ఢిల్లీ పాప అత్యాచారం: రెండో నిందితుడి అరెస్టు


పాప కోలుకోవాలని ప్రార్ధిస్తున్న ఢిల్లీ స్కూల్ విద్యార్ధులు

పాప కోలుకోవాలని ప్రార్ధిస్తున్న ఢిల్లీ స్కూల్ విద్యార్ధులు

తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ లో ఐదేళ్ల పాపపై అత్యాచారం జరిగిన కేసులో రెండో వ్యక్తి పాత్రను నిరాకరిస్తూ వచ్చిన పోలీసులు సోమవారం అందుకు విరుద్ధమైన పరిణామాన్ని దేశ ప్రజల ముందు ఆవిష్కరించారు. రెండో నిందితుడుగా భావిస్తున్న ప్రదీప్ ను బీహార్ లోని లఖిసారాయ్ జిల్లా నుండి అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు సోమవారం ప్రకటించారు. తాను పాపపై ఏ అఘాయిత్యానికి తలపెట్టలేదని, అత్యాచారం చేసింది ప్రదీప్ అని మనోజ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పాపపై అత్యాచారం జరిపినట్లు ప్రదీప్ తమ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అయితే ప్రదీప్ చెప్పిందాని ప్రకారం అత్యాచారంలో ఇద్దరూ భాగం పంచుకున్నారు.

పాప పైన అమానుష రీతిలో జరిగిన పాశవిక అత్యాచారంలో మనోజ్ కాకుండా మరొకరి పాత్ర ఉందని పత్రికలు మొదటి నుండి చెబుతూ వచ్చాయి. అయితే ఈ వార్తలను పోలీసులు కొట్టిపారేశారు. రెండో వ్యక్తి పాత్ర ఉన్నదీ లేనిదీ మనోజ్ ని విచారిస్తే తేలుతుందని ఒక మాట కూడా పోలీసులు అన్నారు. అనంతరం రెండో వ్యక్తి పాత్ర ఉందన్న పుకార్లు నమ్మొద్దని పోలీసులు ప్రకటన జారీ చేశారు. కానీ ఉన్నట్లుండి ఆదివారం సాయంత్రం పోలీసులు తాము రెండో అనుమానితుడి కోసం వెతుకుతున్నట్లు పత్రికలకు తెలియజేశారు.

పోలీసు వర్గాల ప్రకారం నేరం జరిగిన సమయంలో తనతో పాటు మరో వ్యక్తి తన గదిలో ఉన్నాడని మనోజ్ పోలీసులకు చెప్పాడు. నిజానికి పాప పైన అఘాయిత్యానికి పాల్పడింది తాను కాదని తన స్నేహితుడు ప్రదీప్ అని మనోజ్ సాహ్ తెలిపాడు. అత్యాచారంలో రెండవ వ్యక్తి పాత్ర ఉందా లేక మనోజ్ పారిపోవడానికి మాత్రమే అతను సహాయం చేశాడా అన్న విషయం తాము విచారిస్తున్నామని పోలీసులు మొదట తెలిపారు.

బీహార్ లోని లఖిసరాయ్ జిల్లా నుండి రెండో నిందితుడు ప్రదీప్ ను అరెస్టు చేశామని సోమవారం ప్రకటించారు. లఖిసరాయ్ జిల్లా ఎస్.పి రాజీవ్ మిశ్రా ఈ మేరకు తమకు సమాచారం ఇచ్చాడని ‘ది హిందు’ పత్రిక తెలిపింది. బరహాయ్ పోలీసు స్టేషన్ పరిధిలోని లోహియా చౌక్ లో అతని బంధువుల ఇంటినుండి సోమవారం తెల్లవారు ఝామున 1:30 గంటలకు ప్రదీప్ ని అరెస్టు చేశామని మిశ్రా తెలిపాడు. విచారణలో తాను పాప పైన లైంగిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రదీప్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మనోజ్, తాను ఇద్దరం పాప పైన అత్యాచారానికి పాల్పడ్డామని ప్రదీప్ పోలీసులకు తెలిపాడు.

పి.టి.ఐ మరిన్ని వివరాలు అందజేసింది. ఏప్రిల్ 15 తేదీన మనోజ్ గదికి ప్రదీప్ వచ్చాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మనోజ్ ప్రకారం, మద్యపానం అనంతరం గదికి ఒక అమ్మాయిని తీసుకు రమ్మని ప్రదీప్ మనోజ్ పైన ఒత్తిడి తెచ్చాడు. మనోజ్ బైటికి వచ్చి చాక్లెట్ ఆశ చూపి పాపను తన గదికి తీసుకెళ్ళాడు. గదిలో ప్రదీప్ పాపపై అత్యాచారానికి తెగబడ్డాడు. తాను పాపపై అత్యాచారం చేయలేదని మనోజ్ పోలీసులకు చెబుతున్నాడు. అత్యాచారం అనంతరం పాప తమను గుర్తిస్తుందన్న భయంతో గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించారు. పాప స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించి ఇద్దరు రైలెక్కి బీహార్ పారిపోయారు. ఒకరు ముజఫర్ పూర్ జిల్లాకు మరొకరు లఖిసరాయ్ జిల్లాకు పారిపోయి బంధువుల ఇళ్ళలో తలదాచుకున్నారు.

ప్రదర్సనలు, బైఠాయింపులు

ఇదిలా ఉండగా అత్యాచారంకి నిరసనగా ఢిల్లీలో నిరసనలు, వీధి పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈసారి నిరసనలకు రాజకీయ పార్టీలు సారధ్యం వహిస్తున్నాయి. బి.జె.పి, ఆం ఆద్మీ పార్టీతో పాటు ఎ.ఐ.ఎస్.ఎఫ్, ఎ.ఐ.ఎస్.ఎ లాంటి విద్యార్ధి సంఘాల కార్యకర్తలు పోలీసులతో తలపడుతున్నారు. ఆదివారం కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ ఇళ్ల ముందు వివిధ పార్టీలు, విద్యార్ధి సంఘాల నేతలు బైఠాయింపు జరిపారు.

ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ ను తప్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వెంటనే ఫిర్యాదు నమోదు చేసుకుని వెతుకులాట ప్రారంభించకపోవడం వల్ల పాప ప్రాణాపాయ స్ధితికి చేరుకుందని వారు ఆరోపిస్తూ దానికి బాధ్యత వహించి నీరజ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాప చికిత్స పొందుతున్న ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ వద్ద కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆసుపత్రి వద్ద గుమి కూడి అనేకమంది పాపకు సహానుభూతిని తెలుపుతున్నారు.

ఆందోళనలో అటు లెఫ్ట్ నుండి ఇటు రైట్ వరకు వివిధ రాజకీయ భావాల పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు పాల్గొంటున్నాయి. కొన్నిసార్లు ఒకే చోట కలిసి ఆందోళన చేస్తుండగా, కోన్ని చోట్ల విడివిడిగా నినాదాలు ఇస్తూ నిరసనలు నిర్వహిస్తున్నారు. సోమవారంతో ఆందోళనలు నాలుగో రోజులోకి ప్రవేశించాయి. ఆం ఆద్మీ పార్టీ చొరవ తీసుకుని ఉధృతంగా ఆందోళన ప్రారంభించడంతో ఇతర పార్టీలు కూడా అనివార్యంగా రంగంలోకి దిగిన పరిస్ధితి కనిపిస్తోంది. ప్రధాని ఇంటి ముందు, ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ ముందు ఆమాద్మి పార్టీ కార్యకర్తలు నాలుగు రోజుల నుండి బైఠాయింపు జరుపుతున్నారు.

బి.జె.పి మహిళా మోర్చా కార్యకర్తలు సోనియా గాంధీ నివాసం పై దృష్టి కేంద్రీకరించారు. పోలీసులు నెలకొల్పిన బారికేడ్లను తోసుకుంటూ 10, జనపధ్ లోకి చొచ్చుకు వెళ్లడానికి మహిళలు విఫలయత్నం చేశారు. కేంద్రం లోనూ, ఢిల్లీ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే మహిళలపై అత్యాచారాలకు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అడుగుంటాయని దాని ఫలితంగా నేరస్ధులు పేట్రేగి పోతున్నారని వారు ఆరోపించారు. మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు.

ఆం ఆద్మీ పార్టీ వారు సిటిజన్స్ సెక్యూరిటీ ఫోర్స్ నెలకొల్పాలని కొత్త డిమాండ్ ని ప్రభుత్వం ముందు ఉంచారు. పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద వారు రాత్రింబవళ్ళు బైఠాయింపు కొనసాగించారు. రాత్రి పూట వారి సంఖ్య పలచగా ఉన్నప్పటికీ సోమవారం తెల్లవారాక వారి సంఖ్య పెరిగింది. పోలీసులు ఆందోళనలకు ఇస్తున్న ప్రతిస్పందన కూడా ఈసారి వినూత్నంగా ఉన్నది. తమదైన పద్ధతిలో లాఠీలు, నీటి క్షిపణులతో విరుచుకుపడకుండా తాము ఎటువంటి చర్యలు తీసుకున్నది వివరిస్తూ కరపత్రాలు ముద్రించి ఆందోళనకారులకు పంచుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేశామని, విచారణ చేస్తున్నామని కరపత్రాల్లో వారు తెలిపారు.

అయితే ఆం ఆద్మీ కార్యకర్తలు కరపత్రాలకు సానుకూలంగా స్పందించలేదు. కరపత్రాలను చించిపారేశారు. పోలీసుల చిత్తశుద్ధిని వారు తిరస్కరించారు. వారు నెమ్మదిగా ప్రధాని ఇంటివైపు కదలడంతో పోలీసులు బారికేడ్లు ప్రతిష్టించారు. అయినప్పటికీ బారికేడ్లు అతిక్రమించి కనీసం 50 మంది వరకు ప్రధాని నివాసానికి చేరుకున్నారని ది హిందు తెలిపింది. ప్రధాని ఇంటి ముందు వారు బైఠాయించి నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s