బొగ్గు కుంభకోణం విషయంలో సుప్రీం కోర్టు సాక్షిగా సి.బి.ఐ కాంగ్రెస్ ధరించిన మేకప్ ను కడిగేసింది. న్యాయ శాఖ మంత్రి కోరిక మేరకు ఆయనకు చూపించిన తర్వాతే బొగ్గు కుంభకోణం స్టేటస్ రిపోర్టును సుప్రీం కోర్టుకు సమర్పించామని కాంగ్రెస్ ముసుగు విప్పి చూపింది. న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ తో పాటు ప్రధాన మంత్రి కార్యాలయం, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు కూడా తమ నివేదికను చూశారాని సి.బి.ఐ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా, సుప్రీం కోర్టులో సమర్పించడానికి ముందు మంత్రి అశ్వని కుమార్ సి.బి.ఐ నివేదికలో మార్పులు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించగా దానిని కాంగ్రెస్ కొట్టిపారేసింది. సి.బి.ఐ అఫిడవిట్ అది నిజం కాదని వాస్తవం వెల్లడించడంతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నత విచారణ సంస్ధను ఎలా వాడుకుంటున్నదీ నిర్ద్వంద్వంగా రుజువయింది.
సుప్రీం కోర్టు కోరిన స్టేటస్ రిపోర్టులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సవరణలు చేసిందని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం, సి.బి.ఐని కోరింది. కోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ సమర్పించిన రెండు పేజీల అఫిడవిట్ లో సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అసలు విషయం చెప్పనే చెప్పాడు. అశ్వినీ కుమార్ కోరడంతో స్టేటస్ రిపోర్టును ఆయనతో పంచుకున్నామని, సదరు సమావేశంలో ప్రధాన మంత్రి కార్యాలయం, బొగ్గు మంత్రిత్వ శాఖల నుండి సంయుక్త కార్యదర్శి స్ధాయి అధికారులు కూడా పాల్గొన్నారని సి.బి.ఐ తన అఫిడవిట్ ద్వారా కోర్టుకు తెలియజేసింది.
“(స్టేటస్ రిపోర్టు) ముసాయిదాను సుప్రీం కోర్టులో ప్రవేశపెట్టే ముందు న్యాయ శాఖ మంత్రితో, ఆయన కోరిన మీదటే, పంచుకున్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము…. ప్రధాన మంత్రి కార్యాలయం, బొగ్గు మంత్రిత్వ శాఖలకు నుండి ఒక్కో సంయుక్త కార్యదర్శి స్ధాయి అధికారితో కూడా, వారు కోరిన మీదట, ఈ నివేదికను పంచుకున్నాము” అని సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా సమర్పించిన అఫిడవిట్ లో తెలియజేశారు. తాను చెప్పదలచుకున్నది అంతా అఫిడవిట్ లో పొందుపరిచానని రంజిత్ సిన్హా తెలిపాడు.
ఇక మీదట సమర్పించే స్ధాయి నివేదికలను ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజకీయ కార్యనిర్వాహకులతో (మంత్రులతో) పంచుకునేది లేదని ఆయన అఫిడవిట్ లో కోర్టుకు హామీ ఇచ్చాడు. తాజాగా ఈ రోజు సమర్పించిన స్ధాయి నివేదికను కూడా ఎవరికీ చూపించలేదని, నేరుగా కోర్టుకే సమర్పించానని ఆయన తెలిపాడు. “ఇప్పడు ఈ కోర్టులో సమర్పిస్తున్న ఈ స్ధాయి నివేదికను ఏ రాజకీయ అధికారితోనూ పంచుకోలేదని ఇందుమూలంగా నిర్ధారిస్తున్నాను” అని రంజిత్ సిన్హా అఫిడవిట్ లో పేర్కొన్నాడని ది హిందు తెలిపింది. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి కోర్టులో సమర్పించబోయే విచారణ నివేదిక గానీ, పరిశోధన నివేదిక గానీ రాజకీయ అధికారులతో పంచుకోబోమని కూడా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా హామీ ఇచ్చాడు.
రాజీనామా చెయ్యి, చెయ్యను
సి.బి.ఐ అఫిడవిట్ మరొకసారి రాజకీయ దుమారాన్ని రేపింది. అశ్వినీ కుమార్ ఇక ఎంత మాత్రం పదవిలో ఉండడానికి వీలు లేదనీ, ఆయన రాజీనామా చేయాలని బి.జె.పి తదితర ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే అశ్వినీ కుమార్ అందుకు నిరాకరించాడు. ఆయనకు ఇతర మంత్రులు మద్దతు ఇచ్చారు. తానేమీ తప్పు చేయలేదని అశ్వినీ కుమార్ స్పష్టం చేశాడు. ముసాయిదా నివేదికను మాత్రమే అశ్వినీ కుమార్ చూశాడని సి.బి.ఐ స్పష్టంగా అఫిడవిట్ లో పేర్కొన్నదని, అంతిమ నివేదిక ఆయన చూడలేదని కనుక ఆయన రాజీనామా చేయనవసరం లేదని కమల్ నాధ్ సహచరుడిని సమర్ధించుకొచ్చాడు.
అయితే ముసాయిదా నివేదిక అయినా మంత్రి ఎందుకు చూడవలసి వచ్చిందన్నదే ప్రశ్న. అంతిమ నివేదిక తయారయ్యే లోపు మంత్రి చూసాడంటే, తాను మాత్రమే కాక ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు మంత్రిత్వశాఖ, కుంభకోణం కాలంలో బొగ్గు శాఖకు నేతృత్వం వహించిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయం ల అధికారులను కూడా ముసాయిదా సవరణలో భాగస్వామ్యం కల్పించాడంటే సి.బి.ఐ నివేదికను ఆయన ప్రభావితం చేసినట్లే కదా అర్ధం. వారి సవరణలను కలుపుకున్న తర్వాతే అంతిమ నివేదిక తయారయిందనే కదా అర్ధం. ఇక అంతిమ నివేదిక చూడలేదని చెబితే పాప పరిహారం ఎలా అవుతుంది?
కుంభకోణం జరిపిందే మంత్రులూ, అధికారులు (ప్రధాన మంత్రి కూడా). సి.బి.ఐ విచారణ చేసున్నదే వారి మీద. విచారణ ఎదుర్కొంటున్నవారే విచారణ నివేదికను చూసేస్తే అందులో ఇక దోష నిర్ధారణ ఎలా జరుగుతుంది? ఈ లెక్కన నేరస్ధుల పైన చార్జి షీటు నమోదు చేసే ముందు, వారి నేరాల పైన సాక్ష్యాలు నమోదు చేసే ముందు ఆయా నేరస్ధుల అనుమతి తీసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది కదా? అంతకాడికి పోలీసులెందుకు? సి.బి.ఐ ఎందుకు? నిందితులను వారి పైన వారినే చార్జిషీట్లు తదితరాలు నమోదు చేసుకోమంటే సరి. ప్రభుత్వానికి ఖర్చు కలిసొస్తుంది. పోలీసులు, సి.బి.ఐ లాంటి సంస్ధలను మేపే అవసరం తప్పుతుంది.
Ususeless fellows cong
you are the articles in this Blog is good
but please write from which news paper you are taking those news….
try to write referenc at the bottom of article
జరుగుతున్నది జగన్నాటకం….