ఘర్షణ వైపు నడుస్తున్న భారత్-చైనా సంబంధాలు?


 

లడఖ్ లో ఓ సరిహద్దు ప్రాంతం

లడఖ్ లో ఓ సరిహద్దు ప్రాంతం -లైవ్ మింట్

భారత్-చైనా సంబంధాలు మరొకసారి ఘర్షణాత్మక వైఖరిలోకి ప్రవేశించాయి. ఇరు పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో ఇరు దేశాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు ఒక్కసారిగా రద్దు కానున్నాయా అన్న అనుమానం కలిగే వైపుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ సరిహద్దు లో తిరిగి యధాతధ స్ధితిని తీసుకురావాలని భారత ప్రభుత్వం మంగళవారం చేసిన ప్రకటన పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తోంది.

‘దౌలత్ బేగ్ ఓల్డి’ సెక్టార్ లో చైనా బలగాలు 10 కి.మీ దూరం చొచ్చుకు వచ్చిన తర్వాత ఇరు దేశాల సైనికులు ఎదురెదురుగా (face-to-face) నిలబడ్డ పరిస్ధితి వచ్చిందని కనుక చైనా బలగాలు వెంటనే వెనక్కి వెళ్ళి యధాతధ స్ధితిని పునరుద్ధరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ప్రకటించాడని ది హిందు తెలిపింది.

“పశ్చిమ సరిహద్దులోని ఈ సెక్టార్ లో యధాతధ స్ధితిని పునరుద్ధరించాలని చైనా పక్షం వారిని మేము కోరాము. దీని ద్వారా నా అర్ధం ఏమిటంటే ఈ సంఘటనకు పూర్వం యధాతధ స్ధితి అని” విదేశాంగ ప్రతినిధి అక్బరుద్దీన్ అన్నాడు. “వాస్తవాధీన రేఖకు సంబంధించి ఇరు దేశాల అవగాహన ఏకీభవించనందున, దీనిని ఇరు పక్షాలకు చెందిన సరిహద్దు సైనికుల మధ్య ఎదురెదురు పరిస్ధితిగా మేము పరిగణిస్తున్నాము” అని ఆయన తెలిపాడు.

“ఎదురెదురు” అనే పరిస్ధితిని భారత్ ఈరోజు కొత్తగా సృష్టిస్తున్న పదజాలం కాదని అక్బరుద్దీన్ స్పష్టం చేయడం గమనార్హం. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వద్ద మిలట్రీ రంగంలో అమలు చేయడానికి ఇరు దేశాలు రూపొందించిన 2005 ప్రోటోకాల్ లో భాగంగా ఉద్దేశించిన ‘విశ్వాస నిర్మాణ చర్యలు’ (Confidence Building Measures -CBMs) లో ఇది భాగమేనని ఆయన స్పష్టం చేశాడు.

2005 ప్రోటోకాల్ ప్రకారం “వాస్తవాధీన రేఖ పట్ల ఉన్న భిన్నాభిప్రాయాల వల్ల గానీ లేదా మరే ఇతర కారణం వల్ల గానీ ఇరు దేశాల సరిహద్దు బలగాలు పరస్పరం ఎదురెదురుగా మోహరించిన పరిస్ధితి ఏర్పడితే, ఇరు పక్షాలు స్వయం నియంత్రణ పాటించాలి. పరిస్ధితి మరింత ఉద్రిక్తతకు దారితీయకుండా సకల చర్యలు తీసుకోవాలి.” అని అక్బరుద్దీన్ తెలిపాడు. “పరిస్ధితిని సమీక్షించి ఉద్రిక్తత మరింత కొనసాగకుండా ఉండడానికి ఇరు పక్షాలు వెనువెంటనే రాయబార మార్గంలో మరియు/లేదా ఇతర అందుబాటులో ఉన్న మార్గాలలో చర్చల ప్రక్రియ ప్రారంభించాలి” అని ప్రోటోకాల్ చెబుతున్నట్లు ఆయన తెలిపాడు.

మంగళవారం చైనా, భారత్ లకు చెందిన స్ధానిక మిలటరీ కమాండర్లు ఫ్లాగ్ మీటింగ్ జరుపుతుండగానే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి వ్యాఖ్యలు వెలువడ్డాయి. ‘చైనా చొరబాటు’ వలన ఉత్పన్నమైన పరిస్ధితిని పరిష్కరించడానికి ఈ ఫ్లాగ్ మీటింగ్ జరిగిందని ది హిందు తెలిపింది. ఈ సమావేశం దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ లోనే జరిగినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 15 తేదీన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే భారత్ ప్రభుత్వం గత వారం చైనా అధికార వర్గాలతో ఈ విషయాన్ని లేవనెత్తిందని అక్బరుద్దీన్ తెలిపాడు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రంజన్ మత్తయి చైనా రాయబారికి సమన్లు జారీ చేసి సౌత్ బ్లాక్ కు పిలిపించుకుని విషయాన్ని చర్చించాడు. అలాగే విదేశీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్ బంబావాలే గత వారం చైనా ప్రభుత్వంలో అదే స్ధాయిలో ఉన్న అధికారితో ఈ విషయమై చర్చించాడు. సరిహద్దు విషయమై తలెత్తే సమస్యలు చర్చించడానికి ఏర్పడిన ‘ఇండియా-చైనా వర్కింగ్ మెకానిజం’ కు భారత్ వైపు నుండి గౌతమ్ నాయకత్వం వహిస్తుండడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

భారత ప్రభుత్వ ప్రకటనకు చైనా ప్రభుత్వం నుండి ఇతమిద్ధంగా స్పందన ఏమీ రాకున్నప్పటికీ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చైనా ఎంబసీని ది హిందు పత్రిక సంప్రదించగా తన పాత ప్రకటననే పునరుద్ఘాటించారని పత్రిక తెలిపింది. ‘వాస్తవాధీన రేఖకు సంబంధించి కుదిరిన ఒప్పందాలను చైనా బలగాలు ఉల్లంఘించలేదని, రేఖను దాటి ఒక్క అడుగు కూడా వారు ముందుకు రాలేదని’ చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. రేఖకు తమ వైపు ఉన్న ప్రాంతంలో మాత్రమే తమ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయని రేఖను వారు ఎప్పుడూ దాటలేదని చైనా విదేశాంగ ప్రతినిధి హువా బీజింగ్ లో విలేఖరులకు సోమవారం తెలిపింది.

చైనా బలగాలు గుడారం వేసాయని భారత ప్రభుత్వం చెబుతున్న ప్రాంతంలో గతంలో భారత బలగాలు గుడారాలు నిర్మించాయని పత్రికలు తెలిపాయి. అయితే భారత బలగాలు మళ్ళీ ఎన్నడూ ఆ చోటికి వెళ్లలేదు. చైనా బలగాలు ఈ ప్రాంతంలో వస్తూ పోతుండడం ఎన్నడూ జరిగే విషయమేనని, అయితే ఈసారి వారు వచ్చిన చోట పాత గుడారాలు కనిపించడంతో అక్కడ ఉండడానికి నిర్ణయించుకున్నారని దానితో ప్రస్తుత పరిస్ధితి ఏర్పడిందని పత్రికలు చెబుతున్నాయి.

పాత సిల్క్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం మంచు కొండలతో, లోతైన లోయలతో నిండి ఉండే ప్రాంతం. మానవ నివాసానికి అనువైన స్ధలం కాదు. కానీ సరిహద్దు ప్రాంతం కనుక ఎవరి భయాలు వారికి ఉండడం సహజమే. ఆ భయాలు ఘర్షణ రూపం తీసుకోకుండా జాగ్రత్త పడడం ఇరు దేశాలకు అవసరం. ఈ సమస్యలోకి ఇతరేతర శక్తులు జొరబడకుండా చూడాల్సిన అవసరం ఇరు పక్షాలకు ఉన్నది.

రానున్న మే నెలలో చైనా ప్రధాని లీ-కెకియాంగ్ భారత్ సందర్సించనున్నాడు. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లీ-కెకియాంగ్ సందర్శిస్తున్న మొట్టమొదటి దేశం ఇండియాయే కావడం గమనార్హం. భారత్ తో సంబంధాలకు నూతన ప్రధాని-అధ్యక్షులు ఎంతటి ప్రాముఖ్యం ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. అయితే చైనా బలగాలు సరిహద్దులో చేపట్టిన చర్య ‘ఈ ప్రాంతంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాని ఈ ప్రాంతం మాదే’ అని పరోక్షంగా చెప్పడానికా లేక సాధారణ పెట్రోలింగ్ చర్యల్లో మామూలుగా జరిగిన వ్యవహారమా అన్నది తేలవలసి ఉన్నది.

3 thoughts on “ఘర్షణ వైపు నడుస్తున్న భారత్-చైనా సంబంధాలు?

  1. వసంత్ గారు, చైనా, జాతి కాదు దేశం. అక్కడి ప్రజలు మెజారిటీ హాన్ జాతికి చెందినవారు.

    సమస్యను రెండు వైపుల నుండి చూడాలి. పరిశీలన ప్రారంభంలోనే పూర్వాభిప్రాయంతో మొదలుపెడితే పరిశీలనా ఫలితం ముందే నిర్ణయం అయిపోతుంది. ఇక పరిశీలన కొనసాగించి ఫలితం ఉండదు.

    పొతే చైనా పాలకుల చర్యలను దేశం మొత్తానికి లేదా మీరు చెప్పినట్లు జాతి మొత్తానికి ఆపాదించడం తొందరపాటుతనం అవుతుంది. ఢిల్లీలో వరుస అత్యాచారాలను చూసి భారతీయులు మొత్తం రేపిస్టులని చెప్పడం లాంటిదది.

  2. .
    సమస్యను రెండు వైపుల నుంచి వాస్తవికంగా చూస్తే భారత్ ముందు నుంచి సంయమనం పాటిస్తూనే ఉంది. 50 ఏళ్ల క్రితం చైనా చేయసిన దాడి మరిచిపోయారా…ఆక్సాయిచిన్ వ్యవహారంలో చైనా దూకుడు…మన రక్షణ వ్యవస్థ, హోంశాఖ అంతర్గత కంప్యూటర్ వ్యవస్థలపై సైబర్ దాడులు,అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మ్యాపులు విడుదల చేయడం, బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాములు కట్టి (నీరు పల్లమెరుగు) సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ ఈశాన్య ప్రాంత జలవనరుల చౌర్యానికి పాల్పడుతూ అదేం లేదంటూ బుకాయింపులు మరిచిపోయారా శేఖర్ గారూ.ప్రత్యేక వీసాల మంజూరు వివాదాలు, మన చుట్టుపక్కల దేశాలకు వ్యూహాత్మకంగా రక్షణ సాయం, అణ్వాయుధ పరిజ్నానంలో తోడ్పాడునివ్వడం ఇలాంటి దాష్టీకాలకు తెగబడుతున్న విషయం మరిచిపోతున్నారా….కమ్యునిస్టు సిద్ధాంతాలకు ఎప్పుడో తిలోదకాలిచ్చిన చైనాను హిందూ దినపత్రికలాగా మీరు కూడా వెనకేసుకురాకండి. వాస్తవికంగా గమనిస్తే మన దేశం ఎప్పుడూ చైనా దురాక్రమణకు కానీ కవ్వింపు చర్యలకు కానీ పాల్పడలేదు. దశాబ్దాలుగా చైనాయే కుతంత్రాలు పాల్పడుతుంది. వాస్తవాధీర రేఖ ప్రామాణిక రేఖ కానప్పటికీ ఇరు పక్షాలు శాంతియుత పరిస్థితికి అనుకూలంగా వ్యవహరిస్తామని పలుసార్లు ప్రకటించాయి. అయినా చైనా ఇలా దూకుడుగా వ్యవహరించడం ఎంత వరకు సబబు? మీరు లెఫ్ట్ భావజాలం ఉన్నవారిగా అనిపిస్తున్నప్పట్టికీ చైనాను వెనకేసుకు రావడం సరైందేనా ఒక సారి ఆలోచించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s