ఎన్.డి.ఎ కూటమి ఏర్పడినప్పుడు విధించిన షరతులు ఇప్పటికీ వర్తిస్తాయని, అలా అయితేనే కూటమి కొనసాగుతుందని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశాడు. ‘తాము ఒక తుఫాను సృష్టిస్తామని, ప్రజలు దానిని అంగీకరిస్తారని’ కొంత మంది భావిస్తున్నారని, కానీ ప్రజలు చదువు లేకపోయినా చాలా తెలివైనవారని మోడిని పరోక్షంగా ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. తెలివైన ప్రజలు ఎలాంటి గాలిని ఒప్పుకోరని రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో విషయం ఉన్నదీ లేనిదీ వారు అంచనా వేస్తారని నితీష్ వ్యాఖ్యానించాడు. జె.డి(యు) పార్టీ జాతీయ కార్యకవర్గ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్.డి.ఎ) పేరుతో కూటమి ఏర్పాటు చేసినప్పుడు బి.జె.పి కి మూడు షరతులు విధించామని నితీష్ కుమార్ తమ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో గుర్తు చేశాడు. జమ్ము & కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేయడం, మతాలకు అతీతంగా ఐక్య సివిల్ కోడ్, అయోధ్యలో బాబర్ మసీదు కూల్చిన స్ధలంలో రామమందిరం నిర్మాణం… ఈ మూడు డిమాండ్లను బి.జె.పి వదులుకోవాలన్న షరతు పైనే ఎన్.డి.ఎ కూటమి ఏర్పడిందని, అది ఇప్పటికీ అమలులో ఉన్నదని నితీష్ తెలిపాడు. ప్రజలను విడదీసే ఈ డిమాండ్లు బి.జె.పి హృదయంలో కొనసాగుతున్నప్పటికీ కూటమి కోసం వాటిని పక్కనపెట్టక తప్పదని స్పష్టం చేశాడు.
గుజరాత్ అభివృద్ధిని దేశానికి నమూనాగా చెప్పడం పట్ల నితీష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. భారత ప్రజలు తెలివైనవారని, వారు ఒట్టి ఉపన్యాసాలను నమ్మబోరని తేల్చేశాడు. “ఈ దేశ ప్రజలకు పెద్దగా చదువు లేకపోవచ్చు. కానీ వారు తెలివైనవారు. ఎంత తెలివైనవారంటే నాయకుల ఉపన్యాసాలు నిజమో కాదో వారు పసికట్టగలరు” అని నితీష్ దేశ ప్రజలకు కితాబు ఇచ్చాడు. ఆర్ధిక వృద్ధి దేశంలో అనేక చోట్ల జరుగుతోందని అందులో బీహార్ ఒకటని నితీష్ స్పష్టం చేశాడు. బీహార్ రాష్ట్రానికి కూడా తనదైన అభివృద్ధి నమూనా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం దానికి కట్టుబడి ఉన్నదని ఆయన స్పష్టం చేశాడు.
“ఎలాంటి అభివృద్ధి మనకు అవసరం? ప్రజలు పెద్ద సంఖ్యలో మంచినీటికి కరువు ఎదుర్కొనే అభివృద్ధి మనకు అవసరం లేదు” అని గుజరాత్ అభివృద్ధి నమూనా పట్ల సాగుతున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ నితీష్ అన్నాడు. అయితే బీహార్ లో తమ కూటమికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని నితీష్ భరోసా ఇచ్చాడు. అనేక ప్రధాన సమస్యల పైన తాము పరస్పరం అభిప్రాయాలూ ఇచ్చిపుచ్చుకుంటున్నామని, ఒకరినొకరు గౌరవించుకుంటామని తెలిపాడు. తాము కలిసే ప్రయాణిస్తామని కానీ కొన్ని మౌలిక అంశాలను స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెబుతూ ఆయన కూటమి ఏర్పడినప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ మూడు అంశాల పైన బి.జె.పి తన అభిప్రాయాలను పక్కన పెట్టాలని కోరాడు.
ఈ మౌలిక అంశాల పట్ల నిబద్ధత లేనట్లయితే సమస్యలు రావడం ఖాయమేనని నితీష్ స్పష్టం చేశాడు. దేశాన్ని కేవలం అంచనాలతో నడపడం సాధ్యం కాదని, తాము ఒక గాలి దుమారం సృష్టిస్తే దానిని ప్రజలు అంగీకరిస్తారని కొందరు భావిస్తున్నారని నితీష్ మోడీకి చురక వేశాడు. అటల్ బిహారీ వాజ్ పేయి వలే ప్రజల్లోని వివిధ సెక్షన్ల ప్రజలను కాల్పుకోగలిగినవారే దేశానికి నాయకులు కాగలరని అన్నాడు.
జె.డి(యు) పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ మాత్రం నితీష్ కుమార్ వలే కఠినంగా కాకుండా మెత్తనైన మాటలతో బి.జె.పితో కూటమిని నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా మాట్లాడాడు. మళ్ళీ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికయిన శరద్, పేర్లు చెప్పి విమర్శించడానికి దూరంగా ఉండాలని కోరాడు. అయితే బి.జె.పి తో విభేదాలు పరోక్షంగా ఆయన మాటల్లో ధ్వనించాయి. “సిద్ధాంతం రక్తం కంటే చిక్కనైనది” అని ఆయన వ్యాఖ్యానించాడు. తద్వారా మోడితో సాపత్యానికి అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేసినట్లయింది.
గుజరాత్ మారణకాండను అడ్డుకోవడంలో మోడి విఫలం అయినందున ఆయనను ప్రధానిగా అంగీకరించేది లేదని జె.డి(యు) ఇప్పటికే పరోక్షంగా స్పష్టం చేసింది. బి.జె.పి పార్టీయే తమ ప్రధాని అభ్యర్ధి ఎవరయిందీ చెప్పనప్పుడు ఆ విషయం పైన ఊహాగానాలు చేయడం వ్యర్ధం అని చెబుతూనే మోడీకి వ్యతిరేకంగా తగిన సంకేతాలను పార్టీ ఇస్తోంది. ఎన్నికలు త్వరలో రానున్నాయని ఎన్.సి.పి నాయకుడు శనివారం వ్యాఖ్యానించిన నేపధ్యంలో రానున్న రోజుల్లో బి.జె.పి పార్టీలో సైతం ప్రధాని అభ్యర్ధిత్వం పైన వేడి చర్చలు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.
sir kashmir nunchi 7 lakshala hinduvulani tarimesaru, appudu nitish kumar ki noru levaledu, kani daanni vyatirekinchina bjp siddantam tho vyatirekatha chupadam ye vidamga secularism avtundi, kevalam pm avvalanna kanksha tappa. sekhar garu kashmir pandit la gurinchi oka article rayandi yrtuvanti pakshapatam lekunda