అమెరికాలో బాంబు పేలుడు, ముగ్గురి మరణం


Photo: The Hindu

Photo: The Hindu

అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. సెకన్ల వ్యవధిలో రెండు బాంబులు పేలగా మరో 5 పేలని బాంబులు దొరికాయని పోలీసులు తెలిపారు. 40 కి.మీ దూరం సాగే ‘బోస్టన్ మారధాన్’ పోటీ ముగింపు స్ధలంలో జరిగిన ఈ పేలుళ్లలో ముగ్గురు మరణించారు. 130 మందికి పైగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో అవయవాలు తీసివేయాల్సి వచ్చిందని ఆసుపత్రుల అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి. బాల్ బేరింగ్ లాంటి ఇనప వస్తువులు కూరి బాంబులు తయారు చేయడంతో అధిక సంఖ్యలో జనం గాయపడ్డారని తెలుస్తోంది. దుర్ఘటనపై అప్పుడే ఒక అభిప్రాయానికి రావద్దని అధ్యక్షుడు ఒబామా హెచ్చరించినప్పటికీ జరిగింది టెర్రరిస్టు దాడి అని సి.ఎన్.ఎన్ లాంటి వార్తా సంస్ధలు చెబుతున్నాయి.

27,000 మందికి పైగా పాల్గొన్న బోస్టన్ మారధాన్ పోటీ చివరి అంచెలో పేలుళ్లు జరిగాయని ది హిందు, రష్యా టుడే (ఆర్.టి) తెలిపాయి. సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలు 2.55 గంటల మధ్యలో పేలుళ్లు సంభవించాయి. షార్పెనల్స్ కూరిన బాంబులు పేలడంతో పోటీలో నిమగ్నమై ఉన్న పరుగుపందెం పోటీదారులు శక్తివంతమైన పేలుడు ధాటికి షాక్ కి గురైనట్లు తెలుస్తోంది. జరిగింది ‘టెర్రరిస్టు దాడి’ అని పేరు తెలియని అధికారులను ఉటంకిస్తూ పత్రికలు చెబుతున్నప్పటికీ అధ్యక్షుడు ఒబామా మాత్రం అప్పుడే త్వరపడి ఒక నిర్ణయానికి రానవసరం లేదని వైట్ హౌస్ వద్ద ప్రకటించారు.

పేలుడుకు సంబంధించిన వీడియోను ‘రష్యా టుడే’ వార్తా సంస్ధ తన వెబ్ సైట్ లో ఉంచింది. దానిని ఇక్కడ చూడవచ్చు.

పేలుళ్లకు ఎవరు కారణం అయిందీ ఇంకా తమకు తెలియదని ఒబామా అంగీకరించాడు. ఎవరు, ఎందుకు పేలుళ్లకు పాల్పడ్డారో తెలియనప్పటికీ బాధ్యులైన వారు న్యాయ భారాన్ని పూర్తిగా మోయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. సెకన్ల వ్యవస్ధిలో జరిగిన రెండు పేలుళ్ళ ఫలితంగా మారధాన్ ముగింపు లైన్ వద్ద పెద్ద ఎత్తున పొగ అల్లుకుంది. పరుగుపందెంలో పాల్గొంటున్నవారు, ప్రేక్షకులు అక్కడి నుండి పరుగులు తీశారని, అనేకమంది తలలకు గాయాలై రక్తం కారగా, కొంతమంది కాళ్ళు చేతులు కోల్పోయినట్లు పత్రికలు తెలిపాయి. అంబులెన్స్, పోలీసు జీప్ ల సైరన్లతో బోస్టన్ మారధాన్ వీధి నిండిపోయింది.

“రక్తం కారుతున్న ప్రేక్షకులను దగ్గర్లోనే పోటీదారుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ టెంట్ వద్దకు తీసుకుపోయారు” అని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. గాయపడ్డవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని సోమవారం రాత్రికల్లా కనీసం 130 మందికి పైగా గాయపడ్డట్లు తెలిసిందని ఎపి తెలిపింది. చనిపోయినవారిలో 8 యేళ్ళ బాలుడు ఉనాడని బాధితులను మసాచూసెట్స్ జనరల్ ఆసుపత్రికి తరలించారని ది హిందు తెలిపింది. చికిత్స పొందుతున్నవారిలో 6గురి పరిస్ధితి విషమంగా ఉన్నది.

సెప్టెంబరు 11, 2001 తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లపై దాడులు జరిగాక అమెరికా భూభాగం పైన బాంబు పేలుళ్లు లాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి.

రెండు పేలుళ్ళ అనంతరం మూడో పేలుడు జరిగినప్పటికీ అది ఈ ఘటనతో సంబంధం లేదని సి.ఎన్.ఎన్ తెలిపింది. ఘటనా స్ధలం నుండి రెండు పేలని బాంబులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పినట్లు ఒక పత్రిక చెప్పగా ఐదు పేలని బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు మరో పత్రిక తెలిపింది. ఎబిసి న్యూస్ ప్రకారం పేలుళ్లు ఉద్దేశ్యపూర్వకంగానే జరిగాయి. సి.ఎన్.ఎన్ అయితే ఇది టెర్రరిస్టు దాడి అని పోలీసులు చెప్పినట్లు తెలిపింది. కానీ పోలీసులు మాత్రం తామేవ్వరికీ అలా చెప్పలేదని ఖండించారు.

3 thoughts on “అమెరికాలో బాంబు పేలుడు, ముగ్గురి మరణం

  1. ade bomb peludu prapancham lo ekkadanna jarigite munduga peddanna america vachi investiagtion modalu petti bin laden ko saddam hussain ko anta gaattedi ippudu vallu leru evariko antichido evaro aa adrushtavantulu????????????

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s