జ్యోతి సింగ్ పాండేకు ఎందుకు పనికిరాకుండా పోయింది? భారత ప్రజలు అడగవలసిన ప్రశ్న ఇది.

మానవతా దృక్పధం!

మరణ శిక్ష ఎదుర్కొంటున్న సరబ్ జిత్ సింగ్ పట్ల పాకిస్ధాన్ ప్రభుత్వం సానుభూతి చూపాలని, మానవతా హృదయంతో ఆయనను విడుదల చేయాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరింది. లాహోరులో సబ్ జైలుగా మార్చబడిన జిన్నా ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో సరబ్ జిత్ సింగ్ మృత్యువుతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కోల్ లఖ్పట్ జైలులో పాక్ కి చెందిన మరో ఇద్దరు మరణ శిక్ష ఖైదీలు సరబ్ జిత్ పైన ఇటుకలు, పదునైన రేకులతో దాడి చేయడంతో ఆయన కపాలం ఎముక చిట్లిపోయింది. మెదడుకు రక్తం మోసుకెళ్లే మార్గంలో రక్త కణాలు పేరుకుపోయి రక్తప్రసరణకు ఆటంకంగా పరిణమించాయి.

దీనితో సరబ్ జిత్ కేంద్ర నాడీ మండల వ్యవస్ధ తీవ్రంగా ప్రభావితమై ఆయన తీవ్ర స్ధాయి కోమాలోకి జారుకున్నాడు. సర్జరీ చేసి గడ్డకట్టిన రక్తాన్ని తొలగిస్తే ఆయన పరిస్ధితి కుదుటపడే అవకాశం ఉందట. కానీ ఆయన పరిస్ధితి స్ధిరంగా ఉంటే తప్ప సర్జరీ చేయడానికి వీలు లేదు. దానితో ఆకుకూ అందక, పోకకు పొందక సరబ్ జిత్ పరిస్ధితి ప్రమాదకరంగా మారింది. ఆయన ఉన్న పరిస్ధితిలో బతకడం కష్టమే అని పాక్ డాక్టర్లు ఇప్పటికే చెప్పేశారు. అందుకేనేమో సరబ్ జిత్ కుటుంబ సభ్యులను ఆసుపత్రి సందర్శించడానికి అనుమతి కూడా పాకిస్ధాన్ ప్రభుత్వం ఇచ్చింది.

ఈ నేపధ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. ‘అత్యున్నత స్ధాయి వైద్య చికిత్స అందజేయడానికి వీలుగా సరబ్ జిత్ సింగ్ ను భారత్ తరలించే అవకాశాన్ని తాము పరిగణించగలమని ఈ ప్రకటన చెబుతోంది. “ఇటీవల జరిగిన విచారకర ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్ధితుల్లో, ఈ కేసును సానుభూతితో, మానవతా దృక్పధంతో పరిశీలించాలని మేము మరోసారి పాకిస్ధాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము” అని ప్రకటన కోరింది.

ప్రకటన ప్రకారం భారత హై కమిషన్ అధికారులు జిన్నా ఆసుపత్రి వైద్యాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. “ఇక్కడ అందుబాటులో ఉన్న అత్యున్నత స్ధాయి వైద్య చికిత్స నుండి సరబ్ జిత్ లబ్ది పొందేందుకు వీలుగా ఆయనను భారత్ కు తరలించే అవకాశాన్ని పరిగణించడానికి మొగ్గుచూపుతున్నాము” అని ప్రకటన పేర్కొంది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తప్పు ఎంచడానికేమీ లేదు. సరబ్ జిత్ నిర్దోషి అని పాకిస్ధాన్ ప్రభుత్వము, కోర్టులు, ప్రజలు నమ్మకపోయినా ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్న అంశాలే ఆ నమ్మకానికి కారణం. కనుక సరబ్ జిత్ ని విడుదల చేసి భారత్ కి పంపిస్తే ఇక్కడ అత్యున్నత వైద్య చికిత్స నుండి సరబ్ జిత్ సింగ్ నిస్సందేహంగా లబ్ది పొందగలడు.

మరి సింగపూర్ ఎందుకు తరలించారు?

కానీ ఇదే అత్యున్నత స్ధాయి వైద్య చికిత్స జ్యోతి సింగ్ పాండే కు ఎందుకు అందుబాటులో లేకుండా పోయింది? జ్యోతి సింగ్ పాండే ఉరఫ్ నిర్భయను సింగపూర్ తరలించాలని నిర్ణయం జరిగినప్పుడే ఇక్కడి వైద్య ప్రముఖులు దానికి తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. భారత్ లో లేనిది, సింగపూర్ లో అంత గొప్పగా ఉన్నదీ వైద్యం ఏమీ లేదని, అక్కడ ఉన్నవే ఇక్కడా ఉన్నాయనీ పైగా ఆమెను విమానంలో తరలించడం వలన మరింత శ్రమకు గురై ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఎక్కువని డాక్టర్లు హెచ్చరించారు కూడా. వారు హెచ్చరించిందే జరిగింది. ఎయిర్ అంబులెన్స్ ప్రయాణంలో ఆమె ఆరోగ్యం తీవ్ర ఒడిదుడుకులకు లోనయిందని, అంత ఎత్తులో గాలి పీడనం తక్కువగా ఉండడం వలన అది ఆమె ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపిందని ఫలితంగా సింగపూర్ ఆసుపత్రిలో చేర్చేనాటికే అంత్యదశలో ఉన్నదని సింగపూర్ డాక్టర్లు ప్రకటించారు.

కొందరు డాక్టర్లు చెప్పినట్లుగా జ్యోతి సింగ్ పాండే సింగపూర్ తరలింపు వైద్య నిర్ణయం కాదు; అది రాజకీయ నిర్ణయం. ఢిల్లీ ఆసుపత్రిలో చనిపోతే దరిమిలా చెలరేగే ఆందోళనల ఉధృతిని తట్టుకునే పరిస్ధితిలో భారత ప్రభుత్వం లేదు. అప్పటికే ఆందోళనకారులపై విరుచుకుపడిన ఫలితంగా జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక విమర్శలను భారత ప్రభుత్వం ఎదుర్కొంటోంది. మళ్ళీ నిర్భయ మరణ వార్త వింటే దేశం అంతటా తలెత్తే నిరసనల హోరుకు ప్రభుత్వం కుదుళ్లు కదిలిపోగల ప్రమాదాన్ని ప్రభుత్వ పెద్దలు పసిగట్టారు. నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయలేరు; ఎందుకంటే వాళ్ళు మావోయిస్టులు కాదు దోషరహితంగా ఎన్ కౌంటర్ చెయ్యడానికి. అలాగని ఉద్యమం చేసే డిమాండ్లను నెరవేర్చలేరు; ఎందుకంటే ఆ డిమాండ్లు సరిగ్గా భారత రాజ్యాధినేతల మూలాలనే ప్రశ్నించే స్ధాయిలో తలెత్తే అవకాశాలు తీవ్రంగా ఉన్నాయి.

ఒక బ్యూరోక్రాట్ అధికారి వ్యాఖ్యానించినట్లుగా భారత ప్రజల్లో మహిళా అత్యాచారాల విషయంలో గూడుకట్టుకుని ఉన్న తీవ్ర ఆవేదన, అసహనం, వ్యతిరేకతలు జ్యోతి సింగ్ ఘటనతో తెగింపు రూపాన్ని సంతరించుకున్నాయి. జ్యోతిసింగ్ ఘటన ప్రజల ఆగ్రహ ప్రకటనకు ఉత్ప్రేరకంగా పని చేసింది. తమ జీవితాలు భద్రం అనుకున్న మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి భద్ర జీవుల నమ్మకాన్ని జ్యోతిసింగ్ అత్యాచారం పటాపంచలు చేసింది మరి. ప్రజల్లోని అసంతృప్తి, అలజడి అనే నిప్పురవ్వగా మారాలే గాని అది చివరికి దోపిడీ వ్యవస్ధలను దావానలంలా అంటించక మానదు. సరిగ్గా ఈ కారణం వలన ఉత్పన్నమైన భయమే హ్యోతి సింగ్ ను సింగపూర్ తరలించడానికి ప్రభుత్వ పెద్దలను పురిగొల్పింది.

స్వార్ధపూరిత దేశభక్తి

ఇపుడు సరబ్ జిత్ సింగ్ కు క్షమాభిక్ష పెడితే అత్యున్నత వైద్య చికిత్స అందింస్తామని ప్రకటించడం కూడా రాజకీయ నిర్ణయమే. బి.జె.పి తదితర మతసంస్ధలు సాగించిన ప్రచారం పుణ్యమాని సరబ్ జిత్ సింగ్ చుట్టూ ఒక భావోద్వేగ వలయం అల్లుకుని ఉంది. ఆ భావోద్వేగాలు తాత్కాలిక దేశభక్తి భావనలతో నిండి రగిలిపోతున్నాయి. ఈ దేశభక్తి కడు వివక్షాపూరితమైనది. ఒకే నేరానికి తనవాడయితే వదిలి పెట్టాలంటుంది, పరాయివాడయితే నిర్దాక్షిణ్యంగా ఉరితీయాలంటుంది. ఈ దేశభక్తికి శాశ్వతత్వం ఉండదు. పత్రికలో చదివినపుడో, టి.వి ఛానెల్ లో విన్నపుడో ఉద్రేకంతో రగిలిపోయే ఈ దేశభక్తి తిరిగి రొటీన్ లో పడగానే మాయమై పోతుంది. అప్పుడప్పుడూ క్రికెట్ మ్యాచ్ లు జరిగినప్పుడు తటాలున ఉబికి వస్తుంది కూడా.

ఈ దేశభక్తి ‘దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులోయి’ అని గుర్తించదు. ఈ దేశభక్తికి మనుషుల కంటే మనుషుల బతుకుల కంటే వారి మతాలు, కులాలు మాత్రమే ముఖ్యం. ఈ దేశభక్తికి మట్టి కూడా ముఖ్యమే. అందుకే ‘నా దేహం ముక్కలైనా, నా దేశాన్ని ముక్కలు కానివ్వను’ అని ఆర్భాటంగా ప్రకటిస్తుంది. నిజంగా దేహం ముక్కలయ్యే పరిస్ధితి వస్తే అక్కడ ఒక్క క్షణం కూడా వారుండరు అన్నది వేరే సంగతి.

కాశ్మీరు అయినా కన్యాకుమారి అయినా ఆయా భూభాగాలతో అక్కడి ప్రజల నిత్య జీవనానికి ఉన్న అనుబంధమే ప్రధానం అనీ, ఆ భూమి ఏ రూపంలో అయినా (జిల్లా, రాష్ట్రం, స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక దేశం…. ఇలా ఏ రూపం అయినా) అక్కడి ప్రజలకి దక్కడమే సహజ న్యాయం అని ఈ కుహనా దేశభక్తి కనీసంగానైనా గుర్తించదు. ఎంత కుహనా దేశభక్తి అయినా దానిని వ్యతిరేకించడమే ఒక నేరం. దేశ ద్రోహం కూడా. దేశ గనుల్ని, నదుల్ని విదేశీ కంపెనీలకు అప్పజెప్పినా దేశ ద్రోహం కాదు గానీ ‘నా కాలి కింద భూమి నాది’ అనడమే దేశ ద్రోహం, ఈ కుహనా దేశభక్తిపరులకు.

ఈ కృత్రిమ దేశభక్తి ఇపుడు సరబ్ జిత్ సింగ్ ప్రాణాలను ఆవహించి ఉంది. ఈ దేశభక్తిని రెచ్చగొట్టగలిగితే, తట్టి లేపగలిగితే దండుకున్నోడికి దండుకున్నన్ని ఓట్లు. అదిగో ఆ ఓటు బ్యాంకు పైన కాంగ్రెస్ పాలకులు కన్నేశారు. బి.జె.పి పెరట్లో ఉన్న ఆ ఓట్లను దొంగిలించాలని కాంగ్రెస్ ఆలోచన చేసిన ఫలితమే సరబ్ జిత్ సింగ్ ప్రాణాలపై ఆ పార్టీకి పొంగిపొరలుతున్న ప్రేమానురాగాలు.

రాజకీయ నాయకుల ఓట్ల ప్రయోజనాలు, తద్వారా ఒనగూరే స్వార్ధపర ఆర్ధిక ప్రయోజనాలే నిర్భయను సింగపూర్ తరలించేందుకు పురికొల్పితే, సరబ్ జిత్ సింగ్ ను భారత్ రప్పించేందుకు ఉసిగొల్పుతోంది. తస్మాత్ మోసపోవద్దు!

9 thoughts on “జ్యోతి సింగ్ సింగపూర్ కి, సరబ్ జిత్ సింగ్ ఇండియాకి!?

 1. ఏ విషయంలోనైనా అన్ని కోణాల్ని…..అసలైన మూలాల్ని చూపించే మీ వ్యాసాల్లాగే ఇది కూడా చాలా బాగుంది.
  నిర్భయను సింగపూర్ కు, సరబ్ జిత్ సింగ్ ను ఇండియాకు….అనే హెడ్డింగ్ లోనే అనేక అంశాలు దాగి ఉన్నాయి. సరబ్ జిత్ సింగ్ సమస్యను నిష్పక్షపాతంగా పరిష్కరించకుండా దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం మన రాజకీయ పార్టీల అసలు రంగును మరోసారి బయటపెడుతోంది.
  సరబ్ సమస్యకు ఇకనైనా ఇరుదేశాలు ఒక అంతిమ పరిష్కారాన్ని చూపేందుకు చొరవచూపాలి.
  ఆ దిశగా మన అధికారులు ఒత్తిడి తీసుకురావాలి.

  @ అన్నట్లు విశేఖర్ గారు…ఇవాళ ఈనాడు ఎడిట్ పేజిలో అణు శక్తి కర్మాగారాలపై మంచి వ్యాసం వచ్చింది. చూశారా. వీలైతే మన బ్లాగర్ల కోసం చర్చకు పెట్టగలరు.

 2. కుహనా దేశభక్తి గురించి మీరు చెప్పింది అక్షర సత్యం. కానీ నేనున్న భూమి నాది అనే భావన కూడా సరైంది కాదు. ఫలానా ప్రాంతంలో ఉంటే అది మనదెలా అయిపోతుంది. దాంతో అనుబంధం ఏర్పడవచ్చు కానీ అది ఎవరిదీ కాదు. భౌగోళికంగా రాజకీయంగా వివిధ సరిహద్దులతో(ఖచ్చితత్వం లేదు) వివిధ దేశాలు ఏర్పడ్డాయి. అయితే అవన్నీ ఫలానా అని అడ్రస్ చెప్పుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరానివి. మనుషులు మధ్య మనసుల మధ్య ప్రాంతీయ భావాలను,ప్రాంతీయ తత్వాలను విద్వేషాలను రెచ్చగొడుతున్నది….నేను నివసిస్తున్న భూమి నాది అనే భూమి పుత్రుల కుహనా సిద్ధాంతం. ఇదే మనుషుల మధ్య అడ్డుగోడలు కడుతుంది. విశ్వనరుడ్ని అని ఓ మహాకవి చెప్పినట్లు ప్రతీ మనిషి తాను ఈ భూమిపై మిగతా ప్రాణుల్లాగే (బుద్ధితో కూడిన) ఒకడిని అని భావిస్తే ఈ వాదాలకు విలువే ఉండదు. సంకుచిత వాదాలకు ఆ రోజు తెరపడుతుంది. కానీ విశాల ద్రుష్టిలేని స్వార్థపరమైన రాజకీయ నేతలు, శక్తులే విద్వేషకర ప్రాంతీయ వాదనలను తీసుకొస్తున్నారు.వారి ప్రభావాలకు (భావోద్వేగ ప్రసంగాలు) లోనయ్యే నిరక్షరాస్య,విచక్షణ, ఇంగిత జ్నానం లేని జనం ప్రాంతీయ విద్వేషాల్లో సమిధలవుతున్నారు. శేఖర్ గారు మీరు వాడుతున్న వాక్యాల్లో స్త్రీ వాచకం ఉపయోగించే టప్పుడు వాక్యం చివరలో అంటుంది చెప్పింది లాంటి పదాలను పురుషవాచకానికి అంటున్నాడు చెబుతున్నాడు అని డు కారం వాడుతున్నారు.ఇది ఫార్మల్ ఎక్స్ ప్రెషన్ కాదు. గమనించగలరు.(గమనిక: ఒక ప్రాంత ప్రజలు అన్యాయానికి గురైతే తప్పకుండా పోరాడాలి. అయితే అది మరో ప్రాంతంపై విషం చిమ్మడంగా మారకూడదు. తమ సమస్యను తాము లేవనెత్తాలి. అసలు ఆ సమస్య తలెత్తడానికి కారకులైన నేతల్ని నిలదీయాలి. ఆ ప్రాంతం వెనుకబాటుకు కారకులైన ప్రజాప్రతినిధులు ఆడే విక్రుత చేష్టల్ని ఎండగట్టాలి.అంతే తప్ప నా గుండె నొప్పికి) నా పొరుగు వాడే కారణం…లాంటి సంకుచిత ద్రుక్పథానికి లోనయ్య వాస్తవాలను మరిచిపోకూడదు.

 3. చందుతులసి గారు, ఈనాడు వ్యాసం చదివాను. నాసిరకం పరికరాల వలన ఎలాంటి ప్రమాదం వస్తుందో వివరిస్తారు అనుకున్నాను. కాని ఆ వివరాలు లేవు. ఇచ్చుంటే బాగుండేది. కూడంకుళం కర్మాగారంలో నాసిరకం విడిభాగాలు వాడారని, వాటివల్ల ప్రమాదం జరగొచ్చని జనం దృష్టికి తెచ్చారు. ఇలాంటి అంశాల మీద రాజకీయ పార్టీలు తగినంతగా దృష్టి సారించకపోవడం ఒక కొరతగా ఉంటోంది. కనీసం లెఫ్ట్ పార్టీలైనా జాతీయ స్ధాయిలో లేవనెత్తాల్సి ఉన్నా, అలా చేస్తున్నట్లు లేదు.

  మీరు కోరినట్లు వ్యాసాన్ని బ్లాగ్ లో పెడతాను.

 4. ప్రేమ విఘ్నేశ్వరరావు గారు

  “నా కాలి కింద భూమి నాది” అని నేను రాసిన వాక్యం విడి (ఐసొలేటెడ్) వాక్యం కాదు. కనీసం పూర్తి వాక్యం కూడా కాదు. మీరు దాన్ని సందర్భం నుండి బైటికి తీసి చూడడం వలన మీరు చెప్పిన అర్ధం వస్తుంది. కాని నా అర్ధం అది కాదు.

  ధనిక వర్గాలు తమ పెట్టుబడులనుండి లాభాలు పిండుకోవడం కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్లాలని చూస్తారు. ఖనిజ వనరులు, నీరు, అడవి, చౌక శ్రమ ఇలా అన్ని వనరులను లాభదాహం కోసం కబళించాలని చూస్తారు. ఆ క్రమంలో వారు సరిహద్దులు ఉండకూడదని కోరుకుంటారు. వివిధ ప్రాంతాల్లొని, వివిధ జాతుల ప్రజల ఆదాయ వనరులను కూడా కబళిస్తారు. (ఈ క్రమంలో పుట్టినదే గ్లోబలైజెషన్) ఈ పరిస్ధితుల్లో బైటినుండి వచ్చిన ధనికవర్గాల దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారు. ఒక్క శ్రామిక ప్రజలే కాకుండా స్ధానికంగా ఉండే ధనికులు కూడా తిరగబడతారు. ‘మా భూభాగంలోని వనరులు మాకే దక్కాలి’ అని డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ సహజమైనది. న్యాయమైనది. నేను రాసిన వాక్యాన్ని ఈ అర్ధంలో మీరు చూడాలి. భూమిపుత్రుల సిద్ధాంతానికి దీనికి సంబంధం లేదు. ఆ సిద్ధాంతకర్తల ప్రయోజనాలు కేవలం ఓట్లు మాత్రమే.

 5. భార్గవ్ గారు, కాశ్మీరు ప్రజలు ఏది కోరుకుంటే అది అమలు చేయాలని నా అభిప్రాయం. ఆ మేరకు ఫ్లెబిసైట్ నిర్వహిస్తానని భారత ప్రభుత్వం కాశ్మీరు ప్రజలకు హామీ ఇచ్చింది. దానిని అమలు చేయాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల అధికారం అన్నది నిజమే అయితే అది కాశ్మీరు ప్రజలకు దక్కాలి.

  కాశ్మీరు భారత్ లో భాగంగా ఉండాలని భారత ప్రభుత్వం కోరుకునే పనైతే ముందు కాశ్మీరీల మనసులు గెలుచుకునేందుకు చర్యలు చేపట్టాలి. ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టాన్ని రద్దు చేసి సైన్యాన్ని వెనక్కి పిలిపించాలి. స్ధానిక వనరుల నుండి, టూరిజం నుండి ఆదాయం స్ధానిక ప్రజలకే దక్కేలా చర్యలు చేపట్టాలి. అలా చేస్తే భారత్ పైన కాశ్మీరు ప్రజలకు ఉన్న అనుమానాలు, వ్యతిరేకత తొలగిపోతాయి.

  కాని ఈ చర్యలు ప్రభుత్వాలు చేపట్టవని గత ఏడు దశకాల అనుభవం చెబుతోంది.

 6. please don’t write the orginal name of victim (nerbaya)?

  and one more thing

  desha bhakti anedi samsyani batti untundi kani mathanni batti kullani batii undadu anukuntunnanu (andaru ala undaru kada)

  as per the health conditions of sarbjit singh he has to be shifted to india or any other country for good treatment

  and every one knows that the shifting of nerbhaya to Singapore is and political stunt

  thousands of war prisinors are released with humanity.. by indian government during kargil war so as an humanitarian ground sarbjith singh should be shifted but

  he is no more now ……
  i think he was dead 3-4 days before only the whole thing (giving visas to his family members to visit pakistan) is a drama

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s