టెక్సాస్: భూకంపం తలపిస్తూ ఎరువుల ఫ్యాక్టరీ పేలుడు, మరణాలు 70? -ఫోటోలు


అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వాకో నగరం వద్ద ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ భారీ స్ధాయిలో పేలిపోయింది. 5 నుండి 15 మంది వరకు చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతుండగా పత్రికలు డజన్ల మంది మరణించి ఉండవచ్చని భావిస్తున్నాయి. 70 మందికి పైనే మరణించారని స్ధానిక పత్రికలు చెప్పినట్లు తెలుస్తోంది. 160 మందికి పైగా గాయపడ్డారని బి.బి.సి తెలిపింది. ఎరువుల ఫ్యాక్టరీ కావడంతో మంటల వలన వ్యాపిస్తున్న దట్టమైన పొగ విషపూరితంగా ఉన్నదని, దానితో వివిధ విభాగాల భద్రతా బలగాలు, ఫైర్ సిబ్బంది పని కష్టంగా ఉందని రష్యా టుడే (ఆర్.టి) తెలిపింది. ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివాస ప్రాంతాలను విషవాయువులు చుట్టుముడుతున్నాయని తెలుస్తోంది.

గురువారం తెల్లవారు ఝామున (టెక్సాస్ లో బుధవారం రాత్రి 7:50) వాకో ఉత్తరాన గల వెస్ట్ పట్టణంలో ప్రమాదం జరిగింది. మొదట అగ్ని ప్రమాదం సంభవించిందని, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతుండగానే భారీ పేలుడు సంభవించిందని పత్రికలు తెలిపాయి. దానితో మరణించినవారిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. 30 మీటర్ల ఎత్తుతో భారీ అగ్నిగోళం ఫ్యాక్టరీ పేలుడులో పైకి ఎగసిపడిందని ఆర్.టి తెలిపింది.

పేలుడు ఎంత భారీ స్ధాయిలో ఉన్నదంటే దానివలన చిన్న సైజు భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్ స్కేలు పైన 2.1 కొలతతో భూకంపాన్ని ఈ పేలుడు నమోదు చేసింది. “ఈ (రిక్టర్ స్కేలు) కొలత కేవలం భూమి కంపాన్ని మాత్రమే కొలుస్తుంది. గాలిలో జరిగిన ఉత్పాతాన్ని కొలవదు. కాబట్టి పేలుడు యొక్క భారీతనంతో పోలిస్తే ఈ కొలత చాలా తక్కువే” అని జీయొలాజికల్ సర్వే ప్రతినిధి చెప్పాడు.

పేలుడు ఎంత భారీగా ఉన్నదో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

హైడ్రస్ అమోనియా ట్యాంకులో మంటలు ప్రారంభం అయినాయని అవి కాస్తా ఫ్యాక్టరీ అంతా విస్తరించి భారీ పేలుడు సంభవించిందని తెలుస్తోంది. ఫ్యాక్టరీ పౌరుగు ప్రాంతం పేలుడు వలన తీవ్రంగా దెబ్బతిన్నది. సమీపంలోని నివాస భవనాలు దాదాపు నేలమట్టం అయ్యాయి. డిపార్ట్ మెంట్ పబ్లిక్ సేఫ్టీ (డి.పి.ఎస్) ప్రకారం 50 నుండి 75 వరకు ఇళ్ళు నేలకూలాయి. డి.పి.ఎస్ ప్రతినిధి విల్సన్ 1990ల ఇరాక్ యుద్ధం నాటి బాంబింగ్ తో ఫ్యాక్టరీ పేలుడును పోల్చాడు.

160 మందిని ఆసుపత్రికి తరలించారని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. కనీసం 24 మంది పరిస్ధితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడినవారు ప్రధానంగా దూసుకు వచ్చిన శిధిలాల వల్ల కోతలకు, దెబ్బలకు గురయ్యారు. అనేకమందికి ఎముకలు విరిగిపోయాయి. పేలుడు ధాటికి అద్దాలు బద్దలై గాలిలో దూసుకుపోయి అనేకమందిని గాయపరిచాయి. సమీపంలోని వ్యక్తులను గాలిలోకి గిరవాటువేయబడ్డారు. విషయవాయువు వలన కొంతమంది ఊపిరి సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. దుర్ఘటన స్ధాలంలో గాలి వేగంగా వీస్తోందని ఫలితంగా రక్షణ కార్యక్రమాలు కష్టంగా మారాయని పత్రికలు తెలిపాయి.

అనేకమంది మరణించినట్లు చెప్పడానికి డాక్టర్లు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. పట్టణానికి ఉత్తర భాగాన నివశిస్తున్న 3,000 మంది వరకు ఖాళీ చేయిస్తున్నారు. సమీపంలోని నర్సింగ్ హోమ్ లో 150 మంది వరకు చనిపోయి ఉంటారని భయపడినప్పటికి వారు తీవ్ర గాయాలతో బైటపడ్డారు.

రెండో పేలుడు జరగవచ్చని కూడా భయపడుతున్నారు. దానితో హెలికాప్టర్ ల్యాండింగ్, ఎమర్జెన్సీల కోసం వినియోగిస్తున్న సమీపంలోని ఫుట్ బాల్ గ్రౌండ్ ని ఖాళీ చేశారు. అధికారులు దుర్ఘటన స్ధలాన్ని క్రైమ్ సీన్ గా పరిగణిస్తున్నారట! పోలీసులు మాత్రం ఉద్దేశ్యపూర్వకంగా పేలుడు జరిపిన దాఖలాలు లేవని చెబుతున్నారు. రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక హెలికాప్టర్ ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.

పేలుడు ప్రాంతం దగ్గరలోని అనేక ఇళ్ళు కూడా దాదాపు పేలినట్లు అయినాయని కొన్నివార్తల ద్వారా తెలుస్తోంది. సమీపంలోని ఇళ్లన్నీ తగలబడుతున్న దృశ్యాలు యూ ట్యూబ్ వీడియోలు చూపుతున్నాయి. హైడ్రస్ గ్యాస్ గాలిలో ఉన్నందున జనం బైటికి రావద్దని అధికారులు ప్రకటించారు. రసాయనాల ప్రమాదాన్ని బట్టి ఖాళీ చేయాల్సిన ఇళ్ళు ఇంకా పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ స్ధాయి పేలుడు వలన వాతావరణం తీవ్రంగా కలుషితం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా కెమికల్ సేఫ్టీ బోర్డు పరిశోధన కోసం బృందాన్ని పంపుతున్నట్లు ప్రకటించింది.

అమ్మోనియా వాయువు విడుదల చేసిందన్న ఆరోపణలతో ఫ్యాక్టరీ పైన 2006లో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయనందుకు అమెరికా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ (ఇ.పి.ఏ) అప్పుడు 2,300 డాలర్ల జరిమానా వేసి చేతులు దులుపుకుంది. ఫ్యాక్టరీ వలన అతి పెద్ద ప్రమాదం ఏమైనా జరిగితే అది కేవలం ఒక పది నిమిషాల పాటు అమోనియా వాయువు విడుదల కావడం మాత్రమే అని అది కూడా ‘ఎవరినీ గాయపరచదు, చంపదు’ అని కంపెనీ ఇ.పి.ఏ కి అప్పట్లో హామీ ఇచ్చిందని స్ధానిక పత్రికలను ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది. కంపెనీల మాటలు ఎప్పుడూ ఇంత బూటకంగా ఎందుకు ఉంటాయో జనం తెలుసుకోవాల్సిన విషయం.

భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణం అమెరికా కంపెనీ యూనియన్ కార్బైడ్. దీనిని తర్వాత డౌ కెమికల్స్ కంపెనీ కొనుగోలు చేసింది. ఇండియాలో గ్యాస్ లీక్ చేసిన కంపెనీ అధిపతిని ఏ శిక్ష పడకుండా చేయడంలో అమెరికా ఇండియా పైన ఒత్తిడి తేగలిగింది. లేదా తమ యజమానులను తమ ప్రజలనుండి కాపాడడంలో భారత పాలకులు సఫలం అయ్యారు. ఈ నేపధ్యంలో టెక్సాస్ ఎరువుల ఫ్యాక్టరీ పేలుడు అనంతర పరిణామాలను భారతీయులు దగ్గరినుండి పరిశీలించవలసిన అవసరం ఉంది.

One thought on “టెక్సాస్: భూకంపం తలపిస్తూ ఎరువుల ఫ్యాక్టరీ పేలుడు, మరణాలు 70? -ఫోటోలు

  1. అమ్మ ఒడి బ్లాగ్ లో చదివిన ఒక పోస్ట్ నన్ను ఎప్పుడూ వెంటాడుతుంది…ఇలాంటివి చూసినప్పుడు మరీనూ….

    http://kvsv.wordpress.com/2013/04/19/%E0%B0%86%E0%B0%B5%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%85/.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s