బోడిగుండుకు మోకాలుకు ముడి పెట్టడం అంటే ఇదే


సరబ్ జిత్ సింగ్ ను చూడడానికి వెళ్తూ వాఘా సరిహద్దు వద్ద కుటుంబ సభ్యులు

సరబ్ జిత్ సింగ్ ను చూడడానికి వెళ్తూ వాఘా సరిహద్దు వద్ద కుటుంబ సభ్యులు

రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. తిమ్మిని బమ్మిని చేయగలరు, బోడిగుండుకు మోకాలుకు పీట ముడి వేయగలరు. బి.జె.పి అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ ఈ విద్యలో అనూహ్య స్ధాయిలో ఆరితేరినట్లు కనిపిస్తోంది. ఆయన చెప్పిందాని ప్రకారం: భారత భూభాగం లోకి చైనా జరిపిన చొరబాటు నుండి దృష్టి మరల్చడానికే పాకిస్ధాన్ జైలులో భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ పైన హంతక దాడి జరిగింది. ఈ మేరకు పాకిస్ధాన్ ప్రభుత్వం పూనుకుని మోసపూరితంగా సరబ్ జిత్ సింగ్ పైన దాడి చేయించింది. దానితో ప్రపంచం దృష్టి చైనా చొరబాటు నుండి దృష్టి మరల్చింది.

“ఇండియాలో జరిగిన చొరబాటుకు సంబంధించి, ఇండియాలోనూ, ప్రపంచంలోనూ చైనాకు వ్యతిరేకంగా గట్టి సెంటిమెంటు నిర్మితం అవుతోంది. సరబ్ జిత్ పైన జరిగిన దాడి, ఈ చైనా చొరబాటు నుండి దృష్టి మళ్లించడానికి పాకిస్ధాన్ తలపెట్టిన మోసపూరితమైన ఎత్తుగడే” అని బి.జె.పి ప్రతినిధి పేర్కొన్నారు. భారత దేశ దుర్బలమైన, పక్షవాతం వచ్చిన విదేశాంగ విధానం ఫలితమే ఈ దాడి అని కూడా రవి శంకర్ అన్నారు.

“సరబ్ జిత్ ని నిర్దాక్షిణ్యంగా చావబాదారు. అఫ్జల్ గురు, మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ లను ఉరితీసిన తర్వాత సరబ్ జిత్ భద్రత గురించి ఆందోళనలు తలెత్తాయి. భారత ప్రభుత్వం ఆ విషయమై ఏ చర్యలు తీసుకుంది? భారతీయ మత్స్యకారులను చంపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటాలియన్ మెరైన్లు క్రిస్టమస్ సెలవుల కోసం, ఓటు వేయడం కోసం ఇంటికి పంపించవచ్చు” అని రవి శంకర్ వ్యాఖ్యానించారు.

రవిశంకర ప్రసాద్

రవిశంకర ప్రసాద్

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చైనా చొరబాటును ‘స్ధానిక సమస్య’ గా అభివర్ణించడం పట్ల రవి శంకర్ అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరిపి ఉండాల్సిందని కానీ ప్రభుత్వానికి ఆ చొరవ లేదని రవి శంకర్ అన్నారు.

చైనా చొరబాటు విషయంలో అఖిలపక్ష సమావేశం పెట్టి ప్రతిపక్షాల సహాయ సహకారాలు తీసుకోవాలనడం సబబే కావచ్చు. సరిహద్దు సమస్య మొత్తం దేశానికి సంబంధించిన సమస్య కనుక ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకుంటే మొత్తం రాజకీయ వ్యవస్ధను విశ్వాసంలోకి తీసుకున్నట్లు ఉండేది. అయితే రవిశంకర్ ప్రసాద్ జవాబు చెప్పవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.

అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడినా పదేళ్ళు ఆయన్ని ఉరితీయకుండా ఆపారని బి.జె.పి, కాంగ్రెస్ పార్టీని నిందించింది. ముస్లింలను దువ్వడానికే కాంగ్రెస్ అఫ్జల్ గురు ఉరితీత విషయంలో మీనమేషాలు లెక్కించ్చిందని బి.జె.పి ఆరోపణల అంతరార్ధం. మరి సరబ్ జిత్ సింగ్ ఉరితీతను పాకిస్ధాన్ ప్రభుత్వం ఎందుకు ఆపినట్లు? పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ, ముషార్రాఫ్ నేతృత్వంలోని మిలట్రీ ప్రభుత్వం రెండూ పాకిస్ధాన్ లోని హిందూ మైనారిటీలను దువ్వడానికి సరబ్ జిత్ సింగ్ ఉరితీతను వాయిదా వేశారా? హిందువుల ఓట్ల కోసమే పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ సరబ్ జీత్ సింగ్ ఉరితీతను నిరవధికంగా వాయిదా వేస్తూ 2008లో నిర్ణయం తీసుకున్నదా?

అజ్మల్ కసబ్ కి ఉరిశిక్ష పడినా అది అమలు చేయకుండా కోట్లు ఖర్చు పెట్టి అతనిని మేపుతున్నారని బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్ధలు ఆరోపణలు చేశాయి. వారి ప్రచారంలో పడి సాధారణ పౌరులు కూడా ఆయనని మేపారని భావించిన పరిస్ధితి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తదితర నేర చట్టాలు నిర్దేశించిన సూత్రాల ప్రకారమే కోర్టులు పని చేస్తాయి. ఆ చట్టాలు రూపొందించింది, అప్పుడప్పుడూ అవసరమైతే సవరణలు చేసేదీ రాజకీయ నాయకులే. ఆ చట్టాలు కల్పించిన అవకాశాల మేరకు అజ్మల్ కసబ్ వివిధ అప్పీళ్ళకు వెళ్ళి ఉరితీతను వాయిదా వేయించగలిగాడు. చట్టాలు కల్పించిన అన్నీ అవకాశాలు ముగిసిన తర్వాతనే అజ్మల్ కసబ్ ఉరి తీయబడ్డాడు. ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలియనివి కావు. అయినా అజ్మల్ కసబ్ ను కూర్చోబెట్టి మేపారని ఆరోపించడం ప్రజలను మోసగించడం కాదా?

అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు లకు ఒక నీతి సరబ్ జిత్ సింగ్ కు మరొక నీతి ఉంటుందా అన్నది బి.జె.పి నాయకుడు చెబితే బాగుండేది. అజ్మల్ కసబ్ అంటే ఆయన చర్యలకు మరో సాక్ష్యం అవసరం లేదు. అత్యంత క్రూరంగా అమాయకులను పొట్టబెట్టుకున్న హాత్యాకాండలో అతను భాగస్వామి. కానీ అఫ్జల్ గురుకు వ్యతిరేకంగా ఖచ్చితమైన సాక్ష్యాలు లేవని సుప్రీం కోర్టే అంగీకరించింది. ఆ విధంగా ‘అత్యంత అరుదైన కేసుల్లో అరుదైన’ కేసు సూత్రం అఫ్జల్ గురుకు వర్తించదని కోర్టే అంగీకరించిందని వివిధ విశ్లేషకులు, న్యాయ నిపుణులు వివిధ పత్రికల్లో వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు. అలాంటి అఫ్జల్ గురుకు సరబ్ జిత్ సింగ్ కి వర్తించే న్యాయం వర్తించదా?

ఇదంతా ఒక ఎత్తైతే సరబ్ జిత్ సింగ్ పై దాడికీ, చైనా చొరబాటుకు ముడిపెట్టడం మరో ఎత్తు. ఒక ప్లాటూన్ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చారని, చొచ్చుకు రావడమే గాక ఎన్నడూ లేని విధంగా అక్కడ ఒక టెంటు నిర్మించారని వార్తలు చెబుతున్నాయి. త్వరలో భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చైనా వెళ్లనుండగా, చైనా ప్రధాని తన మొట్టమొదటి విదేశీ పర్యటనగా భారత్ రానున్నాడు. ఈ నేపధ్యంలో తాను కోరుకున్న రంగంలో భారత్ నుండి తగిన రాయితీ పొందే వ్యూహంలో భాగంగానే చైనా పాలకులు ఈ చొరబాటుకి దిగారని ఎన్.డి.టి.వి లాంటి సంస్ధలు విశ్లేషించాయి. చైనా అత్యున్నత స్ధాయిలోనే ఈ నిర్ణయం జరిగిందనీ, ఆషామాషీగా జరిగిన వ్యవహారం కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

అంటే ఇది పూర్తిగా చైనా-ఇండియా ద్వైపాక్షిక వ్యవహారాలకు సంబంధించినదే. అదీ కాక ఈ వ్యవహారంలో ప్రపంచంలో మరే దేశమూ ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అటు చైనాను విమరిస్తూ గానీ, ఇటు భారత్ ను సమర్ధిస్తూ గానీ ఎవరూ ప్రకటన చేసిన దాఖలా లేదు. అలాంటప్పుడు చైనా చొరబాటుకి సంబంధించి ప్రపంచవ్యాపితంగా చైనా వ్యతిరేకత ప్రబలిందని బి.జె.పి నాయకులు ఎలా చెబుతున్నారు? అలా చెప్పడానికి ఆయనకి ఉన్న ఆధారాలు ఏమిటి? ప్రజల పట్ల భాద్యతాయుతంగా వ్యవహరించవలసిన రాజకీయ నాయకులు ఇలా ఆధారరహితంగా ఎలా మాట్లాడగలరు?

చైనాను వ్యతిరేకించాలి కాబట్టి, ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆధారాలను ట్విస్ట్ చేయడం వలన ఎవరికి ప్రయోజనం? ఒక ద్వైపాక్షిక సమస్యలోకి మూడో దేశాన్ని లాగడం వలన అందులోకి చొప్పించిన సరబ్ జిత్ సింగ్ సమస్యకు లాభం జరుగుతుందా? స్నేహపూర్వక సంబంధాల ద్వారా నచ్చజెప్పి ఒప్పించి సరబ్ జిత్ సింగ్ ను విడిపించుకోవలసి ఉండగా మరో సమస్యను తెచ్చి ఇరికించి మరింత సంక్లిష్టం చేయడం వలన అది చివరికి సరబ్ జిత్ సింగ్ కి నష్టమే తప్ప లాభం ఏ మాత్రం ఉండబోదు. వస్తే గిస్తే బి.జె.పి కి నాలుగు ఓట్లు రాలతాయేమో!

3 thoughts on “బోడిగుండుకు మోకాలుకు ముడి పెట్టడం అంటే ఇదే

  1. బోడి గుండుకి మోకాలికి ముడి ఎవరో పెట్టక్కర్లేదు అవి ఎప్పుడూ ముడి పెట్టబడే ఉంటాయి మనిషిలొ ఐనా ఈ ప్రపంచం లొ ఐనా…………

  2. మన దేశానికి చెందిన ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి మన దేశ విదేశీ వ్యవహారం సరిహద్ధు భధ్రత గురించి మాట్లాదితే ఆది బోడిగుండుకీ మోకాలుకి ముడి పెడతం ఐతే మరి మన దేశానికి రాజ్యాంగానికి ఏ సంబంధం లేని ఒక దేశం వాల్లు మన దేశాన్ని యాభై రాష్త్రాలుగా విడగొట్టాలని ఎవరో వాల్ల ఫిలాసఫర్ చెప్పాడని పుస్తకాల లో రాసి పంచి పెట్టీ పండుగ చెస్తుంటే వాల్లని ఏమి అనాలి బొడిగుండుకి బొటన వేలు కి ముడి పెట్టే వాల్లు అనాల ఇంకెమన్నా అనాలా????????

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s