బంగ్లాదేశ్ లో అత్యంత శక్తివంతమైన బట్టల తయారీదారులు తమ లాభ దాహంతో 324 మందికి మరణ శాసనం లిఖించారు. గంటల తరబడి నీరు, ఆహారం అందక వేడి వాతావరణంలో డీ హైడ్రేషన్ వల్ల చనిపోయినవారు కొందరైతే, భవనాల గోడల మధ్య, కాంక్రీటు నేలల మధ్య చిక్కుకుని చితికిపోయినవారు మరికొందరు. శిధిలాల చుట్టూ వేలాది జనం తమవారి కోసం విలపిస్తూ అధికారులు గోడలపైన అంటిస్తున్న జాబితాల్లో తమవారి పేర్లు వెతుక్కుంటూ విషాదం అంతా కళ్ళల్లో నింపుకుని కనిపిస్తున్నారు.
ఢాకా శివార్లలోని ఎనిమిది అంతస్ధుల భవనం కూలిపోవడంతో అందులోని బట్టల ఫ్యాక్టరీలలో పని చేస్తున్న కార్మికులు అనేకమంది జాడ ఇంకా తెలియలేదు. భవనంలో నిర్వహించబడుతున్న బట్టల ఫ్యాక్టరీలలో 3,122 మంది వరకు కార్మికులు పని చేస్తున్నారని, అందులో రెండు వేలమంది వరకు సురక్షితంగా తప్పించుకోగలిగారని పత్రికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 324 సవాలు వెలికి తీశారు. శిధిలాల మధ్య అనేకమంది విగత శరీరాలు కనిపిస్తున్నాయని కాంక్రీటుకి డ్రిల్లింగ్ చేస్తున్న సిబ్బంది చెబుతున్నారు. శనివారం ఉదయం ఒక డ్రిల్లింగ్ రంధ్రం ద్వారా శిధిలాల మధ్య 40 మంది వరకు ప్రాణాలతో ఉన్నట్లు కనుగొన్నారు. నీరు, పళ్లరసం రంధ్రాల ద్వారా అందజేసి వారిని కాపాడడానికి గంటల తరబడి సాగే డ్రిల్లింగ్ పనిలో నిమగ్నమై ఉన్నారు వాలంటీర్లు, ఫైర్ సిబ్బంది.
ఢాకా చుట్టూ ఉండే బట్టల ఫ్యాక్టరీలలో ప్రపంచంలోనే అత్యంత హీనమైన వేతనాలు చెల్లిస్తారు. కనీసం కడుపు నింపుకోడానికి సైతం సరిపోనీ ఆ వేతనాల కోసం కూడా ఆబగా పని చేసే కార్మికులు లక్షలాది మంది అక్కడ ఉన్నారు. దానితో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బట్టల కంపెనీలకు ఢాకా శివార్లలోని సవార్ పారిశ్రామక ప్రాంతం ఆకర్షణీయంగా మారింది. ఉత్తర అమెరికా, ఐరోపాలలోని అనేక బట్టల అమ్మకందార్లకు సవార్ లో తయారీదారులు ఉన్నారు. చైనా, ఇటలీ తర్వాత అత్యధిక బట్టల ఎగుమతి పరిశ్రమలు ఉన్నది బంగ్లాదేశ్ లోనే.
ప్రఖ్యాత బ్రిటిష్ బ్రాండు ప్రైమార్క్ కూలిపోయిన రాణా ప్లాజాలో ఫ్యాక్టరీ కలిగి ఉంది. వాల్ మార్ట్ అమ్మే బట్టలు కూడా రాణా ప్లాజాలో బినామీ పేరుతో ఉన్న ఒక ఫ్యాక్టరీలో తయారవుతాయని తెలుస్తోంది. కంపెనీ మాత్రం రాణా ప్లాజాలో తనకు ఫ్యాక్టరీ లేదని అనధికారికంగా ఉన్నదేమో విచారిస్తామని చెబుతోంది. సవార్ పారిశ్రామ వాడలోని బట్టల పరిశ్రమలలో కార్మికుడికి చెల్లించే నెలసరి వేతనం కేవలం 38 డాలర్లు. అంటే రోజుకి కేవలం ఒక డాలరుకు కొద్దిగా ఎక్కువ. వాల్ మార్ట్, ప్రైమార్క్ ఆర్జించే బిలియన్ల డాలర్ల లాభాలు ఎక్కడి నుండి వస్తాయో ఈ రాణా ప్లాజా ఒక ఉదాహరణ మాత్రమే.
భవనం గోడలకు ప్రమాదకరంగా పగుళ్లు ఏర్పడడంతో భవనంలోని వివిధ ఫ్యాక్టరీల కార్మికులు గత వారమే భయంతో పని చేయడానికి నిరాకరించి బైటికి వచ్చారు. ఫ్యాక్టరీ యజమానులు భవనానికి ఎలాంటి ప్రమాదం లేదని వారికి నచ్చజెప్పి మళ్ళీ పనిలోకి దింపారని ది హిందు తెలిపింది. పోలీసులు కూడా యజమానులను హెచ్చరించారని, వెంటనే పనులు ఆపాలని భవన యజమానితో పాటు ఫ్యాక్టరీల యాజమానుల కూడా కోరారని తెలుస్తోంది. కానీ లాభాలను కళ్ల జూసిన ఆశపోతులు కార్మికుల ప్రాణాలను ఎప్పటిలాగే తృణప్రాయంగా ఎంచి పోలీసుల హెచ్చరికలను లక్ష్యపెట్టలేదు. ఫలితంగా ఎనిమిది అంతస్ధుల భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది.
ఐదు అంతస్ధులకు మాత్రమే అనుమతి తీసుకున్న యజమాని మరో మూడు అంతస్ధులు అక్రమంగా నిర్మించడంతో ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ణయించారు. రాత్రి తెల్లవార్లూ వచ్చే పోయే కార్మికుల తాకిడికి భవనం ప్రమాదపు అంచులకు చేరింది. పగుళ్ళ ద్వారా సంకేతాలు ఇచ్చినా పట్టించుకోకపోయిన ఫలితంగా వందలాది ప్రాణాలు గల్లంతయ్యాయి. ప్రాణ నష్టం మరింత పెరుగుతుందని అందరు భయపడుతున్నారు.
అప్ డేట్:
మరణాల సంఖ్య 340 కి పెరిగిందని బంగ్లాదేశ్ అధికారులు ప్రకటించారు. కార్మికులు ఎక్కువ సంఖ్యలో పనిలో నిమగ్నం అయి ఉండే ఉదయం సమయంలో ప్రమాదం జరగడంతో అధిక సంఖ్యలో కాంక్రీటు, మోటార్ల మధ్య చిక్కుకుని చనిపోయారని వారు తెలిపారు. ఇంకా అనేకమంది శిధిలాల మధ్య సజీవంగా ఉన్నారని వారిని త్వరగా రక్షించకపోతే డీ హైడ్రేషన్ కి గురై చనిపోతారని రక్షణ అధికారులు చెబుతున్నారు. నీటి బాటిళ్లు, చిన్న సైజు ఆక్సిజన్ సిలిండర్లు లోపలికి పంపి వారిని సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. దుర్గంధంతో నిండిని శవాలను వెలికి తీస్తుండడంతో ఆ ప్రాంతం అంతా దుర్వాసనతో నిండినట్లు ఎ.పి వార్తా సంస్ధ చెబుతోంది.
భవన యజమాని పరారీలో ఉండడంతో ఆయన భార్యని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఫ్యాక్టరీల అధికారులు ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఢాకాలో నిరసనలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. హింస చెలరేగుతుందన్న భయంతో ఇతర బట్టల ఫ్యాక్టరీలను కూడా పోలీసులు మూసివేయించారు.