తూర్పు లడఖ్ ప్రాంతంలో పది కిలో మీటర్ల మేర చైనా సాయుధ బలగాలు ఇండియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయన్న వార్తలని చైనా ఖండించింది. వాస్తవాధీన రేఖ (Line of Actual Control – LAC) కు సంబంధించి ఇండియాతో కుదిరిన ఒప్పందాలను తాము అతిక్రమించబోమని, తమ సైనికులు రేఖను దాడి వెళ్లలేదని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా సరిహద్దులో భారత ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రక్షణ మంత్రి ఆంటోని ప్రకటించాడు. ఇరు దేశాల అధికారులు తాజాగా తలెత్తిన సమస్యపై చర్చలు జరుపుతున్నారని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జమ్ము & కాశ్మీరు రాష్ట్రం ఈశాన్య ప్రాంతం అయిన లడఖ్ లో ఇరు దేశాల మధ్య సరిహద్దు విషయమై ఇంతవరకు శాశ్వత ఒప్పందం ఏదీ లేదు. దానితో ఇక్కడ సైనికుల కదలికలు అనుమానాలు రేకెత్తించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏప్రిల్ 15 తేదీన తూర్పు లడఖ్ లోని దౌలత్ బేగ్ ఒల్డి (డి.బి.ఒ) సెక్టార్ లో చైనా సైనికులు 10 కి.మీ మేరకు చొచ్చుకు వచ్చాయని పత్రికలు ప్రకటించడంతో సహజంగానే అది అలజడికి దారి తీసింది. ఇరు వైపులా ఆందోళనలను సర్దిపుచ్చడానికి ఇరు ప్రభుత్వాలు రంగంలోకి ప్రయత్నాలు ప్రారంభించడం ఆహ్వానించదగిన పరిణామం.
చైనా సైనికులు ఎల్.ఏ.సి దాటి వచ్చి ఒక సైనిక పోస్టు ఏర్పాటు చేశారని భారత అధికారులు చేసిన ప్రకటన తాజా అలజడికి మూల కారణం. 50 మంది సైనికులతో కూడి ఉండే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్లాటూన్ ఎల్.ఏ.సి కి ఇవతల ఒక టెంటు నిర్మించారని అధికారులు తెలిపారు. ఈ వార్తను పత్రికలు, ఛానెళ్లు పతాక శీర్షికలతో కవర్ చేయడంతో చైనా స్పందించింది. తమ సరిహద్దు కాపలా సైనికులెవరూ భారత భూభాగంలోకి అడుగు పెట్టలేదని ఎల్.ఏ.సి కి చైనా వైపు ఉన్న భూభాగానికి మాత్రమే వారు పరిమితం అయ్యారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం ప్రకటించింది.
“చైనా సరిహద్దు దళాలు ఇరు దేశాల ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాయని నేను పునరుద్ఘాటిస్తున్నాను. వాస్తవాధీన రేఖకు కూడా అవి కట్టుబడి ఉన్నాయి.” అని హువా తెలిపింది. “మా సరిహద్దు దళాలు చైనా వైపు భాగంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి” అని ఆమె తెలిపింది. భారత మీడియా కొన్ని ఊహాగానాలు చేస్తున్నదని కాని అవి నిజం కాదని హువా చెబుతోంది. “గత కొన్ని రోజులుగా భారత ప్రెస్ కవరేజిని నేను అనుసరిస్తున్నాను. సంబంధిత భారత అధికారులు కూడా ఈ అంశం పై ప్రకటనలు జారీ చేశారు. వారు విషయాన్ని విశదీకరించారు. వారి వివరణను చూడాలని కోరుతున్నాను” అని హువా బీజింగ్ లో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పింది.
ప్రస్తుతం చర్చలో ఉన్న డి.పి.ఒ సెక్టార్ లో వాస్తవాధీన రేఖను కూడా ఖచ్చితంగా, స్పష్టంగా నిర్ణయించుకోలేదని భారత అధికారులు అంగీకరుస్తున్న విషయం గమనార్హం. అంటే ఒకే ప్రాంతాన్ని తమ ప్రాంతం అంటే కాదు తమ ప్రాంతం అని చైనా, ఇండియాలు భావిస్తున్నాయన్న మాట. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. తమ ప్రాంతంగా భావిస్తున్న చోట చైనా సైన్యం కొత్తగా టెంటు నిర్మించి సైనిక పోస్టు నెలకొల్పింది. కానీ అది మన ప్రాంతం అని భారత ప్రభుత్వం కూడా భావిస్తోంది. దానితో చైనా సైనికులు చొరబాటుకి దిగారని భారత అధికారులు ప్రకటించారు. చొరబాటు సంగతి పక్కనబెట్టి ఇప్పటికైనా ఈ సరిహద్దు స్పష్టంగా నిర్ణయించుకోవడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారంగా కనిపిస్తోంది. ఈ లోపు అనవసర హడావుడి చేయడం మానుకుంటే పత్రికలు జనానికి చాలా మేలు చేసినట్లే.
ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాలు 2010లో ఇప్పటికే ఒక మెకానిజం ఏర్పాటు చేసుకున్నాయి. “Mechanism on Coordination and Consultation on Border Affairs” అని దానికి పేరు కూడా పెట్టుకున్నాయి. అప్పటి చైనా ప్రధాని వెన్ జియా బావో చొరవ మేరకు భారత ప్రధాని అంగీకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలలో ఇటువంటి సమస్యలు వచ్చినపుడు కేవలం ఎదురు బొదురు కూర్చొని మాట్లాడే సమావేశాల కోసం ఎదురు చూడకుండా ఫోన్ ద్వారా కూడా మాట్లాడుకుని పరిష్కరించుకోగల అంశాలను ఫోన్ లో చర్చించుకోవడం ఈ మెకానిజంలోని ఒక అంశం.
సమస్యలు లేకుండా కూడా ఇప్పటికే రెండు సార్లు ఇరు దేశాల అధికారులు టెలి ఫోన్ ద్వారా సంభాషించుకున్నారని భారత ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. ప్రస్తుతం కూడా వారు అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. చైనా నుండి ఉన్నత స్ధాయి ప్రతినిధి బృందం త్వరలో ఇండియా సందర్శించనుండడంతో ప్రస్తుత సమస్య పరిధి దాటకుండా ఉండడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
చైనా ఇండియాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి చైనా నూతన అధ్యక్షుడు, ప్రధాన మంత్రులు “తాము మూడు అంశాల విధానాన్ని అనుసరిస్తున్నామని” డర్బన్ లో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ప్రధాని మన్మోహన్ కి తెలిపారు. అవి: 1. సరిహద్దులో శాంతి నెలకొనేలా జాగ్రత్త వహించడం 2. ఆర్ధిక సంబంధాలు విస్తృతం చేసుకోవడం 3. అంతర్జాతీయ పాలన, భద్రతా సంబంధిత అంశాల్లో పరస్పర ఏకీభావానికి ప్రయత్నించడం. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వివిధ చర్యలు క్రమంగా ఊపందుకున్నట్లు వివిధ సందర్భాల్లో వస్తున్న పత్రికల వార్తల ద్వారా స్పష్టం అవుతోంది. ఇందులో ఎవరి చిత్తశుద్ధి ఎంత ఉందన్నదీ చర్చాంశమే అయినా అనవసరంగా పరిస్ధితి చేయిదాటి పోవడం ఇరు దేశాలకు, ప్రజలకు శ్రేయస్కరం కానేరదు.