“ఏయ్! ఆ పోలీసు సంస్కరణల పుస్తకాలు పట్రండి… ఇప్పుడే!”
–
ప్రభుత్వము, పోలీసులు అనేక అంశాల్లో దాహం వేసినప్పుడు బావి తవ్వుకునే ధోరణి అనుసరించడం అందరూ ఎరిగినదే. మహిళలపై అత్యాచారాలు జరిగిన సందర్భం వచ్చినప్పుడల్లా పోలీసు సంస్కరణల గురించి మంత్రులు, రాజకీయ నాయకులు, చివరికి పోలీసు అధికారులు సైతం అనేక మాటలు, వాగ్దానాలు కురిపించడం సర్వసాధారణంగా మారింది. దుర్ఘటన జరిగినపుడు పోలీసులు తగిన రీతిలో స్పందించకపోవడం పోలీసుల తీరుతో ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడం ప్రభుత్వము, పోలీసులు వాగ్దానాలు కురిపించడం చివరికి పోలీసు సంస్కరణల దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం అనాదిగా నడుస్తున్న తంతు.
నిర్భయ పైన ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం, హత్య అనంతరం పోలీసులలో కొద్ది మేరకైనా మార్పులు జరిగాయని నమ్మినట్లయితే అది ఢిల్లీ పసికందు పై జరిగిన అసహజ పాశవిక హత్యతో వారి నమ్మకాలు భ్రమలేనని తేలిపోయి ఉండాలి. ఫిర్యాదు చేయవచ్చిన తల్లిదండ్రుల ఫిర్యాదును సమయానికి తీసుకుని వెతుకులాట ప్రారంభించినట్లయితే పాప గాయ రహితంగా దొరికి ఉండేదని బంధువులు ఆరోపించిన సంగతి తెలిసిందే. వరుస దుర్ఘటనలకు నైతిక బాధ్యత వహించి రాజీమానా చేయాలని ప్రజలు, పార్టీలు కోరుతుండగా ‘రిపోర్టర్ చేసిన తప్పుకు ఎడిటర్ రాజీమానా చేస్తాడా?’ అని ఎదురు ప్రశ్నించిన బాధ్యతాయుత పోలీసు చీఫ్ ఢిల్లీ శాంతి బ్రధ్యతలకు బాధ్యత వహిస్తున్నారు. ఈ పరిస్ధితిలో రాజధాని నగరంలో మహిళలపై వాలుతున్న రాబందుల పని బట్టడం పోలీసు వ్యవస్ధతో అవుతుందా అన్నది సందేహమే!
అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందినప్పుడు మాత్రమే పోలీసు బాసులకు, రాజకీయ నాయకులకు పోలీసు సంస్కరణలు గుర్తుకు వస్తాయని కార్టూనిస్టు చేస్తున్న సూచన భారత దేశ అత్యాచార సంక్షోభానికి (రేప్ క్రైసిస్), ప్రభుత్వం, పోలీసుల వ్యవహార శైలికి పక్కా ప్రతిబింబం.