అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ లో మరో మారణకాండను సృష్టించాయి. మిలిటెంట్లను చంపే పేరుతో పదకొండు మంది పసి పిల్లలను, ఒక మహిళను విమాన దాడుల్లో చంపేసింది. జరిగిన ఘోరానికి విచారం వ్యక్తం చేయకపోగా ‘పౌరులు చనిపోయిన వార్తలు విన్నాం. కానీ ధృవపరచలేం’ అని నాటో ప్రతినిధి డాన్ ఈనెర్క్ వ్యాఖ్యానించినట్లు రష్యా టుడే, ది హిందు పత్రికలు తెలిపాయి.
అమెరికా దళాలు అమాయక ఆఫ్ఘన్ పౌరులను “ఇబ్బంధుల పాలు చేస్తున్నాయి, హింసిస్తున్నాయి, చంపేస్తున్నాయి” అని విమర్శిస్తూ, ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అమెరికా నుండి రెండు రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్న కొద్ది రోజులకే అమెరికా మరో హత్యాకాండకు తెగబడడం విశేషం. తాజా హత్యాకాండలో ఆఫ్ఘన్ భద్రతా దళాలు కూడా భాగం పంచుకోడాన్ని బట్టి హమీద్ కర్జాయ్ విమర్శలు పైపై పటాటోపామే అన్న అనుమానం కలుగుతోంది.
ఆఫ్ఘన్ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం 11 మంది పిల్లలు, ఒక మహిళ చనిపోయిందని రష్యా టుడే (ఆర్.టి) చెప్పగా, ది హిందు పత్రిక మరణించిన పిల్లల సంఖ్య పది అని పేర్కొంది. నాటో బలగాల విమాన దాడుల్లో ఒక ఇల్లు కూలిపోవడంతో అందులో ఉన్న పిల్లలు, మహిళ చనిపోయారని, మరో ఆరుగురు మహిళలు గాయపడ్డారని స్ధానిక అధికారులను ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది. శనివారం రాత్రి నాటో-ఆఫ్ఘన్ బలగాలు ప్రారంభించిన సంయుక్త ఆపరేషన్ ఆదివారం ఉదయం వరకు కొనసాగినట్లు తెలుస్తోంది. పాక్ సరిహద్దులోని కూనార్ రాష్ట్రంలో షిగల్ జిల్లాలో హత్యాకాండ చోటు చేసుకుంది.
యుద్ధంలో పౌరుల ఆవాసాలపై దాడి చేయడం, పౌరులను చంపడం ఐరాస చట్టాల ప్రకారం యుద్ధ నేరం. నాటో జేబులో కునుకు తీస్తున్న ఐరాస అధిపతి బాన్ కి-మూన్ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సాగిస్తున్న యుద్ధ నేరాల పైన విచారణ చేయడం అటుంచి ఒక ముక్క కూడా ఇంతవరకు మాట్లాడలేదు. శ్రీలంక యుద్ధ నేరాలపై గొంతు చించుకున్న ఐరాస మానవహక్కుల సంస్ధ అమెరికా, యూరోపియన్ దేశాల యుద్ధ నేరాలు సహజం అన్నట్లుగా మౌనం పాటించడం నేర సమానం.
అమెరికా సైనికుల మరణం
గత ఆదివారమే (మార్చి 31) ఒక కారు బాంబు దాడిలో ఐదుగురు అమెరికన్లు చనిపోయారు. వీరిలో ముగ్గురు సైనికులు కాగా ఒకరు యువ రాయబారి, మరొకరు అమెరికా రక్షణ శాఖ కాంట్రాక్టర్. దక్షిణ ఆఫ్ఘనిస్ధాన్ లోని జాబూల్ రాష్ట్రంలో ఒక కాన్వాయ్ పైన కారు బాంబుతో దాడి జరిగింది. కాన్వాయ్ లో రాష్ట్ర గవర్నర్ ఉన్నప్పటికి ఆయన క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగానే నాటో దాడులు జరిగి ఉండవచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాగే అమెరికా సైనికులు మరణించినప్పుడు ‘మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నందుకు మీ అంతు చూస్తాం’ అని గ్రామస్ధులను హెచ్చరించిన కొద్ది రోజులకే రాత్రిపూట గ్రామంపై దాడి చేసి ఇల్లిల్లు తిరిగి మహిళలను, పిల్లలను కాల్చి చంపిన ఘటన జరిగింది. అనేకమంది సైనికులు ఇళ్లపై దాడి చేసినట్లు గ్రామస్ధులు చెప్పినప్పటికీ ఒకే ఒక అమెరికా సైనికుడు మతి చలించి చేసిన చర్యగా పశ్చిమ పత్రికలు వారాల తరబడి ప్రచారం చేశాయి.
చావు తప్పి…
ఒబామా ప్రకటించిన పధకం ప్రకారం 2014 చివరిలోపు అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్ధాన్ వదిలి వెళ్లిపోవాలి. అమెరికా వెళ్లిపోయాక రష్యా సేనలు అక్కడికి రావచ్చని ప్రచారం జరిగినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుటిన్ ఆ ప్రచారాన్ని కొట్టిపారేశాడు. అమెరికా సేనలు వెళ్లిపోతే ఆఫ్ఘనిస్ధాన్ లో భారత వ్యతిరేక కార్యకలాపాలు మొదలవుతాయని, పాక్ సైనికులు మళ్ళీ కాశ్మీరు సరిహద్దుల్లో కేంద్రీకరిస్తారని భారత్ భయపడుతోంది. యూరోపియన్ దేశాలు మాత్రం ఇప్పటికే చాలావరకు తమ సేనలను ఉపసంహరించుకున్నారు.
కాగా ఆఫ్ఘనిస్ధాన్ ఉపసంహరణ గడువు దగ్గర పడే కొద్దీ అమెరికా, ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ ల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. తాలిబాన్ తో చర్చలు జరుపుతుండడం, ఖతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడానికి ఏర్పాట్లు జరుగుతుండడంతో అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అమెరికా వ్యతిరేక ప్రకటనలను జాస్తి చేశాడు. చైనా, ఇరాన్ లతో చర్చలు జరపడానికి బహిరంగంగానే ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు.
నాటో దళాల ఉపసంహరణ అనంతరం తాలిబాన్ ఎలాగూ మెజారిటీ ప్రాంతాల్లో నియంత్రణ సాధిస్తుందని సర్వత్రా అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. దానితో తాలిబాన్ తో చర్చలు జరపడం ద్వారా సైనిక ఉపసంహరణ తర్వాత కూడా ఆఫ్ఘనిస్ధాన్ పైన పట్టు నిలుపుకోవడానికి అమెరికా ఎత్తుగడ వేస్తున్నదని, ఇది కర్జాయ్ కి నచ్చడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా సైనిక స్ధావరంలోనే, అమెరికా శిక్షణ ఇచ్చిన ఆఫ్ఘన్ పోలీసులే అమెరికా సైనికుల పైన తుపాకులు ఎక్కుపెట్టి తుదముట్టిస్తుండడంతో అమెరికా పరిస్ధితి మళ్ళీ మొదటికొచ్చినట్లవుతోంది. ఫలితంగా తాలిబాన్ తో రాజీపడైనా సరే ఈ ప్రాంతం పైన నియంత్రణ నిలుపుకోవాలని అమెరికా తంటాలు పడుతోందని ప్రఖ్యాత అంతర్జాతీయ పరిశీలకుడు జేమ్స్ పెట్రాస్ ఇటీవల అభిప్రాయం వెలిబుచ్చడం విశేషం.
యేతా వాతా తేలేదేమిటంటే ఇరాక్ లాగానే ఆఫ్ఘనిస్ధాన్ లో కూడా అమెరికా పరిస్ధితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అవబోతోంది.