“ఇది రేషన్ కోసం. బంగారం కోసం క్యూ అదిగో, అక్కడుంది!”
———————————
గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీ స్ధాయిలో పతనం అవుతోంది. ఇండియాలో అయితే గత శనివారం నుండి బంగారం రేటు పెద్ద ఎత్తున పడిపోతోంది. మంగళవారం వరకు భారీగా పతనం అయిన బంగారం ధర బుధవారం కూడా పతనం కొనసాగి ట్రేడింగ్ చివర కొద్దిగా పెరిగినట్లు తెలుస్తోంది.
భుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర 25,790 రూపాయల వద్ద స్ధిరంగా ఉన్నట్లు పత్రికలు తెలిపాయి. శనివారం, సోమవారం ట్రేడింగుల్లో మొత్తం 2,000 వరకు తగ్గిన 10 గ్రా. బంగారం ధర ఒక్క మంగళవారం రోజే రు. 1,160 పడిపోయింది. మళ్ళీ బుధవారం పతనం కొనసాగినా భారీ స్ధాయి పతనం కొనసాగలేదు. బుధవారం ట్రేడింగులో ఒక దశలో రు. 25,435 కు చేరిన 10 గ్రా. బంగారం ధర అనంతరం కొద్దిగా పుంజుకుని 25,790 కు చేరింది. గత సంవత్సరం బంగారం ధర 10 గ్రాములకు 32,000 గా ఉంటే ఇప్పుడు దాదాపు 26,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే దాదాపు 6,000 రూపాయల పతనం!
అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు (28.3495 గ్రాములు) బంగారం ధర బుధవారం నాటికి 1,390 డాలర్లు ఉందని ది హిందు తెలిపింది. సెప్టెంబరు 2011లో అంతర్జాతీయ మార్కెట్ లో చేరిన అత్యధిక ధర 1923.70 డాలర్లు. దానితో పోలిస్తే నిన్నటి ధర 28 శాతం పతనంతో సమానం. ఈ పతనంలో అత్యధికంగా గత ఐదారు రోజుల్లోనే సంభవించిందని పత్రికల ద్వారా తెలుస్తోంది.
బంగారం ధర పతనానికి అనేకకారణాలు వినిపిస్తున్నాయి. ద్రవ్య సంక్షోభంలో కూరుకుపోయిన సైప్రస్ తన సావరిన్ బంగారాన్ని అమ్మకానికి పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్ లో పెద్ద ఎత్తున బంగారం ప్రవేశించి దాని ధరలు పతనం అవుతున్నాయని బ్లూమ్ బర్గ్ లాంటి సంస్ధలు చెబుతుండగా, స్టాక్ మార్కెట్ పతనం కావడం వలన జపాన్ ప్రజలు బంగారం కొనుగోలు చేస్తున్నారని దానివల్ల బంగారం ధర పడిపోతోందని రాయిటర్ వార్తా సంస్ధ చెబుతోంది. అయితే అసలు కారణాలు ఇవేవీ కాదని అమెరికన్ రిజర్వ్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు (ఫెడ్) డాలర్ విలువ కాపాడుకోవడానికి పేపర్ గోల్డ్ లో షార్ట్ సెల్లింగ్ కు దిగిందని ఇదే బంగారం పతనానికి కారణం అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కారణం ఏదైనా బంగారం ధర పతనంతో భారత దేశంలో బంగారం కోట్ల ముందు పెద్ద పెద్ద క్యూలు దర్శనం ఇస్తున్నాయి. హైద్రాబాద్ లో చంటిబిడ్డల్ని చంకనేసుకుని మరీ బంగారం షాపుల ముందు క్యూలు కట్టారని పత్రికలు చెబుతున్నాయి. రేషన్ షాపు క్యూల కంటే బంగారం షాపు క్యూలే చాంతాడంత ఉంటున్నాయని ఈ కార్టూన్ సూచిస్తోంది.
మరి చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కడో ఒక చోట ఖర్చు పెట్టాలి మనీ ఒక చొటు నుంచి ఇంకొ చొటుకి వెల్తూ ఉటుంది అది డబ్బు స్వభావం అది స్థిరం గా ఉండదు దాని వెనుక వెల్లేవాళ్ళూ అంతే the power of money