బోస్టన్ పేలుళ్ళ అనుమానితుల చిత్రం విడుదల, ఒకరి కాల్చివేత


CNN చెప్పిన నల్లజాతి వ్యక్తులు వీరే

CNN చెప్పిన నల్లజాతి వ్యక్తులు వీరే

బోస్టన్ మారధాన్ బాంబు పేలుళ్ళ కేసులో ఇద్దరు అనుమానితుల చిత్రాలు, వీడియోలను అమెరికా ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (ఎఫ్.బి.ఐ) విడుదల చేసింది. సి.సి కెమెరాలు రికార్డు చేసిన వీడియో నుండి ఇద్దరు అనుమానితులను ఎఫ్.బి.ఐ గుర్తించింది. వీడియో, చిత్రాలను విడుదల చేస్తూ వారి గురించి తెలిసినవారు సమాచారం ఇవ్వాలని ఎఫ్.బి.ఐ కోరింది. బాంబులు పెట్టిన వ్యక్తి నల్ల వ్యక్తి అని ‘న్యూయార్క్ పోస్ట్’, ‘బోస్టన్ టైమ్స్’ లాంటి పత్రికలు చేసిన ప్రచారం నిజం కాదని ఎఫ్.బి.ఐ విడుదల చేసిన ఫోటో ద్వారా తెలుస్తోంది. కాగా ఇద్దరు అనుమానితుల్లో ఒకరిని అప్పుడే చంపేశామని అధికారులు ప్రకటించారు.

అనుమానితులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, వారిని అత్యంత ప్రమాదకారులుగా గుర్తించాలని ఫెడరల్ భద్రతా సంస్ధ పౌరులను కోరింది.  ఎఫ్.బి.ఐ విడుదల చేసిన చిత్రంలో అనుమానితులు వీపు వెనుక సంచులతో కనిపించారు. ఒక వ్యక్తి నల్ల టోపీ, రెండో వ్యక్తి తెల్ల టోపీ ధరించి ఉన్నారు. ఇద్దరూ ఒకరికొకరు సంబంధం ఉన్నవారేనని అనుమానిస్తున్నట్లు ఎఫ్.బి.ఐ చెపుతోంది. వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన బోస్టన్ మారధాన్ పరుగు పందేన్ని ప్రేక్షకులు వీక్షిస్తుండగా వారి వెనుకవైపు నుండి బాంబు పేలిన స్ధలం వైపుకి అనుమానితులు నింపాదిగా నడిచి వెళుతున్నట్లు కనిపిస్తోంది.

అనుమానితుల్లో తెల్ల టోపీ ధరించిన వ్యక్తి తన సంచిని బాంబు పేలుడు స్ధలం వద్ద ఉంచుతున్న వీడియో కూడా ఎఫ్.బి.ఐ వద్ద ఉందని పి.టి.ఐ ని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. ఎఫ్.బి.ఐ ఏర్పాటు చేసిన పత్రికల సమావేశంలో వీడియో, చిత్రాలను విడుదల చేశారు. సమాచారం తెలిసినవారు వెంటనే ఎఫ్.బి.ఐ కి చెప్పాలని కోరారు. “ఈ వ్యక్తులను ఎవరికో కొందరికి తెలిసే ఉంటారు… వీరి అత్యంత ప్రమాదకారులుగా మేము పరిగణిస్తున్నాము” అని ఎఫ్.బి.ఐ ఏజెంటు చెప్పాడని ది హిందు తెలిపింది.

నల్ల వ్యక్తి

అంతకు ముందు అమెరికా పత్రికలు పేలుళ్ళ ఘటనపై తమకు తోచిన విధంగా ఊహాగానాలు చేశాయి. పోలీసు అధికారులు చెప్పారని చెబుతూ ఒక చిన్న పోర్టబుల్ బాంబు పేలుడికి ఉపయోగించారని ఆస్ట్రేలియాకు చెందిన ఎబిసి న్యూస్ ప్రకటించింది. తద్వారా బాంబులు విదేశాల్లో తయారు చేసి తెచ్చారన్న ఊహాగానాలకు తెరతీసింది.

మరి కొన్ని పత్రికలు ఇంకా ముందుకు వెళ్ళాయి. “బాంబు శిధిలాలతో గాయపడిన సౌదీ జాతీయుడిని అనుమానితుడిగా ఫెడరల్ పోలీసులు గుర్తించారు” అని న్యూయార్క్ పోస్ట్ పత్రిక ప్రకటించింది. తమకు పోలీసులే ఈ సమాచారం ఇచ్చారని కూడా ఆ పత్రిక తెలిపింది. బోస్టన్ గ్లోబ్ పత్రిక అయితే ఒక సౌదీ జాతీయుడు పేలుడు స్ధలం నుండి పరుగెత్తి పారిపోతుండగా జనం వెంటపడి పట్టుకున్నారని ప్రకటించింది.

ఇక సి.ఎన్.ఎన్ పత్రిక పేలుడు పాపాన్ని నల్లజాతి ప్రజల పైన మోపింది. పరిశోధన చేస్తున్న అధికారులు నల్ల రంగు చర్మ కలిగిన వ్యక్తి లేదా నల్ల పురుష వ్యక్తికోసం వెతుకుతున్నట్లు ప్రకటించారని సి.ఎన్.ఎన్ పత్రిక వార్త ప్రచురించింది. సదరు నల్ల వ్యక్తి విదేశీ యాసలో మాట్లాడాడని కూడా ఆ పత్రిక నిర్ధారించింది. తద్వారా సంఘటన స్ధలంలో ఉన్న నల్లవారందరి పైన అనుమానాలు కలిగే వాతావరణం సృష్టించింది.

ఈ వార్తలన్నింటినీ బోస్టన్ పోలీసులు తిరస్కరించారు. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుడతాయి అని వారు ప్రశ్నించారు. నిజాయితీగా చెప్పాలంటే తాము ఏ పత్రికకూ సమాచారం ఇవ్వలేదని, ప్రత్యేకంగా అనుమానితులేవ్వరూ తమ దృష్టిలో లేరని పోలీసులు చెబుతూ వచ్చారు.

ఎం‌ఐ‌టిలో కాల్పులు

బోస్టన్ పేలుళ్ళ గురించి పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) లో ఒక పోలీసును గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడని అతని కోసం వేట జరుగుతోందని పోలిసులు తెలిపారు. యూనివర్సిటీలో కాల్పులు జరిగిన చోటికి వెళ్తున్న పోలీసులపై ఒక వ్యక్తి కారు నుండి గ్రేనేడ్ విసిరాడని బోస్టన్ గ్లోబ్ పత్రిక చెప్పింది. ఇద్దరు అనుమానితుల్లో ఒకరిని అరెస్టు చేశారని, అతను బోస్టన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలోనే పట్టుబడ్డాడని, పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారని బోస్టన్ గ్లోబ్ తెలిపింది. అయితే ఇంతలోనే అతన్ని చంపేశారని ది హిందు తెలిపింది.

రెండో అనుమానితుడి కోసం పెద్ద ఎత్తున వేట కొనసాగుతోంది. బోస్టన్ శివార్లలోని వాటర్ టౌన్ లో స్ధానిక నివాసులు ఎవరూ ఇళ్ల నుండి బైటికి రావద్దని, ఇంటిలోకి ఎవరిని రానీయవద్దని ప్రకటించారు. మిడిలెసెక్స్ జిల్లా అటార్నీ ప్రకారం ఇద్దరు అనుమానితులు గురువారం మిట్ లో జొరబడి ఒక పోలీసు అధికారిని కాల్చి చంపారు. అనంతరం తుపాకి చూపి ఒకరి కారు దొంగిలించి డ్రైవర్ ను వదిలిపెట్టారు. కారులో పారిపోతూ వాటర్ టౌన్ లో ప్రవేశించారు. పోలీసులు వారిని వెంబడించడంతో వారిపైకి పేలుడు పదార్ధాలు విసిరారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అనుమానితుల్లో ఒకరు తీవ్రంగా గాయపడి అనంతరం చనిపోయాడు. పారిపోతున్న మరో వ్యక్తి టెర్రరిస్టు అనీ, ప్రజలను చంపడానికే వారు వచ్చారని పోలీసులు ప్రకటించారు. అయితే వారు కారు డ్రైవర్ ను చంపకుండా ఎందుకు వదిలిపెట్టిందీ తెలియలేదు.

మిట్ ఘటనలోని వ్యక్తులకు బోస్టన్ మారధాన్ పేలుళ్లకు సంబంధం ఉన్నదీ లేనిదీ ఎఫ్.బి.ఐ నిర్ధారించలేదు. బోస్టన్ కి 16 కిమీ దూరంలోని కేంబ్రిడ్జి కేంపస్ లో మిట్ వద్ద అసలేం జరిగిందో స్ధానిక పోలీసులతో కలిసి విచారిస్తున్నామని ఎఫ్.బి.ఐ తెలిపింది. రాష్ట్ర పోలీసులు మాత్రం మిట్ ఘటనలోని వారే మారధాన్ పేలుళ్లకు కారకులు కావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపారు. అయితే పేలుళ్లు జరిగిన తర్వాత పేలుళ్లకు కారకులు అక్కడికి సమీపంలోనే ఎందుకు తచ్చాడుతున్నట్లు? అది కూడా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు దగ్గర ఉంచుకుని మూడు రోజుల వరకు అదే చోట ఎందుకు ఉంటారు? పైగా పోలీసును కాల్చి చంపడం అంటే తాము అక్కడే ఉన్నామని పోలీసులకు మైకులో అరిచి చెప్పడమే కదా?

మిట్ లో ఏదో అలజడిగా ఉందని సమాచారం రాగా పోలీసు అక్కడికి వెళ్లాడని, దానితో ఆయనని కాల్చి చంపారని పత్రికలు చెబుతున్నాయి. ఆ అలజడి ఏమైందీ పత్రికలు గానీ, పోలీసులు గానీ ఇంకా చెప్పలేదు. మొత్తం మీద బోస్టన్ పేలుళ్లకు సంబంధించి ఎన్ని సమాధానాలు వస్తున్నాయో అంతకు రెట్టింపు అనుమానాలు తలెత్తుతున్నాయి.

బోస్టన్ పత్రిక అందజేసిన కింది ఫోటోలు పేలుళ్ళ పై మరింత దృశ్య సమాచారాన్ని ఇస్తున్నాయి.

అప్ డేట్

అనుమానితులు ఇద్దరినీ గుర్తించినట్లు అమెరికా ప్రకటించింది. ఇద్దరూ సోదరులని రష్యన్ రిపబ్లిక్ చెచెన్యా నుండి వచ్చారని అమెరికా భద్రతాధికారులు చెప్పినట్లు ఎన్.బి.సి న్యూస్ తెలిపింది. ఇద్దరికీ అంతర్జాతీయ సంబంధాలు ఉన్నయయని, మిలిటరీ అనుభవం కూడా ఉందని వారు చెబుతున్నారు. అనేక సంవత్సరాల నుండి వారు అమెరికాలోనే ఉంటున్నారని కానీ వారికి శాశ్వత నివాసానికి అమెరికా అనుమతి ఇచ్చిందని అధికారులు తెలిపారు. సోదరులు ఇద్దరు 19, 20 సం. వయసు వారని, పోలీసు కాల్పుల్లో పెద్ద సోదరుడు చనిపోయాడని, రెండో వ్యక్తి కోసం వేట కొనసాగుతోందని ఎన్.బి.సి న్యూస్ తెలిపింది.

చెచెన్యా ఇస్లామిక్ ప్రాంతం. రష్యా నుండి విడిపోవడానికి తీవ్రంగా పోరాడింది. రష్యా ప్రభుత్వం చెచెన్యా తిరుగుబాటుని ఉక్కుపాదంతో అణచివేసింది. చెచెన్యా తిరుగుబాటుదారులకు ఆయుధ, అర్ధ బలం సరఫరా చేసింది అమెరికాయే కావడం గమనార్హం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s