ఇంటర్నెట్ లో సామాజిక కార్యక్రమాల ముసుగు ధరించే ఐ.టి వ్యాపార కంపెనీల వ్యవహారం పైన భారత దేశంలోని కోర్టులు కొరడా ఝళిపించడానికి సిద్ధం అవుతున్నాయి. చట్టబద్ధ మైన వయసు 18 సంవత్సరాల లోపలి పిల్లలకు ఫేస్ బుక్, గూగుల్ సామాజిక వెబ్ సైట్లు పిల్లలకు ఎలా అందుబాటులో వస్తున్నాయో వివరించాలని ఢిల్లీ హై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. చట్టాలను ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల వినియోగదారుల వ్యక్తిగత వివరాల డేటాను అమెరికా కంపెనీలు అమెరికాకు పంపిస్తున్నాయని తద్వారా ప్రైవసీ చట్టాలను అవి ఉల్లంఘిస్తున్నాయని బి.జె.పి నాయకుడు గోవిందాచార్య జూన్ 2012 లో దాఖలు చేసిన పిటిషన్ ఇపుడు విచారణకు వచ్చింది.
బి.డి.అహ్మద్, విభూ బఖృ లతో కూడిన డివిజన్ బెంచి ఈ మేరకు 10 రోజుల్లో బదులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. తమ సబ్స్క్రైబర్ల వివరాలను తనిఖీ చేయకుండానే ఖాతా తెరవడానికి అనుమతి ఇస్తున్నారని ‘Know Your Customer’ నిబంధనను ఇది ఉల్లంఘించడమేనని గోవిందాచార్య తన పిటిషన్ లో పేర్కొన్నాడు. అంతే కాకుండా వినియోగదారుల సమాచారాన్ని అమెరికాకు పంపి వ్యాపార ప్రయోజనాలకు ఇతర కంపెనీలకు అప్పజెబుతోందని కూడా పిటిషన్ దారు తన పిటిషన్ లో ఆరోపించాడు. పిటిషన్ విచారణలోకి ఫేస్ బుక్, గూగుల్ కంపెనీలను కూడా కోర్టు ఇంప్లీడ్ చేసింది.
ఫేస్ బుక్, గూగుల్ సభ్యులు ఇక్కడి మైనర్ లతో కుదుర్చుకున్న ఒప్పందాలు ‘ఇండియన్ మైనారిటీ యాక్ట్’ లాంటి భారత చట్టాలకు విరుద్ధమని గోవిందాచార్య స్పష్టం చేశాడు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లకు కూడా ఇవి విరుద్ధమని ఆయన తెలియజేశాడు. తన ఖాతాదారుల్లో దాదాపు 8 కోట్ల ఖాతాలు నిజమైన ఖాతాలు కాదని అవన్నీ బూటకపు ఖాతాలేనని ఫేస్ బుక్ సెక్యూరిటీ ఎక్ఛేంజ్ కమిషన్ (ఇండియన్ సెబి లాంటిది) ముందు అంగీకరించడం విశేషం.
ఫేస్ బుక్ సంస్ధ భారతీయ ఖాతాదారుల వివరాలన్నింటిని అమెరికాకు బదిలీ చేసి వాటిని తన వ్యాపార ప్రయోజనాలకు వినియోగిస్తోందని గోవిందాచార్య ఆరోపించాడు. ఆ క్రమంలో భారత ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులను ఎగవేస్తున్నాయని ఆయన పిటిషన్ లో తెలిపాడు. భారత వినియోగదారుల ప్రైవసీకి భంగకరంగా సంస్ధలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించాడు.
పశ్చిమ దేశాల ఐ.టి కంపెనీలతో వ్యవహరించేటప్పుడు కాడు జాగ్రత్త వహించాలని అనేకమంది నిపుణులు చెబుతున్నప్పటికీ చాలామంది పట్టించుకోవడం లేదు. ఏదో ఒకప్పుడు తీవ్రంగా ఎదురు దెబ్బ తగిలేవరకు సవరించుకోడానికి ఇంకా అవకాశం వస్తుందో లేదో చెప్పలేము. కనుక ఇంటర్నెట్ వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలను, ఫోటోలను, కుటుంబ సభ్యులా వివరాలు ఫోటోలను ఇంటర్నెట్ లో ఉంచకపోవడమే ఎప్పటికైనా మంచిది.