అమెరికా ‘మేగ్నిట్ స్కీ జాబితా’కు యాకోవ్లెవ్ జాబితా’తో బదులిచ్చిన రష్యా


జాన్ యూ. ఖైదీల చిత్రహింసలను చట్టబద్ధం చేసేందుకు చట్టం రూపొందించిన ప్రొఫెసర్ (ది హిందు)

జాన్ యూ. ఖైదీల చిత్రహింసలను చట్టబద్ధం చేసేందుకు చట్టం రూపొందించిన ప్రొఫెసర్ (ది హిందు)

నాలుగు దశాబ్దాల పాటు సాగిన ‘ప్రచ్ఛన్న యుద్ధం’ (కోల్డ్ వార్) లో రెండు అంతర్జాతీయ వైరి శిబిరాలకు నాయకత్వం వహించిన అమెరికా, రష్యాలు మళ్ళీ ఒక్కసారి ఆ రోజులను గుర్తుకు తెచ్చాయి. ‘మేగ్నిట్ స్కీ చట్టం’ కింద అనేకమంది రష్యా ప్రముఖుల పైన ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రకటించిన ‘మేగ్నిట్ స్కీ జాబితా’ కు ప్రతీకారంగా పలువురు అమెరికన్ ప్రముఖులపై ఆంక్షలు ప్రకటిస్తూ రష్యా మరొక జాబితా విడుదల చేసింది. ఇరు దేశాలు తమ చర్యలకు మానవ హక్కుల ఉల్లంఘనను అడ్డం పెట్టుకోవడం విశేషం. అయితే జాబితాలో తమ తమ శిబిరాలలో అనేకమంది ఆశించినట్లుగా అత్యంత ప్రముఖులను మినహాయించడం ద్వారా ఇరు దేశాలు సంయమనం పాటించాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రష్యా ప్రకటించిన ‘నిషేధిత అమెరికన్ల జాబితా’ లో 18 మంది ఉన్నారని ది హిందు తెలిపింది. 2005-09 మధ్య అమెరికా ఉపాధ్యక్షుడుగా పని చేసిన డిక్ చెని సిబ్బందికి చీఫ్ గా పని చేసిన డేవిడ్ స్పియర్స్  వీరిలో ఒకరు. ఖైదీలపై అత్యంత క్రూర పద్ధతుల్లో టార్చర్ కి పాల్పడ్డ గ్వాంటనామో జైలు నిర్వహణలో ఈయనకు ప్రముఖ పాత్ర ఉన్నదని రష్యా తెలిపింది. ఖైదీల మానవ హక్కుల ఉల్లంఘన, టార్చర్ లను చట్టబద్ధం చేయడానికి వీలుగా బుష్ హయాంలోనే అధికారికంగా మెమోలు తయారు చేసిన జాన్ చూన్ యూ కూడా వీరిలో ఉన్నారు. గ్వాంటనామో జైలును ప్రత్యక్షకంగా పర్యవేక్షించిన అమెరికా ఆర్మీ మేజర్ జనరల్ (రిటైర్డ్) జెఫ్రీ డి.మిల్లర్, అదే జైలుకు మరో నిర్వాహకుడైన అమెరికా నేవల్ అధికారి జెఫ్రీ హార్బెన్సన్ లు కూడా రష్యా జాబితాలో ఉన్నారని రష్యా టుడే పత్రిక తెలిపింది.

వీరు కాకుండా రష్యా పౌరుల మానవ హక్కులను, వారి స్వేచ్ఛను హరించిన ఆరోపణలతో మరో 14 మంది పేర్లను రష్యా ప్రకటించింది. గత జనవరిలో రష్యా ప్రభుత్వం ఆమోదించిన ‘డిమా యాకోవ్లెవ్ చట్టం’ మేరకు తమ జాబితా ప్రకటించామని రష్యా తెలిపింది. ఈ చట్టం ప్రకారం అమెరికా తల్లి దండ్రులు ఎవరూ భవిష్యత్తులో రష్యా పిల్లలను దత్తత తీసుకోకుండా రష్యా నిషేధించింది. అమెరికాకి చెందిన స్వచ్ఛంద సంస్ధలు కూడా వివిధ రూపాల్లో రష్యన్లను దత్తత తీసుకోవడాన్ని కూడా ఈ చట్టం నిషేదిస్తోంది. రష్యా ప్రజల మానవహక్కులు, స్వేచ్ఛలతో పాటు, సాధారణంగా మానవ హక్కులను ఉల్లంఘించే అమెరికన్ల పైన ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది.

‘మేగ్నిట్ స్కీ జాబితా’ ప్రకటించడానికి ముందు రష్యా అమెరికాని హెచ్చరించింది. తన జాబితాను ప్రకటించినట్లయితే తగిన ప్రతి చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని ముందుగానే హెచ్చరించింది. శుక్రవారం అమెరికా తన జాబితా ప్రకటించిన వెంటనే రష్యా కూడా తన జాబితాను తయారు చేసి శనివారం ప్రకటించింది.

ఎవరీ మేగ్నిట్ స్కీ?

సెర్గీ మేగ్నిట్ స్కీ రష్యాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్రిటిష్ పెట్టుబడి ద్రవ్య సంస్ధ ‘హెర్మిటేజ్ కేపిటల్’ కు లాయర్ గా పని చేసేవాడు. 2007లో ఈ సంస్ధ పెద్ద మొత్తంలో పన్నులు ఎగవేసినట్లు రష్యా ఆరోపించింది. పన్నుల ఎగవేత కుంభకోణం వెనుక కొందరు రష్యా అధికారులు ఉన్నారని అప్పట్లో మేగ్నిట్ స్కీ ఆరోపించాడు. Magnitsky230 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేతకు రష్యా అధికారులు సహకరించారని మేగ్నిట్ స్కీ తెలిపాడు. అయితే హెర్మిటేజ్ కేపిటల్ కంపెనీ పన్ను ఎగవేయడానికి మేగ్నిట్ స్కీ సహకరించాడని రష్యా ఆరోపించి అరెస్టు చేసింది. అరెస్టు అయిన సంవత్సరం తర్వాత మేగ్నిట్ స్కీ జైలులో హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడని రష్యా ప్రకటించగా, ఆయనను ‘ఒప్పుకోలు పత్రం’ పై సంతకం కోసం టార్చర్ చేయడం వల్ల చనిపోయాడని అమెరికా ఆరోపిస్తోంది.

ఈ నేపధ్యంలో మేగ్నిట్ స్కీ పేరుతోనే అమెరికా ఒక చట్టం చేసింది. ఈ చట్టం కింద 18 మంది రష్యన్ల పైన ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. రష్యా హోమ్ మంత్రిత్వ శాఖలోని ఇద్దరు అధికారులు ఆర్తెమ్ కుజ్నెత్సోవ్, పావెల్ కార్పొవ్ లు ఈ జాబితాలో ఉన్నారు. మేగ్నిట్ స్కీ ని అరెస్టు చేసింది ఈ ఇద్దరేనని తెలుస్తోంది. 230 మిలియన్ డాలర్ల రష్యా ప్రభుత్వ సొమ్ము కాజేశారని మేగ్నిట్ స్కీ ఆరోపించింది కూడా వీరే. తప్పుడు పద్ధతుల్లో పన్నుల ఎగవేతకు సహకరించారని మేగ్నిట్ స్కీ ఆరోపించిన ఇద్దరు పన్నుల అధికారులు, రష్యా హోమ్ మంత్రిత్వ శాఖలోని ఇంకా 14 మంది అధికారులు అమెరికా జాబితాలో ఉన్నారు.

అమెరికా ఆంక్షలతో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రష్యా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అలెగ్జాండర్ లూకాషెవిక్ ప్రకటించగా రష్యా ఆంక్షలు విధించిన అమెరికన్లు వాస్తవంగా గ్వాంటనామో బే లో ఖైదీలను చిత్ర హింసలకు గురి చేసినవారు, టార్చర్ ను చట్టబద్ధం చేసినవారు కావడం గమనార్హం అని విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ ప్రకటించాడు. రష్యా జాబితా పైన స్పందించడానికి మాస్కో లోని అమెరికా ఎంబసీ నిరాకరించిందని ఎపి వార్తా సంస్ధ తెలిపింది.

మానవ హక్కులను ఉల్లంఘించడంలో అమెరికా, రష్యా పాలకులు, అధికార వ్యవస్ధల్లో ఎవరూ తక్కువ కాదు. పన్నులు ఎగవేసి ప్రజల సొమ్ముని దిగమింగడంలో కూడా ఇరు దేశాల కంపెనీలు ఏవీ తక్కువ కాదు. ఆ మాటకొస్తే పన్నులు ఎగవేయడానికి పెట్టుబడిదారీ కంపెనీలకు, ధనికులు దాదాపు అన్నీ దేశాలు తగిన ఏర్పాట్లను చట్టాల్లోనే ఏర్పాటు చేసి పెట్టుకున్నాయి. అమెరికా, రష్యాలు ప్రకటించిన రెండు జాబితాలు ఇరు దేశాల మధ్య సంఘర్షణ పరిస్ధితి అభివృద్ధి అవుతోందనడానికి సూచిక మాత్రమే. ప్రకటించినట్లుగా మానవ హక్కుల పట్ల, పన్నుల ఎగవేత పట్ల, చిత్రహింసలను ఆమోదించడం పట్ల ఇరు దేశాలు వ్యక్తం చేసిన ఆందోళన పై ముసుగు మాత్రమే.

One thought on “అమెరికా ‘మేగ్నిట్ స్కీ జాబితా’కు యాకోవ్లెవ్ జాబితా’తో బదులిచ్చిన రష్యా

  1. పింగ్‌బ్యాక్: https://teluguvartalu.com/2013/04/13/---/ | sivasai06

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s