గూగుల్ మోసాలను కట్టడి చేయండి -మైక్రోసాఫ్ట్, ఒరకిల్ ఫిర్యాదు


Scroogledవినియోగదారుల ప్రైవసీని ఉల్లంఘించి సొమ్ము చేసుకుంటున్న గూగుల్ చర్యలను కట్టడి చేయాలని 17 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల గ్రూపు యూరోపియన్ యూనియన్ (ఇ.యు) కి ఫిర్యాదు చేశాయి. మొబైల్ ఫోన్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ల మార్కెట్ లో అవాంఛనీయ పద్దతుల్లో తన ఉత్పత్తులకు మార్కెట్ చేసుకుంటూ పోటీకి, సరికొత్త ఆవిష్కరణలకు ఆటంకంగా గూగుల్ పరిణమించిందని పదిహేడు కంపెనీల కన్సార్టియం ‘ఫెయిర్ సెర్చ్’ తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా మైక్రో సాఫ్ట్ కంపెనీ గూగుల్ కంపెనీ పై మళ్ళీ తన సరికొత్త ప్రకటనల యుద్ధాన్ని ప్రారంభించింది.

“ఈ కీలకమైన మార్కెట్ లో పోటీని, ఆవిష్కరణలను సంరక్షించడానికి అత్యంత త్వరగా, నిర్ణయాత్మకంగా కదలాలని మేము (యూరోపియన్) కమిషన్ ను కోరుతున్నాం” అని 17 ఐ.టి కంపెనీల కన్సార్టియం తరపున వాదించనున్న కౌన్సెల్ ధామస్ వింజే కోరినట్లు ది హిందు తెలిపింది. ఫెయిర్ సెర్చ్ (FairSearch) పేరుతో ఏర్పడిన కన్సార్టియం లో హైటెక్ ఐ.టి దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఒరకిల్, నోకియా తదితర కంపెనీలతో పాటు ఎక్స్ పీడియా, ట్రిప్ అడ్వైజర్ తదితర స్పెషలైజ్డ్ కంపెనీలు కూడా ఉన్నాయి.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వినియోగిస్తున్న మొబైల్ వినియోగదారులు తప్పనిసరిగా తన సొంత ఉత్పత్తులైన గూగుల్ మేప్స్, యూ ట్యూబ్ లాంటి సాఫ్ట్ వేర్ ఉపయోగించవలసిన పరిస్ధితిని గూగుల్ కల్పిస్తోందని ఫెయిర్ సెర్చ్ ఆరోపించింది. తద్వారా పోటీ ఉత్పత్తులకు మార్కెట్ లేకుండా చేయడానికి గూగుల్ ప్రయత్నిస్తోందని కన్సార్టియం ఆరోపించింది.

“త్వరగా చర్యలు తీసుకోవడంలో కమిషన్ విఫలం అయితే గూగుల్ మరింత పేట్రేగిపోతుంది. మొబైల్ వినియోగదారులు అంతకంతకు ఎక్కువగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (ఓ.ఎస్) వైపుకి మళ్లుతున్నారు. ఇక్కడే అడ్డుకోకపోతే మరింత ధైర్యం పొంది  డెస్క్ టాప్ కంప్యూటర్ రంగంలో సైతం తన ప్రైవసీ ఉల్లంఘనలను గూగుల్ విస్తరించే ప్రమాదం ఉంది” అని ధామస్ అన్నాడని గ్లోబల్ టైమ్స్ (చైనా అంతర్జాతీయ పత్రిక) పేర్కొంది.

2012 చివరికల్లా మొబైల్ ఫోన్ ఓ.ఎస్ రంగంలో గూగుల్ 70 శాతం మార్కెట్ ని ఆక్రమించి ఉందని జి.టి తెలిపింది. మొబైల్ ఫోన్ సెర్చ్ మార్కెట్ లో 96 శాతం వాటా గూగుల్ దేనని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో గూగుల్ అనుసరిస్తున్న మోసపూరిత ప్రైవసీ విధానం వలన వినియోగదారుల వ్యక్తిగత వివరాలు ధర్డ్ పార్టీ అప్లికేషన్ తయారీదారుల చేతుల్లోకి వెళ్లిపోతోందని, ఈ విషయం వినియోగదారులకు గూగుల్ తెలియజేయడం లేదని ఐ.టి కంపెనీలు ఆరోపించాయి.

డోంట్ గెట్ స్క్రూగుల్డ్ (Don’t get scroogled)

గూగుల్ ప్లే ద్వారా వివిధ సాఫ్ట్ వేర్ అప్లికేషన్లు అమ్ముతున్న గూగుల్, కొనుగోలుదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారికి చెప్పకుండానే అప్లికేషన్ల తాయారీదారులకు (app makers) కు అప్పగిస్తోందని కనుక వినియోగదారులు జాగ్రత్త వహించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ సరికొత్త ప్రకటనల యుద్ధాన్ని ప్రారంభించింది. ఇంటర్నెట్, టి.వి, మొబైల్స్ తదితర అన్ని వేదికల పైనా గూగుల్ మోసాలను వెల్లడి చేస్తూ మైక్రోసాఫ్ట్ ప్రకటనలు జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తున్న Don’t get scroogled వెబ్ సైట్ లో వివిధ రంగాల నిపుణులు, వ్యాపార సంస్ధలు, సంఘాల నేతలు ఏమి చెప్పింది కోట్ చేస్తూ గూగుల్ వ్యవహారాన్ని వినియోగదారుల దృష్టికి తేవడానికి మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోంది.

సాధారణంగా ప్రైవసీ పాలసీ ఏమిటన్నదీ చూడకుండానే వినియోగదారులు Accept బటన్ పైన క్లిక్ చేయడం కద్దు. సంబంధిత అవసరం తీర్చుకునే తొందరలో ఉండే వినియోగదారులు కంపెనీలపై నమ్మకం ఉంచి ప్రైవసీ పాలసీని అంగీకరిస్తున్నట్లు తమ ఆమోదాన్ని ఒక్క క్లిక్ తో తెలియజేస్తారు. సరిగ్గా దీనినే గూగుల్ దుర్వినియోగం చేస్తోందని ఇతర ఐ.టి దిగ్గజాలు ఆరోపిస్తున్నాయి. వినియోగదారుల నుండి అనుమతి కోరకుండానే వారి వ్యక్తిగత సమాచారం అంతటిని ఇతర ప్రైవేటు కంపెనీలకు గూగుల్ అప్పగిస్తోందని ZDnet లాంటి సంస్ధలు కూడా చెబుతున్నాయి.

స్ట్రీట్ వ్యూ కార్ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సంవత్సరాల తరబడి సాగించిన డేటా చౌర్యం విషయం ఇప్పుడు జగద్విదితం. గత వారమే ఫ్రాన్సు, బ్రిటన్ తదితర ఆరు యూరోపియన్ దేశాలు గూగుల్ కి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ చేపట్టాయి. యూరోపియన్ యూనియన్ ప్రైవసీ పరిరక్షణ చట్టాలను గూగుల్ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఈ దేశాలు భావిస్తున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ వినియోగదారుల వ్యక్తిగత కార్యకలాపాలను వివిధ మార్గాలలో రికార్డు చేస్తూ వారి హక్కులకు భంగం కలిగే విధంగా వ్యాపారీకరిస్తోందని ఆ దేశాలు ఆరోపించాయి. తన ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడానికి వినియోగదారుల వివరాలను వినియోగిస్తుందని ఆ దేశాల ఆరోపణ.

గూగుల్ కంపెనీ మాత్రం ఎప్పటిలాగానే తాను ఇ.యు చట్టాలను గౌరవిస్తున్నానని చెబుతోంది. అయితే చట్టాలకు ఉండే ప్రతి రంధ్రాన్ని స్వప్రయోజనాలకు వినియోగించడం గూగుల్ కి బాగా ఒంటబట్టిన విద్య అని ఐ.టి నిపుణులు చెప్పేమాట! ఈ చట్టాలు ఎప్పుడూ కలవాడికి చుట్టాలే అని ప్రతి దేశంలోనూ రుజువైన సత్యం. వాటాల కోసం చట్టాలను బైటికి తీసే ప్రభుత్వ పెద్దలు వాటాలు దక్కాక నోరు మూసుకోవడం మామూలు వ్యవహారం. కనుక వినియోగదారులే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s