ఆడది అలా చూడకుండా మగాడేమీ చెయ్యడు -కాంగ్రెస్ నాయకుడు


child abuse 10ఒకరో, ఇద్దరో నాయకులైతే నాలుగు మాటలతో విమర్శించి ఛీ, ఛీ అని ఊరుకుంటాం. ఒకసారి, రెండు సార్లు అయినా ‘సరికాదు, సవరించుకోండి’ అని చెబుతాం. కానీ ఈ రాజకీయ నాయకులు గుంపంతా అదే బాపతైతే ఎన్ని విమర్శలు చేయాలి. ఎన్ని ఛీ, ఛీలు కొట్టాలి, ఎన్నిసార్లు సవరించుకోమని చెప్పాలి!? మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కూడా అయిన ఓ పెద్ద మనిషి మహిళలు ఆహ్వానించే విధంగా చూడకపోతే మగాళ్లు అసలు వారినేమీ ఇబ్బంది పెట్టరు అని ఎన్నికల ప్రచార సభలో చెప్పడం చూస్తే ఇదే అనిపిస్తోంది.

కాంగ్రెస్ నాయకుడి దృష్టిలో ఆడవారిపైనా, బాలికలపైనా, ముక్కుపచ్చలారని పాపలపైనా జరుగుతున్న అత్యాచారాలకు, వీధుల్లో వేధింపులకు, ఈవ్ టీజింగ్ లకు కారణం బాధిత మహిళలు, బాలికలు, పాపలే. ఇందులో అకృత్యాలకు పాల్పడుతున్న మగాళ్ల తప్పేమీ లేదు. ఆడ మనిషి, ఆమె 60 యేళ్ళ ముసల్ది కావచ్చు, నవ యవ్వన యువతి కావచ్చు, జడ, బొట్టు బిళ్ళలు తప్ప ఆడ, మగా మధ్య తేడాలు తెలియని బాలికలు కావచ్చు, అసలు తేడానే ఊహించలేని పసి పాపలు కావచ్చు; వాళ్ళు కన్నెత్తి ‘నేను సిద్ధం’ అని సూచించే విధంగా చూడడం వల్లనే మగాళ్లు ‘నిజమే కాబోలు’ అనుకుని అచ్చోసిన ఆంబోతుల్లా బరితెగిస్తున్నారు.

కేవలం ఆహ్వానించినట్లుగా కనిపించిన చూపుకే వాడిలోని పశుత్వం (పశువులకు క్షమాపణలతో) జడలు విప్పి వీరంగా ఆడుతుంది. తట్టుకోలేని మదవాంఛ ఒడలంతా ఆవహించి కంటికి ‘ఆడ’ అని ఎవరు కనిపిస్తే వారిని పట్టుకొచ్చి అత్యాచారాలకు తెగబడడమే కాక కొవ్వొత్తులు, సీసాలు, ఇనప రాడ్లతో ప్రాణాలు తీసేంతగా పూనకం వచ్చేస్తుంది. ఇదంతా కేవలం ఒక్క చూపుతోనే. మధ్య ప్రదేశ్ మాజీ మంత్రి గారు ఒక ఎన్నికల ప్రచార సభలో తాను గెలిస్తే పరిస్ధితి ఏమిటో ఈ విధంగా తన రాష్ట్ర మహిళా ఓటర్లకు నేరుగా హెచ్చరిక జారీ చేశాడు.

“జబ్ తక్ మహిళా తీర్చి సే నహీ దేఖేగి, తబ్ తక్ పురుష్ ఉసే నహీ ఛేడేగా” (రమ్మని సైగ చేసే విధంగా ఆడవాళ్ళు ఎప్పటివరకైతే చూడకుండా ఉంటారో, అప్పటి వరకు పురుషులు వారిని వేధించరు) అని కాంగ్రెస్ నాయకుడు సత్యదేవ్ కటారే ఎన్నికల ప్రచార సభలో అన్నాడని ది హిందు తెలిపింది. ఎన్.డి.టి.వి ప్రకారం ఈ నాయకుడు ఇంకా ఇలా అన్నాడు “జబ్ తక్ కోయి మహిళా తేధి నజర్ సే హసేగి నహి, తబ్ తక్ కోయి ఆద్మీ ఉస్సే ఛేడేగా నహి” (ఏ ఆడదైనా నవ్వుతూ చూడనంత వరకూ, ఏ మగాడు కూడా ఆమెను వెంటపడి వేధించడు).  మాజీ రాష్ట్ర మంత్రి కూడా అయిన సత్యదేవ్ భింద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో మాట్లాడుతూ ఈ అమూల్యమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నవంబరులో జరగనున్న మధ్య ప్రదేశ్ ఎన్నికలకోసం ప్రచారం చేస్తున్న సత్యదేవ్ ఈ విధంగా ఓట్లు రాబట్టడానికి నిర్ణయించుకున్నాడన్నమాట!

మధ్య ప్రదేశ్ లోనే ఏప్రిల్ 17 తేదీన ఒక ఐదేళ్ల పాపను (ఎన్.డి.టి.వి ప్రకారం నాలుగేళ్లే) చాక్లెట్ చూపి ఆకర్షించి, అనంతరం కిడ్నాప్ చేసి, ఆనక అత్యాచారం చేసి పొలాల్లో పడేసి పోయాడు ఒక మగాడు/పురుషుడు/ఆద్మీ/పురుష్. ఆ పాప ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఎయిర్ అంబులెన్సులో హుటా హుటిన మహారాష్ట్ర లోని నాగపూర్ తరలించి ఆ పాపను బతికించడానికి ప్రయత్నిస్తున్నారు. పాప చికిత్సకు స్పందించడం లేదు. దానితో డాక్టర్లు ఏమి జరుగుతుందో చెప్పలేమని చెబుతున్నారు. ఒక పక్క తమ రాష్ట్రంలోనే జరిగిన ఈ ఘోరానికి సమాధానం చెప్పడం మాని మొత్తం ఆడ ప్రపంచం పైనే అత్యంత దారుణంగా, నీచాతి నీచమైన అభిప్రాయం వెలిబుచ్చడానికి కాంగ్రెస్ నాయకుడు ఏ మాత్రం సిగ్గుపడలేదంటే వాడసలు ఏ జాతికి చెంది ఉండాలి? మనుష జాతి అయితే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చా?

నాలుగేళ్ల పాప ఏ విధంగా చూస్తే ఆ మగ వెధవకి కోరికలు పురి విప్పి నర్తించాయి? చాక్లెట్ ఆశ చూపిన మగాడికి ఏ ఉద్దేశ్యం ఉండదు గానీ చాక్లెట్ కోసం వచ్చిన పాప మాత్రం ‘తీర్చి సే’, ‘తేధి నజర్ సే’ వాడి దగ్గరికి వచ్చినట్లా? ఢిల్లీ పాపని కూడా ఇలాగే చాక్లెట్ ఆశపెట్టి గదికి పట్టుకెళ్లారు. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపని పట్టుకెళ్లిన మగ ‘_______’ ది ఏ తప్పూ లేదు. వాళ్ళు తాగడం, చాక్లెట్ ఆశ పెట్టడం, పైత్యం ప్రకోపించి కొవ్వొత్తులు, సీసాలు జోనపడం ఇవేవీ పాపం వారి తప్పు కాదు. ఆ పాపే ఏదో అర్ధం స్ఫురించేటట్లు వారి వంక చూసి ఉంటుంది. దానితో వారు రెచ్చిపోయారు. కాంగ్రెస్ నాయకుడు చెప్పేది ఇదే.

పితృస్వామిక వ్యవస్ధలో మగ అహంభావం కొనసాగుతోందని, అది ఉన్నత పదవులకి ఎగబాకి, చట్టాలు నిర్ణయం అయ్యే అత్యున్నత సంస్ధల్లో పీఠం వేసుకుని వ్యవస్ధలోని సమస్త కదలికలను శాసిస్తోందని చెప్పడానికి ఇంతకంటే పచ్చి రుజువు ఇంకేమన్నా ఉండగలదా?

ఎన్.డి.టి.వి ప్రకారం 2011 సంవత్సరంలో ఒక్క మధ్య ప్రదేశ్ లోనే 3400 లైంగిక అత్యాచారాలు జరిగాయి. దేశం మొత్తం మీద చూస్తే ఈ సంఖ్య లక్షల్లో ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే మధ్య ప్రదేశ్ ది అగ్రస్ధానం. దేశం చూడడానికి వచ్చిన 39 యేళ్ళ స్విస్ మహిళ పైన సామూహిక అత్యాచారం చేసి భార్యా భర్తల వద్ద ఉన్నవన్నీ దోచుకున్నది కూడా ఇక్కడే. చూపులకి భాష ఉండదు కదా. ఆమె విదేశీ మహిళ అయినా ఆమె చూపుని మన మంత్రిగారి అమాయక రేపిస్టులు పసి గట్టారు. స్విస్ మహిళ చూపులో సామూహికంగా అత్యాచారం చెయ్యండన్న ఆహ్వానాన్ని పసిగట్టిన మన వీరులు ఆమె కోరిన విధంగానే అకృత్యానికి తెగబడ్డారు. డిసెంబరులో ఢిల్లీ వైద్య విద్యార్ధిని చేసిన పాపం కూడా అదే. రాత్రి 10 గంటలప్పుడు కూడా ఆమె చూపులోని అంతరార్ధాన్ని ఇట్టే పసిగట్టి ఇనప రాడ్డు ప్రయోగించారని మాజీ మంత్రిగారి మాటల ప్రకారం అనుకోవాలి.

ఇంతకీ మహిళల చూపుల్లోని అంతరార్ధాన్ని, ఆహ్వానాన్ని ఇనప రాడ్లు, కొవ్వొత్తులు, సీసాలు కూడా పసిగడతాయా? ఇలాంటి వస్తువులన్నీ మగ పురుషులేనా?

2 thoughts on “ఆడది అలా చూడకుండా మగాడేమీ చెయ్యడు -కాంగ్రెస్ నాయకుడు

  1. అందగత్తె కనబడితే చాలు.ఆమె ఎలా చూసినా ,అసలు చూడకపోయినా మెజారిటీ మగ కళ్ళు ఆమె అందాన్ని వెతికి వేటాడాలనే చూస్తాయి.బురఖా వేసుకోకుండా తన అందచందాలు అందరికీ కనబరిచి తానే అత్యాచారానికి ఆహ్వానించి ముప్పు కొనితెచ్చుకుంది అంటూ,అందుకు ఆమెనే బాధ్యురాలంటూ మగ(మత)నాయకులు వక్రభాష్యాలు చెబుతుంటే కొంతమంది మహిళలు కూడా అందుకు తందాన పాడుతున్నారు..’బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు’ అని మగవాళ్ళనే కదా అన్నారు?ఆమె అంగీకారం అక్కరలేదని బలాత్కరించినప్పుడే అత్యాచారం అవుతుంది.అత్యాచారంలో స్త్రీకి హాని,అవమానం రెండూ ఉంటాయి.ఇక పసిపిల్లల మీద జరిగే అఘాయిత్యాలకు ఈ నాయకులు ఏం జవాబు చెప్పలేక నీళ్ళు నములుతున్నారు.ప్రేమజీవుల్ని ఈ సమాజం భరిస్తుంది గానీ అత్యాచారుల్ని భరించలేదు.

  2. pithru swaamya vyavastha, purushadurahamnkaram laainti maatalu padikattu padalaipoinaai.veetini purushulami kharma streelaina ardham chesukoni vaallu paalichi penchea purusha durahamnkaranni thaggistaaranukunte samaaja bhaavajaalaanni puraana kaalamulo naalugu kaallatho nadpinchadaaniki anni rakaalasakthulu sakthivanchana lakunda pani chasthoonnai. ika vaallaki dhevude dhikkata. dhaibhaavanni penchithe thappa ee mrugallo paapam punyamu sangarshinchi maanavathvam puduthundata. ee maata chennallo oka stree maatlaadithe gudlappaginchadam naavanthaindhi.
    eelaanti paalakulu mana paalina padinappudu ika eadhi dhaari

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s