సంచలనం! సంచలనం!! మాయాకొడ్నానికి మరణ శిక్ష కోరనున్న మోడి


బాబు భజరంగి, మాయా కొడ్నాని

బాబు భజరంగి, మాయా కొడ్నాని

ఇండియాలో నర మానవుడెవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది. దేశ రాజకీయాల్లో కార్డులు అట్టా ఇట్టా కాకుండా తిరగబడుతున్నాయి. దేశ అత్యున్నత పదవికి గురి పెట్టిన నరేంద్ర మోడి అందుకు స్వపక్షీయులనే బలిపశువులుగా నిలబెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఒకప్పటి తన నమ్మిన బంటులను ‘ప్రధాని పదవి’ అనే దేవత కోసం పార్లమెంటు ఎన్నికల వధ్య శిల పైన బలిగా అర్పించబోతున్నాడు. తన ఆజ్ఞ, అనుజ్ఞలతో గుజరాత్ లోని నరోద పాటియాలో పేద ముస్లిం ప్రజలను అత్యంత దారుణంగా ఊచకోత కోసిన, కోయించిన డాక్టర్ మాయా కొడ్నాని, బాబు భజరంగి తదితర తన మాజీ అనుంగు సహచరులకు జీవిత శిక్ష సరిపోదని, వారికి మరణ శిక్షే తగినదని హై కోర్టులో పిటిషన్ వేయబోతోంది, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం.

గుజరాత్ లో గోధ్రా రైలు దహనం అనంతరం జరిగిన మారణకాండలలో నరోడా పాటియా అత్యంత ఘోరమైనది. 97 మంది పేద ముస్లింలు ఇందులో ప్రాణాలు కోల్పోయారు. నరోద పాటియా ఎమ్మెల్యే మాయా కొడ్నాని, భజరంగ్ దళ్ నాయకుడు బాబు భజరంగిల నేతృత్వంలో హంతక మూకలు ఇల్లిల్లూ తిరిగి నరమేధం సాగించారు. చంపినవారిని ఒక పెద్ద బావిలాంటి గోతిలో కుక్కి పూడ్చారు. ఈ గొయ్యి తవ్వి శవాలను అప్పగించాలన్న ముస్లింల డిమాండు ఇప్పటివరకు విన్నవారు లేరు. మరణించినవారి సంఖ్య వాస్తవంగా 97 కంటే చాలా ఎక్కువని స్ధానిక ముస్లింలు మొరపెట్టుకున్నా విన్నవారు లేరు.

తమ అంతానికి ఆజ్ఞ ఇచ్చినవారే ప్రధాన మంత్రి పదవి కోసం న్యాయ దేవతగా ప్రత్యక్షం అవుతారని బహుశా నరోడా పాటియా ముస్లింలు ఊహించి ఉండరు. వారి తరపున అలుపు అనేది ఎరగకుండా పోరాటం చేస్తున్న తీస్తా సేతల్వాద్ సైతం తాజా పరిణామాన్ని కలలో సైతం ఊహించి ఉండకపోవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న సామెత ఉండడం నిజమే గానీ పదవి కోసం నమ్మినవారిని మరణ శిక్ష వైపు నెట్టే దిగజారుడుతనం కూడా ఈ సామెతలో ఇమిడి ఉంటుందని ఇప్పుడే తెలియడం.

నరోడా పాటియా కేసులో డాక్టర్ మాయా కొడ్నాని, బాబు భజరంగి లతో సహా మొత్తం 32 మందిని దోషులుగా ట్రయల్ కోర్టు నిర్ధారించింది. బాబు భజరంగి శేష జీవితం అంతా జైలులో గడపాలని తీర్పు ఇచ్చిన కోర్టు మాయా కొడ్నానికి 28 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరో ఎనిమిది మంది దోషులకు 31 సంవత్సరాల జైలు శిక్ష విధించగా 22 మందికి 24 సంవత్సరాల జీవిత ఖైదు విధించింది. (కేసు వివరాల కోసం ఈ లింక్ చూడండి.)

భారత దేశంలో మొట్టమొదటిసారిగా, వివిధ నేరాలకు ఏకకాలంలో అనుభవించే విధంగా కాకుండా ఒక దాని తరువాత మరొకటి శిక్ష అనుభవించే విధంగా ఈ కేసులో తీర్పు వెలువడింది. మరణ శిక్ష విధించడానికి తగిన అర్హత కేసుకు ఉన్నదని నిర్ధారించినప్పటికీ ట్రయల్ కోర్టు జడ్జి జస్టిస్ జ్యోత్స్న యాజ్ఞిక్ దానికి బదులు వరుస శిక్షలు వేయడానికి మొగ్గు చూపింది. ప్రపంచవ్యాపితంగా మరణ శిక్షకు వ్యతిరేకంగా అనేక దేశాలు నిర్ణయం తీసుకునాయని, మానవ హక్కుల సంఘాలు సైతం మరణ శిక్షను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాయని ఈ నేపధ్యంలో మరణ శిక్ష వేయడంలేదని జస్టిస్ జ్యోత్స్న గత సంవత్సరం ఆగస్టులో తీర్పు చెబుతూ వ్యాఖ్యానించారు.

ఈ నేపధ్యంలో మాయా కొడ్నాని, బాబు భజరంగిలతో సహా 10 మంది దోషులకు మరణ శిక్ష విధించాలని గుజరాత్ ప్రభుత్వం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. 24 సంవత్సరాల జీవిత ఖైదు శిక్ష విధించబడిన 22 మంది దోషులకు శిక్ష కాలాన్ని 31 సంవత్సరాలకు పెంచాలని నరేంద్ర మోడి నేతృత్వంలోని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నది. ఇంకా ఆశ్చర్యకరంగా నిర్దోషులుగా విడుదల అయిన 29 మంది కూడా దోషులేనని, వారిని కూడా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం కొరనుంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేసిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం’ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ది హిందు తెలిపింది. ప్రత్యేక కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా హై కోర్టుకి అప్పీలుకు వెళ్లనుంది.

అప్పీలు కోసం ముగ్గురు అడ్వకేట్లతో ప్రత్యేక బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. “న్యాయ విభాగం ముగ్గురు అడ్వకేట్లతో ఒక కమిటీని నియమించింది. వీరు హైకోర్టులో వేసే అప్పీలును తయారు చేస్తారు. కొడ్నాని, భజరంగిలతో సహా 10 మందికి మరణ శిక్ష వేయాలని అప్పీలు కోరుతుంది. ట్రయల్ కోర్టు వీరికి యావజ్జీవ శిక్షలు విధించింది” అని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరంగ్ వ్యాస్ చెప్పాడని పి.టి.ఐ తెలిపింది. ఇది అరుదైన కేసుల్లో కెల్లా అరుదైనదని తాము చెప్పదలిచామని వ్యాస్ అన్నాడని ఎన్.డి.టి.వి తెలిపింది.

ప్రధాన మంత్రి పదవికి పోటీపడుతున్న నేపధ్యంలో నరేంద్ర మోడి తనను వదిలి పోనంటున్న ‘గుజరాత్ మారణకాండ’ నీడను వదిలించుకోడానికే ఈ వ్యవహారానికి తెరతీశారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. నిజానికి ట్రయల్ కోర్టు తీర్పు పైన అప్పీలుకి వెళ్లాలంటే అది మూడు నెలల లోపు జరగాలి. కానీ నరోడా పాటియా కేసులో తీర్పు ప్రకటించి ఏడు నెలలు దాటింది. గడువు ముగిశాక అప్పీలుకు వెళ్ళాలంటే మొదటి హై కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. హై కోర్టు అనుమతి ఇస్తే సరేసరి. లేదంటే కోర్టు తమకు అవకాశం ఇవ్వలేదని ప్రచారం చేసుకునే అవకాశం బి.జె.పి, నరేంద్ర మోడి లకు దక్కుతుంది.

తాను మోడి ఆదేశాలతోనే మారణకాండకు తెగబడినట్లు బాబు భజరంగి చెబుతుండగా తెహెల్కా విలేఖరులు రహస్య కెమెరాతో రికార్డు చేశారు. హత్యాకాండ అనంతరం తనను దాచి పెట్టింది మోడీయేనని భజరంగి కెమెరా ముందు అంగీకరించాడు. ఇక మాయా కొడ్నాని అయితే హత్యాకాండ తర్వాత కూడా మూడు సార్లు మోడి నుండి పార్టీ టికెట్ సంపాదించింది. మూడుసార్లు ఆమె ఎన్నికల్లో విజేతగా నిలిచింది. మోడీకి అత్యంత సన్నిహితురాలిగా ఆమెకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆమె పై వచ్చిన ఆరోపణలను నరేంద్ర మోడి ఎంత తేలిక చేశారంటే ఆమెపై సిట్ బృందం కేసు నమోదు చేశాకనే స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పదవి ఇచ్చి సత్కరించిన వ్యక్తి నరేంద్ర మోడి. అలాంటి వ్యక్తి ఇప్పుడు అదే భజరంగి, కొడ్నాని లకు మరణ శిక్ష వేయాలని కోర్టుకి వెళ్ళడం…. మాటలు తెలియడం లేదు.

గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ కేసులో నరేంద్ర మోడిని చేసిన పాపం వెంటాడడం ఇంకా మానలేదు. కాంగ్రెస్ ఎం.పి ఎహసాన్ జాఫ్రీ ని, ఆయన బంధు మిత్రులను హిందూ మతం పేరు చెప్పుకున్న మూకలు నరికి ఆయన ఇంట్లోనే తగలబెట్టిన కేసును మరోసారి విచారించాలని ఎహసాన్ జాఫ్రీ భార్య జకీయా జాఫ్రీ పిటిషన్ వేశారు. నరేంద్ర మోడి కి స్పెషన్ ఇన్వెస్టిగేషన్ టీం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కూడా ఆమె పిటిషన్ లో వ్యతిరేకించింది. మోడీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను సుప్రీం కోర్టు నియమించిన సిట్ బృందం పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. ఏయే సాక్ష్యాలను సిట్ వదిలేసిందో ఆమె తన తాజా పిటిషన్ లో ప్రస్తావించింది. దీనితో నరేంద్ర మోడి మెడ పైన గుజరాత్ మారణకాండ కత్తి వేలాడుతూనే ఉంది.

ఈ నేపధ్యంలో భజరంగి, కొడ్నాని తదితరులకు మరణ శిక్ష విధించాలని మోడి ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళడం కేవలం పదవీ రాజకీయాలలో భాగమే. హత్యాకాండను ఆపలేకపోయినందుకు బహిరంగ క్షమాపణ చెప్పడానికి కూడా నిరాకరించిన మోడిని సాధారణ నాగరికతా నియమాలను అనుసరించేవారెవ్వరూ నమ్మలేరు.

2 thoughts on “సంచలనం! సంచలనం!! మాయాకొడ్నానికి మరణ శిక్ష కోరనున్న మోడి

  1. ఇది నిజంగా సంచలనమే…
    ఓ దుర్ఘటనని సాకుగా తీసుకుని, కొన్ని వేలమంది అమాయకులు అత్యంత అమానుషంగా, అనాగరికంగా చంపబడ్డారు. ఆ దుర్ఘటనని తీవ్రంగా ఖండించిన మోడీ, అనతరం అమాయకులపై జరిగిన దురాగతాల గురించి మాత్రం నోరు మెదపలేదు. వారికి కనీసం సానుభూతికూడా చూపలేదు. అమాయకులపై జరిగిన దురాగతాలకు మీరు చింతిస్తున్నారా అని ‘డెవిల్స్ అడ్వకేట్ ప్రోగ్రాంలో విలేఖరి కరన్ ధాపర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, స్టూడియో నుండి పారిపోయాడు. ఈ వీడియోలు ఇంకా యూటూబ్లో ఉన్నాయి.
    మైనారిటీలపై జరిగిన దాడుల గురించిన కేసులు కనీసం నత్తనడకన ఐనా నడుస్తున్నాయంటే.. దానికి సుప్రీం కోర్టు, ది హిందూ, తెహెల్కా లాంటి మీడియా, తీస్త సెతెల్వాద్ లాంటి సామాజిక కార్యకర్తల వల్లే తప్ప, దీనిలో రాష్ట్రప్రభుత్వం పాత్ర ఏమాత్రం లేదనేది అందరికీ తెలిసిందే. పైపెచ్చు.. తీస్తా సెతెల్వాద్, బాధితుల తరుపున సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడిన సంజీవ్ భట్, రాహుల్ శర్మ లాంటి IPS ఆఫీసర్లపై కేసులు బనాయించి మోడీ ప్రభుత్వం తన ఉద్దేశ్యాలేమిటో చెప్పకనే చెప్తూంది.
    ఇక అధికారిక లెక్కల ప్రకారమే 97 మందిని( అనధికారికంగా ఈ సంఖ్య చాలా ఎక్కువే) సజీవ దహనం చేసిన నరోదా పాటియా తీర్పు మరీ విభిన్నం. ఇక్కడ నేరం అన్ని సాఖ్యాధారాలతో నిరూపించబడింది. ఉరి శిక్ష విధించడానికి అన్ని అర్హతలు ఉన్న కేసుగా సాక్ష్యాత్తూ జడ్జిగారే ఓ వైపు చెబుతూ, ఉరి శిక్ష అనేది అమానవీయ చర్యగా పలు ప్రంపంచదేశాలు అభిప్రాయపడుతున్నాయనీ.. కావున దానిని విధించబోవడం లేదనీ, దాని స్థానంలో దీర్ఘ కాల జైలు శిక్షలు విధించారు.
    ఉరి శిక్ష అమానుషమైందనీ, కసబ్, అఫ్జల్ గురు లాంటి వారి ఉరి శిక్షని యావజ్జీవ శిక్షగా మార్చమని ఎవరైనా అనగానే, వారికి ఉరిశిక్ష విధించకుండా జైల్లలో పెట్టి ప్రజల సొమ్ముతో మేపడమేమిటని విరుచుకుపడే కాషాయ నిక్కరు దేశభక్తులెవరూ ఈ తీర్పు గురించి మాట్లాడలేదు.
    కింది కోర్ట్లు ఇచ్చే తీర్పుల్ని పెంచమనో, తగ్గించమనో కోరుతూ ప్రభుత్వం పై కోర్టుల్లో అప్పీలు చేసుకోవడం అనేది మామూలే. నరోదా పాటియా కేసులో రాష్ట్రప్రభుత్వం, శిక్షల్ని పెంచమని గానీ, ఉరి శిక్ష విధించమని అడుగుందని గానీ ఎవరూ ఊహించలేదు. ఇది ఎలాగూ జరిగే పని కాదనుకుని కనీసం మోడీ ప్రభుత్వాన్ని కోరిన వారు కూడా లేరు. కానీ ఆశ్చర్యకరంగా మోడీ ప్రభుత్వం అలా కోరబుతున్న వార్త ఈ రోజు పతాక శీర్షికలనెక్కింది. దానితో పాటే దీని వెనుక మోడీ ప్లాన్ ఏమై ఉండొచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మొసలి కన్నీరు కారుస్తూ, గడువు తీరాక పై కోర్ట్లులో అప్లై చేస్తున్నాడనే వారు కొందరైతే, ఇప్పుడు ఇక్కడ అప్లై చేసినా పైన హైకోర్టు, ఆ పైన సుప్రీం కోర్టు ఉన్నాయనీ, ఎక్కడో చోట వారిని తప్పించే స్కెచ్ వేసే ఉంటాడనీ భావించే వారు కొందరు. తెర వెనుక సంగతులెలా ఉన్నా.. మాయా కొండానీ, బాబూ బజరంగీ లాంటి వారికి ఉరిశిక్ష విధించడమే సరైంది. దీని వల్ల చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని నిరూపించబడటంతో పాటు, అమాయకుల మాన ప్రాణాలతో చలగాటాలు ఆడేవారు ఎవరైనప్పటికీ ఏదో ఓ సారి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే హెచ్చరిక పంపినట్లవుతుంది. ఈ దిశగా అడుగులు వేసినందుకు మోడీని ఇప్పటికి మాత్రం అభినందించవలసిందే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s