కతార్ రాజ్యాధినేత నడుపుతున్న ఆల్-జజీరా ఛానెల్ ఇరాక్ లో ప్రసారాలు చేయకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధ, ధన, మానవ వనరుల సహాయం అందజేస్తున్న కతార్ చానెల్ ఇరాక్ లో కూడా సెక్టేరియన్ విభజనలను రెచ్చగొడుతోందని ఇరాక్ ప్రభుత్వం ఆరోపించింది. ఆల్-జజీరాతో పాటు మరో 9 టి.వి చానెళ్లకు కూడా ఇరాక్ ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. ఈ మేరకు ఇరాక్ అధికారులు ఆదివారం ప్రకటించారు. మెజారిటీ మతస్ధుల షియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మైనారిటీ సున్నీ మతస్ధుల నిరసనలను హింస వైపుకు మరల్చడంలో ఆల్-జజీరా పాత్ర ఉందని ఇరాక్ ఆరోపించింది.
సున్నీ నిరసన శిబిరం వద్ద గత వారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. భద్రతా బలగాలు, సున్నీ ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 180 మందికి పైగా మరణించారు. 300కి పైగా గాయపడ్డారు. షియా మతస్ధుల ఆధిపత్యంలోని ప్రభుత్వం సున్నీలపై అణచివేత అమలు చేస్తోందని ఆరోపిస్తూ సున్నీలు నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన గత మంగళవారం వరకు శాంతియుతంగానే కొనసాగింది. మంగళవారం ఒక్క సారిగా హింస చెలరేగింది. రష్యా టుడే పత్రిక ప్రకారం సున్నీ నిరసనకారులు సులేమాన్ పెక్ లోని ఒక ఆర్మీ బేస్ ను స్వాధీనం చేసుకుని ఒక షియా మసీదు తగలబెట్టారు. దీనివెనుక నిషేదిత చానెళ్ల చురుకైన పోత్ర ఉన్నదని ఇరాక్ ప్రభుత్వ సంస్ధ ‘కమ్యూనికేషన్స్ అండ్ మీడియా కమిషన్’ ప్రకటించినట్లు ది హిందు తెలిపింది.
విచ్ఛిన్న శక్తి
‘అరబ్ స్ప్రింగ్’ పేరుతో ట్యునీషియా, ఈజిప్టు, లిబియా తదితర దేశాలలో పశ్చిమ రాజ్యాలు ప్రేరేపించిన తిరుగుబాట్లకు ఆల్-జజీరా ఛానెల్ విస్తృతంగా మద్దతు ఇచ్చి కవర్ చేసింది. ముస్లిం ఆల్-ఖైదా టెర్రరిస్టు సంస్ధలకు, ముస్లిం బ్రదర్ హుడ్ సంస్ధకు కతార్ పాలకులు గట్టి మద్దతుదారులు. సిరియాలో అమెరికా, ఐరోపాల అండతో సాగుతున్న టెర్రరిస్టు విధ్వంసాన్ని ప్రజాస్వామ్య తిరుగుబాటు పేరుతో ఛానెల్ మద్దతు ఇస్తున్నది. సెక్యులరిస్టు సిరియా ప్రభుత్వానికి మతతత్వ కతార్ పాలకులు బద్ధ వ్యతిరేకులు కావడంతో అక్కడి కిరాయి తిరుగుబాటును చురుకుగా ప్రోత్సహిస్తోంది కతార్ ప్రభుత్వం. ఈ నేపధ్యంలో ఇరాక్ లోని సున్నీల విధ్వంసానికి కూడా కతార్ మద్దతు ఇచ్చి రెచ్చగొడుతోందని ఇరాక్ షియా ప్రభుత్వం ఆరోపిస్తూ చానెల్ ప్రసారాలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిషేధం వెనువెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.
మధ్య ప్రాచ్యంలో ఇరాక్ ప్రభుత్వంతో పాటు ఇంకా అనేక ప్రభుత్వాలు గతంలో ఆల్-జజీరా ప్రసారాలను తాత్కాలికంగా రద్దు చేసిన చరిత్ర ఉంది. ఛానెల్ ప్రసారాలు స్ధానిక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాగడం, అనేకసార్లు అభూత కల్పనలతో ప్రసారాలు సాగించడం దానికి కారణమని తెలుస్తోంది. నిషేధానికి గురయిన ఇతర ఛానెళ్లలో ఆల్-షర్కియా, ఆల్-షర్కియా న్యూస్ లు ఉన్నాయి. ఇవి తరచుగా ఇరాక్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాయి. ఒక్కోసారి ఇరాక్ ప్రభుత్వం పైన తిరగబడాలని కూడా ప్రోత్సహిస్తాయి. సలాహుద్దీన్, ఫల్లుజా, తఘ్యీర్, బాగ్దాద్, బాబిలియా, అన్వర్ 2, ఆల్-ఘర్బియా తదితర స్ధానిక ఛానెళ్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని ది హిందు తెలిపింది. సెక్టేరియన్ భావాలను ప్రోత్సహిస్తూ విచ్ఛిన్నకర శక్తులుగా ఈ చానెళ్లు వ్యవహరిస్తున్నాయని
ఇరాక్, ఇరాన్ స్నేహం
“కొన్ని శాటిలైట్ ఛానెళ్ల లైసెన్సులు సస్పెండ్ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇవి హింస, విచ్ఛిన్నవాదం (సెక్టేరియనిజం) లను ప్రేరేపించే భాషను వినియోగిస్తున్నాయి” అని మీడియా కమిషన్ ప్రతినిధి ముజాహిద్ అబు ఆల్-హాయిల్ అన్నాడని రష్యా టుడే (ఆర్.టి) తెలిపింది. “దానర్ధం ఇక నుండి ఇరాక్ లో వారి పని ఆగిపోతుంది. వారి కార్యకలాపాలు జరగవు. ఇరాక్ లో జరిగే ఘటనలను అవి కవర్ చేయగూడదు. ఇరాక్ లో అటు ఇటు తిరగడానికి వీలు లేదు” అని ఆయన అన్నాడని ఎ.ఎఫ్.పి ని ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది. నిషేధం సంగతి తమకు ముందుగా చెప్పలేదని ఆల్-జజీరా తమ వెబ్ సైట్ లో తెలిపింది.
సద్దాం హుస్సేన్ పాలనలో సున్నీలు ప్రభుత్వాన్ని నియంత్రించగా, ఇప్పుడు ఇరాక్ ప్రభుత్వం షియాల ఆధీనంలో ఉంది. గత ఎన్నికల్లో షియాల ప్రతినిధి నూరి మాలికి ప్రధాన మంత్రిగా పదవిని చేపట్టాడు. మాలికి పదవిలోకి రాకుండా ఉండడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఇరాన్ లో కూడా షియాల ప్రభుత్వమే ఉండడంతో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బాగా పెరిగాయి. సిరియా ప్రభుత్వానికి ఇరాన్ ఆయుధాలు సరఫరా అయేందుకు ఇరాక్ సహకరిస్తోందని అమెరికా, ఐరోపా, కతార్, సౌదీ అరేబియాలకు కడుపు మంట. ఈ దుష్ట చతుష్టయమే సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు లేదా ఆల్-ఖైదా టెర్రరిస్టులకు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తోంది.