అంతులేని సరబ్ జిత్ కధ, ఇపుడు అంతానికి దగ్గర్లో?


సరబ్‌జిత్ సింగ్ -ఫొటో: ఎన్.డి.టి.వి

సరబ్‌జిత్ సింగ్ -ఫొటో: ఎన్.డి.టి.వి

తాగి ఎటు వెళుతున్నాడో తెలియని స్ధితిలో సరిహద్దు దాటాడని అతని కుటుంబ సభ్యులు సంవత్సరాలుగా మొత్తుకుంటున్నారు. పాక్ భూభాగం లోని పంజాబ్ రాష్ట్రంలో 1990లో జరిగిన వరుస పేలుళ్లకు కుట్ఱ పన్నాడని పాకిస్ధాన్ ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్ధానం ఆరోపించి మరణ శిక్ష కూడా వేశేసాయి. ఆయన్ని విడిచి పెట్టాలని, కనీసం క్షమాభిక్ష అయినా పెట్టాలని కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి వేడుకుంటుండగానే సరబ్ జిత్ సింగ్ గురువారం ప్రాణాంతక దాడికి గురై తీవ్ర స్ధాయి కోమాలోకి వెళ్ళిపోయి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

హృదయవిదారకమైన సరబ్ జిత్ సింగ్ కధ వింటే ఎవరికైనా జాలి వేయకమానదు. జాలితో పాటు సాధారణ పౌరుల జీవితాలతో ఆటలాడుకునే రాజకీయ నాయకుల పైన తీవ్రమైన కోపం, అసహ్యం కూడా కలుగుతాయి. ఇపుడా భావోద్వేగాలకు అతీతమైన స్ధాయికి సరబ్ జిత్ సింగ్ చేరుకున్నాడు. ఆయన తన బ్యారక్ లో ఉండగా ఆరుగురు పాక్ ఖైదీలు లోపలికి జొరబడి ఇటుకలు, డబ్బా రేకులతో దాడి చేయడంతో ప్రాణాపాయంలో ఉన్నాడు. తలపైనా, ముఖం పైనా ఇటుకలతో మోదడంతో పాటు నేతి డబ్బా రేకుతో మెడ, గొంతు, కడుపు పైన కోసేయడంతో సరబ్ జిత్ సింగ్ వెంటనే కుప్పకూలిపోయాడు. విపరీతమైన రక్తస్రావం జరుగుతుండగా జైలు ఆసుపత్రిలో చేర్చారు. ప్రాణాపాయం ఉందని చెప్పడంతో జిన్నా ఆసుపత్రిలో చేర్చారని ది హిందు తెలిపింది.

వార్డన్ ను బంధించి…

ఎన్.డి.టి.వి ప్రకారం ఆరుగురు ఖైదీలు సరబ్ జిత్ సింగ్ పైన దాడి చేశారు. వారిలో మరణ శిక్ష విధించబడిన అమర్ ఆఫ్తాబ్ కూడా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం అమర్ ఆఫ్తాబ్, సరబ్ జిత్ సింగ్ తో గొడవపడ్డాడని కానీ జైలు అధికారులు దానిని గమనించలేదని పాకిస్ధాన్ అధికార వర్గాలు తెలిపాయి. కోట్ లఖ్పాత్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట సరబ్ జిత్ ని ఉంచామని జైలు అధికారులు చెప్పారు. అయినా దాడి ఎలా జరిగింది?

ఆసుపత్రిలో కమెండోల కాపలా

ఆసుపత్రిలో కమెండోల కాపలా

జైలు అధికారులు చెప్పిందాని ప్రకారం ఆరుగురు ఖైదీలు గార్డుల దృష్టిని మరల్చి సరబ్ జిత్ సింగ్ ఉన్న బ్యారక్ ముందుకు చేరుకున్నారు. వాళ్ళు జైలు వార్డెన్లు ఇద్దరినీ గట్టిగా బంధించి పట్టుకోగా ఆఫ్తాబ్ బ్యారక్ తాళం లాక్కున్నాడు. బ్యారక్ తెరిచి సరబ్ జిత్ సింగ్ తలపైన, మొఖం పైన ఇటుకలతో మోదాడు. టమాటో తెచ్చుకున్న బ్లేడులతో, నేతి డబ్బా నుండి తయారు చేసిన రేకుతో మెడ, గొంతు, కడుపు పైన లోతుగా కోశారు. అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయారు.

“సిబ్బంది చూసేటప్పటికి సరబ్ జిత్ సింగ్ స్పృహ కోల్పోయి ఉన్నాడు. విపరీతంగా రక్తస్రావం అవుతోంది. రక్తంతో నిండి ఉండడంతో సిబ్బంది ఆయన బట్టలను తొలగించి జైలు వార్డెన్ ధరించే చొక్కా, ఫ్యాంటు తొడిగి జిన్నా ఆసుపత్రికి తీసుకుపోయారు” అని జైలు అధికారి ఒకరు చెప్పారని పి.టి.ఐ తెలిపింది. అంతకు ముందు ఇద్దరు ఖైదీలు మాత్రమే సరబ్ జిత్ సింగ్ పైన దాడి చేశారని పాకిస్ధాన్ టి.వి చానెళ్లు అధికారులను ఉటంకిస్తూ చెప్పాయి. సరబ్ జిత్, అఫ్తాబ్, ముదస్సర్ లను వారి గదుల నుండి బైటికి తెచ్చినపుడు దాడి జరిగిందని కూడా మొదట చెప్పారు. అయితే ఈ వార్తలను ఇపుడు జైలు అధికారులు ఖండిస్తున్నారు.

ఒక మేయర్ సోదరుడి హత్య కేసులో ఆఫ్తాబ్ మరణ శిక్ష ఎదుర్కొంటున్నాడు. ప్రాణాంతక దాడి చేసినవారిలో ముదస్సర్ ని మరొకరుగా అనుమానిస్తున్నారు. ది హిందు ప్రకారం ముదస్సర్ కూడా మరణ శిక్ష ఎదుర్కొంటున్నాడు. వీరిరువురిని వేరే గదిలో బంధించామని, వారిని విచారణ చేస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. సంఘటన పైన పూర్తిస్ధాయి విచారణ చేయడానికి పంజాబ్ రాష్ట్ర డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ప్రిజన్స్ మాలిక్ ముబాషీర్ ను విచారణాధికారిగా పాక్ ప్రభుత్వం నియమించింది. సరబ్ జిత్ సింగ్ హత్యలో జైలు అధికారుల పాత్ర కూడా ఉన్నదీ లేనిదీ ఆయన విచారిస్తాడు. మతపరమైన శక్తుల ప్రోద్బలంతోనే దాడి జరిగిందా అనేది కూడా ఆయన విచారిస్తాడని తెలుస్తోంది.

భారత దేశంలో అఫ్జల్ గురు ని ఊరి తీసిన తర్వాత సరబ్ జిత్ సింగ్ కి భద్రత కట్టుదిట్టం చేసినట్లు పాక్ అధికారులు చెప్పారు. గత జనవరిలో మరొక భారత ఖైదీ ఛంబైల్ సింగ్ కోట్ లఖ్పట్ జైలు లోనే జైలు అధికారుల దాడిలో గాయపడి చనిపోయాడు. అనుమానాస్పద పరిస్ధితుల్లో చనిపోయినప్పటికీ మరణ కారణాన్ని నిర్ధారించడానికి రెండు నెలల తర్వాత మాత్రమే అటాప్సి నిర్వహించారు.

అంతులేని కధ

1990లో పాకిస్ధాన్ లోని పంజాబు రాష్ట్రంలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 14 మంది పౌరులు చనిపోయారు. ఈ దాడులకు సరబ్ జిత్ సింగ్ కూడా కారకూడని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. నేరం రుజువైందంటూ కోర్టు మరణ శిక్ష విధించింది. క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నప్పటికీ కోర్టులు తిరస్కరించాయి. అప్పటి పాక్ మిలట్రీ అధ్యక్షుడు పెర్వేజ్ ముషారఫ్ కూడా క్షమాభిక్ష పెట్టడానికి తిరస్కరించాడు. ఆయనకు మరణ శిక్ష అమలు చేయాల్సి ఉన్నప్పటికి అధికారంలో ఉన్న పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ దానిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు 2008లో ప్రకటించింది.

ఆయన విడుదలకు సరబ్ జిత్ సింగ్ అనేక యేళ్లుగా ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఇరు దేశాల ప్రభుత్వాలు మాట్లాడుకుని నిర్దోషి అయిన తమ వాడిని వదిలిపెట్టేలా చర్యలు తీసుకోవాలని అనేకసార్లు విన్నవించుకున్నారు. వేరేవ్యక్తి స్ధానంలో పొరపాటున సరబ్ జిత్ సింగ్ ను గుర్తించారని పేలుళ్లలో అతని పాత్ర లేదని కుటుంబ సభ్యులు ఇరు ప్రభుత్వాలకు విన్నపాలు చేశారు. కానీ సరబ్ జిత్ సింగ్ విడుదల ఒక అంతులేని కధలా సాగుతూ పోయింది.

సరబ్ జిత్ సింగ్ కు క్షమాభిక్ష మంజూరు చేయడానికి అధ్యక్షుడు జర్దారీ నిర్ణయించాడని గత సంవత్సరం ప్రకటన వెలువడింది. ఇక్కడి కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో సంబరం జరుపుకున్నారు. అంతలోనే క్షమా భిక్ష ఇచ్చింది సరబ్ జిత్ సింగ్ కు కాదని అదే పేరుతో స్ఫురించే మరొక వ్యక్తికని పాక్ ప్రభుత్వం సవరించుకుంది. దేశంలో మత శక్తుల నుండి ఆగ్రహం వ్యక్తం కావడంతో నిర్ణయం మార్చుకున్నారని అప్పట్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

క్షమా భిక్ష సంగతి ఎలా ఉన్నా సరబ్ జిత్ సింగ్ ఇప్పుడు దానికి అతీతమైన స్ధితిలో ఉన్నాడు. శుక్రవారం సర్జరీ జరగవలసి ఉండగా డాక్టర్లు చేయలేకపోయారు. తలపై తగిలిన గాయం వలన అంతర్గతంగా రక్తస్రావం అయిందని అతని పరిస్ధితి స్ధిరంగా ఉండేవరకు సర్జరీ కుదరదని తేల్చి చెప్పారు. కోమా స్ధితిని వర్ణించే 3 నుండి 15 వరకు ఉన్న స్కేలు పైన సరబ్ జిత్ పరిస్ధితి 5 గా డాక్టర్లు ప్రకటించారు. అంటే ప్రమాదం నుండి బైటపడే అవకాశాలు చాలా తక్కువ. అంతులేని సరబ్ జిత్ సింగ్ కధ ఈ విధమైన ముగింపు రాబోవడం విషాధం. ఇరు దేశాల పాలకుల శతృత్వం వలన సరిహద్దుల వద్ద నివసించే పౌరుల చిన్న చిన్న తప్పులు కూడా ఎలా ప్రాణాంతకంగా మారతాయో సరబ్ జిత్ సింగ్ ఉదంతం చెబుతోంది.

2 thoughts on “అంతులేని సరబ్ జిత్ కధ, ఇపుడు అంతానికి దగ్గర్లో?

  1. ఆరుగురు పిరికి పందలు, ఒక్కసారిగా మారణాయుధాలతో, ఒక్కడి మీద ముట్టడి చేయడం అమానుషం ! కేవలం మద్యం తాగిన మత్తులో ,( సరి )హద్దులు దాటిన శరబ్ జిత్ సింగ్ సంఘటన విషాదం !
    ఆయన కోలుకుంటాడని ఆశిద్దాం !

  2. రెండు దేశాల మధ్య వైరానికి సా ధారణ పౌరులే సమిధలవుతున్నారు. ప్రపంచమంతా ఇదే తంతు. మానవ హక్కుల సంఘాలు స్పందించాల్సిన తరుణం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.సరబ్ జిత్ ప్రాణాలతో బయటపడాలని ఆశిద్దాం. ఇదే అదునుగా పాక్ వైఖరిని ఎండగట్టాల్సిన సరైన సమయం కూడా ఇదేనని గ్రహించాలి. విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించాలి. లేదంటే అరాచక శక్తులు పెట్రేగిపోతుంటాయి.
    పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానం స్వయం వినాశనానికే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s