ఇండియా అణు పరీక్షను ముందే ఊహించిన అమెరికా -వికీలీక్స్


పోఖ్రాన్ వద్ద ప్రధాని ఇందిర గాంధి

పోఖ్రాన్ వద్ద ప్రధాని ఇందిర గాంధి

ఇందిరా గాంధీ హయాంలో భారత దేశం 1974 మే 18 తేదీన జరిపిన అణు పరీక్ష అప్పట్లో ఒక సంచలనం. రాజస్ధాన్ ఎడారిలో పోఖ్రాన్ వద్ద జరిపిన ఈ అణు పరీక్ష ఫలితంగా అమెరికా, యూరోపియన్ దేశాలు ఇండియాపై ఆంక్షలు విధించాయి. ఇండియా పట్ల అణు అంటరానితనాన్ని పాటించాయి. తాము ఒక పక్క అణ్వస్త్రాలను గుట్టలుగా పేర్చుకుంటూనే ఇండియాలాంటి మూడో ప్రపంచ దేశాలు అణ్వస్త్రాలు సమకూర్చుకోవడానికి వీలు లేదని శాసించాయి. అందుకోసం ఇంటర్నేషనల్ ఆటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐ.ఎ.ఇ.ఎ) అనే పెత్తందారీ సంస్ధను ఏర్పరిచి తమ అణు శాసనాన్ని చెల్లించుకునేందుకు దశాబ్దాలుగా కృషి చేస్తున్నాయి.

ఐ.ఎ.ఇ.ఎ పనల్లా తాను చెబుతున్నట్లు అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి కృషి చేయడం కాదు. అణ్వస్త్ర అభివృద్ధిలోనూ, అణు విద్యుత్తు ఉత్పత్తిలోనూ, అణు పరిశోధనల్లోనూ అమెరికా, యూరోపియన్ దేశాల గుత్తాధిపత్యాన్ని సంరక్షించడం, ఆ దేశాలకు ఇతర దేశాలనుండి అణు సవాలు ఎదురుకాకుండా చూడడమే దాని విధి. అందుకే అది ఇరాన్ పైన దొంగ నివేదికలు తయారు చేసి కాకిగోల చేస్తుంటుంది.

విషయానికొస్తే, ఇండియా అణు పరీక్షలు జరపనున్నట్లు అమెరికా ఒక సంవత్సరం ముందే ఊహించినట్లు వికీలీక్స్, ది హిందూ సంస్ధల ద్వారా వెలికి వస్తున్న అమెరికా రాయబార పత్రాల ద్వారా తెలుస్తోంది. భారత అణు పరిశ్రమలో అమెరికా అణు శక్తి కమిషన్ తరపున పనిచేయడానికి వచ్చిన అణు శాస్త్రవేత్తకు బాబా అణు పరిశోధన సంస్ధ (BARC -బార్క్) లోనూ, ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్’ (టి‌ఐ‌ఎఫ్‌ఆర్) లోనూ ప్రవేశం నిరాకరించడంతో జరగకూడనిది ఏదో జరుగుతోందని సదరు శాస్త్రవేత్తకు అనుమానం వచ్చింది.

ఈ రెండు సంస్ధల అధిపతులు అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ జాన్ పినాజియన్ తో మాట్లాడడానికి, కలిసి పని చేయడానికి నిరాకరించారు. ఆయనకు తెలియని ప్రాజెక్టులో పని చేస్తున్న  భారతీయ శాస్త్రవేత్తలకు ఎక్కడంటే అక్కడికి పోవడానికి అనుమతి లేకపోవడం కూడా శాస్త్రవేత్తకు అనుమానం కలిగించింది. ఈ సమాచారాన్ని ఆయన బోంబేలోని అమెరికా రాయబారికి చేరవేయడంతో ఆయన తన అంచనాలను వివరిస్తూ అమెరికా విదేశాంగ శాఖకు కేబుల్ పంపాడు. ఆ కేబుల్ ని వికీలీక్స్ సంస్ధ లీక్ చేయడంతో అదిప్పుడు మనకు తెలుస్తున్నది.

“ఇండియా-పాక్ యుద్ధంలో సాధించిన విజయానికి సంబంధించిన ప్రభావం క్రమంగా బలహీనపడడం, 1970/72 ల నాటి ఎన్నికల విజయాల ప్రభావం క్షీణిస్తుండడంతో ప్రజలు ప్రధాని, ప్రభుత్వాలపైన భ్రమలు కోల్పోతున్న పరిస్ధితి. ఆర్ధిక అగచాట్లు పెరుగుతున్న పరిస్ధితి ఇలా ప్రతిబింబిస్తోంది. ఈ నేపధ్యంలో సాధారణ బలిపశువులతో పాటుగా శాంతియుత ప్రయోజనాల కోసం అణు పరీక్ష నిర్వహించే అవకాశాలు ఎంతో దూరంలో లేవు” అని బొంబే లోని అమెరికా కాన్సల్-జనరల్ నుండి అమెరికాకు కేబుల్ వెళ్లింది. (1973NEWDE03743_b, secret)

అమెరికా కాన్సల్ జనరల్ అంచనాకు ఉన్న ప్రధాన ఆధారం డాక్టర్ జాన్ పినాజియన్. ఆయన తన వ్యక్తిగత అంచనాలను కాన్సల్-జనరల్ తో పంచుకోవడం, కాన్సల్ జనరల్ కూడా తనకు ఉన్న కాంటాక్టుల (అనగా భారత విద్రోహులు) ద్వారా తగిన సమాచారాన్ని సంపాదించుకోవడం, దరిమిలా భారత్ అణు పరీక్షలు జరపడానికి పూర్తి సామర్ధ్యాన్ని కలిగి ఉన్నదని, అతి త్వరలోనే పరీక్షలు జరగొచ్చనీ అమెరికా రాయబారి తమ దేశానికి సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు భారత ప్రభుత్వం కృషి చేస్తున్నదన్న సమాచారం తనకు ఉన్నదని ఆయన తెలిపాడు.

స్మైలింగ్ బుద్ధ కోడ్ నేమ్ తో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షా స్ధలం

స్మైలింగ్ బుద్ధ కోడ్ నేమ్ తో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షా స్ధలం

ఇప్పటి వరకు ఉన్న అవగాహన ఏమిటంటే భారత్ అణు పరీక్షలు అనూహ్యం. ప్రపంచ దేశాలేవీ ఏ విధంగానూ ఊహించని రీతిలో ఇందిరాగాంధి ఆధ్వర్యంలో ఇండియా అణు పరీక్షలు నిర్వహించిందన్న అవగాహనే ఇప్పటివరకూ వ్యాప్తిలో ఉంది. అమెరికా కూడా అలాగే నటించింది. భారత దేశ మొట్ట మొదటి అణు బాంబు నిర్మాణం దేశంలో కూడా రహస్యంగానే సాగింది. బాంబు రూపకల్పన, నిర్మాణం, పరీక్ష లలో పాల్గొన్న 75 మంది శాస్త్రవేత్తలకు (బార్క్ అధిపతి రాజా రామన్న వీరికి నాయకుడు) తప్ప భారత మంత్రులకు ఎవరికీ బాంబు నిర్మాణం అవుతున్న సంగతి తెలియదు. శాస్త్రవేత్తలు కాకుండా భారత ప్రధాని ఇందిరాగాంధి, ఆమె సలహాదారు మరియు అప్పటి మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి పి.ఎన్.హక్సర్, అప్పటి ప్రిన్సిపల్ కార్యదర్శి డి.పి.ధర్ లకు తప్ప రక్షణ మంత్రికి కూడా బాంబు సంగతి తెలియదు. ఇంకా చెప్పాలంటే రాతపూర్వకమైన ఆదేశాలు కూడా లేవట. 1972 సెప్టెంబరులో బార్క్ సందర్శించిన ఇందిర నోటిమాటతో బాంబు నిర్మాణానికి, పరీక్షకు ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది.

ఇంత రహస్యమైన అణు కార్యక్రమం గురించి కూడా అమెరికా రాయబారి సమాచారం సంపాదించగలిగాడంటే ఆయనకి ఉన్న కాంటాక్టులు ప్రభుత్వ అంగాల్లో ఎంతగా చొరబడ్డారో అర్ధం చేసుకోవచ్చు. తనకు వాస్తవానికి బార్క్ శాస్త్రవేత్తలతో అద్భుతమైన సంబంధాలు ఉన్నప్పటికీ వారు తనను దూరం ఉంచుతున్నారని డాక్టర్ పినాజియన్ అమెరికా కాన్సలేట్ కు తెలిపాడు. భారత అటామిక్ ఎనర్జీ కమిషన్, అమెరికా అటామిక్ ఎనర్జీ కమిషన్ ల మధ్య ఒప్పందం ప్రకారమే పినాజియన్ భారత్ లో ఉన్నాడు. భారత ఎ.ఇ.సి ఛైర్మన్ డాక్టర్ హోమీ సేత్న వెంటనే పినాజియన్ బార్క్ లో పని ప్రారంభించాలని సూచించినప్పటికీ బార్క్ ఛైర్మన్ రాజా రామన్న ఆయనతో పని చేయడం అటుంచి కలవడానికి కూడా ఇష్టపడలేదు.

కానీ సేత్న స్వయంగా కలుగజేసుకుని అపాయింట్ మెంటు ఇప్పించడంతో పినాజియన్ రామన్నను కలవగలిగాడు. అయితే అమెరికా కేబుల్ ప్రకారం ఆ సమావేశం పినాజియన్ కు ఏమీ ఉపకరించలేదు. పినాజియన్ కోరిన విభాగంలో పని చేయించడానికి రామన్న అంగీకరించలేదు. అంటే అత్యంత కీలకమైన విభాగంలోనే అమెరికా శాస్త్రవేత్తలు పని చేస్తారన్నమాట! పినాజియన్ వచ్చింది గూఢచర్యానికే తప్ప సాంకేతిక సహాయం అందించడానికి కాదని ఈ ఒక్క అంశమే స్పష్టం చేస్తోంది. ఇరాన్ అణు కర్మాగారాలను తనిఖీ చేసే పేరుతో ఐ.ఎ.ఇ.ఎ శాస్త్రవేత్తలు సైతం అమెరికా తరపున గూఢచర్యం చేశారని, దానితో ఇరాన్ వారిని బహిష్కరించిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.

బార్క్ లో బదులుగా టి‌ఐ‌ఎఫ్‌ఆర్ లో పని చేయాలని పినాజియన్ కు రామన్న సూచించాడు. అయితే టి‌ఐ‌ఎఫ్‌ఆర్ ఛైర్మన్ ఎం.జె.కె.మీనన్ కూడా పినాజియన్ ని కలవడానికి తిరస్కరించాడు. మీనన్ సిబ్బందిలో ఒకరు ప్రొఫెసర్ బి.వి.తోసర్ పినాజియన్ తో కలిసి పని చేయడానికి అనుమతి కోరినా నెలలు గడిచినా అది రాలేదు. భారత దేశం అణు బాంబు తయారు చేయదలిస్తే ఈ రెండు సంస్ధలే అందుకు పూనుకోవాలనీ, రెండూ అనుమతి నిరాకరించడంతో అనుమానం కలుగుతోందని పినాజియన్ అమెరికా రాయబారికి తెలిపాడని కేబుల్ ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత పినాజియన్ కు మొదట్లో సాయపడిన సేత్న కూడా సహకరించడం మానేయడం అనుమానాలను బలపరిచింది. ఆ తర్వాత 1997లో డాక్టర్ రాజా రామన్న స్వయంగా పోఖ్రాన్ లో పేల్చింది అణు బాంబే అని చెప్పేవరకూ అధికారికంగా దాని గురించి చెప్పినవారు లేరు. మిగిలింది చరిత్ర.

2 thoughts on “ఇండియా అణు పరీక్షను ముందే ఊహించిన అమెరికా -వికీలీక్స్

  1. అమెరికా నుండి ఇండియా వచ్చే ప్రతి పర్యాటకుడు ( అధికార , అనధికార) గూడచర్యమే చేస్తారు. వాళ్ళు వచ్చేదే అందుకు. ఇది ఓపెన్ సీక్రెట్. అందుకే ఇందిరా గాంధీ అమెరికన్లను, బ్రిటీషర్లను ఎప్పుడూ నమ్మేది కాదు. అందుకే వాళ్ళకు ఇందిర అంటే మంట. దానిని అంతర్జాతీయ మీడియాద్వారా ఇందిరను Un popular చేసి తమ శునకానందాన్ని తీర్చుకునేవాళ్ళు

  2. అమెరికా సంగతేమో గానీ బ్రిటిషర్ల విషయంలో ఇందిర అంత సానుకూలంగా ఉండేది కాదని అమెరికన్లు అభిప్రాయపడినట్లు ఈ వికీలీక్స్ కేబుల్స్ ద్వారానే తెలుస్తున్నది. రాజీవ్ గాంధి ప్రధాని కాకముందు స్వీడిష్ ఆయుధ కంపెనీలకు ‘ఎంటర్ ప్రెన్యూర్’ (సింపుల్ గా చెప్పుకుంటే దళారి) గా పని చేశాడని వెల్లడయిన కేబుల్ ద్వారానే ఈ విషయం తెలిసింది. బ్రిటిష్ జెట్ ఫైటర్ కి పక్కకు నెట్టి స్వీడిష్ జెట్ ని కొనుగోలు చేయడానికి ఇందిర ప్రయత్నించిందట. కాని స్వీడిష్ జెట్ లో అమెరికా నుండి దిగుమతి చేసుకున్న స్పేర్ పార్ట్స్ ఉండడంతో అమెరికా అనుమతి తీసుకోవాల్సి వచ్చిందట. అమెరికా నో చెప్పడంతో ఇందిరా గాంధికి బ్రిటిష్ ఫైటర్లను కొనక తప్పలేదు.

    అమెరికా నుండి ఎఫ్.డి.ఐ లను ఆహ్వానిస్తే టెక్నాలజీ వస్తుందని చెప్పడం ఎంత బూటకమో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. అంతెందుకు! ఇటీవల కుదిరిన పౌర అణు ఒప్పందం మేరకు అమెరికా సప్లై చేయబోయే రియాక్టర్ల దగ్గర కెమెరాలు పెట్టబోతోంది. వాడిన యురేనియం ఇంధనానికి అమెరికాకు లెక్క చెప్పాలి. వీటన్నింటికి మన్మోహన్ ప్రభుత్వం ఒప్పేసుకుంది. ఒప్పేసుకోవడమే కాక అదేదో లాండ్ మార్క్ ఒప్పందం లాగా ప్రచారం చేసుకుంటున్నారు. అమెరికా టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఆ విషయం అమెరికా కూడా దాచుకోదు. మనోళ్లు దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s