రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నట్టుండి కలకలం రేగింది. మంత్రులు ఆనం, బొత్సలు హడావుడిగా సమావేశాలు జరుపుతుంటే టి.వి చానెళ్లు, పత్రికల విలేఖరులు వారేమి చెప్పబోతున్నారా అని ఉత్కంఠగా ఎదురు చూశారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐదవ చార్జి షీటు దాఖలు చేసిన సి.బి.ఐ అందులో నాలుగో నిందితురాలిగా (A4) పేర్కొనడం దీనికి కారణం.
మార్చి 31 లోపు విచారణ పూర్తి చేస్తామని చెప్పిన సి.బి.ఐ అలా చెయ్యకపోగా మరో చార్జి షీటు నమోదు చేయడమే కాక ఇప్పటిదాకా సాక్షిగా చెబుతూ వచ్చిన సబిత ఇంద్రారెడ్డిని నిందితురాలిగా చేర్చడం రాష్ట్ర రాజకీయాలలో మరో చిన్న కుదుపుకు దారితీసింది. అయితే ఈ కుదుపు చివరికి ధర్మాన రాజీనామా లాగా తుస్సుమంటుందా లేక మోపిదేవి పడుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మంత్రి బొత్స సత్యనారాయణ టి.వి చానెళ్లకు చెబుతున్నదాన్ని బట్టి ధర్మాన టైపు ‘కర్ర విరగని, పాము చావని’ సాగతీతకు సబిత అభియోగాల వ్యవహారం దారి తీయనున్నట్లు కనిపిస్తోంది. కాగా రాజీనామా చేయబోయిన సబితను తాము ‘తొందరేముందమ్మా, పూర్వాపరాలు విచారించాక అప్పుడు చూద్దాం’ అని సి.ఎంతో సహా అందరం ఊరడించామని బొత్స చెప్పడం లక్ష అనుమానాలకు తావునిచ్చింది.
యధావిధిగా మంత్రులు మోపిదేవి, ధర్మాన లాగానే, ‘ప్రభుత్వం నుండి లబ్ది పొందిన కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని’ చార్జి షీటు పేర్కొంది. అలా లబ్ది పొందేట్లుగా జి.ఓ లు జారీ చేసినవారిలో సబిత ఒకరని సి.బి.ఐ నేరారోపణ చేసింది. దాల్మియా సిమెంటు కంపెనీకి కడప జిల్లాలోని తంబళ్ళపల్లె గ్రామానికి చెందిన 407 ఎకరాల సున్నపురాతి గనులను అప్పటి గనుల శాఖ మంత్రి సబిత అప్పగించగా, అందుకు ప్రతిఫలంగా దాల్మియా కంపెనీ అసలు ఉత్పత్తే మొదలుకాని భారతి సిమెంటు షేర్లను భారీ ప్రీమియం చెల్లించి కొనుగోలు చేసిందని ఇది ‘అది నాకు, ఇది నీకు’ ఒప్పందంలో భాగమేనని సి.పి.ఐ ఆరోపించింది. ఈ అక్రమానికి సహకరించినందుకు సబిత A4 అని ఐదో ఛార్జి షీటులో పేర్కొంది. జగన్మోహన్ రెడ్డి A1 కాగా, ఆడిటర్ విజయసాయి రెడ్డి A2.
ఈ వివరాలన్నీ చర్వితచరణం గానే కనిపిస్తాయి. ఏ కంపెనీ చూసినా, ఏ భూ లావాదేవీలు చూసినా, ఏ యజ్ఞం చూసినా ఇదే తంతు. అయితే రాష్ట్రంలో పత్రికలు, ఛానెళ్లు పెద్దగా చర్చించని ప్రశ్నలు ఇంకా అనేకం కనిపిస్తున్నాయి.
అసలు అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు, చార్జిషీటులో పేర్లు నమోదు అయ్యాక కూడా ఎందుకు పదవుల నుండి తప్పుకోరు? ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్న మంత్రుల సగటు నీతి ఏ స్ధాయిలో ఉంది? మోపిదేవి పైన అభియోగాలు మోపిన తోడనే ఆగమేఘాల పైన అరెస్టులు సాగించిన సి.బి.ఐ ధర్మాన, సబితల పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోంది? మోపిదేవి బి.సి కులం, ఇతరులు ఓ.సి కులం అయినందునే ఈ వివక్ష అని వినిపిస్తున్న ఆరోపణలు నిజమేనా?
ధర్మాన మంత్రి కనుక విచారణకు మంత్రివర్గ అనుమతి కోరిన సి.బి.ఐ మోపిదేవి అరెస్టుకు ఎందుకు అనుమతి కోరలేదు? మంత్రివర్గం మోపిదేవి అరెస్టుకు అనుమతి ఇచ్చిందా? మరయితే ధర్మాన అరెస్టుకు లేదా విచారణకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఇప్పుడు సబితపై అభియోగాలు మోపిన తర్వాత ఆమె నైతిక బాధ్యతను గుర్తు చేయడం మాని రాజీనామాను నివారించి ‘పూర్వపురాలు చూద్దాం’ అని ఊరడించడం ఏమిటి?
అసలు ధర్మాన అరెస్టుకు మంత్రివర్గం అనుమతి అవసరం లేదని సి.బి.ఐ వాదించింది. ఆ మేరకు కోర్టు కూడా ఆ సూత్రాన్ని అంగీకరించిందని పత్రికలు తెలిపాయి. కానీ ఆయన అరెస్టు కావడానికి బదులు మంత్రివర్గ సమావేశాలకు ఆహ్వానం ఎలా పొందుతున్నారు?
ఎక్కడో రైలు ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి ఉదంతానికి నేటి మంత్రుల తెంపరితనానికీ అసలు పోలిక ఉన్నదా? ‘నన్నూ వదలొద్దు’ అని కార్టూనిస్టులను ప్రోత్సహించిన అప్పటి ప్రధానికీ, కార్టూన్లు గీయడమే మాహాపాపం అన్నట్లు ప్రవర్తిస్తున్న ఇప్పటి ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులకు సాపత్యం ఉన్నదా? ఇన్ని ఘోరాలను కూడా అవలీలగా క్షమించేస్తున్న సామాన్యుల సహనశీలత ఎత్తు హిమాలయాలను ఎప్పుడో దాటి ఉంటుంది. హిమాలాయాలు ఎన్నిసార్లు ఎంతమంది ఎక్కినా అదే ఎత్తు. సాహసికులు ఇక ఎవరెస్టును వదిలి ఈ సామాన్య ప్రజల సహనశీలత అనే కొండను అధిరోహించేందుకు ప్రయత్నిస్తే సరికొత్త రికార్డులు సృష్టించొచ్చు.