1945-53 మధ్య అమెరికా అధ్యక్షుడుగా పని చేసిన హేరి ఎస్. ట్రూమన్ టేబుల్ మీద ఒక సైన్ బోర్డు ఉండేది. దాని పైన ‘THE BUCK STOPS HERE” అని రాసి ఉండేది. దానర్ధం ‘నా పాలనలో ఏం జరిగినా బాధ్యత నాదే’ అని. తన అధ్యక్షరికంలో తప్పులు జరిగినా అందుకు బాధ్యత మరొకరి మీదికి నెట్టననీ, తానే స్వీకరిస్తానని సదరు సైన్ బోర్డు ద్వారా ట్రూమన్ చెప్పదలిచాడు. (ఆ విధంగా యుద్ధం ఎలాగూ ముగుస్తుందనుకుంటున్న సమయంలో జపాన్ పైన అణు బాంబులు వేయించినందుకు బాధ్యత ఆయనదే అనుకోవాలేమో!) ఈ సామెతను పుట్టించింది ట్రూమన్ కాకపోయినా, అది పాపులర్ కావడానికి కారణం మాత్రం ఆయనేనని చెబుతారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగ్గా ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కార్టూనిస్టు చెబుతున్నారు. నిజం కూడా అదే. శారదా చిట్ ఫండ్స్ అనే సంస్ధ బోర్డు తిప్పేసి అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని లక్షలాది పేద, మధ్య తరగతి మదుపరులను ముంచేసింది. త్రిణమూల్ కాంగ్రెస్ ఎం.పిలు ఇద్దరు తన వద్ద లంచాలు తిన్నారని సంస్ధ అధినేత సుదీప్త సేన్ సి.బి.ఐ కి రాసిన లేఖలో ఆరోపించాడు. తన ఆధీనంలో ఉన్న అనేక మీడియా సంస్ధల యాజమాన్యాన్ని బలవంతంగా అతి తక్కువ వెలకి మార్పించుకున్నారని కూడా ఆయన ఆరోపించాడు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని బెదిరించి తన చేత ఈ పనులు చేయించారని ఆయన ఏప్రిల్ 6 తేదీన రాసిన లేఖలో సుదీప్త పేర్కొన్నాడని పత్రికలు చెబుతున్నాయి. తన సొమ్ము కాజేసిన వారిలో కేంద్ర ఆర్ధిక మంత్రి భార్య నళిని చిదంబరం కూడా ఉన్నట్లు లేఖలో సేన్ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు సుదీప్త సేన్ లేఖే ఒక కుట్ర అని, పెద్దవారి పాత్రను దాచిపెట్టి అనామకుల మీదికి దృష్టి మళ్లించడానికి పన్నిన కుట్ర అని సి.పి.ఎం పార్టీ ఆరోపిస్తోంది.
ముఖ్యమంత్రి మమత విచారణ కమిటీని నియమించింది. కానీ, అది కాలయాపనకేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్’ (ఎస్.ఎఫ్.ఐ.ఓ) ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమించింది. సెబి, ఆదాయపన్ను శాఖలు కూడా త్వరలో విచారణ చేపడతాయని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా తగిన చర్యలు చేపట్టి బాధితులకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి వామపక్ష పార్టీల పైన బాధ్యత నెట్టివేయడానికి ప్రయత్నిస్తోంది. వామ పక్షాల పాలనలోనే శారదా చిట్ ఫండ్స్ లాంటి సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి ప్రజలను దోచుకున్నాయని ఆమె ఆరోపిస్తోంది. చిట్ ఫండ్ కంపెనీలను నియంత్రించడానికి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం పంపిన చట్టం ముసాయిదా ఇంకా రాష్ట్రపతి వద్ద ఉన్నదని, అది చాలా బలహీనంగా ఉన్నదనీ, దాన్ని తిప్పి పంపితే కొద్ది గంటల్లోనే దాన్ని సవరించి కఠిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తానని ఆమె ఊదరగొడుతోంది.
కారులో నగరం అంతా తిరుగుతూ ఒక అమ్మాయిని అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేస్తే అది వామపక్షాల కుట్ర. ఒక ప్రొఫెసర్ తనకు నచ్చిన కార్టూన్లు మిత్రులతో షేర్ చేసుకుంటే వామపక్షాల కుట్ర. విద్యార్ధులు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేస్తే వారు మావోయిస్టులు. వాగ్దానాలు అమలు చేయమని రైతు అడిగితే ఆయన మావోయిస్టు. ఎవరో తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించేవరకు మమత వెళ్ళిపోయారు. ఈ విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిననాటి నుండి మమత బెనర్జీ తీసుకున్న బాధ్యత ఏమన్నా ఉన్నదో లేదో తెలియదు. నళిని చిదంబరం పైన సుదీప్త చేసిన ఆరోపణలను స్వీకరించిన మమత తమ పార్టీ ఎం.పి లపై చేసిన ఆరోపణలను మాత్రం కొట్టిపారేస్తోంది.
శారదా గ్రూపు ప్రజలను ముంచిన మొత్తం ఎంతో తెలియదు. కానీ దాని వెనుక బడా నేతలు, వారి బంధువులే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల బలవంతం పైనే తాను డిపాజిట్లు సేకరించానని చెబుతూ సుదీప్త సేన్ రాసిన లేఖలో 22 మంది పేర్లు ఉన్నట్లు ఎన్.డి.టి.వి చెబుతోంది. వీటన్నిటికి బాధ్యత వహించి సమాధానం చెప్పవలసిన అగత్యం ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ పైన ఉండగా దానికామె సిద్ధంగా లేరని ఆమె మాటలు చెబుతున్నాయి. కేసు సంవత్సరాల తరబడి సాగడం, ఈ లోపు అనేకమంది బాధితులు ఆత్మహత్యలకు దగ్గర కావడం అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడి మరణించినట్లు తెలుస్తోంది కూడా.