ఇరానియన్ సామ్ సంగ్, ఈ.యూ విచ్ఛిన్నం…. క్లుప్తంగా -26.04.2013


అమెరికాలో యు.పి మంత్రి డిటెన్షన్

Azam Khanహార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ‘కుంభమేళా’ గురించి వివరించడానికి యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అమెరికా వెళ్ళాడు. ఆయనకి తోడుగా వెళ్ళిన ఆ రాష్ట్ర మంత్రి అజామ్ ఖాన్ ను బోస్టన్ లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు కొద్ది సేపు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయనకి రాయబార హోదా ఉన్నప్పటికీ ‘మరింతగా ప్రశ్నించడానికి’ మంత్రిని పది నిమిషాల సేపు నిర్బంధించారని ది హిందు తెలిపింది. తాను ముస్లిం అయినందునే అక్రమంగా నిర్బంధించారని, తనకు ఆపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తూ మంత్రి విమానాశ్రయంలో చిన్నపాటి గొడవ సృష్టించినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులు మాత్రం తమ డ్యూటీ తాము చేశామని సమాధానం చెప్పి మిన్నకున్నారు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలోని భారత ఎంబసీ అక్కడి విదేశాంగ కార్యాలయంతో ఈ విషయమై సంప్రదించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అక్బరుద్దీన్ ఈ విషయాన్ని తగిన రీతిలో అమెరికా అధికారులతో చర్చించాలని కోరాడు. కజకిస్తాన్ రాజధాని అల్మటి లో ఉన్న అక్బరుద్దీన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు విలేఖరులకు తెలిపాడు. ఆఫ్ఘనిస్ధాన్ విషయమై జరుగుతున్న అంతర్జాతీయ సమావేశానికి విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరు కాగా, అక్బరుద్దీన్ ఆయన వెంట వెళ్ళినట్లు తెలుస్తోంది.

ఇరాన్ వినియోగదారులకు సామ్ సంగ్ మద్దతు కట్

ఇరాన్ లో ఓ సామ్ సంగ్ స్టోర్ -ది హిందు

ఇరాన్ లో ఓ సామ్ సంగ్ స్టోర్ -ది హిందు

సామ్ సంగ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసిన ఇరానియన్ వినియోగదారులను కంపెనీ నిలువునా ముంచింది. అమెరికా విధించిన అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలకు అనుగుణంగా ఇరానియన్ వినియోగదారులకు సామ్ సంగ్ అప్లికేషన్లకు సపోర్ట్ సేవలు ఉపసంహరిస్తున్నట్లు కొరియా కంపెనీ సామ్ సంగ్ తెలిపింది. ఈ మేరకు వినియోగదారులు సామ్ సంగ్ కంపెనీ నుండి ఈ-మెయిల్ ద్వారా సందేశం అందుకున్నారు.

అమెరికా వాణిజ్య ఆంక్షలు ఈనాటివి కావు. దశాబ్దాల తరబడి అవి అమలులో ఉన్నాయి. సామ్ సంగ్ మొబైల్ ఉత్పత్తులు అమ్మే సమయంలోనే సామ్ సంగ్ కంపెనీకి ఈ ఆంక్షల సంగతి తెలియకుండా ఏమీ లేదు. ఉత్పత్తులు అమ్ముకున్న తర్వాత సాఫ్ట్ ఫేర్ సేవలకు మద్దతు ఉపసంహరించుకోవడం పచ్చి మోసం తప్ప మరొకటి కాదు. కాగా సామ్ సంగ్ కంపెనీ మోసం తమకు గౌరవం అని ఇరానియన్ వినియోగదారులు వ్యాఖ్యానించడం గమనార్హం. సామ్ సంగ్ ఉత్పత్తులను బహిష్కరించి ఇరానియన్ పౌరులు ఆ కంపెనీని గౌరవిస్తే సరిపోతుంది.

ఈ.యూ విచ్ఛిన్నం తధ్యం?

యూరో విచ్ఛిన్నం తధ్యం?

యూరో విచ్ఛిన్నం తధ్యం?

యూరోపియన్ యూనియన్ విచ్ఛిన్నం ఎంతో దూరంలో లేదని పరిశీలకులు భావిస్తున్నారు. సైప్రస్ సంక్షోభం దరిమిలా లక్షలాది డిపాజిట్ దారుల సొమ్ము హారతి కర్పూరంలా కరిగిపోవడం ప్రజలకు మింగుడు పడడం లేదని ట్రొయికా (ఈ.యూ, ఇ.సి.బి, ఐ.ఎం.ఎఫ్) సంస్ధలు రుద్దుతున్న వినాశకర పొదుపు విధానాలు ఈ.యూ విచ్ఛిన్నం వైపుకు దారి తీస్తున్నాయని రష్యా టుడే (ఆర్.టి) విశ్లేషించింది. ముఖ్యంగా ‘యూరో స్కెప్టిక్స్’ కు నిలయం అయిన బ్రిటన్ ఆర్ధిక, రాజకీయవేత్తలు ఈ.యూ విచ్ఛిన్నం కాక తప్పదని వాదిస్తున్నారు. ఉత్తర యూరప్, దక్షిణ యూరప్ గా యూరోపియన్ దేశాలు విడిపోయే అవకాశం ఉందని బ్రిటన్ ఆర్ధిక విశ్లేషకుడు నైజల్ ఫారజ్ ఆర్.టితో మాట్లాడుతూ స్పష్టం చేశాడు. స్పెయిన్ లాంటి భారీ ఆర్ధిక వ్యవస్ధలు దివాళా తీస్తే ఎక్కడి నుండి తెచ్చి డబ్బులు కుమ్మరిస్తారని ఆయన ప్రశ్నించాడు. యూరోపియన్ దేశాలు మళ్ళీ తమ సొంత వ్యవస్ధలను పునరుద్ధరించుకోవడం తప్ప మార్గం లేదని నైజల్ వ్యాఖ్యానించాడు. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తిప్పి కొట్టడానికి ఉద్భవించిన యూరో తానే అవసాన దశలో ఉండడం పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభాలలో ఒక అనివార్య పరిణామం.

యూరో పరిస్ధితి ఇలా ఉంటే డాలర్ విలువను కాపాడుకోవడానికి, తద్వారా దిగుమతులు బిల్లు తగ్గించుకోడానికీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు పేపర్ గోల్డ్ విలువను షార్ట్ చేసి బంగారం విలువను కిందికి నెట్టడంతో ప్రపంచ వ్యాపితంగా బంగారం విలువ పడిపోయింది. కానీ బంగారం కొనడానికి జనం విపరీతంగా ఎగబడుతుండడంతో అది మళ్ళీ పైకి ఎగబాకుతోంది. జపాన్ ప్రభుత్వం, ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా బంగారం కొంటున్నారని పత్రికలు చెబుతున్నాయి. అంటే ఫెడరల్ రిజర్వ్ చేపట్టిన పేపర్ గోల్డ్ రిగ్గింగు వలన డాలర్ సేఫ్ జోన్ లో ఉండడం అటుంచి జపాన్ లాంటి పోటీ రాజ్యాలు పెద్ద ఎత్తున బంగారం నిల్వలు పెంచుకోవడానికి దోహదం చేస్తోంది.

One thought on “ఇరానియన్ సామ్ సంగ్, ఈ.యూ విచ్ఛిన్నం…. క్లుప్తంగా -26.04.2013

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s