జ్యోతి సింగ్ పాండే అలియాస్ నిర్భయ పై జరిగిన పాశవిక సామూహిక అత్యాచార, హత్యోదంతం అనంతరం భారత దేశ న్యాయ వ్యవస్ధకు బాధ్యతాయుతమైన రీతిలో ప్రాతినిధ్యం వహించిన జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ సోమవారం మరణించారు. నిర్భయ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వం నియమించిన కమిటీకి నాయకత్వం వహించిన జస్టిస్ జె.ఎస్.వర్మ రికార్డు సమయంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ప్రజల సమస్యల పట్ల అధికార వ్యవస్ధ స్పందించవలసిన తీరుకు ఒక ఉదాహరణగా నిలిచారు. ‘నిర్భయం చట్టం’ – ‘జస్టిస్ జె.ఎస్.వర్మ కమిటీ’… ఈ రెండు, జంట పద బంధాలుగా భారత దేశ మహిళా ఉద్యమ చరిత్రలోను, న్యాయ వ్యవస్ధ మానవీయ ప్రతిస్పందనల జాబితాలోను, ప్రజా ఉద్యమాలకు వినమ్రంగా తల ఒగ్గవలసిన బ్యూరోక్రసీ ప్రజా సేవా తత్పరతకూ అత్యున్నత ఉదాహరణలుగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
మరణించేనాటికి జస్టిస్ జె.ఎస్.వర్మ వయసు 80 సంవత్సరాలు. కాలేయంలో తీవ్ర సమస్యలు ఏర్పడడంతో ఆయనను శుక్రవారం గుర్గావ్ లోని మేదాంత మెడిసిటి ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్ధితి వేగంగా క్షీణించడంతో ఆదివారం నాటికి ఆయన శరీర అవయవాలన్నీ పని చేయడం మానేశాయని ది హిందు తెలిపింది. పరిస్ధితి మరింత క్షీణించడంతో సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. పి.టి.ఐ వార్తా సంస్ధ ప్రకారం ఆయన సోమవారం రాత్రి 9:30 లకు చనిపోయారు. కాలేయం వైఫల్యంతో ఆసుపత్రిలో చేరిన జస్టిస్ వర్మకు శుక్రవారం, శరీరం లోపల రక్తస్రావం జరిగిందని ఆసుపత్రి అధికారులను ఉటంకిస్తూ జి న్యూస్ తెలిపింది.
జస్టిస్ జె.ఎస్.వర్మ సుప్రీం కోర్టుకు 27వ చీఫ్ జస్టిస్ గా మార్చి 25, 1997 తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 18, 1998 తేదీన రిటైర్ అయేంతవరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. జనవరి 18, 1933 తేదీన మధ్య ప్రదేశ్ లో జన్మించిన ఆయన ప్రారంభ విద్యాభాసం అదే రాష్ట్రం లోని సత్నాలో జరిగింది. న్యాయ శాస్త్ర రంగంలో 1955లో కెరీర్ ప్రారంభించిన జెస్టిస్ జె.ఎస్.వర్మ జూన్ 1973లో మధ్య ప్రదేశ్ న్యాయ మూర్తిగా నియమితులయ్యారు. జూన్ 1986 నాటికి మధ్య ప్రదేశ్ హై కోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేసి సెప్టెంబర్ 1986 నుండి 1989 వరకు రాజస్ధాన్ హై కోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. జూన్ 1989లో సుప్రీం కోర్టు జడ్జిగాను, జనవరి 1998లో చీఫ్ జస్టిస్ గానూ నియమితులయ్యారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఛైర్మన్ గా కూడా ఆయన పని చేశారు.
జస్టిస్ వర్మ నేతృత్వంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులు న్యాయ చరిత్రలో శాశ్వత స్ధానం సంపాదించుకున్నాయి. ఆర్టికల్ 356 కింద ఎస్.ఆర్.బొమ్మయ్ కేసులో 1994లో ఆయన ఇచ్చిన తీర్పు తర్వాత పలు తీర్పులకు రిఫరెన్సు గా ఉపయోగపడింది. పార్లమెంటు ఆమోదించిన తర్వాతనే ఏ రాష్ట్రం లోనైనా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుందని జస్టిస్ వర్మ నేతృత్వం లోని 9 మంది సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది.
శివ సేన నాయకుడు మురళి మనోహర్ జోషి ఎన్నిక విషయంలో జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పు వివాస్పదంగా మారింది. హిందూత్వ ప్రసంగాలతో ప్రజలను మత ప్రాదికన రెచ్చగొట్టి ఎన్నికయినందున ఆయన ఎన్నిక చెల్లనేరదని బొంబే హై కోర్టు తీర్పు ఇవ్వగా జస్టిస్ వర్మ నేతృత్వంలోని సుప్రీ ధర్మాసనం ఆ తీర్పును రద్దు చేసింది. ‘హిందూత్వ భారత దేశంలో ఒక జీవన విధానం’ అని ఆయన ఇచ్చిన తీర్పు హిందూత్వ శక్తులకు ఒక మద్దతు సాధనంగా వినియోగించుకున్నాయి. అయితే తన తీర్పును హిందూత్వ రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించడం పట్ల జస్టిస్ వర్మ బహిరంగం గానే అభ్యంతరం ప్రకటించడం విశేషం. జైన్ హవాలా కేసులో డైరీలో ఉన్న పేర్లు దోషిత్వానికి సాక్ష్యాలుగా పనికి రావని ఆయన ఇచ్చిన తీర్పు ప్రఖ్యాతంగా నిలిచింది.
నిర్భయ కేసు అనంతరం క్రిమినల్ లా అమెండ్ మెంటు బిల్లుకు సవరణలు, చేర్పులు చేయడానికి 30 రోజుల లోపుల నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ నేతృత్వంలో త్రీ సభ్య కమిటీ నియమించగా గడువు కంటే ఒక రోజు ముందే నివేదిక సమర్పించి జస్టిస్ వర్మ కమిటీ ప్రజల ఆందోళనలకు సానుకూలంగా ప్రతిస్పందించారు. నూతన యువతరం పెద్ద తరానికి తమ శాంతియుత ప్రదర్శనల ద్వారా ఒక గుణపాఠాన్ని నేర్పారని వ్యాఖ్యానించడం ద్వారా ప్రజల ఆందోళనలకు ప్రజా ప్రతినిధులు, న్యాయ వ్యవస్ధ, బ్యూరోక్రసీ ఎలా ప్రతిస్పందించాలో ఆయన చెప్పకనే చెప్పారు. తమకు అందిన ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకొని తమ నివేదిక తయారు చేశామని జస్టిస్ వర్మ ప్రకటించారు.
కేవలం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ 29 రోజుల్లోనే నివేదిక తయారు చేయగలిగినపుడు మందీ మార్బలం ఉన్న కేంద్ర ప్రభుత్వం అంతకంటే త్వరగా చట్టం చేయాలని జస్టిస్ వర్మ ఆకాంక్షించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా సవాలు విసిరారు. దానితో నిర్భయ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం అనివార్యంగా ప్రవేశపెట్టవలసిన అగత్యం ఏర్పడింది. అత్యాచార నిందితులకు మరణ శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేసినప్పటికీ మహిళా సంఘాల సూచనల మేరకు దానిని జస్టిస్ వర్మ కమిటీ సమ్మతించలేదు. అయితే ప్రభుత్వం మాత్రం మరణ శిక్షను నిర్భయ చట్టంలో ప్రవేశపెట్టి జస్టిస్ వర్మ కమిటీ, మహిళా, సామాజిక సంఘాలు ప్రదర్శించిన దూర దృష్టి, సామాజిక దృష్టి తమకు లేవని, తక్షణ ఓటు బ్యాంకు రాజకీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చాటుకున్నాయి.
జస్టిస్ వర్మ వెలువరించిన తీర్పులలో కొన్ని ప్రతికూల ధోరణులు వాస్తవాతీత అవగాహనాలు ఉన్నప్పటికి నిర్భయ చట్టం పేరుతో ఆయన పేరు కూడా భవిష్యత్తులో అనుసంధానించబడి ఉంటుంది.