ఇప్పుడు అమెరికాకి నెం.1 టార్గెట్, వెనిజులా -హాలీవుడ్ దర్శకుడు


2009 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'సౌత్ ఆఫ్ ది బోర్డర్' సినిమా స్క్రీనింగ్ కి వస్తున్న ఛావెజ్, ఆలివర్ స్టోన్

2009 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘సౌత్ ఆఫ్ ది బోర్డర్’ సినిమా స్క్రీనింగ్ కి వస్తున్న ఛావెజ్, ఆలివర్ స్టోన్

అమెరికా ప్రభుత్వానికి, అమెరికా మీడియాకి ఇపుడు వెనిజులా నెంబర్ 1 టార్గెట్ అని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలివర్ స్టోన్ వ్యాఖ్యానించాడు. 2009లో హ్యూగో ఛావెజ్ పై ‘సౌత్ ఆఫ్ ద బోర్డర్’ అనే డాక్యుమెంటరి నిర్మించి ఛావెజ్ గురించిన వాస్తవాలను/అవాస్తవాలను అమెరికా ప్రజలకు తెలియజేసేందుకు ఆలివర్ స్టోన్  ప్రయత్నం చేశాడు. తన సినిమా ప్రత్యేక స్క్రీనింగ్ సందర్భంగా చనిపోయిన ఛావెజ్ పశ్చిమ వార్తా పత్రికలు, ప్రభుత్వాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని దుయ్యబట్టాడు. వెనిజులా ప్రజలు అత్యధిక మెజారిటీతో ఎన్నుకున్న ఛావెజ్ ను ప్రజాస్వామ్య వ్యతిరేకిగా, నియంతంగా దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.

వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ కేన్సర్ వ్యాధితో మరణించడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఆదివారం మరోసారి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. గత అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్ధిపై 10 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించిన హ్యూగో ఛావెజ్ తగ్గిందనుకున్న కేన్సర్ వ్యాధి మళ్ళీ తిరగబెట్టడంతో క్యూబాలో నాలుగోసారి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ కోసం క్యూబా వెళ్ళే ముందు తనకు ఏమన్నా జరిగితే తన వారసుడుగా మదురో ను అధ్యక్షుడుగా ఎన్నుకోవాలని ప్రకటించాడు. ఆదివారం జరగనున్న ఎన్నికల్లో ఛావెజ్ కంటే కొంత ఎక్కువగానే మెజారిటీ సాధించే అవకాశాలు మదురో కు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

కాంతి రేఖ

2009లో రూపొందించిన ‘సౌత్ ఆఫ్ ద బోర్డర్’ సినిమా అమెరికన్లకు చావేజ్ పట్ల సానుకూల దృక్పధాన్ని ప్రేరేపించిందని రష్యా టుడే తెలిపింది. చావేజ్ గురించి అమెరికా పత్రికలు, ఛానెళ్లు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాయని ఈ డాక్యుమెంటరీ సినిమా వివిధ సాక్ష్యాలతో తెలియజేప్పింది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా దేశ ప్రజలను మోసం చేశాడా అన్న ప్రశ్నకు ఆలివర్ స్టోన్ ఇలా సమాధానం ఇచ్చాడు:

“యునైటేడ్ స్టేట్స్ వ్యవస్ధ ఎలాంటిదంటే, అధ్యక్షుడు ఎవరైనా ‘మరో మార్గం లేదు’ అని పరిస్ధితిలోకి ఈడ్చబడతారు. కానీ బంతి పగులు ఎప్పుడూ విభిన్న రీతిలోనే పగులుతుందని చరిత్ర నిరూపిస్తూనే ఉంది. మేము ఆ విషయాన్నే, ఎల్లప్పుడూ పగుళ్లు తప్పదని, నొక్కి చెప్పాం. అకస్మాత్తుగా ఒక మార్టిన్ లూధర్ కింగ్ ఆవిర్భవిస్తాడు; అకస్మాత్తుగా వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతాయి; ఫ్రంట్ రన్నర్ గా భావించిన హిల్లరీ క్లింటన్ ను అకస్మాత్తుగా పక్కకు తప్పించి ఈ పాక్షిక నల్ల వ్యక్తిని అందలం ఎక్కిస్తారు. అనూహ్య పరిణామాలకేమీ కొదవలేదు. అవెప్పుడూ గాల్లోనే ఉన్నాయి. మీరు ఎదైతే జరుగుతుందని భావిస్తారో అవెప్పుడూ జరగవు” అని స్టోన్ వ్యాఖ్యానించాడు.

ఛావెజ్ తన వారసుడుగా ప్రకటించిన నికోలస్ మదురో యే వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే ఎవరు గెలిచినా బైటినుండి (అమెరికా నుండి) తీవ్రమైన ఒత్తిడి తప్పదని ఆలివర్ స్టోన్ అన్నాడు. వెనిజులా చమురు సంపదే దానికి కారణం అని ఆయన అన్నాడు. “ఈ బాస్టర్డ్స్ నిరాశపరచగలరు, ఆధిపత్యాన్ని రుద్దగలరు. కానీ నేను ఎప్పుడూ ఏమీ అనుకుంటానంటే ఎక్కడో ఒక చోట అనూహ్య రక్షణ ఉంటుందని, ప్రజలంగా మన పైనా, ప్రపంచం పైనా ఒక విధమైన కాంతిరేఖ ప్రసరిస్తుందని” అని ఆలివర్ వ్యాఖ్యానించాడు. ఆయన దృష్టిలో వెనిజులా ప్రజలకు హ్యూగో ఛావెజ్ ఒక కాంతి రేఖ. రానున్న రోజుల్లో మదురో కి బైటినుండి అనేక కష్టాలు ఎదురు అవుతాయని, కానీ కాంతిరేఖ ఎప్పుడూ జనాన్ని కనిపెట్టుకుని ఉంటుందని అది ఏ రూపంలో నైనా రావచ్చనీ, మదురో సైతం ఒక కాంతి రేఖ కావచ్చని ఆలివర్ స్టోన్ సూచిస్తున్నాడు.

నెంబర్ 1 టార్గెట్

అమెరికా పత్రికల దుష్ప్రచారం పైన స్టోన్ మండిపడ్డాడు. “న్యూయార్క్ నివాసిగా, చాలా కాలంగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికను అనుసరిస్తున్నవాడిగా ఈ పత్రిక సంవత్సరాల తరబడి చేస్తున్న ప్రతికూల ప్రచారం పట్ల నేను ఇప్పటికీ ఖిన్నుడనవుతాను. ప్రపంచంలో అత్యంత చెడ్డ పాలకులపైన ఇలాంటి ప్రతికూల ప్రచారం నేను ఎప్పుడూ చూడలేదు. అడాల్ఫ్ హిట్లర్ కి కూడా జర్మనీలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం లభించిందా అన్నది నాకు అనుమానమే. ఈ అబద్ధాలు, ఈ వికృతీకరణలు… ఇలా చేస్తున్నందుకు వారు సిగ్గుపడాలి.” అని ఆలివర్ అన్నాడు.

“యునైటెడ్ స్టేట్స్ మీడియాకు దాని ఆ దేశ విదేశాంగ శాఖకు ప్రస్తుతం ఉనికిలో ఉన్న దేశాల్లో నెంబర్ 1 టార్గెట్ వెనిజులా అని నేను చెప్పగలను. వెనిజులాలో సాగుతున్న రహస్య విద్రోహ కార్యకలాపాలు చాలా భయపెట్టివిగా ఉంటున్నాయి. నేనైతే నికోలస్ మదురో చెప్పుల్లో ఉండాలని కోరుకోను. నేను అతనిలా ఉండడాన్ని ద్వేషిస్తాను, ఎందుకంటే ఇప్పుడాయనే సరికొత్తగా స్పాట్ లైట్ లో ఉన్నాడు” అని అమెరికా నుండి నికోలస్ మదురో ఎదుర్కొంటున్న ప్రాణాంతక దాడుల గురించి స్టోన్ వ్యాఖ్యానించాడు.

“ఆయనను వ్యక్తిగతంగా వారు ఎదుర్కోలేకపోవచ్చు. కానీ ఇంత భారీ శక్తిని వారసత్వంగా పొందడం చాలా భయానక పరిస్ధితి. కాస్ట్రో కూడా చాలా సంవత్సరాల క్రితం ఇదే పరిస్ధితిని ఎదుర్కొని ఉంటాడు. వెనిజులాకు ఇది అత్యంత కష్టకాలం. ప్రజలు ఐక్యంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇది అంత త్వరగా వదిలిపోయేదేమీ కాదు. ఎన్నికల్లో ఆయన నెగ్గినా రానున్న నెలల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరిన్ని మంటలను ఈ దేశం పై విరజిమ్మనున్నది. మరిన్ని స్పందనలు, కధలు మీరు చూడబోతున్నారు. వెనిజులా అమెరికాకే కాక లాటిన్ అమెరికాకి కూడా చాలా ముఖ్యమైన దేశం” అని ఆలివర్ స్టోన్ కుండబద్దలు కొట్టాడు. స్వతంత్ర ప్రజాస్వామిక రాజ్యాలపై అమెరికా అనుసరిస్తున్న దమన నీటి ఎంత క్రూరమైనదో ఈ విధంగా ఆయన వివరించాడు.

ఆదివారం జరగనున్న ఎన్నికల్లో నికోలస్ మదురో ఎన్నిక కావడం ఖాయం. కానీ ఎన్నికల్లో నెగ్గడం ఆయనకు ఎంత తేలికో అమెరికా కుట్రలను ఎదుర్కొని వెనిజులా ప్రజల ప్రయోజనాలకు కట్టుపడి ఉండడం అంత కష్టం అనీ, ఈ క్రమంలో తన గురువు చావేజ్ వలే అమెరికా నుండి ప్రమాదం ఎదురుకానున్నదని ఆలివర్ స్టోన్ చెప్పింది కఠిన వాస్తవం. అయితే వెనిజులా ప్రజలు అప్రమత్తతతో ఉన్నట్లయితే అమెరికా కుట్రాలను తిప్పి కుట్టడం మదురోకు పెద్ద కష్టం కాకపోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s