తమిళనాట కులాల కాలకూట విషం విరజిమ్ముతున్న పి.ఎం.కె


కుల దురభిమానమే పెట్టుబడిగా స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి సిద్ధపడిన డాక్టర్ ఎస్.రాందాస్ తమిళనాడులో కులాల కాలకూట విషాన్ని విరజిమ్ముతున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా, అది రాకపోతే సృష్టించుకుని మరీ అమాయక పేద ప్రజల మధ్య చిచ్చు రగుల్చుతున్నాడు. ‘చిత్ర పౌర్ణమి’ యూత్ ఫెస్టివల్ పేరుతో ఏప్రిల్ 25 తేదీన రాందాస్ నేతృత్వంలోని ‘పట్టలి మక్కల్ కచ్చి’ (పి.ఎం.కె) పార్టీ నిర్వహించిన వన్నియార్ ‘కుల పండగ’ దళితుల రక్తాన్ని మరోసారి చిందించింది. గంధపు చెక్కల స్మగ్లర్ గా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను గడగడలాడించి పోలీసులు, గిరిజనులను ఊచకోత కోసిన వీరప్పన్ ఫోటోలను ప్రదర్శిస్తూ సాగిన ‘చిత్ర పౌర్ణమి యూత్ ఫెస్టివల్’ మరక్కాణం ప్రాంతంలో దళితుల పాలిట ‘విధ్వంస విలయంగా మారిపోయింది.

ఫలితంగా దళితుల ఇళ్ళు తగలబడిపోగా ‘ఈస్ట్ కోస్ట్ రోడ్’ పైన 30 కి.మీ పొడవునా వాహనాలు విధ్వంసానికి గురయ్యాయి. విధ్వంసానికి కారణం పి.ఎం.కె పార్టీ నాయకులు, వారి కార్యకర్తలేనని డి.ఎం.కె, డి.డి.ఎం.కె, వి.సి.కె, లెఫ్ట్ పార్టీల నుండి ముఖ్యమంత్రి జయలలిత వరకు విరుచుకుపడుతుండగా, ప్రభుత్వాలు ఇస్తున్న నష్టపరిహారం రుచిమరిగిన దళితులే తమ ఇళ్ళు తాము తగలబెట్టుకుని నాటకం ఆడుతున్నారని పి.ఎం.కె నాయకుడు రాందాస్ ఎదురుదాడికి తెగబడ్డాడు.

పి.ఎం.కె, రాందాస్ ల విచ్చలవిడి విలయతాండవం పైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రాష్ట్ర శాసన సభలో నిప్పులు చెరిగింది. అమాయక ప్రజలను రెచ్చగొడుతున్న స్వార్ధశక్తులను పి.డి (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం కింద జైలులో పెడతామని హెచ్చరించింది. ప్రతిపక్షాలు ఇచ్చిన ‘స్పెషల్ కాలింగ్ అటెన్షన్ మోషన్’ కు బదులిచ్చిన ముఖ్యమంత్రి చిత్రపౌర్ణమి యూత్ ఫెస్టివల్ నిర్వాహకులే దళితులపై సాగిన హింసకు కారకులని తేల్చి చెప్పింది.

తగలబెట్టిన ఆరు దళితుల ఇళ్లను పునర్నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. వన్నియార్ సంఘం నేతలు పోలీసులకు ఇచ్చిన హామీలను అడ్డంగా ఉల్లంఘించి చట్టాలను పరిహసించారని ఆమె ఆరోపించింది.రాత్రి 10 గంటలకల్లా సభ ముగిస్తామని వన్నియార్ సంఘం పోలీసులకు హామీ ఇచ్చిందని కానీ హామీకి విరుద్ధంగా పి.ఎం.కె నేత ఉద్దేశ్యపూర్వకంగా 11:30 గంటలకి సభలో ప్రసంగించాడని జయలలిత వివరించింది.

“తాను 11:30 గంటలకు ఉపన్యాసం ప్రారంభించానని చెబుతూ ఆయన తనపై పోలీసులు కేసు పెట్టుకోవచ్చని సవాలు విసిరారు. ఆయన విజ్ఞప్తి ఆమోదించబడింది. దానికి అనుగుణంగా ఆయనపై కేసు నమోదు చేశాము. తగిన శిక్ష అనుభవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను” అని జయలలిత సభలో ప్రకటించారు.గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఫోటోను పెట్టుకుని రాందాస్ యువతకు ఎలా మార్గదర్శకత్వం వహిస్తారని ఆమె ఆశ్చర్యం ప్రకటించారు. సభకు హాజరైనవారంతా తాగి ఉన్నారని ఆమె శాసనసభకు తెలిపారు.

“వీరప్పన్ ని అనుసరించాలని ఆయన యువతను కోరుతున్నారా? … ఒక వైపేమో ఆయన పూర్తిగా మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. మరోవైపేమో సభలో ఉన్న మెజారిటీ యువకులు బాగా తాగి ఉన్నారు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మామళ్లాపురం లోని ప్రాచీన జ్ఞాపక చిహ్నాలను కూడా అల్లరి మూకలు వదిలిపెట్టలేదని జయలలిత తెలిపారు.

ఈ సభకు తాము వాస్తవానికి అనుమతి ఇవ్వలేదని కానీ నిర్వాహకులు హై కోర్టుకి వెళ్ళి అనుమతి తెచ్చుకున్నారని ఆమె గుర్తు చేశారు. పోలీసులు విధించిన షరతులను అమలు చేస్తామని వారు కోర్టుకు అండర్ టేకింగ్ ఇచ్చారని తెలిపారు. “వారి నేపధ్యం, గత అనుభవాలు పరిగణించకుండానే హై కోర్టు వారికి అనుమతి ఇచ్చింది” అని ఆమె హై కోర్టును తప్పుపట్టారు.

చిత్ర పౌర్ణమి కాదు మద్య పౌర్ణమి

హింస చెలరేగి దళితులపై దాడి వరకు వెళ్లడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ది హిందు ప్రకారం మరక్కాణం ఏరియాలోని కట్టాయంతెరు గ్రామం సమీపంలో సామాజిక అటవీ ప్రాంతంలో తాగుబోతుల అల్లరికి గ్రామ దళితులు అడ్డు చెప్పడంతో విధ్వంసానికి మూకలు తెగించారు. వన్నియార్ సంఘం నిర్వహించిన చిత్ర పౌర్ణమి యూత్ ఫెస్టివల్ కి హాజరు కావడానికి వచ్చిన యువకులు గ్రామ సమీపంలో ఈస్ట్ కోస్ట్ రోడ్ (ఇ.సి.ఆర్) పక్కన సామాజిక అడవిలో కూర్చొని మద్యం తాగుతున్నారు. గ్రామ దళితులు వారి చర్యకు అభ్యంతరం ప్రకటించారు.

వెనువెంటనే అక్కడ వన్నియార్ యువకులు పెద్ద ఎత్తున గుమికూడారు. మరక్కాణం కాలనీలో కట్టాయంతెరు ఏరియాలోకి బలవంతంగా ప్రవేశించి విధ్వంసం ప్రారంభించారు. అడవి గుండా వచ్చిన మూకలు కొడవళ్ళు, పెట్రోలు బాంబులతో ఇళ్లపై బడి విధ్వంసం సాగించారని పత్రిక తెలిపింది. పెద్ద ఎత్తున జనం రావడం చూసిన దళిత కాలనీలోని మగవారు భయంతో అక్కడి నుండి పారిపోయారు. దానితో అల్లరి మూకలకి అడ్డులేకపోయింది.

దరిమిలా జరిగిన విధ్వంసంలో గుడిసెలు తగలబెట్టారు. ఆలయాలను కూడా వదలకుండా నిప్పు పెట్టారు. పశువుల కొట్టం, అందులో ఉన్న పశువుల మేతను కూడా అగ్నికి ఆహుతి చేశారు. కొడవళ్ళు, రాళ్ళు చేతబట్టి ఇళ్ళల్లో దూరి కనిపించిన వస్తువునల్లా నాశనం చేశారు. పుస్తకాలు, కాగితాలు, సర్టిఫికెట్లు బూడిద చేశారు. రేషన్ కార్డులు, మార్కుల పత్రాలు, పుట్టిన రోజు సర్టిఫికెట్లు, చావు సర్టిఫికెట్లు… ఇలా అన్నీ దహనం చేశారు. ఇంట్లో దాచి పెట్టుకున్న కరెన్సీ నోట్లు కూడా దగ్ధం అయినాయి.

వచ్చే నెలలో తన కూతురు పెళ్ళికోసం తెచ్చుకున్న 10 సవర్ల బంగారం గృహ దహనంలో పోయిందని అంగళం అనే మహిళ విలపించింది. ములియమ్మ భర్త ఇటీవలే చనిపోగా ఇన్సూరెన్స్ సంస్ధ వారు ఇచ్చిన డబ్బును ఆమె కోల్పోయింది. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్ళు తగలబెట్టడమే కాకుండా విద్యుత్ వైర్లు కూడా కట్ చేశారని బాధితులు చెప్పారు.

60, 70 మంది వరకు కాలనీలో జొరబడి కులం పేరుతో దూషిస్తూ అక్కడ ఉన్న మహిళలను లైంగికంగా వేధించారని వారు తెలిపారు. తాము సాగించిన విధ్వంసాన్ని ఫోటోలు కూడా తీసుకున్నారని, ఆ ఫోటోలను తమ నాయకులకు చూపించాలని వారు చెప్పారని బాధితులు తెలిపారు.

మరక్కాణం కాలనీలో వన్నియార్లు విధ్వంసానికి తెగబడడం ఇదే మొదటిసారి కాదు. 2002 లో కూడా, అది కూడా చిత్ర పౌర్ణమి రోజునే ఈ కాలనీ పైన దాడి చేసి విధ్వంసం సాగించారని కాలనీవాసులు తెలిపారు. ఈసారి సమీపంలో ఇ.ఆర్.సి పక్కన ఉన్న కూనిమేడు గ్రామంలో కూడా విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ముస్లింలు, దళితులు, కొందరు వన్నియార్లు కూడా కలిసి ఐక్యంగా వన్నియార్ సంఘం దాడిని తిప్పికొట్టారని గ్రామస్ధులు తెలిపారు.

ఈ సందర్భంగా ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే ఘర్షణల్లో గాయపడిన అనేకమంది శరీరాల నుండి డాక్టర్లు బుల్లెట్లు బైటికి తీయడం విశేషం. గాలిలోకి కాల్పులు జరపడం అంటే జనం ఇక కొత్త అర్ధం వెతుక్కోవాలేమో.

ఉలిపిరి కట్టె

సి.పి.ఎం లాంటి లెఫ్ట్ పార్టీలతో పాటు డి.ఎం.కె, డి.డి.ఎం.కె, వి.సి.కె లాంటి పార్టీలన్నీ పి.ఎం.కె వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. పార్టీ నేతల కుల విద్వేష ప్రసంగాలు అమాయక ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నాయని వారు తీవ్ర స్ధాయిలో ఖండనలు జారీ చేశారు. స్వయంగా కాలనీలు సందర్శించి నిజానిజాలు విచారించి పి.ఎం.కె, వన్నియార్ సంఘాలే హింసకు కారణమని తేల్చారు.

S.Ramadoss

S.Ramdoss

అయితే పి.ఎం.కె పార్టీ వాదన ‘ఉలిపిరి కట్టె’ తరహాలో విచిత్ర వాదనలు ముందుకు తెస్తోంది. యూత్ ఫెస్టివల్ కు హారుకావడానికి లారీలలో వస్తున్న సందర్భంగా ప్రమాదం జరిగి చనిపోయిన వన్నియార్ ల మరణానికి దళితులు కారణంగా చెప్పడానికి పి.ఎం.కె అధినేత రాందాస్ తెగించాడు. నిస్పాక్షిక విచారణకు సి.బి సి.ఐ.డి విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. తానే విచారణకు డిమాండ్ చేస్తే తన దోషం హరించిపోతుందని ఆయన నమ్ముతున్నట్లు కనిపిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నో దళిత కాలనీలు ఉండగా కట్టాయంతెరు దళిత కాలనీలోనే ఎందుకు దాడి జరిగిందో తెలుసుకోవాలని రాందాస్ మరో విచిత్ర వాదన. దాడి ఎందుకు జరిగిందో ఆ దాడి చేసినవాళ్లు చెప్పాలా, చేయించుకున్నవాళ్లు చెప్పాలా? దళితులపైకి కుల విద్వేషం రెచ్చగొట్టి తద్వారా వన్నియార్ ప్రజల్లో కుల దురభిమానాన్ని పెంచి పోషించి ఎన్నికల్లో లబ్ది పొందడం రాందాస్ అనేక సంవత్సరాలుగా పాటిస్తున్న ఎత్తుగడ.

ఉచ్ఛనీచాలు మరిచిపోయాక, నాలుగు ఓట్లు సంపాదించిపెట్టే నాయకుల కోసం రాజకీయ పార్టీలు మంగళహారతులు పడుతున్న రోజుల్లో రాందాస్ లాంటి నాయకుల కుల విద్వేషపు ఎత్తుగడలు ఫలించే అవకాశాలే ఎక్కువ.

దళితులపై దాడులు చేయడానికి అలవాటు పడిన రాందాస్, అతని అనుచరులు ఎస్.సి/ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తారు. అంటే వారి ఎత్తుగడలకు అనుగుణంగా కుల విద్వేషంతో దాడులు చేసే హక్కు, అవకాశం వారికి ఉండాలని పరోక్షంగా డిమాండ్ చేయడమే.

యూత్ ఫెస్టివల్ చేసిన ఒక తీర్మానం ఏమిటంటే ఇతర కులాలన్నీ దళితులను సోదరులుగా పరిగణిస్తున్నప్పటికీ దళితులే మాయోపాయాలు ఫన్నీ ఇతర కులాల స్త్రీలను ప్రేమ పేరుతో వలలో వేసుకుంటున్నారట. అందుకని కులాంతర వివాహాలు నిషేధించాలని వన్నియార్ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ స్ధాయి పచ్చి విద్వేషాన్ని సహించగల సమాజం తమిళనాడులో ఉన్నదంటే అది అక్కడ ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి సిగ్గు చేటు.

8 thoughts on “తమిళనాట కులాల కాలకూట విషం విరజిమ్ముతున్న పి.ఎం.కె

 1. దలితుల అభ్యున్నతికై ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషనులు, అట్రాసిటీ చట్టం లాంటివాటినే బూచిగా చూపుతూ , వారిని ఇతర వర్గాలనుండి వేరు చేసే ప్రయత్నం చాలా దారుణం. కులాల మధ్య కుంపట్లు రగిలించి దానితో చలికాచుకోవాలనే పియంకె కుటిల ప్రయత్నాల్ని ఆదిలోనే అణచివేయకుంటే, అది అనేక విపరీత పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది.

 2. తమిళ నాడు రాజకీయాలు దేశానికి ఒక తలనొప్పి. కారణాలు వెతుకుతూ పోతే దాని మూలాలు జస్టిస్ పార్టి , ద్రవిడ ఖళగం ఆవిర్భావం లో కనిపిస్తాయి. పెరియార్ పైత్య (బ్రామ్హణులు ఆర్యులు, మిగతావారు ద్రవిదులు )సిద్దాంతం వంటబట్టించుకొన్న వాళ్ళు వాళ్ల అందరిని బి.సి. లు గా ప్రకటించుకొని, బ్రాహ్మణులని తన్ని తగలేసి,ఇతర రాష్ట్రాలకు తరిమి. ఇప్పుడు దళితుల పైన పడి పీక్కుతింట్టునట్లు ఉన్నారు. అది కూడా సమాచారవ్యవస్త బలంగా ఉండే ఈ రోజుల్లో.
  పెరియార్ మూఠాకి దేశభక్తి ఉందో లేదో అని అనుమానం వేస్తుంది. వాళ్లు రాష్ట్రం లో అధికారం లో ఉంటే భారత లో కలసి ఉండాలనుకొంట్టున్నారు. లేకపోతే వాళ్లది ప్రత్యేక ద్రవిడ సంస్కృతి, దేశం నుంచి వేరు పడతామని ఈలం పాటా మొదలు పెడతారు. మొన్న మీ బ్లాగులో రాసిన టపా గుర్తుండేఉంట్టుంది. అమేరికా సహాయం చేస్తే భారత దేశం నుంచి విడిపోవటానికి ఒక డి యం కె మంత్రి అడిగాడని రాశరు మీకు గుర్తు ఉండిఉంట్టుంది. జయలలిత ప్రభుత్వం వీరి ఆటలు కట్టిస్తుందని అనుకొంట్టున్నాను. చెన్నయ్ లో ఉన్నపుడు నా మిత్రులు శాంతి భద్రతల విషయం లో మాత్రం జయలలిత ను పొగుడుతూండే వాళ్లు. ఆమే అధికారం లో కి వస్తే రౌడి ఇజం తగ్గుతుందని చెప్పుకొనే వారు. ఆమే అధికారం లో ఉంటే కరుణానిధి, ఇతర పార్టి లు పెంచి పోషించే చందాలు వసూలు చేసే రౌడిలు భయపడతారని అనేవారు. ఎవరైనా అతిగా తోక జాడిస్తే, అరపరాని వారైతే పోలిసులు యంకౌటర్ చేస్తారు అని చెప్పుకొనేవాళ్ళు. ఆమే ఆగ్రహం వెల్లి బుచ్చిన విధానం చూస్తుంటే దళితులకు న్యాయం జరుగుతుందని నమ్మకం వేస్తోంది.

 3. జయలిత ఎప్పుడూ లేని విధంగా ఈలం సమస్యను ఈసారి తన ఖాతలో వేసుకొని, ప్రతిపక్షాలను దెబ్బకొట్టింది. ఇప్పుడు వారికి బహుసా దిక్కుతోచక అస్తిత్వం కొరకు కొందరు, ఆమేకు సమస్యలు సృష్ట్టించి ఎలా అయినా ఇరుకున పెట్టాలని భావించేవారు ప్రత్యక్ష ,పరోక్షం గా ఇటువంటి సంఘటనలను ప్రోత్సహిస్తూండవచ్చు. ఇటువంటి విభజన రాజకీయాలను, జలలిత ప్రభుత్వం ఉక్కు పాదం తో అణచివేసి దళితులకు న్యాయం చేస్తుందని ఆశిస్ద్దాం.

 4. మనతో పుట్టి, పెరిగి, ఒకే ఊరిలో/జిల్లాలో మన పక్కన్నే ఉంట్టూ నివసించే ప్రజల పై కనీసం కొంచెం ప్రేమ గౌరవం లేని వారు, వారిని అవమానించటమే కాకుండా అనవసరం గా దాడులు చేయటం ఘోరమైన విషయం. అదే ఎప్పుడూ చూడని, ముక్కు మొహం తెలియని శ్రీలంక తమిళు ల పై కట్టలు తెంచుకొన్న ప్రేమ ఎలా వస్తుందో? అందరు తమిళ ప్రజలు వీధుల్లో కి వచ్చి మరీ వాటిని ఎలా ప్రదర్శిస్తారో? టి వి లో ఈ మధ్య చూశాం.

  శేఖర్ గారు,
  ఎవరైనా ఈ విషయం పైన శ్రీలంక తమిళ సమస్య అప్పుడు చేసిన విధంగా ఆందోళన చేశారా? చేయకపోతె తమిళుల ద్వంద్వ వైఖరి అర్థమైపోతుంది. స్వంత వారిని అణచివేత గురిచేసేవారు, వేరే దేశాన్ని ఎలా నిలదీయగలరు? తమిళుల ఈ ద్వందవ వైఖరిని దేశ వ్యాప్తంగా దళితులు తీవ్రం గా నిరసించాలి.

 5. మను ధర్మ శాస్త్రం నేర్పిన వర్నాస్రమ ధర్మాన్ని తు చ తప్పకుండ రామదాసు పాటిసుతూన్నాడు. అందుకని ఆయన బ్రహ్మనత్వాన్ని నెత్తినపెట్టుకోలేదు ఈ విషయం అన్ బుమని రామదాస్ యు పి ఎ మొదటి ప్రభు త్వములొ డా. వేణుగొపల్ గారి మీధ చెర్యలనుభట్టి చూస్తాం. ఇధి తమిలనాడుకు మాత్రమె పరిమితం కాధు ఉత్తరప్రదేష్ లాంటి రాస్ట్రల్లొ బ్రహ్మనెథరులు ధలిథులమీధ దాడులకు పాల్పడడం చూస్తాం.

 6. డాక్టర్ పి. వేణుగోపాల్ దేశంలో మొదటి గుండే మార్పిడి ఆపరేషన్ విజయవంతం గా రిక్షావాడికి చేశాడు. అటువంటి వాడిని ఎంత సతాయించాలో అంత సతాయించారు. ఆయన నేరం రాందాస్ కుటుంబం సభ్యులను AIIMSపాలక మండలి లో తీసుకోకపోవటమే కారణం. వాళ్ళు తమిళనాడులో ఉండే శత కోటి ప్రైవేట్ కాలేజిలలో డాక్టర్ కోర్స్ చదివి, AIIMS బోర్డ్ లో రాజకీయ మద్దతు లో దూరాలని ప్రయత్నించారు. బహుశా ఆ పదవిని అడ్డుపెట్టుకొని, ప్రైవేట్ వైద్య కళాశాల కు అనుమతినిస్తూ డబ్బులు దండుకొందామనో లేక వాళ్లకే ప్రైవేట్ కాలేజిలు అనుమతినిచ్చుకొందామనో ఉద్దేశం అయి ఉంట్టుంది. అసలికి ఈ వీళ్లు దేశంలో ఎవరిని, దేశం కొరకు పనిచేసేవారిని బతకనియారా? ఎమైనా అంటే బి సి ల మవటం వలన అంట్టున్నారని ఆరోపణలు చేస్తారు. లాలు ప్రసాద్,ములాయం సింగ్ వీరి తరపున పార్లమెంట్ లో మద్దతుగా వాదిస్తారు.

 7. @SRI…
  పెరియార్ మూఠాకి దేశభక్తి ఉందో లేదో అని అనుమానం వేస్తుంది….

  అనుమానం అవసరం లేదు…అన్ని దారులూ…అధికారం కోసమే!!
  అధికారం లో మజా ఏమిటో…ఆంధ్రాలో రుచి చూసిన వాళ్ళు చెప్తారు!!

 8. @వీళ్లు దేశంలో ఎవరిని, దేశం కొరకు పనిచేసేవారిని బతకనియారా
  ……

  బ్రతకనీరు…డబ్బు గురించి ఇంత పిచ్చెక్కి పోయిన సమాజం ఎక్కడా చూడం…చూడండీ జైల్లో ఉన్న వాళ్ళని పలకరించి వస్తున్నారు…సినిమాల్లో అవినీతి పై పోరాటం చేసే హీరోలు…
  ప్రపంచానికి అవినీతి నేర్పింది భారతదేశం అని ఎక్కడో చదివిన గుర్తు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s