ముంబై: బాలికకు మత్తు ఇచ్చారు, ఆపైన….


Image: Mid-day

Image: Mid-day

క్రెడిట్ అంతా ఢిల్లీకే పోతోందనుకుందో ఏమో గాని ఈసారి బాలికపై అత్యాచారానికి ముంబై ముందుకొచ్చింది. ముంబై దారుణం ఏమిటంటే చిన్న పిల్ల మీద నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడడం. ముంబైలోని వకోలా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ పైశాచికం చోటు చేసుకుంది. నిందితులంతా 20-25 సంవత్సరాల మధ్య వయసు వారు. పుట్టిన రోజు పార్టీకని నిందితుల్లో ఒకరి స్నేహితురాలి చేత బాలికను ఇంటికి పిలిపించుకుని మత్తు మందు ఇచ్చి నలుగురు యువకులు లైంగిక అత్యాచారానికి ఒడిగట్టారు.

బాలిక వయసు 13 సంవత్సరాలు. ఆమెను పార్టీకి పిలిచిన బాలిక వయసు 16 సంవత్సరాలు. వకోలా పోలీసు స్టేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మెల్విన్ డి సౌజా అనే యువకుడి ఇంట్లో లైంగిక అత్యాచారం చోటు చేసుకుంది. మెల్విన్ కూడా నిందితుల్లో ఒకరు.

ముంబై సబర్బన్ ఏరియాలోని శాంతాక్రాజ్ లో గావోందేవి ఏరియాలో గురువారం సాయంత్రం మెల్విన్ ఇంట్లో అతని పుట్టిన రోజు సందర్భంగా పార్టీ చేసుకోవాలనుకున్నారు నలుగురు యువకుల బృందం. తన స్నేహితురాలి ద్వారా బాధిత బాలికను మెల్విన్ పార్టీకి ఆహ్వానించాడు. బాలిక వెళ్ళేసరికి సచిన్ యాదవ్, బిపిన్ సింగ్, వెంకట్ నాయుడు అప్పటికే మెల్విన్ ఇంట్లో ఉన్నారు. వారందరు శాంతాక్రజ్ నివాసులే అని తెలుస్తోంది.

పార్టీలో వారంతా మద్యం సేవించారని పోలీసులు చెప్పినట్లు ది హిందు తెలిపింది. ‘వారంతా’ అంటే బాధిత బాలిక కూడా అందులో ఉన్నదేమో తెలియలేదు. ఆ తర్వాత బాలిక స్పృహ కోల్పోయింది. స్పృహ లేని స్ధితిలో యువకులు బాలిక పైన అత్యాచారం జరిపారు. మెలకువ వచ్చాక ఆమె మామూలుగా ఇంటికి వెళ్లిపోయింది. కానీ ఇంటికి వెళ్ళాక ఆమె రహస్య అవయవం వద్ద బాగా నెప్పి కలగడం మొదలయింది. ఆ విషయం తన తల్లికి తెలిపింది. వెంటనే ఆమెను వి.ఎన్.దేశాయ్ ఆసుపత్రిలో చేర్పించారు.

“ఆసుపత్రి అధికారులు మాకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల కింద సామూహిక అత్యాచార నేరాన్ని నమోదు చేశాము. పోక్సో చట్టం (Prevention of Children from Sexual Offences Act) కింద కూడా నిందితులందరి పైనా కేసు నమోదు చేశాం” అని వకోల పోలీసు స్టేషన్ ఇనస్పెక్టర్ జితేంద్ర పవార్ తెలిపాడు.

మిడ్ డే పత్రిక ప్రకారం యువకులు మాత్రమే మద్యం సేవించారు. బాలికలకు వేరే సాఫ్ట్ డ్రింక్ ఇచ్చారు. బాధితురాలికి మాత్రం మత్తుమందు కలిపిన సాఫ్ట్ డ్రింక్ ఇచ్చినట్లు అర్ధం చేసుకోవచ్చు.

బాలిక స్పృహ కోల్పోయేలా చేయడానికి ఆమె సేవించిన డ్రింకులో నిందితులు మత్తుమందు కలిపారా అన్నది పోలీసులు విచారణ చేస్తున్నారు. వైద్య నివేదిక అందిన తర్వాత ఏ విషయం నిర్ధారిస్తామని వారు తెలిపారు. యువకులతో పాటు బాలికను పార్టీకి పిలుచుకెళ్ళిన మరో బాలికను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆమెపై కూడా యువకుల పైన పెట్టినట్లుగానే వివిధ కేసులు పెట్టినట్లు సమాచారం.

కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘నేర చట్టాల సవరణ బిల్లు’ ప్రకారం లైంగిక అత్యాచార నేరం జెండర్ స్పెసిఫిక్. అది జెండర్ న్యూట్రల్ కాదు. అంటే లైంగిక అత్యాచారం అనేది కేవలం పురుషులు మాత్రమే చేయగలిగేది. స్త్రీలకు అది వర్తించదు. ‘లైంగిక దాడుల’ నేరాన్ని జెండర్ న్యూట్రల్ గా మార్చుతూ చట్టంలో మార్పులు చేయడానికి ప్రభుత్వం ముసాయిదాలో ప్రతిపాదించినప్పటికి దానిని మహిళా సంఘాలు, వివిధ సామాజిక కార్యకర్తలు, ఎన్.జి.ఓ లు అంగీకరించలేదు. దానితో ఆ సవరణను ఉపసంహరించుకున్నామని చెప్పారు. ముంబై కేసులో 16 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార కేసు ఎలా పెట్టారో అర్ధం కాని విషయం. అత్యాచార నేరం కాకుండా ఇంకేమైనా సెక్షన్ కింద కేసు పెట్టారా అనేది సమాచారం లేదు.

జీ న్యూస్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికల ప్రకారం అత్యాచారం జరుగుతుండగా ఆమె స్నేహితురాలు ప్రత్యక్షంగా చూస్తూ ఉండిపోయింది. దుర్ఘటన జరిగిన సమయంలో మెల్విన్ తల్లి ఇంట్లో లేదని తెలుస్తోంది. బాధితురాలికి చేత కూడా మద్యం తాగించారని ఆమె స్పృహ కోల్పోయాక ఒకరి తర్వాత మరొకరు తమ స్నేహితురాలి సమక్షంలో అత్యాచారం చేశారని ఇనస్పెక్టర్ జితేంద్ర చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలియజేసింది.

బాలిక పైన అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు ధృవీకరించారు. బాలిక తండ్రి వాచ్ మెన్ కాగా తల్లి ఒక ప్రవేటు సంస్ధలో పని చేస్తోంది. కూతురి విషయం తెలిసాక వారు షాక్ లో ఉన్నారు. బాలికను తీసుకెళ్లిన స్నేహితురాలిని బాల నేరస్ధుల చట్టం ప్రకారం విచారిస్తారని తెలుస్తోంది. సచిన్ యాదవ్ ఎం.టెక్ విద్యార్ధి అని, వెంకట్ నాయుడు ఒక సినిమా ధియేటర్ లో పని చేస్తాడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది.

16 సంవత్సరాల బాలిక ఈ ఘోరంలో భాగస్వామ్యం కలిగి ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. 7వ తరగతి చదువు తున్న బాలికకు ఒక స్నేహితురాలిగా హాని తలపెట్టడమే కాక సమాజం అంగీకరించని పద్ధతిలో యువకులతో స్నేహ సంబంధాలు కలిగి ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంత చిన్న వయసులోనే ఆమె దిగజారే పరిస్ధితులు కూడా సమాజంలో ఉన్నాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది. పిల్లల పెంపకంలో తల్లి దండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తోంది. పిల్లల సృజనాత్మక  స్వేచ్ఛకు భంగం కలగకుండానే వారు నడుస్తున్న దారిని కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన తల్లిదండ్రులకు గట్టిగా హెచ్చరించి మరీ గుర్తు చేస్తోంది.

2 thoughts on “ముంబై: బాలికకు మత్తు ఇచ్చారు, ఆపైన….

 1. చాలా విచారించదగ్గ విషయమే. అయితే ఇలాంటివి మన చుట్టూ నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మీడియా పుణ్యమా అని ఒకటి అరా వెలుగులోకి వస్తున్నాయి. చాలా కేసుల్లో బాధితుల్ని భయపెట్టో డబ్బు ఆశ చూపించో వెలుగులోకి రాకుండా చేస్తున్నారు. ఇలాంటి అత్యాచారాల్లో చిన్నారులు, నిరుపేదలు, సాంఘిక హోదాలేనివారు బలవుతున్నారు. నిర్భయ లాంటి చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదు. వాటిపై విస్త్రుత ప్రచారం కూడా అవసరం.

  అలాగే ఆశ్లీల సాహిత్యం, ద్రుశ్యాలు ప్రతీ మొబైల్లోనూ దర్శనమిస్తున్నాయి. విదేశాల్లో నీలి చిత్రాలు ప్రొఫెనల్స్ తో చేయిస్తారు. అవి నిజమేనన్న భ్రమలో మన యువత అడ్డదారి తొక్కుతోంది. యుక్తాయుక్త విచక్షణను మరిచి కామంతో కన్ను మిన్ను తోచక తప్పులు చేస్తున్నారు. స్టెప్ సన్, స్టెప్ డాడ్, స్టెప్ మదర్,పార్టనర్ స్వాప్ కు సంబంధించిన అత్యంత ఘోరమైన హాలీవుడ్ సినిమాలు మన బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నాయి.

  అంతేనా పాశ్చాత్య సినిమాలు చూసి అక్షరజ్నానం కానీ ఇంగితం కానీ లేని మన సో కాల్డ్ క్రియేటివ్ (కాపీ రాయుళ్లు) దర్శక నిర్మాతలు యథావిధిగా కాపీ పేస్ట్ చేసి మన ముందు ప్రదర్శనకు పెడుతున్నారు. డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇలాంటి (వీరి సంఖ్య ఈకాలంలో అత్యధికం) వారికి మన సమాజం ఏమైతేనేం…వారి కుటుంబాలు చల్లగా ఉన్నాయి కదా అనే బాధ్యతరాహిత్యంతో విచ్చలవిడి శ్రుంగార ద్రుశ్యాలను మన ముందు ప్రదర్శనకు పెడుతున్నారు.

  టీవీ ఛానళ్లు సీరియల్స్ నుంచి రియాలిటీ షోల వరకు అన్నింటా నగ్న ద్రుశ్యాలు ద్వంద్వార్థాలు… ఇక అవి చూసిన పరిణతి లేనివారు అదంతా మన సంస్క్రుతి సంప్రదాయాలకు, విలువలకు, సమాజానికి, చట్టాలకు, న్యాయాలకు విరుద్ధమని గ్రహించలేక కామాంధులుగా మారుతున్నారు. పర్యవసానం అమాయకులు బలవుతున్నారు.

  మీరు గమనించారో లేదో …ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కేసుల్లో ఎక్కడా ఒక్క ఎంపీ కొడుకో ఎమ్మెల్యే పుత్రరత్నమో, మంత్రి బంధువో,సినీ నటుల సంబంధికులో ,ఐఏఎస్ ఐపీఎస్ ల బంధువులో, లేక ఆయా వ్యక్తులో కనిపిస్తే ఒట్టు.వాళ్లంతా పలుకుబడి,పరపతి,డబ్బులున్నవాళ్లు కదా….ఇది నేటి భారతం.

 2. ప్రతి అత్యాచారం ఒక ఘోరం !
  నివారణకు కావలసింది,
  అవగాహన,
  అప్రమత్తత,
  కొత్త వ్యక్తులతో ,జాగ్రత్త !
  తెలిసిన వ్యక్తులతో అతి జాగ్రత్త !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s