పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని తమ కూటమిలో చేర్చుకోడానికి యు.పి.ఎ, ఎన్.డి.ఎ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కానీ యు.పి.ఎ నుండి బైటికి దూకిన తర్వాత త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎవరికీ ‘చిక్కరు, దొరకరు’ అన్నట్లుగా పరిస్ధితి ఉంటోంది. ఆమెకు అనుకూలంగా వ్యవహరించడానికి రెండు కూటముల నాయకులు ప్రయత్నిస్తున్నా, ఆమె ఎవరివైపు మొగ్గు చూపుతారో ఎవరి అంచనాలకు అందడం లేదు. ఒక రోజు యు.పి.ఎ పైన యుద్ధం ప్రకటించినట్లు మాట్లాడి ఒక సంకేతం ఇచ్చినట్లు కనిపించి మరుసటి రోజే అందుకు విరుద్ధంగా ట్విట్టర్ పోస్టు ద్వారానో లేదా ఒక జనాంతిక సందేశం ద్వారాలో అందుకు విరుద్ధ సంకేతం ఇస్తున్నట్లు కనిపిస్తోందామె.
లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకున్న 2 లక్షల కోట్ల అప్పులకు యేటా 22,000 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తోందని, దీనితో రాష్ట్రానికి నిధులు కొరతగా ఉందని మమత మొదటినుండి చెబుతున్నారు. కాబట్టి వడ్డీ చెల్లింపులపై మారిటోరియం విధించాలని ఆమె డిమాండ్ చేశారు. డిమాండ్ నెరవేరక పోవడంతో రైల్వే ఛార్జీలు, చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ ఇత్యాది సాకు చూపి యు.పి.ఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి ఎవరూ సహకరించకపోవడంతో విఫలమైంది. అప్పటి నుండి యు.పి.ఎ పైన విమర్శల వాడి తగ్గించిన మమత డి.ఎం.కె మద్దతు ఉపసంహరణ తర్వాత ట్విట్టర్ ద్వారా సానుకూల సంకేతాలు పంపింది.
మొన్న ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ కార్యాలయం సందర్శించిన సందర్భంగా ఆమె సహచర మంత్రి అమిత్ మిత్రా పైన ఒక విద్యార్ధి సంఘ కార్యకర్తలు చేయి చేసుకోవడంతో ఆమె ఆగ్రహోదగ్రురాలయింది. ‘అనాగరికి ప్రవర్తన’ అని విమర్శించింది. సదరు విద్యార్ధి సంఘం నాయకుడి మరణాన్ని ‘చిన్న సమస్య’గా కొట్టిపారేసినప్పుడు తన నాగరికత ఎక్కడికి పోయిందని ఆ సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ చేదు అనుభవంతో ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రులతో అపాయింటుమెంట్ రద్దు చేసుకుని కోల్ కతా తిరిగి వెళ్ళిపోయిన మమత ఆసుపత్రిలో చేరింది. ఆమె ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఆయనను కలవలేకపోయినందుకు సారి చెప్పగా, తిరిగి ప్రధానమంత్రి ఆమెకు ఫోన్ చేసి ఢిల్లీలో జరిగిందానికి సారీ చెప్పారు.
పరిస్ధితి గమనించిన నరేంద్ర మోడి మమత బెనర్జీకి రాజకీయ వల వేసే పనిలో ముందుకు దుమికారు. ఆమె సానుభూతి ప్రకటిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు ఏలుతున్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని, గుజరాత్ తో పాటు బెంగాల్ పైన కూడా వివక్ష కొనసాగుతున్నదని విమర్శించారు. తద్వారా ఇద్దరు ఒకే పడవలో ఉన్నామని చెప్పేందుకు ప్రయత్నించారు. పనిలో పనిగా మమతను ఎన్.డి.ఎ లోకి ఆకర్షించేందుకు పరోక్ష ప్రయత్నం చేశారు. అయితే పశ్చిమ బెంగాల్ లో ముస్లింల సంఖ్య అధికం. మోడి ప్రధాని అభ్యర్ధిగా ఎన్.డి.ఎ ప్రకటిస్తే ఆమె ఆ కూటమిలో చేరడం ఆత్మహత్యా సదృశమే. అందుకే మోడి భజన ఊపందుకున్న నేపధ్యంలో ఆమె మళ్ళీ యు.పి.ఎ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక అంచనా. మొత్తం మీద ఆమె ఎవరికీ ‘చిక్కరు, దొరకరు’గా ప్రస్తుత పరిస్ధితి ఉన్నది. కూటమి రాజకీయాలు ఒక కొలిక్కి వచ్చేవరకు ఈ ఆట సాగవచ్చు.